Site icon Sanchika

సత్యాన్వేషణ-46

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]ఆ[/dropcap] రోజు శ్రీవారికి ఫోనులో ఆ విషయము చెప్పి “ఏంటో ఈ సిస్టమ్. ఆడపిల్లలకి మాత్రము తల్లితండ్రులకు చెయ్యాలని వుండదా” అని వాపోయాను..

మావారు తన మాములు ధోరణిలో “వారు పద్ధతులని పెట్టారు.. నమ్మితే పద్ధతిగా చెయ్యాలి, లేకపోతే అసలు ఇవన్నీ నమ్మకు… సగం సగంగా ఊగిసలాడకు” అని ఊరడించాడు. నేను సమాధాన పడలేదు. ఇలాంటి కర్మకాండలకు స్త్రీలను దూరంగా వుంచి పూర్వీకులు చాలా అన్యాయం చేశారని నా బలమైన భావన. ఇందులో నేను ఎవ్వరితోనూ వాదులాడ దలచుకోలేదు. స్త్రీవాదమని మరో వాదమని కాదు కానీ, నా భావన మాత్రం అచ్చంగా ప్రపంచములో స్త్రీని second grade citizen గా చూస్తారన్నది వాస్తవం. మన వేదాలలో స్త్రీకి ఉన్నతమైన స్థానమిచ్చారు. యాగవిధులలో భాగము చేశారు. కానీ మధ్యలో ఎవరో మార్చారు ఈ పద్ధతి. మనకు యోగవాసిష్ఠములో ఈ విషయము తెలుస్తుంది

నేటి మారిన కాలములో స్త్రీ సంపాదన పనికివస్తుంది. స్త్రీ కుటుంబం కోసం కొవ్వత్తిగా కరగటానికి పనికి వస్తుంది. ఇందులో మాత్రం పనికిరాదు. అర్థం పర్థం లేని అవకరాలు. దీని గురించి కలిగిన ఖేదంలో నేను తమ్ముడికి మెసేజ్ ఇచ్చా. “మహనుభావా తమరు తప్ప ఇతరులు పనికిరారట. ఇటు వచ్చి ఆ పనేదో చూడు” అని. దానికి వాడు ‘ఆ బ్రహ్మ సంకల్పము కుదిరినప్పుడు బ్రహ్మకపాలంకి వస్తాలే, నీవు జాగ్రత్త!!’ అంటూ సెటైర్ వేశాడు.

మనసులో కలిగిన కష్టం ఆశ్రమ నిర్వాహకులలో మాతృమూర్తి సమాన కోటేశ్వరమ్మ పిన్నిగారు గమనించి ఊరడించారు. ఆ అష్టాక్షరీ క్షేత్రంలో అన్నవితరణ చేసి అమ్మ నాన్నగార్లకు నాకు చేతనైనంత బుణం తీర్చుకోవచ్చని రాఘవ స్వామి సలహా ఇచ్చారు.

ఈ మహాలయ పక్షాలు అందునా అమ్మ తిథి కూడా అచ్చంగా అప్పుడే… అందుకని అన్నదానంకి కట్టి చేసేది ఇంక ఇంతేనని కన్నీటితో నమస్కరించాను బ్రహ్మకపాలానికి, గంగమ్మకు, పుణ్యదంపతులైన అమ్మానాన్నగార్లకు.

***

స్త్రీ సన్యాసినిలు

బదిరిలో ఎందరో సాధుసంతులున్నారు. వారిలో కొందరు స్త్రీలు కూడాను. ఒక స్త్రీ సన్యాసినితో నాకు కొంత స్నేహము కలిగింది. ఆమె పేరు సూరమాత. ఆమె ఆశ్రమములో జరిగే అన్నవితరణకు రోజూ వచ్చేది. భోజనమంతా ఒక స్టీలు డబ్బాలో పెట్టించుకు పోయేది. అక్కడ తినేది కాదు ఆమె.

నలభై వుండవచ్చు వయస్సు. తెలుగు మాట్లాడేది ఆమె.

నాతో మాటల సందర్భములో “స్త్రీ లకు ఆత్మజ్ఞానము గురించి భారతీయ సనాతన ధర్మం కొంత నిరాదరణ చేసింది” అంది.

“అంటే? వివరించగలరా?” అడిగాను

“ఎంత సేపూ స్త్రీకి భర్త, పిల్లలు, వారి సంరక్షణనే జీవిత ధ్యేయంగా నిర్దేశించారు. అది అన్యాయము… పరమాత్మ కోరితే ఎవ్వరూ ఆపలేరని… ఉదా: మీరాబాయి చూడండి. ఆమె సంసారము వదిలి భక్తిలో మునిగిందా లేదా. స్త్రీ కూడా ఒక ఆత్మ వున్న మనిషి. సాధనకు లింగభేదము లేదు. ఈ శరీరము కేవలము వాహనము మాత్రమే. ఆత్మనే నిజము. ఆ ఆత్మ స్వేచ్ఛను కోరుతుంది, ఈ జనన మరణ చట్రము నుంచి. దానికే మనము సాధన చెయ్యాలి” అంది ఆమె.

ఆ మాట నన్ను ఆలోచనలలో పడేసింది.

ఆమె కాషాయము కట్టుకునేది. కుటుంబ జంజాటము లేనిది. తనకు చిన్నప్పుడు పెళ్ళి చేస్తామంటే, అదో కట్టడియని వద్దని పారిపోయి ఆమె బృందావనము వెళ్ళిపోయింది. అక్కడ వున్నన్ని రోజులూ ఆమె కృష్ణుని తన భర్తగా భావించిందట. తరువాత ఆమెకు కలలో బదిరి రమ్మని పిలుపు వచ్చింది. ఏదో తెలియని స్వరము “బదిరికి వచ్చి నాతో వుండు” అన్నది. ఆమెకు బదిరి ఎలా వెళ్ళాలో తెలియదు. కొంత బస్సులో, కొంత నడిచి ఆమె బదిరి చేరింది. రాగానే బదిరీనారాయణుడే తనకు రక్ష అని గ్రహించి ఇక అక్కడే వుండిపోయింది.

“బదిరి మూసిన ఆరు నెలలూ మరి ఎక్కడ వుంటారు” అడిగాను..

“దిగువన ప్రభత్వము వుంచుతుందమ్మా” అంది. అంటే రిషికేషుకు వెళ్ళే దారిలో వాళ్ళకు ఒక చోట చిన్న గదుల వంటివి వున్నాయి.

“మీరు ఏ మంత్రము చేస్తారు? మీకు సన్యాసమెవరిచ్చారు” అడిగాను సూరమాతను.

“నాకు వేరే ఏ మంత్రమెందుకమ్మా. నారాయణుడే నావాడు. ఆయన నామమే నాకు మంత్రము. ఆ నామము తలుస్తా, పాడుతా. నాకింకొకటి తెలియదు” చెప్పింది భక్తిగా.

“మీ సన్యాస దీక్ష….” మళ్ళీ అడిగాను.

“ఈ రంగు కాకుండా మరో రంగు బట్టలలో వుంటే నీచ మానవ బుద్ధి, చూపు పట్టలేము తల్లీ. నాకు అన్నీ నారాయణుడే ఇచ్చాడు” అంది ఆమె చిన్నగా నవ్వుతూ.

“మీకు ఏవైనా సంఘటనలు ఎదురయ్యాయా అటువంటివి” ఆమెను లోతుగా చూస్తూ అడిగాను…

నా వైపు చూస్తూ “ఇక్కడ వున్న సన్యాసులలో సగము పైగా మగవాళ్ళు ఇంట్లో పెళ్ళాం మీద కోపముతో వచ్చినవారే. వారికి నిజమైన వైరాగ్యము, భక్తి వున్నాయంటావా” అన్నది. నాకు తెలియదన్నట్లుగా తల వూపాను.

కాని నిజానికి వారిలో చాలా మంది ఎప్పుడు చూసినా హిమాలయన్‌ వీడ్ పీలుస్తూ కనపడుతారు. ఆ మత్తులో ఏ అరాచకము చేస్తారో మనకు తెలియదు కదా.

ఆమె నా వైపు స్నేహంగా చూచి నవ్వుతూ “బంగారు తల్లిలా వున్నావు… కోటేశ్వరమ్మ చెప్పింది.. నీవు తిండి కూడా మానేసావని. ఎందుకింత కష్టపెట్టుకుంటున్నావు. చక్కగా అమెరికాలో వున్న నిన్ను ఏం లాగిందని ఇటు వచ్చావు” అంది.

“నా అదృష్టము పండి బదిరి నారాయణ దర్శనము కలిగింది” చెప్పానామెకు.

“చిదిమి దీపం పెట్టొచ్చు. మీవారున్నారా? పిల్లలా?” ఆరాగా అంది. మాటకో అడ్జక్టివు వాడుతూ నన్ను ముద్దు చేస్తున్న ఆమెను చూసి, తల వూపుతూ “ఉన్నారు. ఆయన ఆఫీసు పనిలో. ఉన్న కూతురు చదువుతూ….” అన్నాను.

“నిన్ను చూస్తే మా చెల్లి గుర్తుకొచ్చింది” అన్నది.

“ఎక్కడుంటుంది మీ చెల్లి”

“ఊరులో” అంది. వివరాలు ఇవ్వలేదు.

“ఇక్కడ ఎక్కడుంటారు” అడిగాను.

“చరణపాదుకల దగ్గర రూము దొరికింది ఈ సంవత్సరము” అంది. కమ్మని భజన గానము చేసింది. నారాయణుడే తన భర్త, తన జీవము అన్న ఆ భజన… ఆ గొంతులో భక్తి ఆ నాటి మధ్యహ్నపు నీరెండను, ఆ ఆశ్రమముతో పాటూ నా మదినీ నింపాయి.

బదిరిలో అక్కడ ప్రభుత్వ గదులు చిన్నవి వున్నాయి. అవి సాదుసంతుకు కేటాయిస్తారు. దానికి వీరు అప్లై చేసుకోవాలి. సత్రం వంటిది. అందుకే కాబోలు అన్నారు సత్రం నిద్ర, మఠం భోజనము…. మిగిలిన సమయము ఆ నారాయణ్ణి చూస్తూ ఆయన నామాన్ని సేవిస్తూ…. ఓహో…. ఏమి భాగ్యము అనిపించింది.

ఆ గదులు దొరకని వారు చిన్న ప్లాస్టిక్ పట్టా క్రింద వుంటారు. స్త్రీలైనా పురుషులైనా…. చలీ, సౌకర్యాలు పట్టించుకోక కేవలం పరమాత్మను ధ్యానిస్తూ… ఆ చలిని తగ్గించుకోవటానికే ఆ మత్తు మీద ఆధారపడుతారు చాలా మంది. కొందరు మాత్రము వీటికి అతీతముగా ధ్యానములో మునిగి, సర్వము మరిచి వుంటారు. వారిని ఈ ప్రకృతి, మార్పులు ఏమీ చెయ్యవు.

మౌనిబాబా

బదిరిలో చరణపాదుకలు వున్న చోటుకు పైన మరింత ఎత్తున శిఖారాగ్రాన ఒక ఆశ్రమము కనపడేది. దానిని చేరటము కూడా చాలా కష్టముగా వుండేదిట. అందులో ఒక సన్యాసి వుండేవారట. ఆయన దేనికీ ఆ శిఖరము దిగి వచ్చేవాడు కాదట. ఎవ్వరూ అంత దూరము రాకూడదని ఎత్తులో కట్టుకున్నాడు ఆయన. ఆయనను చూడటానికి భక్తితో వెళ్ళిన భక్తులను పలకరించేవాడు కూడా కాదుట. ఆయన మౌన యోగి అన్నమాట. కాని ఆయన దర్శనము తరువాత భక్తులకు మంచి అనుభవాలు జరుగుతూ వుండేవిట. ఇది ఎప్పటి మాటో నాకు తెలియదు.

నా మిత్రులు కొందరు “బదిరిలో మౌని బాబా వున్నారు చూసిరా.. నీ కోరిక తీరుతుంది” అని పదే పదే నన్ను హెచ్చరించారు. నేను మా ఆశ్రమ కేర్‌టేకర్‌ని వివరాలు అడిగాను. ఆయన చెప్పినదేమంటే “ఆ పైన శిఖరాన వున్న ఆశ్రమములో ఇప్పుడు ఎవ్వరూ లేరు. దానికి కొద్దిగా క్రిందన కనపడే నీలి రంగు ఆశ్రమములో ఒక మౌనిబాబా వున్నాడు. కాని ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు” అని …

“బదిరిలో చాలా మంది సాధువులు మహిమలు గలవారుంటారు. నీ లక్ ట్రై చెయ్యి” అని పదే పదే మిత్రుల హెచ్చరికల వలన నేను ఆలోచనలో పడ్డాను.

(సశేషం)

Exit mobile version