[dropcap]చ[/dropcap]లేస్తుందేమో..?
తలదించేసుకుని వెలుగింటి సూరయ్య
పడమటి వీథిలోని
తన కొంపకు పరిగెత్తి పారిపోయాడు
ఎప్పుడెప్పుడా అని
ఎదురుచూస్తున్నట్లు ఆకాశం
కళ్ళను పొడిచేసే చీకటిరంగును
పద్ధతిగా పులిమేయడం మొదలెట్టేసింది
మిద్దెనెక్కేసిన చుక్కలన్నీ
‘సందడంతా సద్దుమణిగింది, ఏమా?’ అని
కిందికి నిక్కి నిక్కి చూసాయి
కళ్లకేమీ కనపడక బిక్కమొగమేసాయి
పగలంతా పాతిపెట్టేసిన చల్లదనాన్ని
పదిలంగా పైకితీసిన గాలి
చడీచప్పడు లేకుండా చుట్టూరా చల్లేసి
గజగజల వణుకుళ్ళకు తెరలేపింది
చిమ్మట్ల బృందగానానికి
తీతువు గొంతుకలపడం వినబడుతోంది
ఎక్కడో ఓ వీథికుక్క అపుడపుడూ ‘భౌ’మంటూ
తన ఉనికి చాటుకోవడం తెలుస్తోంది
ఒంటరి ప్రాణాలన్నీ
గొంగళ్ళ వెచ్చదనాన్ని కప్పుకుంటుంటే
జంటకట్టిన జీవితాలన్నీ
కౌగిళ్ళ కమ్మదనాన్ని కమ్ముకుంటున్నాయి
పగలంతా పనిలో హూనం అయిన ఒళ్ళన్నీ
ఒళ్ళెరక్కుండా ఏదో ఓ పక్కన పడిపోయాయి
రాతిరికోసం ఘడియలు లెక్కేసుకున్న తనువులన్నీ
తమకంగా పక్కమీద తడుముకుంటున్నాయి
గడియారం పడక గదిలో, కాలం
ఆరునుండి పన్నెండుదాకా పైపైకి పాకేస్తూ
అక్కడనుండి కిందికి దొర్లి ఆరును చేరే,
అలసిపోని అలవాటైన పనిలో నిమగ్నమై ఉంది
రాతిరమ్మ పక్కచేరి వెచ్చగా
ఒళ్ళు మరిచి నిద్రిస్తున్న ఆ వెలుగింటి సూరయ్యకు
వేకువ గంట కొట్టి మెలకువ తెచ్చేందుకు
సద్దులేకుండా ఓ కుట్ర, సజావుగా సాగుతోంది