Site icon Sanchika

సత్యాన్వేషణ-55

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]ఓం[/dropcap] అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం।
హోతారం రత్న ధాతమం॥ ఋగ్వేదం (1-1-1)

అర్థము :

ఓ సర్వవ్యాపక సర్వేశరా! నిన్న మా హృదయములోనికి ఆహ్వానిస్తున్నాము.

నీవు సృష్టి స్థితి లయలకు ఏకైక కర్తవు. నీవు సర్వశక్తివంతుడవు.

నీవు కర్మ ఫలధాతవు. నీవు న్యాయముగా అన్నీ ఇచ్చు న్యాయదేవతవు.

***

మా వూరికి ఎందరో పెద్దలు పూజ్యులు వస్తూ వుంటారు. వారు విదేశాలలో వున్న భారతీయులకు ఆర్షధర్మము వినిపించి వెళ్ళటము మామూలుగా జరుగుతూనే వుంటుంది. ఇక్కడ పెరుగుతున్న పిల్లలకు, వున్న మాబోటి వారికి మేము భౌతికంగా దూరమైన మన ధర్మమును వినిపించి మమ్ములను కార్యోన్ముఖులుగా చేస్తూవుంటారు.

అలా మావూరికి సామవేదం షణ్ముఖశర్మగారు వచ్చేవారు. వారు పూర్వము కొద్ది సార్లు వచ్చారు. అలా వచ్చిన సందర్భములో మా ఇంటికి కూడా ఒకసారి వచ్చి వున్నారు. వారి ప్రవచనాలు చాలా ప్రత్యేకంగా వుంటాయి. అవి వారు చెబుతున్న విషయాము ప్రస్థావించబడిన అన్నీ శాస్త్రాలను, వేదాలను, ఉపనిషత్తులను ఉటకించటము జరుగుతుంది. ఆ సబ్జక్టు కాని విషయము దుర్భిణి వేసి వెతికినా వారి ప్రసంగాలలో దొరకదు. అంత కట్టుదిట్టముగా, నిర్దిష్టంగా చెప్పటము వారి ప్రవచనాల ప్రత్యేకత.

వారు మాట్లాడుతుంటే వాగ్దేవి వారి నాలుక మీద నాట్యము చెయ్యటము అందరికీ తెలిసిన విషయమే. వారి ప్రవచనాలు పరమ పవిత్రాలు. వారి ప్రవచనాలు ఎందరికో దిశానిర్దేశాలు.

వారికి సనాతన ధర్మముపై వున్న అనంత జ్ఞానము చూస్తే తెలుస్తుంది, వారు కేవలము ఆ లలితాంబ మానవ రూపమే తప్ప మానవమాత్రులు కారని. నేటి యుగధర్మం ప్రకారం పరమాత్మను తలుచుకోవటానికి నామపారాయణము ప్రవచనమే నిర్దేశించబడింది. ప్రవచనాలు విన్నప్పుడు జ్ఞానము, ఆనందము కలగటముతో పాటు, తరువాత దిశానిర్దేశం చేస్తాయి. సరి అయిన జీవన విధానము చూపుతాయి. సామవేదం వారి ప్రవచనాలు పంచదార గుళికలు. జ్ఞాన ఐరావతాలు. ఆధ్యాత్మిక వీధులలో వికసించిన సుమపారిజాతాలు. తెలుగువారు చేసుకున్న అదృష్టము సామవేదము గురువుగారు.

కొన్ని దృష్టాంతాల వలన ఆయన ప్రవచానాలు ప్రజలలో కలిగించిన మార్పు మనను ఆనందాశ్చర్యాలలో ముంచుతుంది.

ఒక గాయత్రిమాత భక్తుడు అమ్మవారి ఉపాసనలో పండిపోయాడు. కాని అతనికి మనస్సులో ఏదో లోటు. ఇది అని చెప్పలేనిది. ఆయన అమ్మవారినే శరణుపొందాడు. అతనికి స్వప్నంలో ఆ తల్లి కనపడి సామవేదం గురువులను ఆశ్రయించమని పంపినది. అమ్మవారి అనుగ్రహముతో ఆయనకు గురువు దొరికాడు కదా.

ఒక పెద్ద కుటుంబము వుంది. వారంతా భగవంతుని భక్తులు. విద్యాధికులు. లాయర్లు, డాక్టర్లునూ. వారిలో వాళ్ళ చిన్న పిల్లవాడు ఆర్టిజన్‌తో బాధపడుతున్నాడు. వాడు ఎవ్వరి మాట వినడు. ఆ కుంటుబపు కష్టము చూడనలవికాదు. వారు భక్తులు కాబట్టి ఇంట్లో నిత్యము పూజలు హోమాలు, ప్రవచనాలు. ఒకనాడు సామవేదము వారి ప్రవచనాలు వింటూ కుర్రవాడు శాంతి పొందాడు. నాదస్వరము విన్న నాగుపాములా ఆయన ప్రవచనము వింటూ గొడవ మానాడు. అటుపై కేవలము శ్రీ సామవేదము గురువుల ప్రవచానాలకు మాత్రమే వాడు తగ్గుతాడు. గురువుగారినికి నమస్కరించి వారి ఆశీర్వచనాలతో జబ్బుతో పోరాడుతున్నాడు…

ఒక పంజాబీ వ్యాపారి వున్నారు. ఆయనకి తెలుగు రాదు. ఆయన మిత్రుడు తెలుగువాడు. శ్రీ సామవేదము గురువుల ప్రవచనాలు వింటూ వుంటే ఈ పంజాబీ వ్యాపారి కూడా వింటూ వుండేవాడు. వ్యాపారములో కష్టనష్టాలకు చికాకులతో వుండేవాడు ఆ వ్యాపారి. అతను ప్రవచనము విని శాంతి పొందాడు. భాష తెలియకపోయినా, ఆ మాటల వైబ్రేషనుకు ఆ సర్దార్జీకి మనస్సు నెమ్మదించింది. అతను ప్రతిరోజూ ఆ ప్రవచనాలను వింటూ ఆ ప్రభావంతమైన మాటలకు శాంతగా వుండటము వలన ఆయన వ్యాపారములో అనుకోనంత విజయము సాధించాడు. ఆయన గురువుగారిని కలవాలంటే కుదరలేదు. అందుకని తన ప్రణామాలు తెలుపుతూ ఒక వీడియో మెసేజు చేసి పంపాడు. గురువుగారికి తెలియదిదంతా. వారు ప్రవచనములో వుంటే వారికి, అందరికీ కలిపి ఈ వీడియో చూపారు. ఇది వారికీ మరి ఎందరికో సంభ్రమ ఆశ్చర్యాలను నింపింది.

ఒక భక్తుడు గురువు గారు ప్రవచనాలు వింటూ, వారు ఏ వూరు వెడితే ఆ వూరు వెడతారు. ఆయన చెప్పే ప్రవచనాలు వినటమే అతని సాధన. గురువుగారికీ తెలుసు అతను వచ్చి వింటాడని. అతను గురువుగారిని దూరం నుంచి నమస్కరించి వెళ్ళిపోతాడు. ఇది అమెరికాలో. భారతదేశములో కూడా ఇలా వారి ప్రవచనాల కోసము వూర్లు తిరగే కొందరు భక్తులను నే చూచాను. వారికి ప్రవచనాలు వినటము అందలి తాత్వికతను అనుసంధానము చేసుకోవటమే సాధన. ఆ సాధనతో భక్తులు ఉన్నతస్థితి పొందుతున్నారు.

ఇంతటి పరమపురుషులు, సరస్వతీ ప్రవాహములా ప్రవచనాలు చెప్పే గురువులు మరిలేరంటే అతిశయోక్తిలేదు. వారికి వేదవేదాంగాలు, పురాణాలు, రామాయణ భారతభాగవతాలు కరతలామలకము. గంగాఝరి వంటి ఆ ప్రవచనాలు ఎందరికో మార్గము చూపాయి.

వారి పుట్టింది పెరిగింది అంతా ఒడిషా లోని గంజాం జిల్లాలో. విద్యావంతులు వేదపండితులైన శ్రీ రామమూర్తి శర్మగారు వారి తండ్రిగారు. చిన్ననాటి నాడే తండ్రిగారి వద్ద వేదము సంస్కృతము నేర్చారు. ఎకనామిక్స్‌లో బిఎ చేసి విజయవాడ చేరి స్వాతి పత్రికలో సబ్ఎడిటరుగా చేరారు. తరువాత ఆయన తొలత భక్తిగీతాలు రాయటముతో, గీత రచన మొదలుపెట్టారు. ఆయన రాసిన భక్తిగీతాలు ఆల్బమ్ బాలసుబ్రమణ్యము గారు పాడటము, దానికి చాలా పేరు రావటము కూడా జరిగింది. అటు పై సినిమా పాటలు రాయటానికి మద్రాసు వచ్చారు. ఆయన రాసిన పాటలన్నీ ఆనాడు ఎంతో హిట్ అయ్యాయి.

వారు అక్కడ వుండగా వారి గురువులు శ్రీ పినపాటి వీరభధ్రమహాదేవుగారిని కలిశారు. సినిమాల ప్రభావము, పేరు ప్రతిష్ఠ వంటి ఎండమావులు శ్రీ సామవేదము వారిని ఆకర్షించలేదు. ఆ మద్రాసు నివాసము వారి గురువులను కలవటానికి సంభవించినదని చెబుతారు శ్రీ సామవేదము గురువుగారు. వైజాగు భీమిలీ లోని శ్రీ కందుకూరి శివానందమూర్తిగారి ప్రభావము కూడా తన మీద వుందంటారు సామవేదం గురువుగారు.

శ్రీ కుర్తాళం స్వామి వారి సమక్షంలో ఋషిపీఠము అన్న పత్రికను మొదలుపెట్టారు సామవేదమువారు. ఆధ్యాత్మిక సుగంధము పంచుతున్నారు ఆ పత్రిక ద్వారా.

వారి ప్రవచనాలు మొదట విజయవాడలో ‘అగ్ని’ మీద మాట్లాడటముతో మొదలైనవి. అటు తరువాత ఇక ఆ ధార గంగా ప్రవాహములా సాగుతూనే వున్నది.

వారి ప్రవచించని విషయము లేదు. వారి ప్రవచనాలు మనకు ఈ మధ్య యూట్యూబులో దొరకటము అదృష్టము.

వారిని ‘వాగ్దేవి వరపుత్రులు’, ‘సమన్వయ సరస్వతి’ వంటి ఎన్నో బిరుదులు వారిని వరించాయి. వారి ప్రవచనాలు ఈ కలియుగములో మనకు సాధనను ముందుకు తీసుకుపోవటానికి సహాయము చేస్తాయనటములో ఎటు వంటి సందేహము లేదు. కలియుగములో నామపారాయణమే చెప్పబడింది కదా. మనము ఆచరించే శ్రవణ, మనన, నిధిధ్యానములకు ప్రవచనములు పట్టుకొమ్మలు. అలా శ్రీ సామవేదము షణ్ముఖశర్మగారు నేటి కలియుగములో ప్రజలను ఆధ్యాత్మక వైపుకు, పరమాత్మ వైపుకు, నడిపిస్తూ అంతర్ముఖత్వము వైపు బాటలు వేస్తున్నారు. వారు విదేశాలలలోని జిజ్ఞాసువులను ఉద్ధరించటానికై ఎంతో ప్రయాసకోర్చి విదేశీ పర్యటనలు చేస్తారు. అటువంటి సామవేదము షణ్ముఖశర్మగారి ప్రవచనము మా వూరిలో ఏర్పాటు చేశారు. నిర్వాహకులు నన్ను సహాయాన్ని అడగటము నాకు పరమాత్మ ఇచ్చిన వరము.

ఆ కార్యక్రమానికి ముందు వారిని నేను అట్లాంటాకు మూడు గంటల దూరములోని వూరు నుంచి తీసుకురావాలి. నేను సంతోషముగా బయలుదేరాను. వారిని కలిసి, నా నమస్కారాలు తెలిపి, వారిని తోడ్కొని అట్లాంటాకు రావటము జరిగాయి. దారిలో నేను నా హృదయఘోషగా నా గురువుకోసము చేస్తున్న యత్నం, తపస్సు అన్నీ వారికి వివరించాను.

అన్నీ విని, వారు “అమ్మా! ఆత్మకు స్త్రీ పురుష భేదము వుండదు. ఈ శరీరము కేవలము వాహనము మాత్రమే. దానిని తెలుసుకొని తపః చింతనలో జీవితము పండించుకోవచ్చును” అని ధైర్యమిచ్చారు.

వారు ఉదయము జపము చేసుకొని కొద్ది మంది భక్తులకు తీర్థమిస్తారు.

అది తెలుసుకొని నేను వారి దర్శనానికి ఆ మరుసటి ఉదయము వెళ్ళాను. తీర్థము తీసుకోమని పిలిచిన వారి స్థానములో నాకు లలితా త్రిపుర సుందరిలా దర్శన మిచ్చారు. ఇది పరమ సత్యము. నా భ్రమ కాదు.

నేను ఎదురుగా అమ్మవారినుంచుకొని ఎక్కడ వెతుకుతున్నానని నా మీద నాకు జాలి కలిగింది.

నేను వారిని ఆశ్రయించి నన్ను శిష్యులుగా చేసుకోమంటే “అమ్మవారి అనుమతి కావాలిగా” అని సాగిపోయారు.

ఆనాడు నా గుండె అడ్డంగా కొట్టుకుంది.

వారి కృపకు ఎదురుచూడటము కంటే నేను చెయ్యగలిగినదేమీ లేదు.

మరుసటి సంవత్సరము తిరిగి మళ్ళీ వచ్చారు గురువులు.

నేను పట్టు వదలక వారిని తిరిగి ఆశ్రయించాను. “నన్ను మీ శిష్యులలో చేర్చుకోండి. దీక్ష ఇవ్వండి గురువుగారు” అని.

నేను అప్పుడు ఆ ప్రవచనాల తరువాత ఇండియా వెడుతున్నానని తెలుసుకున్న వారు “హైద్రాబాదు వస్తున్నారుగా. భారతావనిలో కలుసుకుందాము” అని చేప్పి వెళ్ళిపోయారు.

నేను ఇండియా వెళ్ళగానే వారిని కలిశాను. నాకు తీర్థమిచ్చి తరువాత కలువమని చెప్పి వెళ్ళిపోయారు. మనము ఎదురుచూడటము తప్ప మరో మార్గము లేదు.

నేను వారు చెప్పిన “శివాయ గురువే నమః” అనుకుంటూ వుండటము తప్ప మరో మార్గము లేకపోయ్యింది.

(సశేషం)

Exit mobile version