Site icon Sanchika

శీతాకాలం కబుర్లు

[box type=’note’ fontsize=’16’] వణికిస్తున్న చలిలో శీతాకాలం కబుర్లు చెబుతున్నారు కొల్లూరి సోమ శంకర్. [/box]

[dropcap]గ[/dropcap]త కొద్ది రోజులుగా చలి విపరీతంగా పెరిగిపోయింది. టైప్ చేయడానికి కోబోర్డ్ పైన వేళ్ళు పెట్టాలన్నా కూడా కష్టంగా ఉంది. చలికి వేళ్ళు వణుకుతున్నాయి. నిన్నటి నుండీ మరీ తీవ్రంగా ఉంటోంది చలి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలులు ఇందుకు కారణమంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఈ చలికి మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్ కూడా మానేసి ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటున్నాను. చర్మం పొడిబారిపోయి శరీరం బిగుతైపోతోంది, సాధారణం కన్నా ఎక్కువగా వణుకొస్తోంది ఈసారి. బైక్ మీద ఎక్కడికైనా వెళ్ళాలంటే బాబోయ్ అనిపిస్తోంది.

పొద్దున్న చలికి వణుకుతుంటే, మా అమ్మాయి “నాన్నా, నువ్వు ముసలాడివైపోతున్నావ్” అంది. ఎప్పుడో చదివిన ఓ విషయం గుర్తొచ్చింది – ఆంగ్లో శాక్సన్ సంస్కృతిలో మనుషుల వయస్సులను శీతాకాలాలను బట్టి నిర్ణయించేవారట. ఒక వ్యక్తి జీవితంలో నాలుగు శీతాకాలాలు జరిగితే తన వయసు నాలుగు శీతాకాలాలనేవారట! మరి నా వయసెన్ని శీతాకాలాలో?

లాప్‌టాప్‌లో హిందీ పాటలు ఆన్ చేశాను. జంగ్లీ సినిమాలో “చాహే కోయీ ముఝె జంగ్లీ కహే” పాట వస్తోంది. ఆ పాటకి షమ్మీకపూర్ వేసిన డాన్స్ మనసులో కదలాడింది. అంతటి మంచుముద్దల మీద అలా ఎలా గంతులు వేయగలిగాడా అనిపించింది. శ్రీనగర్‌లో గత కొద్ది రోజులుగా ఉష్ణోగర -4.2 డిగ్రీల సమీపంలో ఉంటోందట. ‘చలిపులి’ పద ప్రయోగం ఇక్కడ సరైనదేమో… ఇంకో రెండు మూడు పాటలు విని పాటలు ఆపాను.

కశ్మీర్ వంటి కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటుంది. అదే దక్షిణ భారత దేశంలోనైతే 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్‌ మధ్య మారుతూ ఉంటాయి. ఈసారి ఎక్కువ రోజులు ఉష్ణోగ్రత 12 డిగ్రీలకు పడిపోయింది. రష్యాలోని ఉత్తర సైబీరియాలోని వెర్కోయానస్క్‌లో ఉష్ణోగ్రతలు -67.8 డిగ్రీల వరకు పడిపోతాయి. అక్కడ జీవనం ఎంత దుర్భరంగా ఉంటుందో. అలాగే సియాచిన్ వద్ద మన సైనికులకి ఎంత కష్టంగా ఉంటుందో కూడా వింటుంటాం. ఎందుకో హఠాత్తుగా పాత ‘హకీకత్’ సినిమా గుర్తొచ్చింది. విపరీతమైన మంచులో మన సైనికులు పడే కష్టాలను ఆ సినిమాలో చూడవచ్చు. వాళ్ళు అనుభవించే చలి ముందు మన దగ్గర చలి ఏపాటిది?

ఘన పదార్థాలు తినడం తగ్గించి వేడి వేడి టీలు, లెమన్ టీలు, గోరు వెచ్చటి నీళ్ళు తాగడం ఎక్కువయింది. ఎలాగొలా పనిచేసుకుందామని, లెమన్ టీ సిప్ చేస్తూ మెల్లిగా ఆర్టికల్ టైప్ చేస్తున్నాను. పక్కన దినపత్రిక జిల్లా ఎడిషన్‌లో ఓ పేజీలో చలికాచుకుంటున్న గ్రామస్థుల ఫోటో ఒకటి కనబడింది. అది చూడగానే నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది.

***

అప్పట్లో హైదరాబాదులో డిసెంబరులో కన్నా జనవరిలోనే చలి బాగా ఎక్కువుండేది. కొత్త ఏడాది ప్రవేశించి ఓ నాలుగైదు రోజులయ్యేదో లేదో సంక్రాంతి హడావిడి మొదలయ్యేది. ఇంటిముందు కళ్ళాపి కోసం గేదే పేడ, ముగ్గులో గొబ్బెమ్మల కోసం ఆవు పేడ కోసం పొద్దున్నే అక్కతో బయల్దేరి మాకు పాలు పోసే గోపీ వాళ్ళింటికి నడుస్తూ వెళ్ళేవాణ్ణి. ఓ చిన్న ప్లాస్టిక్ బకెట్‌లో గేదె పేడ, మరో చిన్న డబ్బాలో ఆవుపేడ తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఓ ఇరవై నిమిషాలు పట్టేదేమో… తిరిగి వస్తుంటే చిన్నగా మంచు కురిసేది… చెవుల్లో గుయ్…మంటు సన్నగా చలిగాలి. మఫ్లర్ మడిచి కట్టుకున్నా అది సరిపడేది కాదు. రోడ్ల మధ్యలో చెక్కముక్కలు, కర్ర పుల్లలు వేసి చలిమంట వేసేవారు. కాసేపు అక్కడ ఆగి చలి కాచుకునేవాళ్ళం.

మేం నడిచి వచ్చేలోపు మా పాలబ్బాయి సైకిల్ మీద వచ్చి పాలు పోసి వెళ్ళిపోయేవాడు. అమ్మ పాలు వెచ్చబెట్టి మమ్మల్ని తాగడానికి పిలిచేలోపు మా అక్క, అత్తతో కలిసి కళ్ళాపి జల్లి, ముగ్గులకి అంతా సిద్ధం చేసుకునేది. మా అత్త అంటే సొంత మేనత్త కాదు, పక్కింటి సామ్రాజ్యంగారి అమ్మాయి. మా చిన్నప్పుడు ఇరుగుపొరుగువారినందరిని వరసలు పెట్టి పిలిచేవాళ్ళం. కళ్ళాపి ఆరడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ లోపు మేం లోపలికొచ్చి పాలు తాగేవాళ్ళం. అత్త కూడా లోపలికి వెళ్ళొచ్చేది. తర్వాత ముగ్గువేసి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టే పని మొదలయ్యేది. ఈలోపు బేగంపేట స్టేషన్ పట్టాల పక్కన దొరికే గుమ్మడిపూలు కోసుకురమ్మనేవారు. మహా సరదాగా పరిగెత్తేవాడిని. పండగకి రెండు మూడు రోజుల ముందు గొబ్బెమ్మలకి బంతిపూలు, చామంతి పూలు, డిసెంబరు పూలు కూడా పెడతారు. అప్పుడు చలి గురించి పట్టించుకునేవాళ్లమే కాదు. పెద్దవాళ్ళే లోపలికి లాగుతూండేవాళ్ళు జలుబు చేస్తుందంటూ!

పండగయ్యాక స్కూల్ కెళ్లడానికి రడీ అయ్యేటప్పుడు చూడాలి చలి గోల! చన్నీటి స్నానం చెయ్యాలంటే వణుకు… అప్పటికింకా కిరోసిన్ స్టవ్‌లే… కిరోసిన్ ఎక్కువగా దొరికేది కాదని వేణ్ణీళ్ళు ఎప్పుడో గాని పెట్టేది కాదు అమ్మ. చలికి వణుకుతుంటే చర్మం పగలకోడదని కొబ్బరి నూనె రాయాలని చూసేది.. కొబ్బరి నూనె గడ్డ కట్టుకుపోయి, బయటకి వచ్చేది కాదు. నూనె బాటిల్‌ని చేతులతో రుద్దీ రుద్దీ వెచ్చజేస్తే ఒక్కో చుక్కా నూనె బయటకు వచ్చేది. స్టవ్ మీద అన్నమో, పప్పో ఉడుకుతూ ఉండేది. అమ్మ కొబ్బరి నూనె సీసాని సెగ తగిలేలా జాగ్రత్తగా నిప్పు దగ్గర ఉంచేది. కాసేపటికి నూనె బాగానే వచ్చేది.

కాళ్ళకీ, చేతులకీ, మొహానికి నూనె పట్టించుకుని స్కూలుకి బయల్దేరేవాళ్ళం. మా స్కూల్ అమీర్‌పేటలో ఉండేది.. బేగంపేట నుండీ అమీర్‌పేటకి నడక. మా స్కూల్ బ్యాగ్ అమ్మ మోసుకుంటూ వస్తుంటే, మేం సిగరెట్ ఆట ఆడేవాళ్ళం! అరచేతులు మడిచి నోటికి అడ్డంగా పెట్టుకుని ఉఫ్‌మని ఊదితే… ఆ చలికి నోట్లోంచి ఆవిరి సిగరెట్ పొగలా బయటకి వచ్చేది. దారంతా ఈ ఆటే ఆడుతూ స్కూలు చేరేవాళ్ళం. మమ్మల్ని దింపేసి ఇంటికెళ్ళే ముందు – ఆటల్లో దెబ్బలు కొట్టుకోవద్దు అని అమ్మ జాగ్రత్తలు చెప్పేది… చలికాలంలో గాయాలు సులువుగా మానవని భయపడేది.

ఒకరోజు మధ్యాహ్నం స్కూల్లో ఆడుతూ కాలు జారి పడ్డాను. కంకర రాయి తగిలి కాలు బాగా గీసుకుపోయింది. రక్తం కారుతుంటే మా తెలుగు టీచర్ కాలు కడిగి, టించర్ వేస్తే… మంట… మంట అంటూ ఒకటే గోల చేశాను. అమ్మ చెప్పినట్టు ఆ దెబ్బ తగ్గడానికి చాలా కాలం పట్టింది.

అదేంటోగాని సంక్రాంతి అయిపోయాకా, చలి ఇంకా ఎక్కువయ్యేది… శివరాత్రి వస్తే… చలి శివ శివా అని పారిపోతుందని అమ్మ చెప్తే… శివరాత్రి కోసం ఎదురుచూసేవాళ్ళం… పరీక్షల సమయం కావడంతో… చదువు మీద దృష్టి ఎక్కువై చలికాలం ఎప్పుడు వెళ్ళిపోయింది కూడా ఒక్కోసారి తెలిసేది కాదు!

***

నా సెల్ మోగడంతో వర్తమానంలోకి వచ్చాను. ఇంటర్‌నెట్ సర్వీస్ వాళ్ళు చేశారు. ఇంతకుముందు నెట్ కనెక్షన్ పోయిందని కంప్లయింట్ ఇచ్చాను. బాగు చేశారట… వస్తోంది, చెక్ చేసుకోండని చెప్పాడు టెక్నిషియన్.

ఈ రోజు స్కూలుకి ఎందుకో సెలవివ్వడంతో, పిల్లలు వాళ్ళ గదిలో స్వెటర్లు వేసుకుని, మంకీ క్యాప్‍లు పెట్టుకుని కూర్చుని చదువుకుంటున్నారు. పిల్లలు రూమ్ వార్మర్ కొనమని గొడవ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళింట్లో ఉందట. బోలెడు కరెంటు కాల్తుంది వద్దని మేం వాయిదా వేస్తున్నాం.

“ఇంకా ఎన్నాళ్ళీ చలి పాట్లు మనకి?” అని అడుగుతూ మా ఆవిడ వంటింట్లోంచి బయటకి వచ్చింది.

పరాకుగా ఉన్నానేమో, నాకు వేరేలా వినబడింది.

“చలి పాటలా? ఉన్నాయి….” అన్నాను.

“పాట్లు సారూ… పాటలు కాదూ…” అంది టీ కప్పులు బల్ల మీద పెట్టి చేతులు రుద్దుకుంటూ.

“కనీసం ఇంకో వారం పాటు తప్పవు ఈ తిప్పలు” అన్నాను, లాప్‌టాప్ పక్కన బెట్టి.

“Nothing burns like the cold అన్న George R.R. Martin మాటలు గుర్తొసున్నాయి” చెప్పాను.

“Blow, blow, thou winter wind, thou art not so unkind as man’s ingratitude అని షేక్‌స్పియర్ చెప్పాడు గుర్తుందా?” అంది.

“గుర్తుంది” చెప్పాను.

“ఇందాక చలిపాటలు అన్నారుగా…” అంటూ “उफ़ कितनी ठण्डी है ये रुत ” పాడింది.

“सुलग़े है तनहाई मेरी सन सन सन जलता है बदन” నేను కొనసాగించాను.

“काँपे है अंगड़ाई मेरी …” తీన్ దేవియా అనే సినిమా పాట పాడుకున్నాం.

“ठंडी हवाएं, लहरा के आयें  रुत है जवां तुमको यहाँ, कैसे बुलाएँ ठंडी हवाएं…” నౌజవాన్ సినిమా పాట పాడింది తను.

“ठण्डी हवा ये चाँदनी सुहानी ऐ मेरे दिल सुना कोई कहानी लम्बी सी एक डगर है ज़िंदगानी ऐ मेरे दिल सुना कोई कहानी” కిశోర్ కుమార్ పాట నేనందుకున్నాను.

“जब चली ठण्डी हवा, जब उठी काली घटा मुझको ऐ जान-ए-वफ़ा तुम याद आए ” దో బదన్ సినిమా పాట పాడింది.

“ये हवा, ये हवा, ये हवा ये फिजा, ये फिजा, ये फिजा है उदास जैसे मेरा दिल, मेरा दिल, मेरा दिल आ भी जा, आ भी जा, आ भी जा ” గుమ్రాహ్ సినిమాలో పాట నా నోట పలికింది.

“చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసూ” తను పాడింది.

“చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది… జుంబారే జుంబారే…” క్షణక్షణం సినిమా పాట పాడాను.

తనూ ఏదో పాడాలని అనుకుంది కాని… ఆగిపోయింది.

“మన సినిమాలో వానపాటలు బోలెడు; చలిపాటలు మాత్రం బాగా తక్కువ” అన్నాను.

“చలి అనే పదం వాడుతూ ఎన్నో పాటలున్నా పల్లవిలో ఆ పదమున్న పాటలు తక్కువే” అంది.

“అవును… ‘చలి పులి పంజా విసిరితే..’ అని పాట మధ్యలో వస్తుంది చూడాలని ఉంది సినిమాలో” అన్నాను.

ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.

మా బిల్డింగ్ వాచ్‌మన్ వచ్చి ఏదో కొరియర్ వచ్చిందంటూ ఒక కవర్ చేతికిచ్చి వెళ్ళిపోయాడు.

చలిపులి పంజా అని వ్రాసిన వార్తని పేపర్‌లో చదువుతూ, “మనకి ఎంతో కొంత నయం.. పాపం నిరాశ్రయులు, గుడిసెల్లో ఉండేవారు, ఫుట్‌పాత్‌ల మీద పడుకునేవాళ్ళ పరిస్థితి తలచుకుంటే బాధగా ఉంది” అంది.

“అవును, Jana Stanfield అంటారు – ‘I cannot do all the good that the world needs. But the world needs all the good that I can do’ అని. నేను అదే చేశాను. నేను వాలంటీర్‌గా వెళ్ళే సేవా సంస్థ వాళ్ళు నిర్భాగ్యులకీ, నిరాశ్రయులకీ పంచడానికి రగ్గులు కొన్నారు. కొంత డబ్బు నేనూ ఇచ్చాను. దానికి రసీదు పంపారు ఇదిగో!” అంటూ కొరియర్‌లో వచ్చిన కాగితం చూపించాను.

“పోన్లెండి కనీసం కొందరైనా ఇకనుంచి వెచ్చగా పడుకుంటారు” అంది.

ఉన్నట్టుండి మా గది వెచ్చబడినట్టు అనిపించింది మాకు. లాప్‌టాప్‌లో పాటలు ఆన్ చేశాను. ధుంధ్ సినిమాలో సాహిర్ లూధియాన్వి రాసిన పాట వస్తోంది. संसार की हर शै का इतना ही फ़साना  है  इक धुंध से आना है, इक धुंध में जाना है  …. మౌనంగా ఆస్వాదిస్తూ ఉండిపోయాను.

Exit mobile version