‘రామకథాసుధ’ సంకలనం ప్రచురణకు పరిశీలనకు అందిన కథ.
***
[dropcap]స[/dropcap]ముద్రం మహోగ్రంగా ఘోష పెడుతున్నది. అలలు ఎగసి ఎగసి ఉవ్వెత్తున లేచి విరిగిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. జాంబవంతుడు, విభీషణుడు తదితరులు మౌనంగా ఉన్నారు.
వాతావరణం గంభీరంగా ఉంది. రాముని మనసు సముద్రం వలె అలజడిగా ఉంది. సీత జాడ తెలియకున్నది. పక్షి జటాయువు చెప్పిన దిక్కుగా ఎవరిని పంపుదామన్నా అనంతమైన జలనిధిని దాటి ఆ వైపుకు వెళ్ళగలిగిన వారెవ్వరు!? తన చుట్టూ ఉన్న వారంతా అరవీర పరాక్రమవంతులే! తనకోసం ప్రాణాలను సహితం పణంగా పెట్టగల పరమ భక్తులే!.. తనకోసం ప్రాణాలను సహితం పనంగా పెట్టగలపరమ భక్తులే కానీ ఆవలి ఒడ్డుకు వెళ్ళగలవారేరి? తనకు గాని, తమ్ముడు లక్ష్మణుని గాని సంద్రాన్ని దాటగల శక్తి ఏది!?
రాముని ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి. ఒక్కసారి సముద్రం వైపు చూసాడు. దీర్ఘంగా నిట్టూర్చి మరల కపివరుల వైపు చూశాడు. ఊహూ.. నిరాశ అలుముకుంది. కానీ వెంటనే సర్దుకున్నాడు. తానే బేలగా మారితే తనవారి పరిస్థితేమిటి!?
తమ్ముడు లక్ష్మణుని పిలిచాడు.
కపివీరులకు కొంచెం దూరంగా తీసుకుని వెళ్లి ఒక బండరాయి మీద ఆశీనుడయ్యాడు. లక్ష్మణుడు క్రింద ఇసుకలో, రాముని పాదాలు చెంత కూర్చున్నాడు.
“తమ్ముడా! నేను చేసింది తప్పంటావా!?”
రాముని నోటంట రామబాణంలా వచ్చిన మాటకు లక్ష్మణుడు ఉలిక్కిపడ్డాడు. సమాధానం చెప్పక మౌనం దాల్చాడు.
“మౌనం వహించక… పలుకు లక్ష్మణా! నాకు కొంచెం మానసిక ధైర్యం కావాలి… చెప్పు.. నేను చేసింది తప్పా?”- రెట్టించాడు రాముడు.
ఏ విషయంలోనైనా రాముని ప్రతి చర్య ధర్మబద్ధమే కాని… ధర్మేతరం కాదు.
“అసలు ఏ విషయం గురించి అన్నగారు చింతిస్తున్నారో….” – అర్ధోక్తిగా ఆగాడు లక్ష్మణుడు.
“లేదని తెలిసి… లేడి కోసం… బంగారు లేడి కోసం వెళ్లి… అనవసరంగా అర్ధాంగి సీతను ఆపదలకు గురిచేసేనేమోనని…” రాముని గొంతులో ఆవేదన.
“మీకు చెప్పేటంతటి వాడిని కానన్నా! విధి చేసిన ప్రతీ పని వెనుక విశిష్టమైన వైనమేదో ఉంటుందనేది మహర్షుల వాక్కు. మీ వలన లోకానికి మేలు జరగవలసిన మహత్తర కార్యం ఏదో ఈ కృత్యం వెనుక నిఘాడంగా దాచి ఉంచాడేమో బ్రహ్మ అనే వాస్తవమును మరువకూడదు కదా! అంతేకాక వదిన గారి కోరికను తీర్చటం మీ విధి కదా అన్నా!”
మృదువుగా, వినయంగా పలికిన తమ్ముని మాటలకు రామునికి కాగల కార్యం గుర్తుకు వచ్చింది. తమ్ముని చేతి సహాయంతో బరువుగా లేచాడు రాముడు.
ఒక్కసారి అన్నదమ్ములు ఇరువురు పరస్పరం ముఖాలు చూసుకుని… మెల్లగా నవ్వుకొని?.. తమ వారి వద్దకు బయలుదేరారు.
ఒకరి చేయి ఒకరు పట్టుకొని, నవ్వు ముఖాలతో వస్తున్న ఆ అన్నదమ్ములను చూసినా కపివీరులకు, తదితరులకు కొండంత ధైర్యం వచ్చింది. సీతమ్మ దొరికినట్లేనని సంబరపడ్డారు.
వాతావరణం తేలికపడింది. సూర్యాస్తమయం ముగిసి చంద్రోదయంలో చల్లని వెన్నెల కాంతులు అంతటా పరుచుకున్నాయి.
అందరూ ఎవరి గుడారాలకు వారు వెళ్లిపోయారు. రాముడు మాత్రం సముద్రపు ఆవలనున్న లంకా నగరం వైపు చూస్తూ ఉండిపోయాడు.
అనంతమైన చంద్రకాంతి ఆ రఘురాముని ఆవేదనను తీర్చలేకపోతున్నది. అనంతమైన చంద్రకాంతి అక్కడ అడవి కాచిన వెన్నెలగా ఉంది.
***
‘పారా హుషార్’ అంటూ రాక్షస వీరులు జాము జాముకు గుర్తుకు చేస్తున్నారు. నిశాచరులకు నిశిలోనే పని. అందరూ అప్రమత్తులై ఉన్నారు. లంకా నగరం ఒక విధమైన గాంభీర్యాన్ని సంతరించుకుంది. జరగరానిదేదో జరుగుతుందని అందరి భయం. రావణుడు సీతను తెచ్చి అశోకవనంలో ఉంచిన దగ్గర నుంచి నిశాచరులకు నిద్ర కరువయింది.
రావణ బ్రహ్మ కఠిన శాసనాలు త్రిజటను కలవరపరుస్తున్నాయి.
త్రిజటకు ఈ మధ్యకాలంలో అన్ని దుశ్శకునాలే దృగ్గోచరమవుతున్నాయి. లంక నాశనం తప్పదా? లలాట లిఖితాన్ని రావణ బ్రహ్మ తప్పించుకోగలడా?… రామునితో లడాయి ఏ తీరాలకు తమను చేరుస్తుందోనని భయం ఆమెను నిలవనీయటం లేదు.
ఆమె ఆవేదనను ఆపుకోలేక సీత ఉన్న ప్రాంతానికి బయలుదేరింది. రావణుడు త్రిజటను సీత సౌకర్యాలను చూడటానికే నియమించాడు.
సీత ఈ మధ్యకాలంలో కాస్త కోలుకుంది… ధైర్యంగా ఉంది. జరుగుతున్న సంఘటనలు ఆమెకు ధైర్యాన్ని కలిగిస్తున్నాయి. జరగబోయే సంఘటనలను జగన్మాత గ్రహించగలిగింది. తన ముందున్న కర్తవ్యాలు ఆమెకు తెలుస్తున్నాయి.
రాముని రాక.. రావణుని ప్రాణం పోక.. తాను చూస్తుంది. జరగరానిది జరిగితే అగ్ని భట్టారకుడు తనకు అండగా ఉంటాడు.
ఆమె ముఖంలో సంతోషంతో కూడిన చిరునవ్వు.
అదే సమయానికి త్రిజట అక్కడికు చేరుకుంది. సీత సమ్మోహనకరమైన నవ్వును, సర్వమంగళకరంగానున్న మోమును చూసింది. చేతులెత్తి నమస్కరించింది. క్రింద కూర్చుంది.
“అమ్మా.. సీతమ్మ తల్లీ! ఈ ముఖాన్ని చూసే మా అన్న రావణ నిన్ను అపహరించి ఉంటాడు… రాక్షసుడు కదమ్మా.. రామునితో పోరాడలేడు కదమ్మా?.. కనుకనే రాక్షసంగా తెచ్చాడమ్మా.. అమ్మా.. ఫర్వాలేదమ్మా.. నీ కష్టాలు తీరిపోతాయమ్మా.. నీ ప్రభువు వస్తాడు.. మమ్మల్ని తరింప చేస్తాడు.. ఏ జన్మలోనో ఏ కొంచెం పుణ్యం చేసుకొని ఉంటాను.. ఎంతో పుణ్యకరమైన నీ సేవా భాగ్యం లభించింది.. ఆ జగన్నాథుని చేతిలో మరణం కన్నా గొప్ప వారం ఇంకొకటి లేదమ్మా..”
త్రిజట మాటలకు సీత హాయిగా నవ్వింది. ఆ నవ్వు తల్లి నవ్వులా ఉంది. వెన్నెల వెలుగులా చల్లగా ఉంది. పసిపాప నవ్వులా హాయిగా ఉంది. జగన్మాత నవ్వులా ధైర్యాన్నిచ్చేదిగా ఉంది.
దగ్గర్లో ఏదో అలికిడి అయింది. రాక్షస స్త్రీలు అటుగా వచ్చారు. త్రిజట గంభీరంగా మారిపోయింది. సీతను అదిరిస్తున్నట్టుగా, బెదిరిస్తున్నట్టుగా కాస్త నటించింది.
త్రిజట పరిస్థితి చూసిన సీతకు నవ్వు మరింతగా వచ్చింది.
సీతకు రోజులు దగ్గర పడుతుండటం వలన చిత్త చాంచల్యం కలిగిందని భ్రమించారు రాక్షస స్త్రీలు. క్రూరంగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
వాతావరణం చల్లగా ఉంది. చంద్రుని కాంతి ఏటవాలుగా చంద్రశిలా వేదికపై పడి పరావర్తనం చెంది సీతను స్పృశించి తరిస్తున్నట్లుగా ఉంది. చంద్రబింబం వంటి సీత ముఖానా చిరునవ్వు మరింత శోభించింది.
త్రిజటకు తొలిసారిగా ఆమె సాధారణ స్త్రీ కాదని, అసాధారణ శక్తి గల అపరశక్తియని అనిపించింది.
ఆమె మనసును గ్రహించిన సీత, “త్రిజటా… ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు…. నా గురించేనా?” అంది
“అవును తల్లీ! నీ వంటి తల్లికి ఇటువంటి దుర్గతి ఆ బ్రహ్మ ఎందుకు కల్పించాడా అనిపిస్తున్నది. మరో విషయం తల్లి.. ఇక్కడకు వచ్చిన కొత్తలో కన్నా ఇప్పుడు ఎంతో ధైర్యంగా కనిపిస్తున్నావు.. మర్మమేమిటో.. మాటల్లో చెప్పలేకున్నాను..”
“త్రిజటా నీకు అలా కనిపిస్తున్నానా? మనసు ఆనందంగా ఉందే… నా రాముడు త్వరలో నన్ను తీసుకువెళతారనే నమ్మకం నాకు కలుగుతున్నదే.. బ్రహ్మరాత అన్నావు చూసావా… విధి చేసే ప్రతి పని వెనుక ఏదో ఒక విశిష్టత ఉంటుంది… ఈ చరాచర సృష్టిలో అర్థం కానిది.. వ్యర్థమైనది ఏదీ లేదు సుమా.. మనం చూసే చూపులోనే ప్రతి భావం దాగి ఉంటుంది… మంచి చెడు భావనలకు మూలం మన మనసే! ఇక్కడకు వచ్చిన కొత్తలో అత్తవారింటికి వెళ్లిన కొత్త కోడలు స్థితి నాది. క్రమ క్రమంగా నీవంటి ఆడపడుచులు వలన కొత్తదనం పోయింది. నీవంటి ఉత్తమ ఆడపడుచులున్న వారెవరైనా క్రొత్త ప్రదేశంలోనైనా హాయిగా కలిసిపోగలరు. అయినా ఆడవాళ్లకు ప్రతి దశలోనూ కొత్త వాతావరణం తప్పదు కదా! బాలికగా, వివాహితగా, తల్లిగా, భార్యగా ఎప్పుడూ కొత్త కొత్త దశలను చూస్తూనే ఉంటుంది. కాన్పు కాన్పుకు క్రొత్తదనమే….”
ఆమె ముఖంలో సిగ్గు లీలామాత్రంగా ద్యోతకమవటం త్రిజట చూసింది. ఆమె మాటలు మృదువుగా, మధురంగా ఉన్నాయి. ఎంతసేపు విన్నా ఇంకా ఇంకా వినాలన్నట్లుగా ఉన్నాయి.
త్రిజటలో ఓ చిన్న సందేహం కలిగింది. ఎందుకు కలిగిందో తెలియదు. మనసు నిగ్రహించుకోలేక సీతను అడిగింది.
“తల్లీ ఇలా అడుగుతున్నానని అన్యథా భావించకమ్మా.. ఒకవేళ రాముడు యుద్ధంలో ఓడిపోయి.. ఆ.. అలా జరగదు.. కానీ..”. ఆమె మరి మాట్లాడలేక పోయింది.
“వెర్రి త్రిజటా! నీ వెర్రితనం పోనిచ్చుకున్నావు కాదు. నేను ఇంతకాలం నిరీక్షించినది ఇందుకా? నా రాముని పరాక్రమం నాకు తెలియదా? ప్రతి భార్య భర్తను గురించి ఇలాగే చెబుతుంది అనుకునేవు… కాదు సుమా.. కలకాదు సుమా… నా రాముని శూరత్వం నాకు తెలుసు… నీ రావణుని అసహ్యత కూడా నాకు తెలుసు.. శివధనుర్భంగ సమయంలో కళ్ళారా చూసినవి ఈ కనులు.. కమనీయమైన కళ్యాణరాముని శూరత్వం కనులు మూసుకున్న కనుమరుగు కాదు సుమా! పోనీ నీవు అనుకున్నట్టే జరిగితే కథ ఇక్కడితో ఆగిపోతుంది”- ఆమె మౌనంగా ఉండి పోయింది.
కథ ఇక్కడితో ఆగిపోవడం అంటే ఏమిటో త్రిజటకు అర్థం కాలేదు. అర్థం చేసుకోవలసిన అవసరం కూడా ఆమెకు లేదు.
వారి మధ్య కొన్ని క్షణాలు మౌనం! రాముని పరాక్రమ పౌరుషాలను గూర్చి సీత చెబుతుంటే… త్రిజట నోరు మూయడం కూడా మర్చిపోయింది.
***
రాముడు ధైర్యంగా లేచి నిలబడ్డాడు. కపివీరులను పిలిచాడు. లక్ష్మణుడు, జాంబవంతుడు, విభీషణాదులు భయభక్తులతో చేతులు కట్టుకొని రాముడు ఏమి చెబుతాడా అని ఎదురు చూస్తున్నారు. రామునికి తటాలున హనుమ గుర్తుకు వచ్చాడు.
హనుమను పిలిచాడు. హనుమ వినయంగా అతని ముందు వంగి నిలుచున్నాడు.
“హనుమా! ఈ కార్యభారం నీదే సుమా! నా సీతను వెతికే భారాన్ని మరువకుమా హనుమా! ఈ మొత్తం కార్యానికి నీవే రథసారధివి. నీ బలం, పరాక్రమం నాకు తెలుసు. మేరువు కూడా నీ ముందు భీరువే!.. కాగల కార్యం, రాగల విజయం … రెండూ నీ కార్యచరణపైనే ఆధారపడి ఉన్నాయి. కపివీరులారా.. లక్ష్మణా.. విభీషణా.. జాంబవంతా.. హనుమను కార్యవీరునిగా తీర్చిదిద్దండి” అని చెప్పి ముందుకేగిపోయాడు.
అందరూ రాముని అభీష్టం నెరవేర్చటానికి ఉపక్రమించారు.
హనుమ కార్యశూరుడైనాడు… లంక నగరాన్ని చూసాడు… కనుచూపుమేరా కడలి అలలు వెనుక లీలగా గోచరమవుతున్న ఆ దిశగా తాను మాత్రమే వెళ్ళగలననే నమ్మకం కలిగింది.
కార్యచరణకు కాలు కదిపాడు.
***
“రావణ అన్న ఈ రోజు మీతో తాడో పేడో తేల్చుకోవటానికి సిద్ధపడుతున్నాడని చారులు చెప్పారు తల్లీ! కింకర్తవ్యం?”- త్రిజట సీతను ఆదుర్దాగా ప్రశ్నించింది.
“రావణుని రానీ చూద్దాం. మాది జన్మజన్మల వైరం.. శాపం. చెప్పిన నీకు అర్థం కాదు. అర్థమయ్యే రీతిలో చెప్పనవసరం లేదు కూడా.. ఏం చేస్తాడు? ఎప్పటిలాగానే భయపెడతాడు. బొబ్లలు పెడతాడు.. భయంకరంగా దూషిస్తాడు. భయమెందుకు ఆ మాత్రం దానికి.. అంతకుమించి ఒక్క అడుగు కూడా వేయలేడు”
సీత ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాటలకు ఆశ్చర్యపోయింది త్రిజట. “అది కాదమ్మా జరగరానిది జరిగితే!?” – త్రిజట సందేహం.
“ఏదో జరుగుతుందని ఎందుకు భయపడాలి? భయపడుతూ బ్రతకటం అవసరమా? ఇవాళ రేపు ఏమైనా జరగొచ్చు… ఏమీ జరగకపోవచ్చు. సమస్యలు వచ్చినప్పుడే వ్యక్తిత్వం విలువ తెలుస్తుంది. మా నాన్న నన్ను వీరవనితగా పెంచాడు కానీ భీరువుగా కాదు. శివ ధనుస్సును అవలీలగా ఆవలకు నెట్టిన దానను నేను. మానవ జన్మ ఎత్తిన తర్వాత సుఖాలకు కాదు కష్టాలకే ఎక్కువగా ఆనందపడాలి. భవిష్యత్తులో ఇంతకన్నా ఎక్కువ కష్టాలే వస్తాయేమో ఎవరు చెప్పగలరు? త్రిజటా నీకో విషయం చెప్పనా? కీర్తి అనేది కష్టాల కడలిని దాటిన వారికి.. సమస్యలను పరిష్కరించుకుంటూ సమర జీవితాన్ని కొనసాగించిన వారికి మాత్రమే లభ్యమవుతుంది. నా రాముడు దేవుడు అంటారు… నిజమే! నాకు దేవుడు. కానీ మానవమాత్రునిగానే నేను అతనిని చూస్తాను. అలా చూస్తేనే అతను బంగారం వంటి వ్యక్తిత్వం నాకు నచ్చుతుంది. ఆపదలు వచ్చాయని ప్రాణాలు తీసుకుంటామా చెప్పు. బ్రహ్మ సృష్టికి అర్థం పరమార్థం ఇది కాదు కదా! ఆలోచించు త్రిజటా.. ప్రతి జీవికి మరణం అనివార్యం. కానీ.. మరణమే శరణ్యం అనుకోవడం అవివేకం.”
దూరంగా జయ జయ ధ్వనులు రావణుని ఆగమన సూచికగా వినబడుతున్నాయి.
త్రిజట ఆలోచిస్తూ దూరంగా తప్పుకుంది. గాలి మంద్రంగా వీస్తున్నది… అంతటా నిశ్శబ్దం… ఎవరూ వస్తున్న అలికి లేదు. త్రిజట ఒంటరిగా ఒక తిన్నెపై కూర్చొని ఆలోచిస్తున్నది. సీత చెప్పినది ఎంత సత్యం…!?
తరాలు యుగాలు మారినా.. ఇవి శిలాక్షరాలుగా మిగిలిపోతాయి. సీత గొప్ప ద్రష్ట. ఉత్తమ ఇల్లాలు… దైవాంశ.. అయినా కష్టాలను దుఃఖాలను సమంగా చూస్తూ సంతోషాలను త్యాగం చేయటంలోనూ ఇంతటి నిరాశమయ వాతావరణం లోను జీవితేచ్ఛను కోల్పోకుండా తన భర్త మీద ఉన్న నమ్మకంతో బ్రతుకుతున్న సీత ధైర్యాన్ని, విశ్లేషించిన జీవిత సత్యాలను మరోసారి మననం చేసుకోసాగింది.
కొమ్మల్లో ఏదో అలికిడి…. శత్రువులెవరో కోటలో ప్రవేశించారని మనసులో అలజడి… వినీవినపడని సవ్వడి… ఎక్కడినుంచి… ఎవరి నుంచి… ఆమె మనసు ఆందోళన భయాలతో నిండిపోయింది. లంకకు ముప్పు రాబోతున్నది.. రావణునికి మరణం ఆసన్నమైంది..!? రావణుడు లేని లంక తల్లిదండ్రులు లేని అనాథ బాలిక. ఆమె ఆవేదనగా తన భవనం వైపుగా అడుగులు వేసింది. కొమ్మల్లో మరలా అలజడి.. అలికిడి.. ఎవరు…!? కొమ్మల వైపు దీర్ఘంగా చూసింది… నిశితంగా పరీక్షించింది… అంతటా నిశ్శబ్దం.. త్రిజట వడివడిగా కదిలిపోయింది.
కానీ… మనసులోని వేదనను ప్రక్కన పెట్టి మరికొంత నిశితంగా గమనించి ఉంటే అక్కడో చిన్న ఆకారం.. కోతిలాంటి ఆకారం.. కనిపించి ఉండేది.
భవిష్యత్తును నిర్దేశించే చాలా చాలా విషయాలు.. చిన్నచిన్న నిర్లక్ష్యాల వల్లనే గణనకు అందవు… నాశనాలు తప్పవు… ఇది చరిత్ర చెప్పిన సత్యం… దీనికి ఎవరు బాధ్యులు!?