[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]
[dropcap]ఎ[/dropcap]వరి పాద పద్మములు
సేవించిన
ఈ సంసార సాగరమును
తడవక దాటుదురో
అట్టి సద్గురువుకు వందనములు!!
గురుదేవా!
మరణము తప్పదు పుట్టిన తదుపరి
ఈ సంసారకూపములో ఇరికితిని
దీన్ని దాట నాకు శక్తిలేదు
నిన్ను శరణువేడితిని. కాపాడుము.
గురుదేవా,
సర్వ నరకములకు
కారణమగు సంసారము
తప్పించుకు మార్గమేదో
ఆ దారి చూపుము….
నిన్ను శరణు వేడితిని!!
గురుదేవా!
నీవు ఈ సముద్రము దాటడానికి
నౌక వంటివాడివి. కరుణచూపు.
దుఖఃపూరిత సంసారములు
విషము వంటి విషయవాసనలు
పాముల వలె చుట్టుకొనినవి.
ఈ పాముల వలన
సంసారములో మరల మరల లాగబడి
భయముతో చిక్కుకుపోయినాను
కాపాడుము!!
నా మొదటి గమ్యము మాణిక్యనగరు. అది హూజూరాబాదు అని బీదరు దగ్గరగా వుంది. బీదరు, హైద్రాబాదుకు నాలుగు గంటల దూరములో వుంది. బీదరు వరకూ కారులో వెళ్ళమని అక్కడ్నుంచి ఏమైనా చేసుకోమని పిన్ని మరీ మరీ చెప్పింది. కాదనలేకపోయాను.
దారిలో సంగారెడ్డి అన్న పట్టణము కూడా వుంది. అక్కడ మా మేనమామగారు వున్నారు. మా మేనమామ వారు కాండిన్యస్య గోత్రీకులూ. చుండూరు వారు. తెనాలి వద్ద చుండూరు వారి స్వగ్రామమైనా, మా తాతగారు వీరెవ్వరూ కలగక మునుపే హైద్రాబాదు వచ్చేసినారు. చిన్నజియ్యరు స్వామికి అనుంగు అనుచరులు, ఉద్యోగరీత్యా సంగారెడ్డిలో నివాసముంటున్నారు. ఆయన, అత్తా బంధువులంటే ఎంతో ప్రేమగా వుంటారు. ఒక్కసారి కనపడి వెళ్ళదామని అనుకున్నా. ఇన్ని సంవత్సరాలు రాలేదుగా మరి. బయలుచేరిన గంటన్నరకి నేను వారి ఇంటిముందు వున్నాము.
అత్త చాలా ప్రేమగా ఆహ్వానించింది. కాని నా గమ్యము లేని ప్రయాణానికి కొంత కంగారు పడింది. నాకు కూడా వుంచుకోమని కుంకుమ, రెండు మంచి పుస్తకాలు బహుమతి ఇచ్చింది. ఆమె ప్రాతూరి వారి ఆడపడుచు. వారి తాతగారు శతసంవత్సర వేడుకలకు వారు శంకరుల సాహిత్యమంతా కలిపి ఒకచోటకు తీసుకురావలెనని చెప్పి ఒక పుస్తకము ముద్రించారు. దానికి ఆశీర్వచనములు ‘శ్రీ భారతీ తీర్థ స్వామి వారు’ అనుగ్రహభాషణములు ఇచ్చారు.
“గురువు యొక్క ఆవశ్యకత” అని మొదలెట్టి గురువంటే ఏమిటో వివరించారు శ్రీ స్వామివారు ఆ ముందుమాటలో. నేను ఆ పుస్తకము చేతికి తీసి తీయ్యగానే ఈ వ్యాసము, టైటిలు నా కళ్ళకు కనిపించాయి. దారి తెన్నులేని వారికి చుక్కాని వంటి, ప్రపంచములో సాధకులకు మొదటి గురువుగా జగద్గురువులు శ్రీ శంకరుల కన్నా మనకు ఎవ్వరి ఆసీస్సులు కావాలి?
అత్త బహుమతిగా ఇచ్చిన మరో గ్రంథము “నాయన”. అది కావ్యకంఠగణపతి ముని జీవితచరిత్ర.
తపస్సు ఎలా ఆచరించాలో చూపించారు నాయన. ఆయన చరిత్ర చదివితే ఆ విషయము తెలుస్తుంది మనకు. మన కాలానికి చెందిన ఋషి, తపస్వీ అయిన నాయన నన్ను అనుగ్రహించుగాక!! ఆ గ్రంథము నాకు నా ప్రయాణములో ధైర్యము నిచ్చింది. అందుకే నే ముందు అక్కడ ఆగి సాగానెమో. భగవంతుని లీల మనకు తెలియదు. ముందు అదో జిగ్‌సా ఫజిలు లాగా, ఒక మేజ్ లాగా అనిపించినా తరువాత అన్ని గళ్ళు తెలిసి “ఇదా నీ లీల స్వామి” అని అనిపిస్తుంది. ముందు పడిన ఖేదము పోయి పరమాత్మ మీద మరింత ప్రేమ కలుగుతుంది. మనమెంత అల్పమో అనుభవమవుతుంది.
మా మేనమామ మాత్రము నా అవతారము చూచి చాలా దిగులుపడిపోయారు. నేను ఎటో వెళ్ళిపోతున్నానని. ఆయన తరువాత చెప్పారు…. దిగులుగా వాళ్ళ వూరి శ్రీ వెంకటేశ్వర దేవాలయములో కూర్చుంటే అర్చకస్వామి వివరములడిగి “ పర్వాలేదు, తిరిగివస్తుంది లెండి” అన్నారుట.
ఈ సంసారమంత తేలికగా వదులుతుందా? ఎన్ని జన్మల కర్మలు కాళ్ళకు పట్టుకున్నాయో కదా!
“తాపత్రయీదుస్సగ్నేర్ఘోరసంసారరౌరవాత్।
విముక్తస్స్యాం కథం బ్రహ్మన్! దయయా వద మే ప్రభో!!” (అద్వైతబోధదీపిక)
తాత్పర్యము: పరబ్రహ్మరూపుడమగు ప్రభూ! తాపత్రయమగు దుర్బరవేదనతో గూడిన భయంకర సంసారమను రౌరవ నరకము నుండి ఎట్లు విముక్తుడను కాగలను?
***
దారిలో తినమని కొన్ని తినుబండారాలు ఇచ్చి క్షేమముగా వెళ్ళమన్నారు సంగారెడ్డివారు.
హుమానాబాదుకు యాత్ర రొడ్డెక్కినది అలా…..
మాణిక్యనగరు అన్న దివ్య క్షేత్రము హుమానాబాదుకు మూడు కిలోమీటర్లు. ఈ హుమానాబాదు హైదరాబాదు, బొంబాయి నగరాల మధ్య వున్న హైవేకు అనుకొని వుంటుంది. అట్లాంటాలో పూజారికి తెలిసిన మిత్రుడు మాణిక్యనగరులో వున్నాడని అతని ఫోను నంబరు ఇచ్చారు. ముందే అతనికి చెప్పాను ఇలా వస్తున్నానని, ఒక్క రాత్రి వుంటానని.
అతనే ఏర్పాటు చేశాడో తెలియదు. కాని హుమానాబాదులో కలుస్తానని చెప్పాడాయన.
నా కారు హుమానాబాదు చేరాగానే కనిపించాడతను. మాణిక్యనగర్ వేదపాఠశాలలో అధ్యాపకుడు.
తన వెహికల్ మీద దారిచూపుతూ మమ్మలను ఒక సత్రానికి తీసుకుపోయాడు. అక్కడ నాకో రూము వుంచారని చెప్పాడు. నేను లోపలికి వెళ్ళి ఆఫీసు గదిలో డబ్బు కట్టి నాకు ఇచ్చిన రూములో నా బ్యాగు పెట్టుకొని, కారును డ్రైవరును వెన్నక్కి పంపిచేశాను.
ఆ సత్రము కొత్తగా కడుతున్నారు. ఇటుకలు, ఇసుకతో వుంది ప్రాంగణము. గది మూములు సైజు గదే కానీ పూర్తిగా మంచాలతో నింపేశారు. దాదాపు ఆరు మంది వరకూ అందులో వరసగా పడుకోవచ్చును. క్రొత్తగా కడుతున్నారు కాబట్టో, మరెందుకో చాలా ఖాళీ మాత్రమున్నది.
“రాత్రికి ఏం తింటార”ని అడగాడు నన్ను అక్కడకు తెచ్చినతను. అతని పేరు వైభవు శర్మ. నేను రాత్రులు ఏమీ తిననని చెప్పినా అతను ఏదైనా తీసుకోమని బలవంతం పెట్టాడు. గ్లాసు పాలు చాలంటే పాలు తెచ్చి ఇచ్చి ఉదయమే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
అక్కడ భాష కన్నడం మాట్లాడుతున్నారు అంతా. కొందరికి తెలుగు వచ్చు. హిందీ కూడా కొంత మంది మాట్లాడుతున్నారు కానీ, ఇంగ్లీషు అసలు ఎవ్వరూ మాట్లాడరు. ఆ సత్రం గుడికి చాలా దగ్గరగా వుంది.
నిద్ర నాకు నామమాత్రంగా పట్టింది. నాలుగుకల్లా తయారైనాను. ఉదయము వైభవు ఎక్కడకొస్తాడో తెలియలేదు. గుడి వద్ద నుంచి సుప్రభాతము వినపడుతోంది. నా శాలువా, గురుచరిత్ర ఒక వాటరుబాటిల్‌తో నేను గుడికి బయలుదేరాను. నాకు నా జర్నీ ఎలా జరుగుతుందో అన్న దిగులు కన్నా గురుదేవులుగా నమ్మిన దత్తస్వామిని అణువణువునా వెతుకుతున్న దీక్ష మనసులో గట్టిపడుతూవుంది.
ఆ దేవాలయము చాలా పెద్దగా వుంది. గ్రైనెటు రాతితో కట్టారు. పరిశుభ్రముగా వుంది. వాతావరణము అక్కడ చాలా ప్రశాంతముగా వుంది. ఉదయపు ఆ సేవకు ఓ పది మంది వచ్చారులా వుంది. గడప వరకూ వెళ్ళి అభిషేకము చేస్తున్న సమాధిని దర్శించి నా వందనములు సమర్పించి వచ్చాను. ఒక ప్రదక్షణ చేశాను.
శ్రీ మాణిక్య ప్రభు దత్తుని అవతారము, సద్గురువు. ఆయనది చతుర్ధావతారమంటారు. శ్రీ దత్తుని మొదటి అవతారముగా కొలుచుకుంటే మాణిక్యప్రభుది చతుర్ధమన్నమాట! అక్కడ స్వామి సజీవ సమాధి.
“వందే దత్తావధూతం విధి హరి శివ రూపాత్మకం దేశికాద్యం।
శ్రీపాద శ్రీదవాక్యం శ్రితవిపదపహం చిద్ఘనైకం ద్వితీయం।
తార్తీయం నృసింహం యతికుల తిలకం భక్తకార్యామరద్రువం।
వందే మాణిక్యప్రభుం తం సకల మత గురుం శుద్ధసత్త్వం చతుర్థం॥”
కళ్యాణ్ నివాసియగు శ్రీ మనోహరనాయిక్, బయమ్మ దంపతులకు శ్రీ దత్తుడు కలలో కనిపించి తనే స్వయంగా వారికి జన్మిస్తానని వరమిచ్చారు. స్వామి ఇచ్చిన మాట ప్రకారము 1817లో డిసెంబరు 22 న, మార్గశిర శుక్ల చతుర్ది నాడు వారికి మగశిశువు ‘మాణిక్’ జన్మించాడు. బయమ్మ తల్లిగారి వూరైన లాడవంతిలో ప్రభు జన్మించినాడు.
ప్రభు యొక్క బాల్యము చాలా వరకూ కల్యాణిలోనే గడిచింది. ఆయన విద్యాభ్యాసము గురించి వివరములు తెలియవు. అక్షరజ్ఞానము వ్యవహార జ్ఞానము కల తండ్రి నుంచి పుచ్చుకున్నారా అని అనిపించేది. తండ్రి ఆయనకు ఉపనయనము చేసి గాయత్రి ఉపదేశం చేశారు.
చిన్నతనము నుంచి ప్రభు చాలా స్వతంత్ర ధోరణితో ప్రవర్తించేవారు. ఆయన ప్రవృత్తి చూచి చాలా మంది ఆయనను పిచ్చివాడని భావించి “వేడాబాపు” (పిచ్చి సోదరుడు) అని పిలిచేవారు.
అలా పిచ్చివాడులా కనిపించే ఆయన మహాజ్ఞానియని కొందరి విశ్వాసము. చిన్నతనములోనే ఆయన అమృతమయమైన మాటలకు లోక కల్యాణము జరుగుతుందని నమ్మకము ప్రజలలో కలిగింది.
కల్యాణ్ లోని మేనమామ ఇంట చిన్నతనము గడిపారు ప్రభువు. ఆయన మేనమామ బడికి పంపటానికి చేసిన ప్రయత్నాలు వమ్ముచేసేవారు ప్రభు.
అడవులలో తన మిత్రులతో కలసి తిరుగుతూవుండేవారు. కృష్ణుని చిన్నతనపు అల్లరి ప్రభు తన చిన్నతనములో చేసి, తనలోని దైవత్వాన్ని మరుగునపరిచేవారేమో. హిందీ, మరాఠీ, కన్నడ, తెలుగు, ఉర్దూ, అరబీ అన్ని భాషలలో ఆయనకు ప్రవేశముండేది. వ్యవహార విషయములో సర్వతోముఖాభివృద్ధితోపాటు, వైరాగ్య విషయములో ఎంతో జ్ఞానము కనపరిచేవారు. ఆయనకు గురువుగా ఎవ్వరినీ మనము చూడలేదు అందుకేనేమో.
ఆయన అడవిలో తిరుగుతూ వుంటే గొల్ల పిల్లలు ఆయనతో కలిసి తిరిగేవారు. గొర్రెలను మేకలను వదిలి ఆయనతో ఆడిపాడేవారు. ఆటలలో రాని వారి గురించి ప్రభువు ఎప్పుడూ అడుగుతూవుండేవారు. ఒకనాడు గోవిందు అన్న పిల్లవాడు కనపడడు. ప్రభు వారింటికి వెళ్ళే సరికి ఆ పిల్లవాడు మరణించాడని అంతా శోక సముద్రములో మునిగి వుంటారు. గోవిందుని తల్లి వద్దకు వెళ్ళి ‘గోవిందు’ ఏడని అడుగుతాడు ప్రభు. ఆ తల్లి దుఃఖముతో వుంటుంది. ఆయనకు అక్కడ వున్నవారు గోవిందుడు జర్వంతో మరణించాడని చెబుతారు. ఆయన గోవిందుని తల్లి దగ్గరకు వెళ్ళి ‘గోవిందుని పిలువ’మని చెబుతాడు. ఆమె ప్రభు చెప్పినట్లుగా “గోవిందా లే నిన్ను పిలవటానికి వేడాబాపు వచ్చాడు” అని పిలుస్తుంది. ఇలా అనగానే గోవిందు నిద్రనుంచి లేచినట్లుగా లేచి వచ్చి ఆకలని అడుగుతాడు. అక్కడివారు ఆశ్చర్యముతో మాటరాక వుంటారు. అలా ప్రభు తన చిన్నతనములోనే కారణజన్ములని నిరూపిస్తారు.
పండ్లు అమ్మే స్త్రీకి పండ్లు ఉచితముగా ఇమ్మని పిల్లలు కలుగుతారని అంటారు ప్రభు. ఆమెకు పిల్లలు వుండరు. ఆమె ఆశ్చర్యపోయి బుట్ట మొత్తం ఇస్తుంది. పిల్లలందరూ కావలసిన పండ్లను తీసుకుంటారు. ఆమెకు పిల్లలు కలుగుతారు.
ప్రభువు హళిఖేడుకు చెందిన యజ్ఞేశ్వర దీక్షితులతో “సర్వతోముఖ” అన్న పేరు గల యజ్ణము చేయించారు. ఈ విషయము చరిత్రాకారులందరూ రచించారు. అది ‘నభూతో నభవిష్యతి’లా జరిగిందంటారు. యజ్ఞము నిర్విఘ్నంగా సాగుతుండగా ఒక పేద బ్రహ్మణుని కుమారుడు 14 సంవత్సరములవాడు చపాతీలు తింటూ డెక్కుపడి మరణిస్తాడు. ప్రభు వద్దకు వచ్చి రోదిస్తూ కూర్చుంటాడు. ఎన్ని రకాలుగా సముదాయించినా వినడు. యజ్ణమండపము వదలడు. శవము వుంటే యజ్ఞం చెయ్యరాదని ఇక ఇది విఘ్నమని అనుకుంటారు అందరూ. ప్రభు అందరి వద్దా వున్న తీర్థజలం తెచ్చి పిల్లవాని నోటిలో పొయ్యమని చెబుతాడు. ప్రభు సోదరుడు తాత్యాసాహెబ్ అందరి వద్ద జలం తీసుకొని పిల్లవాని నోటిలో పొయ్యగానే పిల్లవాడు లేచి కూర్చుంటాడు. అందరూ పుర్ణాహుతి సమర్పించి యజ్ఞం పూర్తిచేస్తారు.
1865 నవంబరు 29న ప్రభు సమాధిలోకి ప్రవేశించదలచారు. ప్రభు సజీవ సమాధి అగుటకు నిశ్చయించుకున్నారు. భక్తులకు ప్రభు సమాధి విషయము ముందు తెలియలేదు. ఆ విషయము ముఖ్యమైన నలుగురు శిష్యులకు ముందు చెప్పారు.
ఆయనకు వీపు మీద రాచకురువు మొదలయ్యింది. దశమి నాటికి అదీ చాలా పాకింది. కానీ ఆయనకు ఆ కురుపు వలన శారీరక వేదన వున్నట్లు ఎవ్వరికీ అనిపించలేదు. ఏకాదశి పుణ్యతిథి. చతుర్థాశ్రమం తీసుకొని నిర్ణయించుకున్న సమయానికి ప్రభు సమాధి ఆసనముపై కూర్చున్నారు. నలుగురు శిష్యుల నుంచి పూజ స్వీకరించారు. తాత్యా మహరాజు (మాణిక్యప్రభు సోదరులు) గారి ఇద్దరు పుత్రులను దగ్గరకు ప్రభు పిలుచుకున్నారు. వారి నుంచి పూజ స్వీకరించి వారికి మాల వేసి ప్రసాదమిచ్చారు. పెద్ద కుమారునికి తన వంటి మీద నుంచి శాలువ తీసి కప్పి మంత్రోపదేశము చేశారు. కనిష్ఠ పుత్రునికి ప్రసాదమిచ్చి ఇద్దరినీ వెళ్ళిపొమ్మన్నారు. తరువాత సమాధి ముయ్యవలసినదిగా శిష్యులకు చెప్పారు. ఆజ్ఞ ప్రకారము శిష్యులు చేశారు. పైన కొద్దిగా భాగము తీసి వుంచారు. సాయంత్రం ఐదు గంటలకు మస్తకభేదము జరిగింది. ఆ తరువాత సమాధి ఆ పై భాగమూ మూసివేశారు. దత్తజయంతి పౌర్ణమి రోజన సమారాధన అయ్యాక సమాధి విషయము భక్తులకు తెలిసింది. వారు ఎంతగానో శోకించారు. మాణిక్యప్రభు తరువాత వారి సోదరుల పుత్రుడు పీఠమధిరోహించాడు. నేటికీ ఆ పీఠము పరంపర సాగుతోంది.
గురు సార్వభౌమ
శ్రీ మద్రాజాధిరాజ యోగిరాజ
త్రిభువనానంద అద్వైత అభేద
నిరంజన నిర్గుణ నిరాలంబ
పరిపూర్ణ సదోదిత సకల మత స్థాపిత
శ్రీ సద్గురు మాణిక్యప్రభు
మహారాజ్ కీ జయ్!! (మాణిక్య ప్రభువు జయఘోష)
(సశేషం)