Site icon Sanchika

సత్యాన్వేషణ-42

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]తే[/dropcap]రుకొని “క్షమించండి…. నేను అంధ విద్యార్థుల చదువు అన్న కారణానికి పని చేస్తాను… ఇన్ని చెయ్యలేను”… చెప్పాను గొంతు పెగల్చుకొని….

వెంటనే ఆయన ముఖంలో భావం మారింది. పురుగును తీసిపడేసినట్లుగా… “పో అవతలకి” అన్నాడా పూజారి.

పూర్వము నేను తెగ మొహమాట పడి అన్నింటిని తలకు తగుల్చుకు నానా హైరానా పడుతుండేదాన్ని. ఈ తిరుగులాట మొదలయ్యాక…. చెయ్యలేనివి చెయ్యలేనని చెప్పాలని నిశ్టయించుకున్నాను. అంత్య నిష్ఠూరము కన్నా ఆది నిష్ఠూరము మేలు కదా……

ఆయన ముఖములో చూపించిన చీదరకు మళ్ళీ హృదయములో కలుక్కుమంది.

మారు మాట పలకక వచ్చేశాను…. ఏదో చెబుతున్నారెవరో…. ఏమీ వినపడలేదు…. కళ్ళు మసకబారుతుండగా వచ్చి కారులో కూర్చున్నా.. “ఇంటికి పద” అన్నాను….

అలా ఇంటికి తిరుగుప్రయాణమైనాను….

ఏదీ దొరకుండా వుండదు. అనుభవము గొప్పది. అది మనలను భవిష్యత్తు వైపుకు సూటిగా పంపుతుంది.

నాకు తేరుకోవటానికి చాలా టైం పట్టింది.

దారిలో నా హీలింగు టీచరు, హీలరు కూడా అయిన…. ఆయనకు ఫోను చేశాను..

నా అనుభవము విని ఆయన నాతో చెప్పినదేమంటే… “ఎవరు ఏమి చెప్పానా మీరు గమనించుకొని అక్కడ అంతటి ఎనర్జీ వున్నదా అని ప్రశ్నించుకోండి. పరమాత్మ మీకు దారి చూపుతాడు.” అని.

నిజము.. ఎవరైనా ఏదైనా చెప్పినా అది మనకు కుదురుతుందా, అని దాని మీద ఎనర్జీ ఎంత వుంది అని మనము ధ్యానించి చూడాలి. మనకు సమాధానము తప్పక దొరుకుతుంది. కీ ఏమంటే, మనము ఎంత శ్రద్ధగా ఆ సాధన చేస్తున్నామన్న దాని బట్టి ఈ విషయము తెలుస్తుంది.

సాధనలో ఇలాంటివి తప్పక చెయ్యాలి. కొన్ని చోట్లకు వెళ్ళకూడదు. కారణము అక్కడి నెగిటివ్ ఎనర్జీ మనను క్రిందికి తోసేస్తుంది. మనకు మళ్ళీ సమయము పడుతుంది, మనలను మనము శుద్ధి చేసుకోవటానికి. సాధన పెరిగేకొద్ది ఇలాంటి విషయాలలో శ్రద్ధ పెట్టాలి. మంచి స్థాయికి వచ్చిన వారికి ఇక గొడవుండదు. వారికున్న ఎనర్జీ ఎక్కువై, ఈ నెగిటివ్ ఎనర్జీలు ఏమీ చెయ్యలేవు.

నాకు నేను సమాధానపర్చుకున్నాను.

నా సాధనలో నేనుండి ప్రజలు మనలను అమెరికా నుండి వచ్చిన ఎన్నారై… డబ్బు చెట్టులా చూసే అవకాశమున్నదన్న విషయము మరిచాను. అసలు నేను ఎవ్వరికీ చెప్పను కాని అక్కడ నా మిత్రుని వైపుగా కాబట్టి ఇలాంటి విషయాలు వారికి తెలిశాయి.

మిత్రుడు ఫోను చేసి విషయము విని బాధపడ్డాడు. తనని నేనే ఓదార్చవలసివచ్చింది.

“పోనిలే విషయము తెలిసిందిగా… నాకు అనుభవమొచ్చింది” అన్నాను. మావారికి అదే చెప్పాను. ఆయన ఏమీ మాట్లాడలేదు.. నేనెంత నొచ్చుకున్నానో అనే ఆలోచించారు…

మొత్తానికి ఇలాంటి అనుభవాల సమాహారమేగా జీవితము!!

***

పశుపతినాథుని దర్శనము

పశుపతీన్దుపతిం ధరణీపతిం భుజగలోకపతిం చ సతీపతిమ్।
ప్రణతభక్తజనార్తిహరం పరం భజత రే మనుజా గిరిజాపతిమ్॥

నేపాల్‌ చూసివద్దామని మా పిల్ల వెంటబడింది. నేను ఇక ఇంటికి అట్లాంటా పోవాలని, వచ్చి చాలా రోజులైయ్యిందని హడావిడిలో వున్నా. అది వినలేదు. నన్ను శివాలయము వద్ద వుండనిస్తే వస్తానని షరతు మీద మేము నేపాల్ ప్రయాణమైనాము. హైద్రాబాదు నుంచి చాలా చోట్లకు  డైరెక్టుగా ఫైట్లు లేవు. మనము ఢిల్లీ వెళ్ళి మారవలసినదే. అలా మేము రెండు ఫైట్సు మారి ఖాట్మండులోని త్రిభువన్‌ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగాము. అంతకు ముందే బుక్‌ చేసుకున్న హాయాత్‌లో బస చేశాము. పశుపతినాథుని దర్శనానికి నా మనస్సు ఉవిళ్ళూరుతోంది అప్పటికే.

పశుపతినాథుని ప్రస్థావన పరమ పురాతనమైనది. మనకు హరప్పా కాలము నుంచి పశుపతినాథుని పూజించినట్లుగా వివరాలు దొరుకుతాయి. ఇక్కడి దేవాలయము విశాలమైనది. బాగమతి నది వడ్డున వుంది. ఎన్నో దేవాలయాల మధ్యన వున్న పశుపతినాథుడు ప్రభువులా ప్రకాశిస్తున్నాడు. దేవాలయము కట్టడము విచిత్రముగా, పగోడా లాగా వుంది. బంగారు గోపురము, వెండి తలుపులు. చాలా పెద్ద నంది, ఆ నందికి వెండి తాపడము.

ఈ దేవాలయ స్థల పురాణము ప్రకారము అక్కడ పూర్వము ఒక పెద్ద వనముండేది. ఒకరోజు శివుడు ఒక దుప్పిలా మారి ఆ వనములో తిరుగుతుంటే, దేవతలు శివుని దర్శించాలని ప్రయత్నించారు. వారు దుప్పి కొమ్ములు పట్టుకు లాగితే, కొమ్ము విరిగి చేతికొచ్చింది. దుప్పి మాయమైనది. ఆ కొమ్మ పడిన చోట లింగమైనది. అది చాలా కాలము ఎవరికీ తెలియలేదు. ఒక ఆవు ఎప్పుడూ ఆ ప్రదేశానికి వచ్చి పాలు విడుస్తూ వుంటే, ఆ దేశపు రాజు చూచి, త్రవ్వి చూడగా అక్కడ పశుపతినాథుడు కనిపించాడట. అక్కడే దేవాలయము కట్టారు. అది దాదాపు పదిహేను వందల ఏళ్ళ పూర్వపు కట్టిన గుడి. మళ్ళీ నాలుగు వందల సంవత్సరాల క్రితము కొద్దిగా బాగు చేశారు దానిని.

మరో కథనము ప్రకారము  పాండవులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత మోక్షకాములై, మహాదేవుని వెతుకుతూ కేదారఖండము చేరుతారు. యుద్ధం చేసిన పాపం వలన వారికి మహాదేవుని దర్శనం లభించదు. అక్కడ తిరుగాడుతున్న ఎద్దులలో శివుడు కూడా ఉన్నాడని గ్రహించిన సూక్ష్మగ్రాహి ధర్మజుడు, భీముని రెండు కొండలమీద ఆటో కాలు ఇటో కాలు వేసి నిల్చోమని ఆదేశించి, నకుల- సహదేవులని ఆ ఎద్దులని భీముని క్రిందగా పంపమని ఆదేశిస్తాడు. ఎద్దుగా మారిన శివుడు అలా వెళ్ళడని ఆయన ఊహ.  ధర్మజుని ఊహ నిజమై శివుడు అటు వెళ్లకుండా తప్పించుకుంటూ ఉంటాడు.

భీముడు ఆ ఎద్దు శివుడని గ్రహించి, పట్టుకోబోతే, శివుడు భూమిలోకి దూరిపోయాడని, ఎద్దు వెనుక భాగం భీముని చేయి తగిలి, భూమి మీద జ్యోతిర్లింగమైనదని, అదే కేదారీశ్వరుడు. ఆలా భూమిలోకి వెళ్లిన శివుడు ఖాట్మండు లోని పశుపతినాథునిగా బయటకు వచ్చాడని చెబుతారు.

ఖాట్మండులో ప్రజలకు పశుపతినాథునిపై పరమ భక్తి. వారి దేశాన్ని రక్షిస్తున్నది ఆ పరమశివుడే యని వారి నమ్మకము. పూర్వము అక్కడ బలులు చాలా జరిగేవిట. ఆది శంకరులు ఆ బలుల సాంప్రదాయము మాన్పించి, సాధు పద్ధతిలో పూజలను నిర్దేశించారు. అక్కడి పూజారి కన్నడపు పూజారి.

ఆ శ్రావణములో మేము ఇద్దరమూ వెళ్ళి ఖాట్మండులో వారము రోజులున్నాము. శ్రావణమాసము ఉత్తరభారత దేశములో ఎంతో ప్రత్యేకమైనది. శివపూజతో ప్రతి వారు భక్తిలో మునిగి తేలుతారీ మాసములో. నాకు ఆ విషయము అక్కడికి వెళ్ళాక అర్థమయ్యింది. కార్తీకము మనకు ప్రత్యేకము.

మేము వెళ్ళిన రోజు హోటలుకు వెడుతుంటే ఒకచోట ప్రజలు ఎర్రచీరలు, పెద్ద కుంకుమ బొట్టుతో బారులుగా నిలబడి వున్నారు. అదేమని అడిగితే అది పశుపతినాథ దేవాలయ దర్శనానికి వరస అన్నారు.  ఎంతో మంది శ్రద్ధగా చేతిలో పూల సజ్జలతో నిలబడి వున్నారు. నాకు శివరాత్రి నాటి కాశీ గుర్తుకు వచ్చింది. అక్కడా అంతేగా పదిహేను కిలోమీటర్ల పొడుగు బారులు బారులుగా భక్తులు.  చాలా విషయాలలో పశుపతినాథ దేవాలయ పరిసర ప్రాంతాలు నాకు కాశీని గుర్తుకు తెచ్చాయి.

వారణాశీ విశ్వేశ్వరుని తరువాత అంత పవిత్ర భావము కలిగించేది పశుపతినాథుడే. అక్కడ ఆ దేవాలయములో అణువణువు పరమ పవిత్రము. హిందువులు కాని వారికి ఆ దేవాలయములో ప్రవేశముండదు. మేము హోటలు చేరిన రోజు చాలా అలసటగా వుండి నే నిద్రపోయాను. మా పిల్లది నాది అరాచకమని గొడవ మొదలెట్టింది.

(సశేషం)

Exit mobile version