[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]
నేను బదిరి కేవలము కొంత జపము చేసుకోవటానికి, సాధనకు వచ్చాను. సాధుసంత్ చుట్టూ తిరగటానికి కాదుగా అనుకున్నా, చెబుతున్నది యోగాలో చాలా పేరు తెచ్చుకున్న వారు కాబట్టి కొట్టెయ్యలేకపోయాను.
ఒకనాడు ఉదయము నా పారాయణము పూర్తి చేసుకొని భోజనము చెయ్యకుండా అలా నడుస్తూ చరణపాదుకల వైపుగా వెళ్ళాను. అది ఎత్తు లోయ కాబట్టి ఆశ్రమములో నా గది బయట నుంచుని చూస్తే అన్నీ కనపడతాయి. కాని నడవటానికి వెడితే మాత్రము చాలా దూరముంటాయి. నేను నెమ్మదిగా ఆ నీలి రంగు రేకులతో కప్పిన ఆశ్రమము లోనికి వెళ్ళాను.
లోపల ఎవ్వరూ లేరు. ప్రవేశించగానే మెట్లు కనపడ్డాయి. ఎక్కుతూ వెడితే ఒక గది తలుపులు తెరిచి వున్నాయి. గదిలో ధూపము దట్టంగా వుంది. వెలుతురు పూర్తిగా లేదు. కొంత మసకగా వుంది. ఒక వైపు గోడకు పెద్ద మహావతార్ బాబా ఫోటో వుంది. దాని ముందు హుండిలు రెండు ఉన్నాయి. ఒకటి డాలర్లు వెయ్యమని, మరోటి రూపాయలు వెయ్యటానికి.
ఆ వాతవరణములో కొద్దిగా మత్తు కలుగుతోంది. పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కళ్ళు ఆ మసక వెలుతురుకు అలవాటు పడినాక చూస్తే, మూలకు ఒక నల్లజాతి అతను ఎర్రటి కళ్ళతో మత్తులో జోగుతున్నాడు. ఆ మత్తు ఈ ధూపముదేనని నాకు అనుమానము కలిగి బయటకు వచ్చాను. అటు మాలగా వున్న గదిలో పూర్వము ఎవ్వరూ లేరు… ఇప్పుడు ఒక జడధారి వున్నాడు. ఎర్రటి ముఖమల్ గౌను వంటిది ధరించాడు. పెద్ద త్రిశూలము వుంది ప్రక్కన. ఆయన ముఖాన ఎర్రుటి బొట్టు… కళ్ళు కూడా ఎర్రటి ఎరువు. నన్ను చూసి దగ్గరకు రమ్మనమని సైగచేశాడు. వయస్సు ముప్పై వుంటాయి బహుశా.
నేను వెళ్ళి నమస్కరించి కూర్చున్నాను.
“ఎక్కడ్నుంచి వచ్చావు” అడిగాడు.
“హైద్రాబాదు” చెప్పాను.
నాకు టీ తెమ్మనమని పిలిచాడు ఎవరినో… తరువాత నాకు ఇక సోది కొట్టటడము మొదలెట్టాడు… “నాకు వి.ఎన్.ఆదిత్య తెలుసు….. జ్యోగి తెలుసు…. పూరి తెలుసు… నేను వస్తే బంజారాహిల్స్‌లో పెద్ద ప్రభంజనములా జనం వస్తారు”…….
“తెలుగ్సు సబ్ మేరే భక్త్” అన్నాడు ముక్తాయింపుగా…..
నాకు లోలోపల చిరాకు పెరుగుతోంది. ఇక భరించలేక.. “నేపోతా” అని లేచాను…..
ఆయన మాటలు తడబడుతూ…. “రా… నా మందిరములో దుర్గా నిత్య దీపముంటుంది…. దర్శనము చేసుకో….. మహామేరు చూడు” అన్నాడు…
నాకు నచ్చలేదు… కాని జగదంబను తలిచి ‘అమ్మానాకు సరి అయిన దారి చూపు’ అనుకుంటూ ఆయన పూజా మందిరములోకి వెళ్ళాను.
అక్కడ మహా మేరువు వుంది. అఖండ దీపమూ వున్నది.
ప్రక్కనే పెద్ద మంచం వుంది. ఎర్రటి రంగు అంతటా…. ఎర్రటి దుప్పటి మీద ఎర్ర బట్టల బాబా…. ఎర్రటి కళ్ళతో….. చూస్తూ వుంటే నాకు జీవితములో ఎప్పుడూ కలగనంత నిరాశ…. చీదర కలిగాయి…. నేను మహామేరువుకు భక్తిగా నమస్కరించి లేచి వస్తుంటే “ఆగు” అని నా మోహాన కుంకుమ పెట్టి ఒక బ్రహ్మకమలము ఇచ్చాడు.
నేను ఆశ్రమము దాటి వడివడిగా బయటకు వచ్చేశాను… నా గుండె దడ తగ్గలేదు.
నేను అలకనంద దాటి ఆశ్రమము వైపు వెళ్ళాలి. బయటకు రాగానే ఒకతను “మౌని బాబా ఆశ్రమము ఇదేనా” అన్నాడు. “అవును” చెబుతూ వచ్చేశాను.
అతను తరువాత కనపడి అక్కడ ఎవ్వరూ లేరని, అది పూర్తి ఖాళీగా వుందని చెప్పాడు. నాకు ఆశ్చర్యమేసింది….. నా చేతులలో బ్రహ్మ కమలము అలాగే వుంది.
నేను అలకనందలో ఆ పువ్వు పడేశాను. నాకు ఆయన ప్రవర్తన నచ్చలేదు. ఏదో ఫిషీగా వుంది.
నేను ఆశ్రమములో భోజన సమయములో సూరమాతను “మౌనిబాబా తెలుసా” అంటే ఆమె “ఆ నత్తోడా” అంటూ నవ్వింది…
నేను తలవూపుతూ….”కొద్దిగా తేడాగా వున్నాడు కదా” అన్నాను….
ఆమె ఉత్సాహముగా “నీకూ అనిపించిందా….. నేను చెప్పానమ్మా అందరికీ… నమ్మరు ఎవ్వరూ… అతను ఆరేడు ఏళ్ళప్పుడు ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఆ శిఖరము చూడు అక్కడో ముసలి మౌనిబాబా వుండేవాడు. ఈ పిల్లాడు ఆయనకు తోడుగా వుంటూ ఆయనకు కావలసినవి చేసిపెడుతూ వుండేవాడు. ఆయన వయస్సు భారమై క్రింద పల్లెకు వెళ్ళిపోయాడు. ఇతనికి మాట నత్తి. ఆ ఇన్ఫీరియారిటీతో మాట్లాడేవాడు కాదు. అందుకని మౌనిబాబా అన్నారితనిని. ముందు బానే వుండేవాడు…. ఈ మధ్యనే ఏదో జరిగింది. పూర్తిగా చెడ్డాడు” అంది.
వూరుకోకుండా ఆశ్రమ హెల్పర్లును పిలిచి ”వినండి.. సంధ్య కూడా చెపుతోంది మౌనిబాబా గురించి తేడాగాడని…. దొంగమ్మా… వాడు దొంగ…. బాబా ఏంటి. ఇంతకు ముందు ఫారెన్ భక్తురాలితో ఏదో చేసి తన్నులు తిన్నాడమ్మా” అంది అరిచినట్లుగా….
నేను మాట్లాడలేదు..కాని చాలా కష్టమేసింది మనస్సులో.
నేను ఆ రాత్రి చాలా డిప్రెషను ఫీల్ అయ్యాను.
(నన్ను అక్కడికి పంపిన మిత్రురాలు తరువాతి కాలములో నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఆమెకున్న లోతైన నెగిటివ్ దృష్టికి నేను చాలా కష్టపడ్డాను. కాని పరమాత్మ కృప వలన పెద్ద కష్టం లేకుండా బయటపడ్డాను. కొన్ని సార్లు ఇలాంటి వారి వలన మన ఇన్నాళ్ళ సాధన బూడిదలో పోసినట్లు అవుతుంది.)
మళ్ళీ నా హిలీంగు టీచరుకు మెసేజ్ చేశాను. నా డిప్రెషను గురించి. ఆయన నన్ను దీవించి హీల్ చేశారు. కానీ అక్కడ ఇక వుండవద్దని…. కుదిరినంత త్వరగా బయలుచేరి హైద్రాబాదు వచ్చి కలవమని చెప్పారు.
నేను వచ్చి రెండు వారాలే అయ్యింది. ఇంకో వారమన్నా వుండాలన్న నా కోరిక తీరకుండా మావారు నా మాట వినక నాకు వారంలో ఫ్లైటు బుక్ చేశారు. నేను ఎదురుచెప్పలేని స్థితికెళ్ళాను. ఆ మౌనిబాబా దగ్గరకు వెళ్ళకపోతే నే నెలరోజులు వుండేదాన్ని కదా అనుకున్నా. నాకు అప్పటికి అదే ప్రాప్తం.
నేను ఆదివారము తిరిగి రుషికేషు వెళ్ళాలనుకున్నాను. సోమవారం నా ఫ్లైటు.
శుక్రవారము వాన మొదలైయ్యింది. శనివారము ఉదయము నేను నిజరూప దర్శనానికి వెళ్ళాను.
అక్కడ స్వామికి దోమతెర తొలగించలేదింకా. నేను మండపములో ఎదురు చూస్తూ మూలను కూర్చున్నాను.
ఇంతలో ఒకతను వచ్చి, “నా వద్ద అభిషేకం టికెట్లు వున్నాయి. మా వాళ్ళు రాలేదు. నాతో రండి” అన్నాడు.
నేను వెళ్ళిపోవాలని చెప్పేలోపల ఆయన వడివడిగా వెళ్ళి జనములో దూరి లైనులో మొదట నిలబడ్డాడు. నేను దగ్గరకు వెళ్ళి జనం అంటే భయమని చెప్పే లోపలే, నా చేతిలో ఒక టికెటు పెట్టి లోపలికెళ్ళాడు. నేను నారాయణ దర్శనము తప్ప మరో ఏ సేవ చెయ్యలేదు. కొండల్‌తో వచ్చి అన్ని సేవలు చేసుకోవాలని నా కోరిక. అందుకే ఆ టికెటు కొనలేదు. విష్ణసహస్రనామ పూజ టికెటు కొన్నా ఎక్కడో వెనక కూర్చొని, వాళ్ళలో దూరలేని నా చేతకానితనానికి దూరం నుంచి చూసి వచ్చేశాను. ఈయన టికెటు ఇచ్చి లోపలికి వెళ్ళిపోతే ఎలా మాట్లాడకుండా. ఆయన వెనకనే నేనూ నా చేతిలో టికెటు ఇచ్చి వెళ్ళాను. ఎవ్వరూ లేరు. గడప దగ్గర ఆయన కూర్చున్నాడు. నన్ను ప్రక్కన కూర్చోమన్నాడు. నేను కూర్చునా కాని తరువాత జనము తొయ్యటము మానలేదు. కొంతసేపటికి ఇక ఎవరిగోలా లేదు…. కళ్ళ ఎదురుగా పరంధాముడు…. జగన్నాథుడు…. జగన్మోహనముగా…. సాలిగ్రామముపై చెక్కినట్లుగా… గిరజాల జుత్తు…. ఆ పద్మాసనము… ఆ చిరునవ్వు…. అన్నీ స్పష్టము… ఆ స్వామి నేను సాగిలపడితే అందేలా వున్నాడు. నన్ను అంత దగ్గరగా చేర్చుకున్నాడు.
(సశేషం)