[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]
[dropcap]నే[/dropcap]ను హైద్రాబాదు వెళ్ళినప్పుడు వారింటికి వెళ్ళాను. పళ్ళు, వారి పిల్లలకు ఏవో చిన్న బహుమతులు, వారికి బట్టలు ఇచ్చి నమస్కరించి వచ్చాను.
ఆయనకు చాలా విషయాల మీద పట్టు వుండేది. ఎన్నో విషయాలు చెప్పినా, అన్నీ వదిలేయ్యటం కాదని, హిందూ మతోద్ధరణకు కంకణము కట్టకోవాలని పట్టుదలగా చెబుతుంటేవారు.
సాధన అంటే కేవలము జపతపాలే కాదని కొంత శరీర దృఢత్వమన్నది వుండాలన్నది చెపుతూ, సంసారము వదలొద్దని అదే పనిగా నాకు ప్రసంగాలు ఇచ్చేవారు. ఆయన వ్యాయామము చేసే వీడియోలు పంపటము మొదలుపెట్టారు. కొంత కాలానికి ఆయనలో తేడా కనపడింది. అతిగా పొగడటము…. వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడటము మొదలెట్టారు. వారికి నా హద్దులు గుర్తుచేశాను.
తరువాత, తన గురించి తను అతిగా పొగుడుకుంటూ చెప్పటము కొద్దిగా ఇబ్బందిగా వుండేది. “నేను 2000 మందిని బ్రతికించాను” వంటివి పెరిగాయి. నేను ఇంద్రుడను, చంద్రుడని అని పొగడుకోవటము. “నేను సర్వము చెయ్యగలను. నాకు అడ్డు లేదు. నాకు అమ్మవారు ప్రక్కన్న కూర్చుంది. నేను ఏది చెబితే అదే జరుగుతుంది. నేను బ్రహ్మ వాక్కు తిరిగి రాస్తాను”…. అన్న మాటలు పెరిగాయి. ‘నేను’ అన్న అహంకారము అణువణువునా అతిగా కనపడుతూ వుండేది. “గురువుగా చూడకు నేను నీ మిత్రుడిని” అని గొడవ మొదలెట్టారు. ఇటువంటివారిని వదిలించుకోవటము ఉత్తమము అన్న భావన బలంగా కలిగింది.
సున్నితమైన మనసత్వము కారణమున మొఖముపై చెప్పలేక కొంత కాలము ఇబ్బందిని భరించవలసి వచ్చింది. ఆ వేషాలు శృతిమించాయి. సుందరాకాండలో రావణుడు సీతతో చెబుతాడు. “నీవు చిన్నదానవు. వయస్సులో వున్నదానవు. నీకీ సన్యాసిని వేషాలెందుకని”….
ఆయన అలాంటి మాటలు నన్ను తిరిగి తిరిగి ఆలోచనలో పడవేసాయి. నేను ఎక్కడ పొరపాటు చేశాను? అని. ఈయన ఇంత పైత్యపు వాగుడు మొదలెట్టాడు అని. బ్లాకు చెయ్యటానికి గురువు కదా అన్న బెంగ, భయం.
చాలా నలిగిపోయాను ఆ కొద్దికాలము. బహుశా నన్ను అన్ని రకాలుగా పరీక్షించదలిచాడా పరమాత్మ? ఇక చాలు భరించలేనన్న రోజున ఆయనను బ్లాకు చేసినా…. ఇలా గురువులని చెబుతు ఎందరి జీవితాలతో ఆడుకుంటున్నారో….. నిజమైన సాధకులకు ఇవ్వన్నీ మాయయని తెలుసుకదా. నన్ను పరీక్షిస్తున్నాడా అంటే అంత అభ్యంతరకరమైనవి మాట్లాడడు కదా. ఈ గురువు అన్న ముసుగులో వున్నాయన శ్రీ ఎమ్ చెప్పిన అఘోరీ కాదు గాక కాదు.
ఈ శరీరము నవ రంధ్రముల కుండ. ఇందలి వెలుగు జగదంబ చైతన్యము. అంతటా నిండివున్న ఆ చైతన్యాన్ని మనము ఎరుకలోనికి తెచ్చుకోవటమే ముక్తి.
బదిరిలోని సూరమాత చెప్పినట్లుగా స్త్రీలు విరాగినిలుగా చూసినా, వారు ముక్తి కొరకు ప్రయత్నించినా గురువులన్న వేషధారులు తెగ అలుసు తీసుకుంటారు. అందుకే అన్ని కుంభకోణాలు… అన్ని అపనమ్మకాలు. అప్పటి నుంచి మరింత ఆచితూచి అడుగు వెయ్యాలని నిశ్చయించుకున్నాను. వారిని పూర్తిగా నా ఆలోచనలలోనుంచి తొలగించాను.
భయమనేది అధర్మం. నిర్భయత్వం-ధృతి అనేది ధర్మం. ధర్మానికి గల పది లక్షణాలలో మొట్టమొదటి లక్షణం ధృతి. దీనిని ధరిస్తే మిగతా తొమ్మిది లక్షణాలు వాటంతటవే ధరింప బడుతాయి. విజయము కరతలామలక మవుతుంది. ‘యతో ధర్మ స్తతో జయః’ ధర్మము ఏ వైపుంటే విజయము ఆ వైపుంటుంది. భయమనేది ఓటమికి చిరునామా, పట్టుదల అనేది విజయానికి చిరునామా. భయపడినవాడిని విజయం వరించదు, పట్టుదల ఉన్నవాడ్ని ఓటమి భయపెట్టదు.
ఇన్నాళ్లు మనసు మూలలలో ఉన్న కాస్త భయం పోయింది. ఇక నాకు నేనే భయపడను.
ఈ ప్రహసనములో ఇదో అనుభవము….
***
ఓo….
“ఏతా ఏనా వ్యాకరం ఖిలే గా విష్ఠితా ఇవ
రమన్తాం పుణ్యా లక్ష్మీర్యాః, పాపీస్తా అనీనశమ్॥”
-అథర్వవేదం.( 7-115-4)
ఓ అంతర్యామీ పరమేశ్వరా! నాకు సత్యాసత్యములను, ధర్మాధర్మాలను, న్యాయాన్యాయాలను వేరుచేయగల వివేక బుద్ధిని ప్రసాదింపుము.
దైవీ సంపదలను – అభయము, సత్త్వ సంశుద్ధి మొదలగు వాటిని నాలో నింపుకుంటూ, అసురీ సంపదలైన – దంభ, దర్ప, అభిమాన, అహంకారాదులను వెడలగొట్టెదను గాక.
వైజాగు టీచరుగారు:
నా మిత్రులలో ఒకరు నాకు వైజాగులో వున్న ఒక ఆధ్యాత్మిక గురువును సందర్శించమని సలహా ఇచ్చారు.
ఆమె పేరు లక్ష్మిటీచరు గారు. ఆమె తండ్రి నాస్తికులు. ఆయన సైన్సును నమ్మిన వ్యక్తి. కాని చిన్నతనముననే ఆమెకు మనిషి దేవుడూ వేరు కాదని జ్ఞానము కలిగింది. చిన్నతనము నుంచి సదా పరిపూర్ణమైన ఆనందములో వుండేవారు. ఇంట్లో పరిస్థితి వ్యతిరేకముగా వున్నాకూడా సదా పరమాత్మతో అనుసంధానములోనే వుండేవారు. ఆమెకు ప్రేమ ఇవ్వటము తప్ప మరొకటి తెలిసేది కాదు. ఆమెకు ఇద్దరు అక్కలున్నారు. వారు, ఆమెను అందరూ ఇష్టపడటము చూసి చాలా ఆశ్చర్యపోతూ వుండేవారు.
ఆమె ఇంగ్లీష్ లిటరేషర్ చదివి సెంట్రల్ స్కూల్లో టీచరుగా పని చేసేవారు. ఆమె ఎక్కడ వుంటే అక్కడ ఆమె మాటలకు, అవ్యాజ ప్రేమకు ఆమె తోటి వారు ఆకర్షితులవ్వటము జరిగేది. దేని మీద ప్రత్యేక శ్రద్ధగానీ, అశ్రద్ధగాని ఆమెకు వుండదు. అందరినీ సమంగా ప్రేమించే ఆమె నైజము, మృదువైన ఆమె స్వరము, కరుణ కూడిన ఆదరణ ఆమెకు ఎందరో శిష్యులను చేకూర్చినా వారిని మిత్రులుగా చూస్తారు తప్ప తనో గురువు అని అనరు.
సాధకులైతే సాధనా విషయాలు. సిద్ధులైతే వారికి ఉపయోగకరమైన విషయాల లోతులు, జ్ఞానులైతే వారితో చర్చా విధానం అందుకు తగ్గట్టుగానే ఉండేది ఆమెది. శ్రోత/భక్తుడు ఏ స్థాయిలో ఉన్నాసరే వారికి అవసరమైన విషయం మాత్రమే సూటిగా స్పష్టంగా అర్థం అయ్యేటట్లు అర్థం అయ్యేవరకు చెబుతారు.
ఎంత ఎక్కువ స్థాయిలో ఉన్నవారికైనా వారితో మాట్లాడితే అంత కంటే పై మెట్టు ఉంది అని అర్థం అవుతుంది. వచ్చినవారు ఎవరైనా ఎలాంటివారైనా వారి ఆత్మోన్నతికి టీచరుగారి పదాలు, వాక్యాలు, బోధ ఖచ్చితంగా సహకరిస్తాయి. ప్రపంచములో ప్రతీది ఒక జంఝాటమే అని, అన్నింటినీ వదులుకోవటమే సాధన అని చెబుతారు. మన పద్ధతి నుంచి మన అహం వరకూ.
నాకు ఆమెను కలవమని చెప్పిన స్నేహితురాలు ఆమె వివరాలు చెబుతూ, ముందుగా అంటే కనీసము మూడు రోజులు ముందుగా ఆమెకు నా రాక తెలిపి వెళ్ళమని హెచ్చరించింది.
నేను సరేనన్నా, ఆ విషయము మర్చిపోయాను. వైజాగు మావారితో కలసి వెళ్ళిన తరువాత ఆ విషయము గుర్తుకు వచ్చింది. చెయ్యగలిగినది ఏమీ లేదు. కాని ప్రయత్నించదలచి నేను ఫోను చేశాను.
ఆమె చాలా ఆదరముగా “చాలా ఖాళీగా వున్నాను. వచ్చెయ్యండి” అని పిలిచారు.
నాకు లంచ్ ఇత్యాదులు ముగించుకు వెళ్ళేసరికే చాలా టైము గడిచింది.
ఆమె నాతో “మీ కోసము ఎదురుచూస్తున్నాను. ఎందుకింత ఆలశ్యముగా వచ్చారు” అన్నారు.
నాకు మనస్సులో అమ్మవారి మీద మరింతగా తపన కలిగింది. నాకోసము ఒక ఆత్మజ్ఞాని ఎదురుచూడటమంటే అమ్మవారి కరుణనేగా మరి.
ఆమెను కలిసిన క్షణం ఎంతో మధురమైనది. ఆమె తన పరిసరాలలో వున్న ప్రజలకు జ్ఞానమందిస్తూ వారిని స్వాత్మ వైపుకు మరలుస్తున్నారు. ఆమెకు జిడ్డు కృష్ణమూర్తి బోధలను చిన్నచిన్న మాటలతో వివరిస్తూ వుంటారు. అవి మన మామూలు జీవితములో ఎలా అనువదించుకోవాలో తెలుస్తుంది. మనలను మనము బంధాలనుంచి విడుదల చేసుకోవటానికి సహాయపడుతుంది.
ఆమె చుట్టూ వున్న ఆరా చాలా సున్నితంగా వుంటుంది. మన భావాలు, మన బాధలు ఆమెకు చేరుతూ వుంటాయి దూరంతో నిమిత్తం లేకుండా.
మన మనసులో మాట ఆమెకు మనము చెప్పకనే తెలిసిపోవటము కూడా చాలా మంది భక్తులకు అనుభవము. ఆమె మాట, చేష్టా మన ప్రశ్నలకు సమాధానమవుతూనే వుంటుంది.
ఆమె ఎప్పుడూ “ఈ డివైను ప్లాను మనకు అందుతూ వుంటుంది. అది గ్రహించటము మన పని” అని చెబుతారు.
విచార మార్గమును ప్రోత్సహిస్తారు. భౌతికమైన పూజల కన్నా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారు.
ఆమెను కలిశాక ఆమె నాతో ఎన్నో విషయాల గురించి మాట్లాడారు.
మా సంభాషణ ఇలా సాగింది.
(సశేషం)