[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]
[dropcap]నా[/dropcap]కు మళ్ళీ వారిని కలిసే అవకాశము మూడు నెలలకు వచ్చింది. నేను ఇక బయలు చేరి వెననకకు వస్తున్నాని చెప్పాను. కలవమని పిలచారు. మరురోజు వెళ్ళి కలిశాను. మళ్ళీ తీర్థమిచ్చారు. ఒక్క గురువుతోనే వుండాలని పదే పదే చెప్పారు. ఆచారము పాటించాలని అన్నింటికి సిద్ధంగా వుంటే తప్ప గురువును ఆశ్రయించకూడదన్నారు. వెళ్ళి రమ్మన్నారు.
నేను చాలా నిరాశగా వెనుతిరిగాను. నాకు ఎలా ఎవరిని ఆశ్రయించాలో తెలియలేదు. అప్పటి వరకూ ఒడ్డు కనపడుతున్నట్లుగా వున్నా మళ్ళీ నడి సముద్రములో మునిగినట్లు అయ్యింది.
నేను తిరిగి తిరిగి చక్రములో మళ్ళీ మొదటికే వస్తున్నాను. ధైర్యము చేసి కుర్తాళం స్వామి వారిని కలుద్దామా అని అనుకున్నాను. కాని కుదరలేదు.
అట్లాంటాలో అమ్మవారి భక్తులు శ్రీ విద్యా ఉపాసకులైన ఒక ఆంటీ వున్నారు.
ఆమె నా దిగులు చూసి “పోనీ ఒకరోజు వచ్చేసేయి. శ్రీ విద్య అంతా చెప్పేస్తాను!” అన్నారు. అది ఆమె మాతృహృదయానికి గుర్తు. కానీ గురువుల పరంపర కూడా ఎంతో ముఖ్యమైనది. శ్రీ సామవేదం వారు సాక్షాత్తూ జగదంబ స్వరూపులు అన్న నమ్మకము కలిగాక వారి కృప కోసము ఎదురు చూడాలి తప్ప మధ్యే మార్గం చూడకూడదు. సాధనలో షార్ట్ కట్ అంటే సాధనే. నన్ను నేను సముదాయించుకున్నాను. జారి పోతున్న హృదయాన్ని కూడగట్టుకు వారికి మధ్య మధ్య పోనులో టచ్‌లో వుంటూ ఎదురు చూస్తున్నాను.
మళ్ళీ ఋతువులు మారాయి. వర్షఋతువున భారతావనికి వెళ్ళాను. గురువుగారు రాజమండ్రిలో వున్నారు. అక్కడ గణపతి దేవాలయము వున్నది. హోమాలు ఉత్సవాలు జరుగుతున్నవి. వెళ్ళి వారి పాదాలు పట్టుకు కన్నీటితో ప్రార్థించాను. కరుణించమని. వారు “తప్పక అమ్మా! హైద్రాబాదులో కలుద్దాము” అన్నారు.
నేను వెనకకు వచ్చేశాను.
హైద్రాబాదులో మళ్ళీ కలిశాను. మళ్ళీ దీవించారు. “చూద్దాం” అన్నారు.
నా ఎదురు చూపులకు అంతం లేనట్టుగా వుంది. నేను తలవూపాను. “అమెరికా వస్తున్నా. అక్కడ చూద్దాం” అన్నారు.
గురువులు శిష్యుల జిజ్ఞాస మీద, ఓపిక మీద పరీక్ష పెడతారు. అటు వంటి పరీక్షలకు విసిగి వెళ్ళిపోతే గురువులు ఏమీ బాధపడరు. పోయేది ఆ శిష్యుని అదృష్టమే. అసలు పరీక్ష లేకుండా ఎవ్వరికీ ఏమీ ఇవ్వకూడదని, అందునా దీక్షలు అసలు ఇవ్వకూడదని పెద్దలు చెబుతారు.
కొందరు “శ్రీవిద్య యని, మరో మంత్రమని, ఇస్తాము మీరు కేవలము ఆరు వేలు కట్టండి, వంద డాల్లర్లు ఇవ్వండి” అంటూ ప్రచురిస్తారు. అటు వంటి వాటిలో పడ్డామా మనము కొండ మీద నుంచి గోతిలో పడ్డట్లే. ఇక మనలను ఉద్ధరించేవారు వుండరు. గురువులను నమ్మటము, వారి కృపకై ఎదురు చూడటము శిష్యుల వంతు. అది ఎన్ని సంవత్సరాలైనా. కేవలము దృష్టి మాత్రాన ఎందరికో ముక్తిని ప్రసాదించిన గురువులున్నారు భారతదేశములో. మౌనముగా తన చూపులతో జ్ఞానమిచ్చిన రమణుల పరమ పూజ్యులు ఉన్నారు మనకు.
ఆశ్రయించిన వారికి కరుణతో బ్రోచే కుర్తాళము స్వామి వంటి మహా తపఃసంపన్నులున్నారు. మనలను వారు తమ శిష్యులుగా స్వీకరిస్తే చాలు. తరువాత వారే మనకు దారి చూపుతారు. గురువు తన శిష్యునికి ఇచ్చిన దీక్షతో పాటూ తన తపఃశక్తినీ ఇస్తారు. శిష్యులు అది గ్రహించి సాధన చేస్తే వారికి ఉత్తమోత్తమము. లేదంటే శిష్యుడు, అతనితో పాటు గురువుకు కూడా సమస్య. అందుకే పెద్దలు పూజ్యలు తొందరగా దీక్షలూ, మంత్రోపదేశము ఇవ్వరు. చాలా కాలము పడుతుంది. పైపెచ్చు ఎన్నో వారు చెప్పిన పద్ధతులు ఆచరిస్తూ ఎదురుచూడాలి. మనకు గురువుకూ మధ్య బంధం ఏర్పడినాక ఆ శిష్యుని ముందుకు నడిపించే బాధ్యత మాత్రము గురువుదే కదా! అందుకే ఇన్ని పరీక్షలు ఇంత ఎదురుచూపు.
గురు చరిత్రలో శిష్యుడు ఎంత సపర్యలు చేస్తున్నా, ఎంత కాలమున్నా తనకు ఏమీ చెప్పలేదని అలిగి శిష్యుడు వెళ్ళిపోతాడు. దుఃఖములో శ్రీగురువును ఆశ్రయించి తన సమస్య చెప్పుకుంటాడు. శ్రీగురువు ఆ శిష్యుని “చాలా తప్పుచేశావు. నీ పూర్వ కర్మలు కాల్చటానికి గురువు నీచే సపర్యలు చేయిస్తున్నారు. నీకు ఏ సమయములో ఏమివ్వాలో నీ గురువుకు తెలుసు. వెళ్ళి ఆయననే ఆశ్రయించు. నీకు మేలవుతుంది” అని చెప్పి పంపేస్తాడు. అతను తప్పు తెలుసుకొని వెళ్ళి తన గురువును సేవించి ఆయన కృప పొందుతాడు.
బహుశా నా పూర్వ కర్మ ఏదో అడ్డం పడ్డాదో, లేక గురువుగారు చెప్పనట్లుగా నాకు తెలిసినా, వారికి అమ్మవారు చెప్పలేదో. ఏది ఏమైనా నన్ను వారు కరుణించే సమయము రాలేదేమో మరి.
నా ఎదురుచూపులలో, అటు ఇటు తిరగటములో సమయము కరిగిపోతూ వున్నది. నేను నడిచే టన్నల్ (సొరంగం) తుదిలేనిదిగా వుంది. కన్ను పొడుచుకున్నా కనపడదు వెలుతురు…. అంతా చీకటి. అమ్మవారి కృప ఇలా వున్నదా? అనుకున్నా…. దిగులుగా
“అర్చన కాలే రూప గతా, సంస్తుతికాలే శబ్ద గతా – చింతన కాలే ప్రాణ గతా, తత్వ విచారే సర్వగతా” (ఉమా సహస్రం. గణపతిముని) జగదంబ పూజా సమయంలో పూజించాల్సిన మూర్తిలో, స్తుతించేటప్పుడు శబ్ద రూపంలో, ధ్యానించేటప్పుడు ప్రాణంలో ఉంటుందట. అంటే అంతటా సర్వ రూపిణిగా ఉంటుంది.
అర్చన, కీర్తన, ధ్యానం, తత్వ విచారణ సమయాలలో భగవతి ఆయా స్థానాలలో భక్తులకు సన్నిహితంగా ఉండి అనుగ్రహిస్తుందని భావము. అటు వంటి తల్లి నేడు నాకు ఓపికగా వుండి సహయపడాలని కోరుకోవటము ఒక్కటే నే చెయ్యగలిగినది.
మనము ఏదైనా పరుగు పందెములో వున్నప్పుడు, చివరకు వచ్చేటప్పటికీ మన ఓపిక తగ్గి ఎప్పూడూ కలగని హడావిడి కలుగుతుంది. అలాగే ఈ అన్వేషణలో నేను నా శక్తిని కోల్పోయి, దిగులుగా మారుతున్నాననిపించింది. నన్ను నేను శాంత పరుచుకోవటానికి చాలా ఎనర్జీ అయిపోయేది. నిరాశ దరిచేరనీయక సాగటము మరో చాలెంజుగా వుండేది.
అసలు ఈ జన్నకు నాకు అమ్మవారి అనుగ్రహము వున్నదా? అని అనిపించినా నాకు నేనుగా ధైర్యం చెప్పుకుంటూ, ఆ జగదంబను ధ్యానిస్తూ అలా ఎదురుచూపులతో చాలా కాలము గడిపాను. అన్నిటికన్నా అతి కష్టమైన పని ఎదురుచూడటం.
“అఖిల జగన్మాతోమా తమసా తాపేన చాకులా నస్మాన్ – అనుగ్రుహ్నా త్వను కంపాసుదార్ద్రయా హసిత చంద్రికయా” అని ప్రథమ శ్లోకంతో అన్ని లోకాలకు తల్లి అయిన ఉమాదేవి చీకటి, అజ్ఞానం చేత ఆధ్యాత్మిక ఆది దైవికాలన బడే మూడు తాపాల చేత పీడింపబడే మమ్మల్ని దయామృతంతో చల్లనయిన నవ్వు వెన్నెలతో అనుగ్రహించాలి అని ప్రార్థించారు గణపతి ముని ఉమాసహస్రంలో. ఆ తల్లి చిరునవ్వును ధ్యానిస్తూ ఎదురుచూపుల తాపము తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ వున్నాను.
ఆ శీతాకాలము చాలా నిడివి పెరిగింది. ఎంతకూ ఉదయించని రాత్రిలా వుంది.
ఆ తరువాత మార్చిలో గురువుగారు అమెరికా వచ్చారు. నన్ను వచ్చి కలవమని కబురు చేశారు.
మా తోటకు కాదు నాకే వసంతమొచ్చిదా అన్నంత సంతోషపడ్డాను. పరుగు పరుగును వెళ్ళి వాలాను.
ఆయన నన్ను చూసి ఆనందముగా తల వూపి “రేపు రా” అన్నారు.
నేను ఆనందముతో మరురోజు వెళ్ళాను.
అదో గుడి. అక్కడ ఆ రోజు చండీ హోమము, జపము, ప్రవచనము అలాంటివి సాగాయి. గురువుగారు వచ్చారు. నన్ను చూసారు. దీవించారు. కానీ… కానీ… నాకు ఎదురు చూపులలో మార్పు లేదు.
ఆయన మళ్ళీ “రేపు ఉదయము చూద్దాం” అన్నారు.
ఆ రోజు టంపా బే మీద వున్న హిల్టన్లో బాల్కనీలో దీపాలను చూస్తూ కూర్చున్నా. టంపాలో వున్న బే గొప్ప విలాసవంతమైన ప్రదేశము. ఒక ప్రక్క సముద్రము, మరో ప్రక్క ఎతైన భవనాలు. డబ్బుతో కొనగలిగే ప్రతిదీ కుప్పలుగా దొరికే ఆ ప్రదేశములో ఎప్పడూ హడావిడే. ఆ దీపాలు సముద్రగాలి అన్నీ మెరుస్తూ కనబడుతున్నాయి. ఆ దీపాలు చూస్తూ వుండిపోయాను. ఏవీ నన్ను ఆకర్షించలేకపోతున్నాయి.
చాలా సేపటి తరువాత మావారు వచ్చి “లోపలికి వచ్చి పడుకో” అన్నారు. ఇక నా కన్నీరాగలేదు.
నాకీ జన్మకు అసలు రాసి వున్నదా? నేను వెనకకు లెక్కవేసుకుంటే సరిగ్గా ఏడేళ్ళుగా పిచ్చి పట్టినట్టుగా తిరుగుతున్నా. వారు నా గురువు అని నేను అనుకున్న తరువాత మూడేళ్ళుగా రమ్మన్న చోటకు వెళ్ళి వారి కృపకై ఎదురుచూశాను. ఎదురుచూపులు తప్ప నాకు ఏమీ మిగల లేదు. నాకు అమ్మకృప వున్నదా అసలు? ఆ తల్లి దయలేకపోతే,…. లేకపోతే ఇంత ఆయుష్షు ఎందుకు?
జీవితము, దాని లక్ష్యము తెలుసుకోవటానికి గురువు కావాలి. గురువు దీక్షనిచ్చి ఏదైనా మంత్రమో తంత్రమో చెయ్యమన్నాలి. మహావాక్యాలను ఇవ్వాలి. తదుపరి సాధనలో ఆ జీవి జీవితము పండుతుంది కదా!
ఈ అన్వేషణలో అన్నింటినీ వదిలేశాను. డబ్బు, మంచి చీరలు, నగలు, సమాజము, అందులో ఒక పేరు, రాజకీయాలు, సంఘాలు, వాటిలో పొజీషన్లు, బిరుదులు, ఒకటేమిటి, ఒక్కొక్కటే పొరలు పొరలుగా ఎండిన ఉల్లి, పొరలులా విచ్చుకు వూడిపొయాయి. నాకు నేను తెలుసుకునే నెపంతో దేన్నీ పట్టించుకోలేదు.
మంచి బట్ట, కడుపు నిండా తిండి కూడా సహించని స్థితికి వచ్చాను.
చాలా చాలా సున్నితమైనది స్థితిలోకి వచ్చి దిక్కు తోచక కొట్టుకుపోతున్నా.
పైపై మెరుగులుగా ప్రపంచము తోచింది.
ఇక గురువుల కృప రాకపోతే నాకేమిచెయ్యాలో కూడా తెలియదు. ఎంత కాలము వేచి చూడాలో.
ఆ రాత్రి కంటికి నిదురలేదు.
“రేపటి ఉదయమన్నా నాకు అరుణోదయమవుతుందా??”
ఉదయము గురువుగారు ఏడిండికి రమ్మంటే ఆరుకే బయలుదేరాము. ఆహోటలు నుంచి వారున్న ప్రదేశానికి ఎంత వేగంగా వెడుతున్నా ఆ దూరము తగ్గటము లేదు.
మేము వెళ్ళే చోట గేటేడ్ కమ్యూనిటీ. ఆ విషయము ముందుగా తెలియదు. మాకు గేటు కోడు తెలియదు. గేటు వద్ద నుంచి ఫోను చేస్తే, ఆ ఇంటివారు తీయ్యరు.
అసలు అన్నీ ఏదో చెప్పినట్లుగా ఎదురొస్తాయి ఏంటి??
ఆ సెక్యూరిటీ అతను గేటు తీయ్యటము లేదు.
అతనికి ఇంటివారు సరే నంటే తప్ప తీయ్యడు.
వారా ఫోనులో పలకరు………
డోలామాయంగా….
త్రిశంకు స్వర్గంలా…..
దిగులుగా ఆ ఉదయము రోడ్డు మీదను…..
రోడ్ మీద మధ్యలో నిలబడి కన్నీరుతో చూస్తూ “అడ్డంకులు ఇంకా తొలగవా” అని దిగులు పడుతూ గుండె బద్దలవుతోంది.
అలాగే గేటు దగ్గర నిలబడ్డాను.
‘నా జీవితాన్ని నీవేమి చెయ్యాలనుకున్నావు దేవా?!!’ అని ఆలోచిస్తూ నా టర్ను కోసము ఎదురుచూస్తూ ఎంత సేపు వున్నానో తెలీదు.
మావారు ఏమిచెప్పారో, సెక్యూరిటీ అతను గేట్ వైపు కదలటం, గేట్ తీయటం …. మా వారు చెయ్యి ఎత్తి థంబ్స్ అప్ ముద్ర చూపుతున్నారు…….
మర్చిపోలేని ఆ ఉదయము తూర్పన ఎర్రటి సూర్యుడు ఉదయిస్తుండగా గేటు తెరుచుకోవటము నా కన్నీటి మధ్య మసగ్గా కనపడింది.
మనస్సులో యజుర్వేద మంత్రం లీలగా గుర్తుకు వచ్చింది…..
“అహాని శం భవంతు నః శం రాత్రీః ప్రతిధీయతామ్। శంన్న ఇంద్రాగ్నీ భవతామవోభిః
శం న్న ఇంద్రావరుణా రాతహవ్యా! శంన ఇంద్రా పూషణా వాజసాతౌ,
శమింద్రా సోమా సువితాయ శంయోః।।” (యజుర్వేదం-36-11)
హే దయాసాగరా! నీ దయవల్ల దినరాత్రులన్నీ మాకు శాంతిదాయకములగును గాక. మాకు చక్కని ప్రేరణనిచ్చి మమ్ము ప్రగతి పథంలో నడిపింతురు గాక.
***
ఉపసంహారము:
“చరణ్వై మధువిందతి,
చరణ్స్వాదుముదుంబరం
సూర్యస్య పశ్య శ్రేమాణం, యోన
తంద్రయతే చరశ్చరైవేతి, చరైవేతి॥” (ఐతిరేయ బ్రాహ్మణం)
చరించి నందువలన తేనెటీగలకు మధువు దొరుకుతోంది
చరించినందువలననే పక్షులకు స్వాదువైన ఫలాలు లభిస్తున్నాయి
చరిస్తున్నందుకు సూర్యుడు గౌరవించబడుతున్నాడు –
నడవాలి, నడవండి, నడుస్తుంటే చేరేది గమ్యమే……
అన్వేషణకు అంతిమ అంతిమముగా లభించేది, శాంతిని కలిగించేది గమ్యమే!!
~
య ఈం చికేత గుహా భవన్తమా యః ససాద ధారామృతస్య,
వి యే చృతస్త్యృతా సవన్త ఆదిద్వసూని ప్ర వవా చాస్మై౹౹
(ఋ.1-67-4)
వేదాల(గురువు) వెలుగులో ఏ వివేకవంతుడు సర్వవ్యాపక సచ్చిదానంద సర్వేశ్వరుడు తన బుద్ధి గుహయందే దాగి ఉన్నాడని గుర్తించి చక్కగా తనలోనే వెతుకుతూ ఉపాసిస్తాడో అట్టి భక్తునకు పరమానందం ప్రాప్తిస్తుంది. ఇంతేకాక, అతనికి జ్ఞాన ధనము కూడా ప్రాప్తిస్తుంది. తనను తాను పరమేశ్వరునికి సమర్పించుకొని సత్యనిష్ఠుడై ఆదర్శ జీవితాన్ని గడుపుతాడు. లోకానికి మేలు చేస్తాడు.
సాధన సాగుతూ వుంటుంది.
చేతిలో దీపము వెలుతురున దారి చూసుకు నడిచే బాటసారిలా గురువన్న దీపపు వెలుతురులో బుడిబుడి అడుగులు వేస్తూ…. లోలోపలికి పయనము సాగుతుంది.
రెండు సంకల్పాల మధ్యలో వున్న, అసలు ఏ సంకల్పమూ లేని చైతన్య స్వరూపమైన స్థితికి ‘సంధ్య’ అని పేరు.
మనం నిద్ర లేచింది మొదలు మనసులో నిప్పుల్లోoచి రవ్వలు పైకివచ్చినట్టు అనేకమైన ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అవి అలా పుట్టేస్తుంటాయి.
అందుకే మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం అంటారు.
అసలు మన యథార్థ స్వరూపం ఎక్కడవుంది?
అంటే రెండు సంకల్పాలకు మధ్యలో ‘ఏ సంకల్పము’ లేని కొద్దిపాటి సమయమేదైతే ఉందో అది.
సంకల్పం లేని సమయం అదే మన ‘నిజస్వరూపము’.
‘అది ఆత్మ’.
అటు వంటి ఆత్మస్వరూపం దర్శించిన క్షణమే సంధ్యాసమయం.
~
“స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః
స్వస్తి నః పూషా విశ్వవేదాః
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః
స్వస్తి నో బృహస్పతిర్దధాతు” (కైవల్యోపనిషత్తు)
(సమాప్తం)