[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]
[dropcap]నే[/dropcap]ను అది కుండలినీ అవేకనింగు అని అనుకున్నాను. తరువాత ఎంత అడిగినా చెప్పలేదు వారు నాకు. వారు చెప్పినట్లు నేను సిద్ధము కాలేదేమో దానికి.
ఒకరోజు నాతో “కోశాల శుద్ధి కావాలి నీకు” అన్నారు.
నాకు అప్పటి వరకూ కోశముల మీద జ్ఞానము నామమాత్రము. అదే చెప్పాను ఆయనతో.
ప్రాణాన్నీ, ఆత్మను కప్పుకుని పంచ కోశాలుంటాయి. ఈ కోశాలు శుభ్రమై వుంటే వారికి అంతర్ముఖత్వముతో ఆత్మ దర్శనము సులభము.
ప్రాణమయ కోశము ఉపరితల చివరికోశము. ఆనందమయ కోశము అంతరములో చివరిది. ఈ రెంటికి మధ్య అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు వుంటాయి.
కోశముల మీద నేను గ్రహించినది ఇది:
కోశాలలో ప్రాణమయ కోశము మొదటిది. ఇది జీవునికి మొదటి తొడుగు. మొదటి కోశము. భౌతిక శరీరముపై వున్న మొదటి తొడుగు ప్రాణము. తరువాతి తొడుగు అన్నమయ కోశము. శక్తి నిచ్చే ఏ ఆహారమైనా అన్నమయ కోశానికి వెడుతుంది. భౌతిక శరీరము నడిపించే శక్తికి ఇదే ఆవాసము. మనము ముందు ఆహారములో సాత్విక ఆహారమును తీసుకోవటము, మితాహారము ద్వారా ఈ కోశము నుంచి ప్రాణమును లోనికి నడుపుతారు.
తరువాతి కోశము మనోమయ కోశము. ఇది మనస్సుకు సంబంధించినది. ఇంద్రియ వ్యాపారము ఈ కోశము. ఇంద్రాయాలను స్వాధీనము ద్వారా ఈ కోశమును దాటుతారు. ఇంద్రియాలను కంట్రోలు చెయ్యటమే అత్యంత కష్టసాధ్యమైనది. దానికి పతంజలి చెప్పిన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యహార, ధారణ, ధ్యానము, సమాధి. ఇవి సాధన చెయ్యటము వలన మనోమయము లోని ప్రాణము ఇంద్రియాలను కంట్రోలు చేస్తుంది. ఏక విషయము మీద ప్రాణము నిలబడుతుంది. కుండలిని కదల్చాలంటే మనోమయ కోశములో ప్రాణము నిలబడాలి.
యమాది నియముల వలన కోశము పరిశుభ్రంగా వుంటుంది. సదా సత్యపాలనా, వాచక తపస్సు చెయ్యటము తప్పని సరి. మనసు చంచలము కాదు.
జీవుడు ఏకోన్ముముఖుడవటము విజ్ఞానమయ కోశము. బుద్ది వికసించటము. కన్ఫ్యూషను తగ్గటము గురువు సహయముతో లోపలికి ప్రయాణము సిద్ధిస్తుంది.
ప్రాణము ఈ కోశమునకు చేరేసరికే ఆనందము అనుభవమవుతుంది.
“అద్యతనాయ విద్యతేయనాయః
నాన్యపంతా విద్యతేనాయః”
సాత్విక, రాజస, తామసాలలో- ఆలోచనలలో, అధ్యనాలలో, భోజన పరముగా సాత్వికతను సాధన చెయ్యాలి సాధకులు.
సత్యమును పాటించటము ద్వారా, నిజాయితీగా వుండటము ద్వారా, పెద్దలను గౌరవించటము వంటి చర్యల ద్వారా, దానము ద్వారా ఇంద్రియ నిగ్రహము ద్వారా ఈ పంచ విలువలు పాటించటము ద్వారా పంచకోశాల నుంచి ప్రాణమును ఆత్మతో సంధానపర్చగలరు.
సాధకుడు ప్రపంచము సర్వము అశాశ్వతమని గ్రహించి, సత్యమైన దానికై తపన చెంది నెమ్మదిగా బయటి ప్రపంచములోని విషయాలకు దూరముగా జరుగుతారు. తదనంతరము శమము, దమము, ఇంద్రియనిగ్రహము వంటివి సాధనలోకి వస్తాయి. ఇవ్వన్నీ కూడా సత్సాంగత్యము వలన సిద్దిస్తాయి. నెమ్మదిగా ఆహారము రుచుల గురించి, భోగాల మీద ఇచ్ఛను సహజముగా వదిలేస్తారు. ఇవ్వన్నీ సాధన వలన కలిగే మార్పులు. పూజ్య దేవీదాసుగారు నాకు వీటి మీద అవగాహన కలిగించినాక, నేను అప్పటి వరకూ పట్టుకు వేలాడిన సమాజంలో సమూహము, ‘నా’ పొజీషను నాకు అత్యంత అల్పముగా అనిపించాయి. ఈ చిన్న చిన్న రాజకీయపు వేషాలు, వాళ్ళ మీద వీళ్ళ మీద గాసిప్స్ పరమ చెత్త. సమయము వృథా. మన సాధనకు అడ్డు. మనలను పడేసే ఇవ్వన్నీ మాయ, అవిద్య ఇవే.
సత్యమును సాధన చెయ్యటము కూడా ఇందులో భాగము. సత్యసాధన వలన మన కోశాల శుద్ధి జరుగుతుంది. సత్యపాలన అత్యంత కష్టము. అప్పటి వరకూ లౌకికముగా అబద్ధాలు చెప్పకపోయినా, ఎదుటివారికి నచ్చని నిజాలు చెప్పటానికి ఇష్టపడని నేను ప్రజలతో లావాదేవీలు దాదాపుగా కట్ చేసుకున్నాను. సత్యపాలన వలన మనము మనకు దగ్గరవుతాము. లోకానికి దూరమైనా పర్వాలేదు. అసలు కావల్సినది కూడా అదే. నా దగ్గర దాచవలసినది లేదు, సత్య సాధనకు భయము లేదు. స్నేహితులు తగ్గుతారన్న చింత లేదు. నిజమైన స్నేహము సదా నిలిచే వుంటుంది. నాకున్నవారు సదా నా మేలుకోరు నిజ మిత్రులే.
ఆకలి, నిద్ర అలవోకగా తగ్గుతాయి.
వీటి సాధనలో ఎప్పటికో మనకు శుద్ధి కలిగిన మనస్సు, ఇంద్రియముల యందు నిరాసక్తి గల మనస్సు తన ఆత్మను కనుగొనుటకు లోలోపలి వైపుకు ప్రయాణము మొదలెడుతుంది.
నాకు తెలియకనే నేను దేవీదాసుగారి పర్యవేక్షణలో ఎంతో మారాను. వారు అశుద్ద రాయిగా వున్న నన్ను ఆ స్థితి నుంచి సాన పెట్టారు. నాకు చాలా మెటీరియల్ విషయాలపై ఒక్కసారిగా ఇంట్రస్టు పోయ్యింది.
వారికి సాహిత్యము అంటే చాలా మక్కువ. ఆయన విశ్వనాథ, గుంటూరు శేషేంద్రశర్మ గారి శిష్యులు. అరవైకి పైగా పుస్తకాలు ప్రచరించారు. సాహిత్యములో, నేటికి వారు చలివేంద్రము. నన్ను పద్యాలు విషయములో రాయమని చెప్పటము సహజము కదా. నేను కళ్ళు మూసుకు కూర్చోవాలన్న ధ్యాసలో వున్నాను. గురు మంత్రము వదలటములేదు.
వారు నాకు మంత్రోపదేశము ఇవ్వలేదు. ఆనాడు నాకు మనస్సుకు కష్టం కలిగింది. కానీ ఈనాడు చూసుకుంటే, వారికి తెలుసు నేను ఎవరి వద్దనుంచి అది గ్రహించాలో. ఆయన జ్యోతిష్యములో ఉద్దండ పండితులు. మన గురించి సర్వము ఆయనకు తెలిసిపోతుంది. నేను ఆయన గురించి ఆలోచిస్తూ వుంటే వారు ఫోను చెయ్యటమో, ఏదో ఒక విషయ జ్ఞానము పంచటమో చేస్తారు. అందుకే కాబోలు నేను ఎంత ప్రార్థించినా మాకు కావలసిన మంత్రమివ్వలేదు.
వారి వాత్సల్యము అపురూపము. నన్ను వారు తన కుమార్తె వలె చూసుకున్నారు. నేటికీ అంతే. నాకు ఉన్నతి కలగాలని వారి దీవెన.
నాకు నా తదుపరి మెట్టుకు పునాది వేసి, జీవితానికి మార్గము చూపిన వారు. నాకు సదా పూజ్యనీయులు.
ఓం! యజ్జాగ్రతో దూరముదైతి దైవం
తదు సుప్తస్య తథైవేతి।
దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం
తన్మే మనః శివ సంకల్పమస్తు॥
(యజుర్వేదం-34-1)
అర్థము:
ఓ సర్వవ్యాపక సర్వేశ్వరా! నీ కృపవలన ఏ నా మనస్సు జాగ్రదావస్థలో (మేలుకొని ఉన్న సమయంలో) దూరదూర విషయాలవైపు పోవుచుండునో, అట్లే స్వప్నావస్థలోనూ విహరించుచుండునో, ఏది ఇంద్రియ జ్యోతులన్నిటికీ జ్యోతిగా ఉంటుందో అట్టి నా మనస్సు సదా శివ సంకల్పములనే చేయును గాక. నాకును, ఇతరులకును మేలు జరుగునట్టి ఆలోచనలనే చేయును గాక!
వివరణ:
ఓ రక్షకా! పరమాత్మా! నా మనస్సు నీ కృప వలన ఎల్లప్పుడూ మంచి సంకల్పములనే చేయునుగాక! ఆ మనస్సు ఎట్టిదన – జాగ్రదావస్థలో దూరముగా పోవుచూ వచ్చుచుండును. దానికది స్వభావము. ఇంద్రియాలకు ప్రకాశమునిచ్చు జ్యోతి మనస్సు, అది లేకున్న లోకమున ఏ వస్తువు మనకు తెలియదు. అది చంచలము, వేగవంతము. అట్టిది నీ కృపవలన స్థిరపడును. ధర్మయుక్తమగును. విద్యావంతమగును. ఆత్మకది ముఖ్యసాధనము.
త్రికాలముల నెరుగు సాధనము. అది నీ వశముననే యున్నది. దానిని నీవు మా వశము చేయుము. మేము కుకర్మలు చేయక ధర్మకార్యములనే చేయుచు నీ సేవయందు అనురక్త మగుదుము గాక! శివోహం!!
(సశేషం)