Site icon Sanchika

శీతాకాలపు వాక్యం

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘శీతాకాలపు వాక్యం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]శీ[/dropcap]తాకాలం వణికిస్తున్నది
అంతా అదిరిపోతున్నది
అటు భానుడు సెలవు తీసుకోగానే
ఇటు శివతాండవం చేస్తున్నది

తలుపులూ కిటికీలూ
కాల్రెక్కలు ముడుచుకుని
ముసుగుతన్ని మూసుకున్నాయి

పైన గిరగిరా తిరిగే పంకాలు
మూగనోము పట్టాయి

రాత్రంతా కురిసే మంచు వర్షానికి
చెట్టూ చేమా అన్నీ
తెల్లటి దుప్పటి కప్పుకున్నాయి

రోడ్లన్నీ కర్ఫ్యూ పెట్టినట్టు
బిక్క మొఖాలేసుకున్నాయి

వీధుల్లో చలిమంటల
చిరునామా మాసిపోయింది

కాఫీ మగ్గో పెగ్గో హగ్గో
కొంత వూరటనిస్తున్నాయి

రారాజులా రాత్రంతా వణికించిన చలి
ఉషోదయానికి ఉసూరుమంటుంది

నీలిరంగు కొలను లోంచి విచ్చుకున్నట్టు
తూర్పున భానుడుదయిస్తాడు

రాత్రంతా లోకం చలి దుప్పట్లో
ముసుగుతన్ని మూలిగింది

కానీ నా మనసేమో మెలకువగానే వుంది
లోపల కొత్త భావాల విత్తనాలు
మెలితిరుగుతూనే వున్నాయి

ఏవో నాలుగు వాక్యాలు
రూపుదిద్దుకుంటూనే వున్నాయి

Exit mobile version