సత్యాన్వేషణ-41

0
2

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

అక్కడి దేవాలయములో కొంత సేపు జపము చేసుకున్నా. ఆ రాగి చెట్టు క్రింద జపము అద్భుతముగా అనిపించింది. మమ్మల్ని మూడింటికి రమ్మని పిలిచారు.

లోపలికి వెళ్ళాము. ప్రాకారము దాటి వెడితే లోపల గుడి, ప్రక్కగా రెండు గదులు. గది లోపల అమ్మ మాణిక్యేశ్వరి కూర్చొని వున్నారు. ఆమె చాలా వృద్దురాలు. పండిన ఆకులా వున్నది. కనిపించటము లేదు పూర్తిగా గడప దగ్గర్నుంచి. వీపు మాత్రమే కనపడుతోంది. కంఠము వినిపిస్తోంది. ఆమెకు ఆ పూజారి పరిచర్యలు చేస్తున్నారులా వుంది. ఆయనా తాకరు. అంతా అలా దూరంగా వుండాలి. ఆమెలో కదలికలు లేవు. చాలా కష్టపడుతోంది కాస్త కదలటానికి కూడా. నాకు ఎలాంటి భావమూ కలగలేదు.

నాతో వచ్చిన వారు ఆ శివయ్య పూజారికి చెప్పారు.

ఆయన తొందర పడుతూ అదిలింపుగా… “ఏమడగాలి అమ్మను” అన్నాడు. అతని ముఖములో ప్రసన్నత లేకపోవటము నేను గమనించాను. మహాత్ముల సందర్శనములో నాకు మాములుగా కలిగే ఉద్రేకము కలగటం లేదు.

“జన్మలు ఎందుకు కలుగుతాయి” అని అడిగాను.

ఆమె విన్నారు …. నా వైపు తిరగలేదు.. నన్ను చూడలేదు…

“కర్మలను అనుభవించటానికి” అన్నారు అమ్మ….

“నేనెందుకు జన్మించాను?” అడిగాను

“నీ కర్మ అనుభవించటానికి” సమాధానము…

“కర్మలను పరిపూర్తి చేసుకోవాలంటే ఏం చెయ్యాలి?” అడిగాను…

“ధ్యానము చెయ్యి తెలుస్తుంది” అన్నారామె.

“అంటే… జన్మ రహస్యము తెలియాలంటే..?” అడిగాను మళ్ళీ…

“వీపు నిటారుగా పెట్టి ధ్యానము చెయ్యి. అన్నింటికీ సమాధానము దొరుకుతుంది” అన్నారు అమ్మ.

పూజారి “ఇక చాలు పొండి” అంటూ విదిలించాడు. నాకు ఆ పద్ధతి విచిత్రముగా తోచింది. నేను మాట్లాడకుండా బయటకు వచ్చాను. నాతో ఆ ఇద్ధరు వ్యక్తులూ బయటకు వచ్చారు. నేను వారికి నమస్కరించి కారు ఎక్కి నారాయణ్ పేట్ వచ్చేశాను.

నా మిత్రుడు కొద్దిగా హడావిడిగా వున్నాడు. ఆయనకు ఎలక్షన్ల డ్యూటీ. ఊరు చూపమని, నాకు తన సహాయకులనిచ్చి ఆయన వెళ్ళిపోయాడు. నే నెమ్మదిగా ఊరు తిరిగి మగ్గం మీద చీరలు నేసే వారిని ఇంటర్యూ చేసి, వారు చెప్పిన స్టోరీని రాసుకొని, కొన్ని చీరలు కొని తిరిగి మిత్రుని బంగళాకు వచ్చాను. నా మిత్రుడు నేను కొంత సేపు ముచ్చట్లు, చిన్ననాటి విషయాలు చెప్పుకొని, నేను ఇక హైద్రాబాదు బయలుదేరాను. ఆ రోజుకు వుండమన్నా, నేను లలితా భాష్యాలు చేస్తున్నందున, ముందుగా అనుకోని కారణాన, వెడతానని బయలుచేరాను. హైద్రాబాదు లోకి ఎంటరవుతామంటే, నా ఫోను మ్రోగింది.

నన్ను యోగినా మాతా రమ్మనమని కబురుచేశారని….

“శివం శాన్తం జగన్నాథం లోకానుగ్రహకారకమ్।
శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః॥”

***

నా మిత్రుడు చేసిన ఫోను అది.

“ఎక్కడ దాకా వెళ్ళారు?”  అడిగాడు తను.

“హైద్రాబాదులోకి ఎంటరవుతున్నాను” చెప్పాను.

“నీవు మళ్ళీ రావాలేమో” అన్నాడు.

“ఎందుకు?” అర్థం కాక అడిగాను.

“మాత వద్ద నుంచి ఫోను వచ్చింది. ఆమె నిన్ను చూడాలనుకుంటున్నారు. నీతో సరిగ్గా మాట్లాడలేదట. నీవు చాలా భక్తురాలివని, నీతో మాట్లాడాలని రమ్మనమని పిలిచారు. కావాలంటే నా అసిస్టెంటుతో మాట్లాడు. తనే వాళ్ళతో మాట్లాడాడు” అంటూ తన అసిస్టెంటుకు పోను ఇచ్చాడు.

అతను కూడా దాదాపు అదే మెసేజ్ చెప్పాడు.

మళ్ళీ మిత్రుడు ఫోను తీసుకొని “నాకు తెలిసి ఎవ్వరినీ మాత పిలవలేదు. మొదటిసారి నేను చూస్తున్నాను రమ్మనమని పిలవటము. ఆమెను పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చూడటానికి వచ్చినా ఆమె చూడదు. చివరకు అమిత్‌షా చూడటానికి వచ్చినా ఆమె చూడలేదు. ఆలోచించుకో. నీకు ఇది మంచి అవకాశము” చెప్పాడు ప్రామిసింగ్‌గా. ఒక్క క్షణము నాకర్థము కాలేదు.

“సరే ఆలోచించుకుంటాను” అన్నాను.

“నీవు వస్తే బెటరు సంధ్యా” చెప్పాడతను. నేను ఫోను పెట్టేశాను.

నాకు నిజంగా ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నిజానికి ఆ ఫోను కాల్‌లో విన్న విషయానికి నేను ఎగిరి గంతేసి వెళ్ళాలి. కాని అది మరీ డ్రమాటిక్‌గా వుంది. ఆమె చెప్పాలనుకున్నది ఈ రోజే చెప్పవచ్చు కదా. నన్ను ఆ పూజారి అంత చికాకు పడటమెందుకు. మళ్ళీ రమ్మని కబురు పెట్టడమెందుకు. నేను వెడితే నాకు మరో రోజు, సమయము, వెళ్ళిరావటానికి డబ్బు పోతుంది. కానీ అదే వెళ్ళకపోతే నేను నాకు అందివచ్చిన అవకాశము చేతులారా వదులుకున్నానన్న నిస్పృహలో పడిపోతాను.

ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఏం తేల్చుకోవాలో తెలియనప్పుడు నేను సామాన్యముగా శ్రీవారి సలహా మీద ఆధారపడతాను. అప్పుడూ అదే చేశాను. ఆయనకు ఫోను చేసి అడిగాను.

తనూ నాలాగే ఆలోచించి వెళ్ళి రమ్మనీ, ఏమీ కాకపోతే అనుభవమన్నా వస్తుందని ధైర్యం చెప్పారు.

నేను మా రథసారథికి “రేపు కూడా వెళ్ళాలోయి. రమ్మంటున్నారు” అని చెప్పాను.

“సరే మేడమ్” అన్నాడు అతను.

మరు రోజు నేను మా డ్రైవరు కోసము ఇడ్లీలు వేసి ప్యాక్ చేశాను. ఈ విషయానికి మా వారు ఇప్పటికీ నవ్వుతారు. నేను ఇడ్లీ తినను. పైపెచ్చు దైవ సన్నిధి అని తినకుండా వెళ్ళి అలాగే ఇంటికి తిరిగి వస్తున్నాను. అలాంటప్పుడు మరి ఇతరులకు తిండి విషయమేంటి అని. కాని అక్కడ ప్రసాదము పెట్టేది అతను తినలేదు. మాంసాహారము మానమని ఉద్బోదించే మాత సమక్షంలో మాంసహారులు ప్రసాదము కూడా తీసుకోరు. అక్కడ తీసుకుంటే మళ్ళీ వీళ్ళు తినేది మానాలని. అలా అని అతను ముందురోజు ఏమీ తినలేదు. మేము నారాయణ్‌పేట్‌ వెళ్ళాక తిన్నాడు. అందుకే అతని కోసము నే టిఫెను కట్టుకువెళ్ళాను.

వెళ్ళాను. మళ్ళీ పది నుంచి ఎదురుచూపులు.

నిన్నటి వాళ్ళు వచ్చారు. అక్కడి శివలింగాకారములో పెద్ద దేవాలయము కడుతున్నారు. అందులో గోడలకు అరలు పెట్టి ఆ అరలలో చిన్న శివలింగాలు పెడుతున్నారు. ఆ కట్టడము చాలా పెద్దగా, రాజసంగా వుంది. పని మధ్యలో ఆగింది. ఏది ఏమైనా పూర్తిగా కట్టిన తరువాత అదో గొప్ప దేవాలయము కాగలదు. కోటి శివలింగాలు ఒక మహా లింగములో.

ఈరోజు నేను మళ్ళీ దేవాలయాల చుట్టూ తిరిగి, మర్రి చెట్టునీడన జపము చేసుకుంటూ కాలక్షేపము చేశాను.

పరమాత్మ మన లోని ఓర్పును పరీక్షిస్తాడు. అక్కడ కూర్చొని జపమో తపమో చేసుకుంటూ మహాత్ముల సన్నిధిని అనుభవిస్తూ వుంటే చాలా మాటలు చెప్పారు అక్కడి వారు. అసలు కొందరిని అమ్మ చూడరని, చూసినా పలకరని, పలికినా మళ్ళీ రమ్మనమనరని…. అదో గొప్ప అదృష్టమనీ చెప్పారు.

అంతా వింటూవుండగా మూడింటి వరకూ అయ్యింది. ఇక వెళ్ళిపోవటము బెటరనుకున్నాను. ఆ వచ్చిన పెద్ద మనిషితో అదే అంటే ఆయన కంగారుగా “వుండండి…” అంటూ హడావిడిగా అరగంటకు అటు ఇటుగా లోపలికి తీసుకుపోయాడు. నాలుగింటికి ఆమె దర్శనము దొరికింది మాకు.

ఆమె కనిపించటము లేదు. నాకు ప్రశ్నలు లేవు నేడు. ఎందుకంటే ఆమె చెప్పింది కదా

“ధ్యానము చేసుకో సర్వమునకు సమాధానము దొరుకుతుందని……”

ఆ పూజారి ముందుకొచ్చాడు. నేను నమస్కరించి “అమ్మ పిలిచారట” అన్నాను వినమ్రముగా…

ఆయన నవ్వుతూ నాతో “ మీరు అమెరికాలో వుంటారట కదా”…. అన్నాడు…..

“అవును” అన్నాను ఆశ్చర్యముతో భృకృటి ముడి పడుతుండగా….

“పిలిచింది అమ్మ కాదు…. నేనే” అన్నాడు హీరోలా…

నేను మాట్లాడలేదు.. ఆశ్చర్యముతో చూస్తుండగా…

“మీరు అమెరికాలో మా శివలింగాల గురించి ప్రచారము చేసి మాకు స్పాన్సర్లు తేవాలి…” అన్నాడాయన.

నేను చాలా షాకైనాను… నా భక్తి… నా గురువుకై అన్వేషణ…. నాకు నేనేంటో తెలిసుకోవాలనుకోవటము…. ముక్తి మార్గము అంతా కూడా అమెరికాలో నివాసము ముందు గడ్డిపోచలా వున్నది…. నిన్నటి చిరాకు మాయమయ్యి వారికి నా మీద ఎంతో ప్రేమ కలిగింది. హైద్రాబాదు వెళ్ళిపోయానంటే మళ్ళీ పిలిపించటానికి ఆమె పేరు వాడారు వారు. అలా చెయ్యటానికి వారికే మాత్రము మోహమాటము అనిపించలేదు. పోనీ వచ్చిన రోజునే ఆ విషయము అడగవచ్చుకదా…. అమ్మ వద్ద వున్నందున ప్రతి వారిని చీపురు పుల్లలా తీసివెయ్యటము అలవాటైనట్టుగా వుంది. తరువాత డబ్బు తెచ్చేవారేమో అనిపించి ఇలా ప్లాను వేసుకున్నారు… అవన్నీ కళ్ళ ముందు రీళ్ళలా తిరుగుతుంటే…. గొంతుకు ఏదో అడ్డం పడింది… కష్టమైంది ఆపటము కన్నీరు….

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here