ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం.
ఓమ్.
ఏవా ప్లతేః సూనుర్ అవీవృధద్ వో విశ్వ ఆదిత్యా అదితే మనీషీ।
ఈశానాసో నరో అమర్త్యేనాస్తావి జనో దివ్యో గయేన॥ (ఋగ్వేదము-10-63-17)
అర్థము: ఓ ఆదిత్యా నామక చతుర్వేద విదూషీమణులారా! మీ మానస పుత్రులమైన మేము మిమ్ము భోజనాదులతో తృప్తిపరచి, అతిథిసేవ చేసి మీ ఉపదేశాలను వినగోరుచున్నాము. మా ప్రార్థనలను మన్నించి మమ్ము అనుగ్రహించండి. మీ వంటి జీవన్ముక్తుల వాక్కులనుండి పరమేశ్వర స్తుతులను-గుణ కర్మ స్వభావాలను వినగోరుచున్నాము. కనుక కరుణించి వినిపించి, బోధించి మాకు స్వస్తిని కలిగించండి.
మేము దర్శించిన అవధూత:
భగవాన్ రమణ మహర్షి తమ వద్దకు వచ్చిన సాధకులకు చేసిన భోద ఒక్కటే. ‘నేను’ అన్నదేమిటో చూసుకొమ్మని. ఆ ‘నేను’ అన్నది తెలిస్తే, ఆత్మ దర్శనము, బ్రహ్మానందము.
‘నేను’ సహజ స్వరూపముగా ఆనందముగా వున్నదని, ఆ ‘నేను’ను గమనించే తాను ‘నేను ఉన్నాను’ అన్న అనుభూతి చెందుతున్నానన్నదే స్వయం అవగాహన. స్వయం అవగాహనే స్వస్వరూప మౌన మని చెబుతారు అవధూత శ్రీ నిర్గుణ చైతన్య స్వామి.
శ్రీ స్వామి వారి బోధ సరళముగా వున్నా అర్థమవుటాని కొంత సమయము పట్టవచ్చు. మనము మన వంతుగా స్వ అనుభూతిని ఎరుకతో గమనిస్తూ వుండాలి. ఆ గమనిక వలన మౌనము సహజంగా అలవడుతుంది.
మేము శ్రీ నిర్గుణ చైతన్య స్వామి వారిని దర్శించటము అమ్మకృప. డిసెంబరులో శ్రీవారు ఇండియా పర్యటన కోసము వారం రోజులకు వస్తున్నారు. నేను ముందే వచ్చేశాను. శ్రీవారు రమణుల భక్తులు. వచ్చేది చాలా కొద్ది రోజులకే కాబట్టి రమణాశ్రమం వెళ్ళలేమని కొద్దిగా చిన్నబుచ్చుకుంటున్నారు. నేను వారికి మిత్రులు చెప్పిన గురువులను దర్శిద్దామని, ఆ రూపున వున్న రమణులను దర్శించినట్లేనని సలహా చెప్పాను. మనము చేసిన పుణ్యఫలము వలన మనకు మహాత్ముల దర్శనము కలుగుతుంది. వారి దర్శనము, అనుగ్రహము కలిగితే, మనకు తదుపరి మార్గము వారే చూపుతారన్నది సత్యం. మన కర్మ వారి దర్శన మాత్రాన నాశనమొంది, మన సాధనకు మార్గం సుగమమవుతుంది.
అలా మేము విజయవాడలోని శ్రీ నిర్గుణ చైతన్య స్వామివారి దర్శనానికి వెళ్ళాము. వెళ్ళటానికి పూర్వం విజయవాడ వారి మఠానికి ఫోను చేస్తే స్వామివారే స్వయంగా మాట్లాడారు. మేము దర్శించబోతున్నది అవధూతనన్న విషయము గ్రహించిన నాకు మరింత ఆనందం కలిగింది.
అలా ఆ డిసెంబరు 18 ఉదయము 10 గంటల వేళ లబ్బీపేటలోని స్వామి వారి మఠానికి వెళ్ళాము. మేము వెళ్ళిన వారి మఠము రెండు అంతస్తుల ఇల్లు. భక్తులు స్వామి నివాసానికై, ఆ గృహాన్ని వారికి ఇచ్చినది. మేము లోపలికి వెళ్ళే సమయానికి అంతకు ముందు నాతో ఫోనులో మాట్లాడిన అమ్మాయి కనిపించింది. స్నేహంగా నవ్వుతూ ఆహ్వానించింది. మమ్మల్ని అక్కడ వున్న గదిలో కూర్చొమని చెప్పారు. ఒక వైపు వచ్చిన వారు కూర్చోవటానికి ఐదు కుర్చీలు వేసి వున్నాయి. మరో వైపు ఒక నవారు అల్లిక కుర్చీ పై పులి చర్మపు డిజైనుతో వున్న వస్త్రం పరచి వుంది. నేల మీద ఎర్ర పట్టా వుంది. మేము తెచ్చిన వస్తువులు అక్కడ పళ్ళెంలో పెట్టి, గోడకు దగ్గరగా కూర్చున్నాము. నేను అలవాటుగా కళ్ళు మూసుకొని ధ్యానము మొదలుపెట్టాను. నేను దర్శిస్తున్న గురుమూర్తులు నా గురువులేనని, జగదంబ రూపమని భావనతో ధ్యానము మరింత మౌనముగా మారుతుండగా, మావారు తట్టిలేపారు, స్వామి వారిస్తున్నారు. కళ్ళు తెరిచిన నా ముందు వారి దివ్య మంగళరూపము హృదయాంతరాలలో ముద్రించుకుపోయ్యింది. మొదట వారి నుదిటి పై తెల్లని విభూది మెరుస్తూ, కళ్ళ నుంచి అపారమైన కరుణ ప్రవహిస్తూ….తల వంచి వినమ్రంగా నమస్కరించి వారి పాదాల చెంత సర్దుకు కూర్చున్నాము. వారు ఎంత దయాళువో అంత పసి మనస్కులనిపించింది. వారి రూపము నేటికీ హృదయము నుంచి చెదరటము లేదు. నేను దర్శించిన మహాత్ములైన వారి గురించి… వారి బోధనలు గురించి నేను సేకరించిన వివరాలు….
శ్రీ స్వామి వారి పూర్వ నామము కంచిభోట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి. వారు విజయవాడ వాస్తవ్యులు. డిసెంబరు 10, 1945 నాడు శ్రీ కంచిభోట్ల లక్షీనారాయణ, వెంకట సుబ్బమ్మ దంపతులకు మూడవ సంతానముగా జన్మించారు.
వారి కుటుంబములో అందరూ విద్యావంతులే. స్వామి వారు తన 14వ ఏట, ఒక నాడు పడుకొని వుండగా ఆకాశములో చంద్రుని నుంచి ఆకారమేదో దిగి తనలో కలిసినట్లుగా అనిపించినదట. ఆ నాటి నుంచి వారి ధోరణిలో మార్పు కలిగినది. రకరకాల ప్రశ్నలు కలిగాయి. సమాధానము కొరకు అన్వేషణ మొదలైయ్యింది. సత్యం కొరకు అన్వేషణగా ముందుగా విజయవాడ దగ్గర కొండపల్లి గుహలలో కొంతకాలము మౌనముగా వున్నారు. రామకృష్ణ పరమహంస, ఆది శంకరులు, శ్రీ రమణులు, తనకు మార్గదర్శకమని స్వామి వారు భావించారు. విజయవాడ పరిసర పాంత్రాలలో వుంటే తల్లితండ్రులు ఇంటికి పట్టుకుపోతున్నారు. అందుకని ఆయన ఎవ్వరికీ చెప్పకుండా హిమాలయాలలో ఉత్తరకాశి చేరుకున్నారు. అక్కడే మౌనముగా తపస్సు ఆచరించారు. తన 29 వ సంవత్సరము నాటికి ఆయనకు నిజతత్త్వము తెలిసినది. ఆత్మానందము తెలిసి ఆయన తిరిగి విజయవాడ వచ్చేశారు.
వారి ఆహారవిహారాదులు వేరుగా వుంటాయి. వారు ప్రతి దినము రెండు ఇడ్లీలు, గ్లాసు పాలు తప్ప మరోటి తీసుకోరు. తెల్లని కౌపీనధారులు.
సంవత్సరము 2000 వరకూ సత్సంగములు నిర్వహించారు. ఆంధ్రదేశములో ప్రతి వూరు తిరుగుతూ ఆత్మానందము గురించి బోధించారు. వారి బోధనలు ముందు కొంత గందరగోళమనిపించినా శ్రద్ధగా వింటే చాలా సులువుగా మనసుకు పడతాయి. స్వీయ గమనిక చేయమని చెబుతారు. దానితో స్వయం అవగాహన కలుగుతుంది. అది ఎలాగంటే,
I (ఆంగ్ల) అంటే నేను – ఉనికి – అనగా – Existence.
I Am అంటే ‘నేను ఉన్నాను’ అన్న అనుభూతి.
‘నేను ఉన్నాను ‘ అన్నది తన ఉనికిని ( i ) సూచిస్తున్నది .
I am అనేది self-experience (Experience of self-existence) అని చెప్పటము సూచిస్తుంది.
i am ‘నేను ఉన్నాను’ అని ఫీలింగ్ కలగాలన్న తన ఉనికిని తెలుసుకోవాలి, గమనించాలి, గుర్తించాలి: అంటే, తెలుసుకునే లక్షణం, గమనించే లక్షణం, అనుకునే లక్షణం, అను లక్షణం, స్పేస్ లక్షణం, శబ్ద లక్షణం ‘నేను’కు ఆల్రెడీ ఉన్నాయి. ‘నేను’కి ఈ setup ఆల్రెడీ స్వతః సిద్ధంగా ఉన్నదని గ్రహించడమే ‘స్వయం అవగాహన’.
తమను తాము ముందు అవగాహన చేసుకుంటే స్వ అనుభూతి స్వ అనుభవంగా తెలుస్తుంది. అప్పుడు సహజంగా మౌనము స్వతః సిద్ధమవుతుంది. మౌనమే ఆనంద స్వరూపము. Consciousness అంటే జ్ఞానము. జ్ఞానమును మనము ఫోటో తీయ్యగలమా? తియ్యలేము కదా!అనుభూతి పొందగలమా అంటే పొందగలము అని చెబుతాము.
తెలివితో తెలివిని తెలుసుకోవచ్చు. అనుభూతిని గమనించవచ్చు.
స్వ అనుభూతిని గమనిస్తూ ఎరుకలో వుండటమే సత్ – చిత్ – ఆనందము. ఆ హాయి పరిపూర్ణమైన హాయి.
స్వామి వారు మాకు ఇలా భోదిస్తూ వుంటే అన్నీ తెలిసినట్లుగా వుండి తరువాత అంతా కంగారుగా అనిపించినది. కాని వారి గురించి చింతనతో కొంత అవగతమవుతున్నది. ఇదే సాధనతో వుంటే వారి కరుణన మనకు పరిపూర్ణమైన జ్ఞానానందము కలుగుతుంది. దయతో కరుణించే వారి కన్నులు, ప్రేమతో మాట్లాడే వారి మాటలు మనకు మరుపుకురావు. వారి హస్యప్రియత్వం మనకు స్వస్థత నిచ్చి భయం పోగొడుతుంది. జీవితానికి కొంత భరోసా, సాధనకు కొంత నెమ్మది చేకూరుతుంది. వారి పాదాల వద్ద వుంచిన శిరస్సును దయతో నిమిరి, విభూదితో ప్రేమగా నుదుట దిద్ది దీవించారు. ‘మన సంప్రదాయం’ అని నాకు పసుపు కుంకుమలిచ్చారు. వారి కరుణకు హృదయం కరిగి కన్నీరు ఎంత ఆపినా ఆగలేదు. ఆయన గురించి వివరించ నాకు భాష చాలదు. ఎవరైనా స్వయంగా వారి అనుగ్రహము అనుభవించి చూడవలసినదే. ఆ విధంగా విజయవాడ వాస్తవ్యులు అదృష్టవంతులు. తమ ముంగిట్లో దుర్గమ్మనే కాదు, ఈ అవధూత మహరాజునుంచుకొన్న ధన్యజీవులు.
(సశేషం)