Site icon Sanchika

సత్యాన్వేషణ-9

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

గాణుగాపురములో రెండవరోజు ఒక వింత జరిగింది. ఆ సాయంత్రం శ్రీగురుని మఠములో చాలా హడావిడిగా వుంది. ఒక ప్రక్క పూజకు లైను. మరో ప్రక్క పల్లకి క్రింద పడుకునేవారి సందడి. చుట్టూ అరుగులా వుంటే ఆ అరుగుల మీద ఈ పల్లకీ వేడుకు చూడటానికి భక్తులు బారులు తీరి వున్నారు. ఈ ఉత్సవము ప్రతిరోజూ ఇదే హడావిడి. ఆ రోజు పైపెచ్చు మరో ప్రత్యేకత కూడా వున్నట్లుగా వుంది. మొత్తానికి ఈ సందడిలో నా దృష్టిని ఆకర్షించినది మాత్రము ఒక కుటుంబము.

భార్య, భర్త, కూతురు ముగ్గురూ సాంప్రదాయమైన వస్త్రాలలో వున్నారు చూడ ముచ్చటగా. ఆమె ముఖములో మెరుపులు. పిల్ల ముఖములో ప్రశ్నలు, నవ్వులూ. తండ్రి భక్తితో ప్రసన్నముగా వున్నారు. ఆ ప్రతేక్యపూజకు కొద్ది మందికే అవకాశము వుంటుంది. దానికి ధర ఎక్కువ అనుకుంటాను ఎవ్వరూ రారు. నేను వచ్చే ముందు ఆ ప్రత్యేక పూజ చేసుకున్నాను శ్రీగురునికి. ఈ కుటుంబము మీద నా దృష్టి నిలబడిపొయింది. నాకు ‘నా కుటుంబము’ గుర్తుకు వచ్చింది. ఆ రోజు వరకూ  నన్ను నేను మరచి, నా సర్వ ఆలోచనలూ లక్ష్యము వైపుగా సారించి సాగుతున్నాను. ఆ చిన్న కుటుంబము, వారి మెరుపుల చిరునవ్వులలో నాకు నా చిన్న కుటుంబమును గుర్తుకు తెచ్చింది.

మేమూ చాలా సంతోషముగా వుండేవాళ్ళము. మా తగవులు అల్లరులూ అన్నీ నవ్వులలో కొట్టుకుపోయేవి. మా ముగ్గురిని చూచి ‘క్యూట్  ఫ్యామిలీ’ అనేవారు జనులు.

మా మధ్యన   నమ్మకము, గౌరవమూ చనువూ అనిర్వచనీయము. ముగ్గురము ఒకళ్ళతో ఒకరు నిజాయితీగా వుంటాము,  నేటికి కూడా.

అవన్నీ ఏమైనాయి? నేను ఏమైనాను?

నా జీవితము పేకమేడలా కూలిపోవటామికి కారణమేమిటి?

నా మిత్రులందరూ సంతోషంగా వుంటే నేనెందుకు ఇలా దేశం పట్టుకు తిరుగుతున్నాను ?

నా జీవితములో విపరీతమైన అసంతృప్తితో  ఎందుకు తల్లడిల్లిపోతున్నాను ?

నిజానికి ప్రపంచములో లక్షల మంది కోరుకునే అదృష్టవంతమైన జీవితము నాది. అమెరికాలో వుండాలని లక్షల మందికి కోరిక. మేము అక్కడ సిటిజన్స్‌మి కూడా. డబ్బు ఆరోగ్యము వంటి సమస్యలు కూడా లేవు. అయినా ఆ విషయాలు నన్ను ఎంత మాత్రం సంతోషపెట్టడము లేదెందుకు?

నాలో కలిగే అలజడికి కారణము చాలా మంది చెప్పినట్లుగా కష్టాలు లేకపోవటమా?

నేను అన్నీ వదిలేసి ఇలా దాదాపుగా  కట్టు బట్టలతో దత్తస్వామికి కొలుస్తూ, గురువు కోసము తిరగటము ఎంత వరకూ సమంజసము? ఎవరు నాకు సరి అయిన దారి చూపుతారు? అలా చూపే అమ్మా, నాన్న లేరుగా ఇప్పుడు? నేను చేస్తున్నది సరి అయిన పనేనా?

ఇలాంటి ప్రశ్నలు నన్ను నిలవనీయలేదు. ఇలాంటి ప్రశ్నలు నన్ను కలిచివెయ్యటానికి కారణమైన ఆ కుటుంబము వంక మళ్ళీ చూశాను.

అందమైన ఆమె భక్తిగా నమస్కరిస్తోంది. నేనూ చక్కటి చీర కట్టుకుంటే, తల దువ్వుకుంటే ఇంకా బావుంటాను కదా?

నాకే చాలా పిచ్చిగా అనిపించింది నా ఆలోచన.

ఏ అందము నాకు కావాలి?

కట్టెలలో కాలిపోయి, కుండలోకి వెళ్ళిపొయిన అమ్మ గుర్తుకు వచ్చింది.

నా శరీరము వైపు చూచాను.

బాగు పోగూ ప్రపంచ మార్గం…. ఏమిటి చివరకు మిగిలేది.

ఈనాడు మనమందమనుకున్నది కాలిపోతుంది.

కర్మ బావుంటే ‘అమ్మా, నాన్నగారి’లా నొప్పి తెలియని చావు.. తరువాత గంగలో కలిసే  అదృష్టము. లేదంటే ఎవరికి తెలుసు.

సీ. పచ్చి చర్మపుఁదిత్తి పసలేదు దేహంబు – లోపలనంతట రోయ రోఁత
నరములు శల్యముల్‌ నవరంధ్రములు రక్త – మాంసంబు కండలు మైల తిత్తి
బలువైన యెండ వానల కోర్వ దింతైనఁ – దాళలే దాఁకలి దాహములకు
సకల రోగములకు సంస్థానమై యుండు – నిలువ దస్థిరమైన నీటి బుగ్గ
తే. బొందిలో నుండు ప్రాణముల్‌ పోయినంతఁ – గాటికే గాని కొఱగాదు గవ్వకైన
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! – దుష్టసంహార! నరసింహ దురితదూర!” (నరసింహ శతకము)

నా చేతులు చూసుకుంటూ కూర్చున్నాను.

ఏనాడో దత్తగురువుకు చేసిన చిన్న సేవ వలన నేడు సద్గురువుకై అర్రలు చాస్తున్నాను.

మళ్ళీ ఆ చట్రం లోకి వెళ్ళకూడదు.

శాశ్వతమైన అందము కావాలి నాకు. గురుసేవ యన్న నిజమైన అందం కావాలి.

నాకు మనసు నెమ్మదించింది.

అవును!

నేను నా గురువును కలవాలి!

అంత వరకూ నా మార్గము నుంచి నన్ను ఏ ఆకర్షణ దూరము చెయ్యదు.

ఇలా భావించిన తరువాత నేను నెమ్మదించాను.

కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళు లేరు. వెళ్ళిపొయినట్లులుగా వున్నారు.

నాలో డోలామాయస్థితి మళ్ళీ ఎన్నడూ కలగలేదు.

అలా దత్తస్వామి నా హృదయాన్నీ తట్టి మార్గము చూపారేమో.

ఆ రోజు రాత్రి మావారికి ఫోను చేసినప్పుడు ఆలోచనలు చెబితే “చూడాలనుకున్నావు. అన్నీ చూసిరా ” అని ఎప్పటిలా ప్రోత్సహించారు.

పాపమేనాడు నేను చేయ్యాలనుకున్న పనికి అడ్డం పడడు. మంచి మిత్రుడు, సహచరుడు.

***

అక్కల్కోట  గాణుగాపురము నుంచి దాదాపు 70 కిలోమీటర్లు దూరము ఉంటుంది.

అక్కడ సమాధి మందిర పూజారి ఒక బస కూడా నడుపుతారు. ఆయనను నేను హైద్రాబాదు రాగానే కాంటాక్ట్ చేశాను. ఆయన అడ్రస్సు ఇచ్చి అక్కడికి రమ్మనమని, బస్సు దిగవలసిన చోటు చెప్పారు.

నేను దత్త క్షేత్రాలన్నీ చూడూలనుకున్నప్పుడు గూగుల్ సాయంతో ఒక మ్యాపూ, ఒకదానికి మరోక వూరికి దూరము లాంటివి నోటు చేసుకున్నాను. నెట్‌లో దొరికినంతగా వుండేందుకు బస కూడా ఏర్పాటు చేసుకున్నాను.

అలా ముందుగా ఫోను చేసి బయలుదేరినందున, ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది అవలేదు ఇంతవరకు. అక్కల్కోటకు బయలచేరటానికి నేను ఉదయం దాదాపు 11 గంటలకి బస్సు ఎక్కితే 70 కిలోమీటర్ల దూరాన్నీ ఆ బస్సు నాలుగు గంటల సమయము తీసుకుంది. ఆ దారంతా కంకర. పదునైన రాళ్ళతో నిండి వున్నది. బస్సు నెమ్మదిగా గమ్యము చేర్చింది. అన్ని కంకర రాళ్లమీద ఆ బస్సు కుదుపులు నా మానసికమైన ఆందోళన ముందు చిన్నగానే అనిపించాయి.

బస్సు ఒక పెద్ద దేవాలయము ముందర ఆగింది. చాలా హడావిడిగా వుంది అక్కడ.  అయితే అది స్వామి సమర్థ్ వారి సమాధి మందిరం కాదు. ఒక పెద్ద అశ్వత్థ వృక్షం చుట్టూ కట్టిన గుడి అది. స్వామి అక్కడ ఉండి భక్తులను అనుగ్రహించిన స్థలం.

నేను మాట్లాడిన పూజారి చెప్పిన సత్రం అది కాదు. బస్సులో స్వామీ సమర్థ దేవాలయమంటే అక్కడ దింపి వెళ్ళిపోయారు. నాకు తెలియదు ఇలా రెండు వున్నాయని. ఆ పూజారిగారు చెప్పలేదు.

నేను దిగిన చోట నుంచి సమాధి మందిరం వరకు ఒక ఆటో ఎక్కి వెళ్ళాను.

సాయంకాలము సమయానికి ధనుంజయ పూజారి వారి బసకు చేరుకున్నాను.

ఆయన సత్రం చక్కటి మూడు అంతస్తుల ఆ భవనం. అన్ని ఆధునిక సదుపాయాలతో, చాలా శుభ్రంగా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రవేశించిన వెంటనే మనం ఒక పెద్ద హాల్ లోకి వెళ్తాము. ఒక వైపు గోడకు నిలువెత్తు స్వామి సమర్థ్ వారి చిత్రం… ఎంతో దివ్యంగా మన కేసి చూస్తూ ఉంటుంది. అయన ముఖంలో, ముఖ్యంగా ఆ కళ్ళు మననే చూస్తూ ఉంటాయి. మనని కట్టిపడేస్తాయి. ఒక వైపు ఒక దీపం వెలుగుతోంది. నన్ను మూడవ అంతస్తుకు కొనిపోయి ఒక గది చూపారు.

మొదటి అంతస్తు వారి గృహం. భోజనం వారు ప్రేమతో నాకు పంపించారు. నేను భోజనము చేసి మందిరం వైపు సాగాను.

***

“కౌపీనధారీ సన్యాసీ సమర్థో జ్ఞానభాస్కరః।
నారాయణ స్వరూపీ చ ధనదారా వివర్జిత॥
సర్వసంగ పరిత్యాగీ భక్తానాం జ్ఞానదో గురుః।
బ్రహ్మేంద్రో బ్రాహ్మాణో జ్ఞానీ క్ష్రేత్రజ్ఞః సురవందితః॥” (శ్రీ సామి సమర్థ స్తోత్రం)

శ్రీ స్వామి సమర్థ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. భగవన్తుని లీలలు అనంతం. వాటిని తెలుసుకునే కొద్దీ, ఇంకా తెలుస్తూనే ఉంటాయి. అలానే శ్రీ స్వామి సమర్థ లీలలు అంతు లేకుండా, కడు విచిత్రంగా ఉంటాయి. మానవ మేధకు అందకుండా ఉంటాయి. ఈ స్వామి పుట్టుక, పెరిగిన విధానం, చదువు అన్ని అగోచరములే.

అశ్వని మాస 1856 వ సంవత్సరం ఈ స్వామి మొదటి సారి అక్కల్కోటలో కనిపించారు. ఆనాటి నుంచి వారు అక్కల్కోట లోనే ఉండిపోయారు. వారి గురించి భక్తులు వివరాలు అడిగితే – ఒకసారి తమ తల్లి తండ్రులు ‘మాదిగ వారు’ అన్నారు. మరొక భక్తునితో ‘యజుర్వేద బ్రాహ్మలమని’ చెప్పారు. మరొక భక్తునితో ‘మూలపురుషుడు – వటవృక్షం, మూలానికి మూలం’ అన్నారు. కుల మతాలకు  అతీతమైన భగవంతుని రూపమని చెప్పటానికి ఇలా చెప్పి ఉంటారు.

స్వామి సమర్థను భక్తులు గాణ్గాపుర వాసి అయిన ‘శ్రీ నృసింహ సరస్వతి’ వారి అవతారంగా నమ్ముతారు. శ్రీ స్వామి సమర్థ అక్కల్ కోట రాక పూర్వం దేశం నలుదిశలా పర్యటించారు. బదిరి, కేదార్, హరిద్వార్, గంగోత్రి, వారణాసి, కలకత్తా, పూరి, ఉడిపి, పండరినాథ్, గిర్నార్, మాతాపూర్, నరసింహవాడి, రామేశ్వరం ఇలా ఎన్నో చోట్లు వారు పర్యటించారని చెప్పారు. భక్తులు కొందరు వారిని అక్కడ, ఇక్కడ చూసి ఉన్నారు కూడా.

వివిధ క్షేత్రాలలో స్వామి భక్తులకు రకరకాలైన అనుభవాలు ఇస్తుండేవారు. ఒక సారి కొందరు భక్తులు ‘పూరి’ చేరి దర్శనం చేసుకొని లోపల జ్వరంతో మూలుగుతూ భగవంతుని స్మరిస్తూ ఉండిపోయారు. ఆ గదిలోకి మెరుపు మెరిసి శ్రీ స్వామి సమర్థ ప్రత్యక్షమయ్యారు. వారికి వెంటనే స్వస్థత కలిగింది. వారి ఆకలి కూడా తీర్చి స్వామి అదృశ్యమయ్యారు. మరో భక్తునికి పూర్వజన్మ స్మృతి కలిగించి తన పూర్వపు జన్మలో ‘నృసింహ సరస్వతి’ అని నిరూపించారు. ఈ సంఘటనలు ఆళాని బువా అన్న సాధువు ద్వారా మిగిలిన భక్తులకు తెలిసింది.

అక్కల్కోట వచ్చినప్పుడు స్వామి మొదట కండోబా ఆలయం వద్ద ప్రకటితమైనారు. అక్కడి తహసీల్దార్ స్వామిని పిచ్చివాడని నమ్మి వుట్టి ఖాళీ చిలుము తెచ్చి పీల్చమని ఇస్తాడు. స్వామి ఏమి మాట్లాడకుండా ఆ చిలుముకి అగ్గి పెట్టి పీలుస్తాడు. హుక్కా పొగ రావటం చూసి స్వామి సిద్ధ పురుషుడని గ్రహించి ఖాన్ తప్పు క్షమించమని వేడుకుంటాడు. చో అన్న భక్తుని ఇంట స్వామికి భోజనం ఏర్పాటు చేస్తాడు. ఆనాటి నుంచి స్వాళప్పమి చోళప్ప  ఇంటనే ఉండిపోతారు. స్వామి హిందువు భక్తులను, మహ్మదీయ భక్తులను భేదభావం లేకుండా చూసేవారు.

స్వామికి భక్తులకు భోజనం పెట్టటమంటే ఎంతో ప్రీతి. ఒకసారి స్వామి రాంపుర అన్న గ్రామం వెళతారు. భక్తుడు రవాజి స్వామి ఆగమన విందుగా 50 మందిని పిలుస్తాడు. కానీ స్వామిని చూడటానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు వందలలో కదిలి వస్తారు. రవాజి ఆ భక్త సముద్రాన్ని చూసి కంగారు పడటం జరుగుతుంది. స్వామి మాత్రం చెక్కుచెదరక రవాజిని ఖాళీ బుట్టలు తెమ్మని చెబుతారు. ఆ బుట్టలలో శివ, అన్నపూర్ణ దేవతల మూర్తులను పెట్టి, పైన రోటి, అన్నం వంటి ఆహారంతో నింపుతారు. ఆ బుట్టలను తులసి మాత చుట్టూ మూడు సార్లు తిప్పించి, బుట్టలను కప్పి, చూడకుండా వడ్డన చెయ్యమని స్వామి ఆజ్ఞాపిస్తాడు. అలానే రవాజి వచ్చిన భక్తులకు వడ్డిస్తారు. ఆనాడు భక్తులు వందలలో భోజనం చేస్తారు. చిట్టచివరకు స్వామి సమర్థ భోజనం చేసిన తరువాత చూస్తే, వండినది వండినట్లుగా ఉంటుంది. ఇది ‘అన్నపూర్ణ సిద్ధి’. ఇదే లీల మనకు శ్రీ నృసింహ సరస్వతి స్వామి చరిత్రలో, శిరిడి సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చు.

శ్రీ నృసింహ సరస్వతి స్వామికి, మన అక్కల్కోట స్వామికి కొన్ని చిన్న భేదాలు కనపడుతాయి. అక్కల్కోట స్వామికి ఎటువంటి ఆశ్రమాలు లేవు. అంతమాత్రాన స్వామి సన్యాసి కారని కాదు. పరమహంస, తురీయాతీత, అవధూత సంప్రదాయానికి దండం, కమండలు, కాషాయం ఆవశ్యకత లేదు. ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందిన కొందరిని ‘అత్యాశ్రమి’ అంటారు. వీరు బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు అతీతంగా ఉంటారు. ఏ నియమ నిబంధనలు వారికి చెందవు. మన అక్కల్కోట స్వామి అలాంటి కోవకు చెందిన వారు.

శ్రీ స్వామి ఎప్పుడు బ్రహ్మానందంలో మునిగి ఉండేవాడు. ఆయన రూపం విచిత్రంగా ఉండేది. ఈయన వయో వృద్ధులైన, అవధూత అయినప్పటికీ ఆయన శరీరం ఎక్కడ ముడతలు ఉండేవి కావు. స్వామి సర్వజ్ఞులైనప్పటికీ పసి పిల్లలవలె చేష్టలు ఉండేవి. బ్రహ్మానందంలో ఉన్మత్తావస్థలో ఉన్న స్వామి ఎవ్వరిని లక్ష్య పెట్టేవారు కారు.

స్వామి చాలా పొడుగు. ఆజానుబాహులు. దాదాపు 7 అడుగులు పొడుగు ఉండేవారు. పెద్ద బొజ్జా, విశాలమైన భుజాలు, తీవ్రమైన దృష్టి. స్ఫురద్రూపి. గోధుమవన్నె శరీరఛాయతో ఉండేవారు. పెద్ద చెవులు. పాదాలు పొడుగుగా ఉండేవి. స్వామి ముఖాన తిలకం మెడలో స్పటికపు మాల, తులసి మాల రుద్రాక్షలు ధరించేవారు. కౌపీన ధారి.

చెవులకు ప్రవాళం పొదిగిన కుండలాలు ఉండేవి.

ఒక్కొక్కప్పుడు వేదాలు, శ్లోకాలు, భజనలు ఆయన నోటి వెంట వచ్చేవి. ఒక్కొక్కప్పుడు వంటికి గంధం రాచుకొని హారతి ఇప్పించుకునేవారు. తరచూ చిన్నపిల్లలతో కలసి ఆడుతూ ఉండేవారు.

ప్రతి ఉదయం రెండుసార్లు ఆచమనం చేసేవారు.

స్వామి సర్వజ్ఞులు. ఎవ్వరు ఏమి ఆలోచించినా ఆయనకు తెలిసిపోతుంది. ఒకసారి ఒక భక్తుడు సన్యాసి అయిన స్వామి ఇన్ని భోజన పదార్థాలు తినటమేమిటి? అని మనసులో అనుకుంటే, ఆనాడు స్వామి పచ్చిశెనగలు తిని నీరు త్రాగి ఊరుకున్నారు. స్వామి భక్తుల పాలిటి కల్పవృక్షం. ఆయన భక్తుడైన జ్యోషి నిత్యం “పంచదశి” గ్రంధం పారాయణం చేసేవాడు. ఒకరోజు ఒక జటిలమైన శ్లోకానికి అన్వయం తెలియక జ్యోషి పారాయణం నిలిచిపోతుంది. ఆరోజు జ్యోషి, తన మిత్రులు పారాయణం ఆపి స్వామి దర్శనానికి వెడతారు. ఆనాడు స్వామి వారిని కూర్చోబెట్టి వేదాంతబోధ చేశారు. ఆ బోధ అంతా ఆనాటి శ్లోకం అర్థమే!! స్వామిని నమ్మిని వారు ఏమీ ప్రత్యేకంగా కోరవలసిన అవసరంలేదు. అన్నీ స్వామికి తెలుస్తాయి.

(సశేషం)

Exit mobile version