Site icon Sanchika

కూతురు కోసం తండ్రి “SEARCHING”

[box type=’note’ fontsize=’16’] “రెండుగంటలలోపు ఈ చిత్రంలో ఆద్యంతమూ ఉత్కంఠ. అదీకాక సినెమా తీసిన విధం కొత్తగా వుంది” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘సెర్చింగ్’ సినిమాని సమీక్షిస్తూ. [/box]

[dropcap]2[/dropcap]018 లో వచ్చిన ఈ ఆంగ్ల చిత్రం తీసినది అనీష్ చాగంటి. ఆంధ్ర ప్రదేశ్ నుంచి వాషింగ్టన్ కెళ్ళిన తెలుగు దంపతులకు పుట్టాడు అనీష్. కంప్యూటర్ ఎంగినీరింగ్ లో ఎమ్మెస్ చేసాక సినెమా కళలో కూడా పట్టా పొందాడు. కొన్ని లఘు చిత్రాల అనంతరం ఇది తను తీసిన మొదటి పూర్తి నిడివి చిత్రం. మొదటి ప్రయత్నానికే సండేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డును పొందాడు. ఈ ముక్కలు కాస్త గర్వంతో పంచుకుంటున్నాను మీతో. మనవాడు వొక మంచి చిత్రం తీస్తే నాతోపాటు మీరూ సంతోషిస్తారని.

కంప్యూటర్లు, ఇంటర్నెట్టూ వచ్చిన ఈ ఆధునిక జీవితం చాలా మారిపోయింది. నా తరం వాళ్ళు ఫొటోలు తీసుకుని ఆల్బం లలో భద్రపరుచుకునేవారు. వొకోసారి పాత జ్ఞాపకాలు కమ్మేసినప్పుడు అవి తీసి చూస్తూ కూర్చునేవారం. ఇప్పుడు ఫొటోలన్నీ కంప్యూటర్లలో, మొబైళ్ళలో, మేఘాల్లోనూ భద్రపరచుకుంటున్నారు. ఈ చిత్రం ప్రారంభంలో డేవిడ్ కిం (జాన్ చో) తన వివాహపు తొలి దినాలనుంచీ, కూతురు పుట్టడం, పెరగడం, ఆ తర్వాత భార్య పామెలా (సారా) కేన్సర్ బారిన పడి మరణించడం, కూతురు మార్గో ( మిషెల్ ల) ఎదిగి హయ్యర్ స్కూల్కెళ్తుండడం ఇవన్నీ తండ్రి కంప్యూటర్లో ఫొటోలు చూస్తూ జ్ఞాపకాలను నెమరేస్తూ వుంటాడు. ఒక నాడు మార్గో కంబైండ్ స్టడి కోసం స్నేహితురాలింటికి వెళ్తుంది. రాత్రి చాలా ఆలస్యమయ్యేసరికి తండ్రి ఫోన్ చేస్తాడు. ఇంకా ఆలస్యమయ్యేలా వుందని, అవసరమైతే రాత్రికి వుండిపోవాల్సి వస్తుందనీ, చింతించవద్దని చెబుతుంది. డేవిడ్ నిద్రపోతాడు. అర్ధరాత్రి ఎప్పుడో అతనికి మూడు సార్లు కూతురు దగ్గరినుంచి కాల్స్ వస్తాయి. కాని అతను గాఢ నిద్రలో వుండి వినడు. మర్నాడు లేచేసరికి మిస్సడ్ కాల్స్ చూసి కూతురికి ఫోన్ చేస్తాడు. సమాధానం రాదు. చాట్ చేస్తాడు, ఎలా వున్నావు యేమిటీ అని; సమాధానం వుండదు. స్కూల్ వదిలేసే సమయం తర్వాత కాల్ చేసినా సమాధానం వుండదు. బడికి ఫోన్ చేస్తే ఆమె రాలేదంటారు. ఆమె పియానో నేర్చుకోవడానికి వెళ్ళే టీచర్ కి ఫోన్ చేస్తే తను ఆర్నెల్ల నుంచీ రావట్లేదని చెబుతుంది. ఇప్పుడు తండ్రి ముఖంలో కొంత టెన్షన్ కనబడుతుంది. కూతురు స్నేహితులు ఎవరూ తనకి తెలీదు. ఎలా? ఆమె తన లేప్టాప్ వదిలేసి వెళ్ళింది. దాన్ని తెరిచి ఆమె ఈమేల్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాంలు తెరిచి చూస్తాడు. పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఎలాగో దొరకబుచ్చుకుంటాడు. ఇక ఆ ఖాతాలలో ఆమెకున్న స్నేహితులను వొక్కొక్కరినీ ఫోన్ చేసి మార్గో వున్నదా అని అడుగుతాడు. ఆమె గత రెండు సంవత్సరాలుగా (అంటే తల్లి చనిపోయినప్పటినుంచీ) ఎవరితోనూ మాట్లాడదూ, కలవదూ అని చెబుతారు. తన దగ్గర నెలకు వంద డాలర్లు పియానో ఫీజుకని తీసుకుని తన బేంకి ఖాతాలో జమ చేయడం, నాలుగు రోజుల క్రితమే పోగు చేసిన 2400 డాలర్లు ఎవరికో బదిలీ చేసినట్లు తెలుసుకుంటాడు. వొక్కొక్కటీ తెలుస్తుంటే అతని భయం ఇంకా పెరిగి పోతుంది. అదంతా అతని ముఖంలో చూస్తాం. వొక ఫేస్ బుక్ సంభాషణలో తన తమ్ముడు పీటర్ (జోసెఫ్ లీ) తో నెరపిన సంభాషణ సందేహాత్మకంగా వుంటుంది. రాత్రి కలవమని, క్రితం రాత్రి బాగా మజా వచ్చిందని, తండ్రికి చెప్పవద్దనీ ఇలాంటివి వుంటాయి. ఇక పోలీసులకు ఫిర్యాదు చేయక తప్పదు అని పోలీసులకు ఫోన్ చేసి కేసు నమోదు చేస్తాడు. కాసేపటికి డిటెక్టివ్ రోస్మేరి విక్ (డెబ్రా మెసింగ్) నుంచి ఫోన్ వస్తుంది, తనకు ఈ కేసు అప్పచెప్పబడిందనీ, తాము చేయాల్సిన తనిఖీలు, గ్రౌండ్ వర్క్ ఎలాగూ చేస్తాము అయితే తండ్రిగా ఆమె గురించిన ప్రతి చిన్న విషయం తనతో చెబితే పని సరళతరం అవుతుందనీ, తొందరగా తేలుతుందనీ చెబుతుంది. ఆ క్షణం నుంచి ఇద్దరూ కలిసి దర్యాప్తు చేస్తారు. బేంకినుంచి డబ్బు తీసుకుని మార్గో పారిపోయిందేమో అని సూచిస్తుంది విక్. డేవిడ్ అది నమ్మడానికి తయారుగా లేడు. తన కూతురు అట్లాంటిది కాదంటాడు. తన కొడుకు మీద కూడా దొంగతనం నేరారోపణ వచ్చినప్పుడు తను కూడా అలాగే అన్నానని, అయితే నిజంగానే అతను దోషి అని తెలిసింది; మన పిల్లలగురించి మనకు తెలుసు అనుకుంటాం కానీ చాలా తెలీదు అంటుంది రోస్మేరి విక్. మార్గో వివరాలేమైనా తెలిసాయా అని అడగడానికి పీటర్ వస్తాడు. డేవిడ్ కోపంగా అతన్ని కొట్టి వాళ్ళిద్దరిమధ్య యేం జరిగిందని గద్దిస్తాడు. నువ్వనుకుంటున్నట్టు ఏమీ లేదు, ఇద్దరం కలిసి చాటుగా మేరువానా సేవించేవాళ్ళం అంతే అంటాడు. ఇది చిత్రంలోని మొదటి మూడో వంతు మాత్రమే. ఇలాంటి ఉత్కంఠ భరిత చిత్రాల కథ సాంతం చెప్పకూడదు. మార్గో పారిపోయిందా? చనిపోయిందా? బతికేవుందా? నేరస్తుడు ఎవరు? ఇలాంటివన్నీ సినెమా లో చూడాల్సిందే. అమేజాన్ ప్రైం లో వుంది.

రెండుగంటలలోపు ఈ చిత్రంలో ఆద్యంతమూ ఉత్కంఠ. అదీకాక సినెమా తీసిన విధం కొత్తగా వుంది. సినెమా మొత్తం లేప్టాప్ తెరమీద, విడియో కాల్స్ మీద, టీవీ తెర మీద నే చిత్రించబడింది. 2014లో అంఫ్రెండెడ్ అనే చిత్రం ఇలాంటి పధ్ధతిలోనే తీశారట, నేను చూడలేదు. కాని ఈ టెక్నిక్కు ఆసక్తికరంగా వుంది. నటులందరి నటనా బాగుంది. ముఖ్యంగా డేవిడ్, విక్ లది. డేవిడ్ ముఖం లో క్రమంగా పెరుగుతున్న టెన్షన్ మనలో కూడా అలాంటి టెన్షనే నింపుతుంది. అంత బాగా చేశాడు. స్క్రిప్టు సెవ్ ఒనానియన్ తో కలిసి అనీష్ వ్రాశాడు. వాన్ సెబాస్టియన్ బేరన్ చాయాగ్రహణం, టొరిన్ బొరొడేల్ సంగీతమూ చెప్పుకోతగ్గ స్థాయిలో వున్నాయి. చాయాగ్రాహకుడికి చాలా విషయాలు స్వేచ్చలేకుండా కట్టిపడేసినా, అతని పని తీరు మనల్ని తెరకు కట్టిపడేసేలా వుంది.

నాకు ఈ చిత్రం నచ్చింది. మిమ్మల్ని కూడా చూడమని సిఫారసు చేస్తున్నా.

Exit mobile version