(బటర్‌ఫ్లై ఎఫెక్ట్:
(“ఒక సీతాకోకచిలుక అమెజాన్ అడవుల్లో తన రెక్కలు టపటప లాడిస్తే కొన్నాళ్ళకి యూరప్లో తుఫాను వస్తుంది…” ఇలా అన్నాడు వాతావరణ శాస్త్ర వేత్త ఎడ్వర్డ్ లోరెంజ్.
ప్రారంభ పరిస్థితులలో ఒక చిన్న మార్పు చిట్టచివరి ఫలితాలపై చాలా పెద్ద పరిణామాల్ని కలిగించటం అనేది బటర్‌ఫ్లై ఎఫెక్ట్ లేక సీతాకోకచిలుక ప్రభావం అని చెప్పుకోవచ్చు. ఎడ్వర్డ్ లోరెంజ్ అనే వాతావరణ శాస్త్రజ్ఞుడు మొదటిసారి ఈ పదాన్ని వాడారు. వాతావరణ శాస్త్రంలో ప్రారంభదశలో ఉన్న చిన్న లెక్కలు కూడా మార్పుకి గురయితే చివరిలో వాతావరణ మార్పులు ఎంతో పెద్దగా మారిన ఫలితాలు వస్తాయని ఆయన గ్రహించాడు. దీని గురించి ఆయన తేలికగా అందరికీ అర్థం కావడానికి అమెజాన్ అడవుల్లో సీతాకోకచిలుక రెక్కలు విప్పితే యూరప్‌లో భయంకరమైన టోర్నడో తుఫాన్ వస్తుందని చెప్పేవాడు. ఈ రకంగా ఈ సిద్ధాంతం ప్రాచుర్యంలోకి వచ్చింది.. సైన్స్ ఫిక్షన్ వ్యాపార శాస్త్రంలో(business management) స్టాక్ మార్కెట్లు ఎడ్వర్టైజ్మెంట్ రంగంలో ఈ సిద్ధాంతానికి చాలా ఉపయోగాలు కనిపిస్తాయి. Quantumభౌతిక శాస్త్రంలో కూడా ఈ సిద్ధాంతానికి ప్రయోజనాలు కనిపిస్తాయి. అన్ని చెడ్డ ఫలితాలే కాదు,ఒక చిన్న మార్పుతో వ్యాపార రంగంలో పెనుమార్పులు తెచ్చి మిలియన్ల లాభం సంపాదించవచ్చు.ఇది కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో చూస్తాం.
1952లో రాసిన రే బ్రాడ్ బరీ ఒక కథలో కాల ప్రయాణంలో వెనక్కి వెళ్లి సీతాకోకచిలుక ప్రభావం వల్ల చరిత్ర లో మార్పులు జరిగితే చరిత్రలో ఎలా పూర్తిగా విరుద్ధం అయిన మార్పులు వస్తాయో రాసిన కథ “ఎ డిస్టెన్స్ థండర్” చెప్పుకోవాల్సింది. 1952లో జాన్ స్టీన్ బెక్ “ఈస్ట్ అఫ్ ఈడెన్” అనే నవలలో కూడా ఈ విషయం చూడొచ్చు. టెర్మినేటర్, కామికజీ బటర్ఫ్లైస్, ది సింప్సన్స్, మై బటర్‌ఫ్లై అనే టివీ ఎపిసోడ్,ది ఎమేజింగ్ వరల్డ్ ఆఫ్ గన్ బాల్ ఇలాంటి సినిమాలలో బటర్‌ఫ్లై ఎఫెక్ట్ గురించిన ఇతివృత్తాలు మనం గమనించవచ్చు. ముఖ్యంగా కాల ప్రయాణంలో వెనక్కి వెళ్లి మార్పులు చేస్తే, కాలంతో ఆటలాడితే చిన్న చిన్న మార్పులు కూడా చరిత్రని మార్చేస్తాయి అనే సిద్ధాంతంతో రాసిన కథలు ఎన్నో ఉన్నాయి. దానికి ఉదాహరణ గానే నేను ఈ సీతాకోక చిలుక అనే కథ వ్రాశాను. సైన్స్ ఫిక్షన్ లో ప్రతి ఒక అంశంపై ఒక కథ రాయాలనే నా ఆశయానికి ఈ కథ ఒక ఉదాహరణ.
ఎక్కడో వూహాన్ చైనాలో ఒక వ్యక్తి గబ్బిలంతో చేసిన సూప్ తింటే, జంతు వైరస్ మనిషిలో దూకి మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే, చరిత్రనే మారుస్తోంది. ఇంతకంటే బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌కి ఉదాహరణ ఏం కావాలి.
భారతీయ సినిమాలు “దశావతారం”, “నాన్నకు ప్రేమతో “అనే చిత్రాలలో కూడా ఈ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ ప్రస్తావన ప్రధానంగా ఉంది.
నా ఈ కథ ఈ సిద్ధాంతం ప్రకారం సృష్టించినది.)
~
సాయంత్రం ఏడు గంటలకే ఈరోజు ఆకాశంలో నల్లబడి అర్ధరాత్రిలా తయారైంది. చల్లటి గాలి వేగంగా వీస్తూ పెద్దపెద్ద శబ్దాలతో చినుకులు పడసాగాయి.
రాజా బహదూర్ విశ్వేశ్వరరావు తల ఎత్తి చూశాడు. అతని కొత్త మెర్సిడెస్ కారు దూరంగా ఆగివుంది. రెయిన్ కోట్ లో నుంచి కొద్దిగా నీటి తుంపరలు కారుతున్నాయి.
“కాల యంత్రం ఇన్కార్పొరేటెడ్”
“భూతకాలంలో మీరు కోరుకున్న సంవత్సరానికి ఒక్కరోజు ప్రయాణం!
ప్రభుత్వ అనుమతి లైసెన్స్ నెంబర్ TM009.”
చలిగాలిలో వర్షానికి బోర్డు మీద అక్షరాలు అస్పష్టంగా ఉండి ఒక్కసారి మెరిసిన మెరుపులో తళుక్కుమని కనిపించాయి.
ఆఫీసులో పెద్ద బల్ల వెనుక బుంగ మీసాలు టోపీతో ఉన్న వ్యక్తి ముఖాన చిరునవ్వు లేదు. మిలిటరీ మనిషిలా ఉన్నాడు .
ఆఫీస్ గది నిండా వైర్లూ, ఏవేవో కంప్యూటర్ మానిటర్లు, రంగు రంగుల క్యాలెండర్లు అనేక సంవత్సరాలవీ చిత్రించిన పటాలూ, ఒక పక్క సూర్యుడు ఉదయిస్తున్న బొమ్మ, మరొకపక్క చంద్రుడు నక్షత్రాలు మెరుస్తున్న చిత్రపటం అంతా గజిబిజిగా ఉంది. గాలిలో కూడా ఏదో ఎప్పుడూ బాల్యంలో చూసిన వాసన లాంటిది వ్యాపించి ఉంది.
“మీకు ఏం సహాయం చేయగలను?”
“1870 జూన్ 15వ తారీకు కు వెళ్లాలి.” కాగితం తీసి వివరాలు చెప్పాడు. లాటిట్యూడ్ 16.3 లాంగిట్యూడ్ 81 44 . దక్షిణ భారతదేశం. ప్రస్తుతం విజయవాడకి తూర్పున వున్న ఒక ఊరు. పేరు గంగవరం.”
“200 సంవత్సరాలు. అంతే కదా! తేలిక. ఎన్ని గంటలు ఉంటారు? ఇది కేవలం పర్యాటక ప్రయాణమే!చూసి రావాలి! అంతే. రెండు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఎనిమిది గంటలు ఉండి రావటానికి INR10 లక్షల రూపాయలు అవుతుంది.”
రాజా విశ్వేశ్వర రావు బహదూర్ అన్నాడు. “చదివాను. మీ ప్రకటనలలో అన్నీ షరతులు నాకు సమ్మతమే!”
చెక్ సంతకం పెట్టి ఇచ్చాడు. 10 లక్షలు స్టేట్ బ్యాంక్‌లో బ్యాలెన్స్ ఉన్నది. లేదా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయగలను ఇప్పుడే. నమ్మకం లేకపోతే.”
చెక్ విసురుగా వీసిన గాలిలో రెపరెపలాడింది.
“బయట తుఫాన్ అనుకుంటాను.” ఆ వ్యక్తి గొణుక్కుంటూ లేచాడు. “చెక్ ఓకే! ప్రభుత్వ నిబంధనలకు లోబడి చెక్కు కూడా తీసుకుంటాం . కానీ మీరు ఎందుకు వెళ్ళుతున్నారో తెలుసుకోవచ్చా?”
“మా పూర్వీకుల సంస్థానం అది. మా ముత్తాత తండ్రి ఆ భవనంలో ఉండేవాడు. ఆయన ఉన్నప్పుడు పరిస్థితి చూడాలని అభిలాష అంతే.”
“రూల్స్ తెలుసుగా? మేం అతి కష్టం మీద ఈ లైసెన్స్ తెచ్చుకున్నాం. ఎంతో లంచాలు ఇచ్చి తెచ్చుకున్నాం. భూతకాలంలో మీరు ఏ వస్తువులను ముట్టుకోకూడదు. ఎవరితో మాట్లాడకూడదు. అక్కడికి మీకు గైడ్ లని ఇస్తాం. కేవలం చూడటం ఒక ప్రేక్షకుడి లాగానే చేయాలి, ఎవరితో మాట్లాడినా ఏదైనా కాని పనులు చేసినా కాలంలో ఘటనలు మారిపోతాయి. కాలంతో ఆటలు ఆడకూడదు. మీరు ఒక నిర్లిప్తమైన ప్రేక్షకుడిలా ఉండి పోవాలి. అంతే.”
“అంటే ఎవరితో మాట్లాడకూడదా? మా పితృదేవతలకి నమస్కారాలు బహుమతులు ఇవ్వకూడదా?”
“కూడదు! కనీసం పలకరించటం కూడా కుదరదు. మేం సూచించిన మార్గంలో నడిచి వెళ్లాలి. పక్కన గడ్డిని కీటకాలను కూడా తొక్కకూడదు. చిన్న దోమనీ ఈగనీ కూడా చంపకూడదు.”
నవ్వాడు రాజా విశ్వేశ్వర బహదూర్.
“తెలుసు సార్ నాకు! మీ ప్రకటనలు చదివాను. సీతాకోకచిలుకను కూడా ముట్ట రాదు. దాని రెక్కల టపటపకే తుఫాను రావచ్చు. ఎలుక అడ్డం వచ్చి కరువబోయినా దానిని చంపరాదు. నిజంగా ఇంత పెద్ద చరిత్రలో అంత చిన్న విషయాలు ముఖ్యమైనవేనా?”
“రెండు వందల ఏళ్ళ క్రితం ఆ విషయం అంత ముఖ్యం కాకపోవచ్చు. ఏ చిన్న సంఘటనకైనా సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి పరిణామ క్రమం ఉంటుంది. ఒక ఎలకను చంపారు అనుకోండి. దాని వంశమంతా పోయినట్లే కదా. దాన్ని తినే పిల్లులు వాటిని తినే ఇతర నక్కల లాంటి జంతువులు అన్నీ దెబ్బతింటాయి కదా. కొన్నిసార్లు ఒక జంతు జాతి మాయమై పోవచ్చు.
ఒక మనిషిని చంపితే అతని వంశమంతా అంతరించి పోవచ్చు. వంశం చేసిన పనులన్నీ ఇతర జీవితాలని ప్రభావితం చేసేవి అన్ని మారిపోవచ్చు. మానవులని అందరినీ ప్రభావితం చేయొచ్చు. చరిత్రే మారవచ్చు. పరిశోధనలు కూడా మారవచ్చు. రాజకీయం మారవచ్చు.”
“అంతా ఒక చిన్న ఘటనతోనా?”
“అవును మా ప్రకటనలో వివరంగా రాశాం. దీనినే సీతాకోకచిలుక ప్రభావం అంటారు. బటర్‌ఫ్లై ఎఫెక్ట్… నిజం అయినా కాక పోయినా జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రభుత్వం నిబంధనలు విధించింది.”
పెద్దగా నవ్వాడు విశ్వేశ్వర్. “ఏదో ఒక చిన్న జంతువు లేక ఒక వ్యక్తీ మరణిస్తే చరిత్ర అంతా ఎలా మారుతుంది? అక్కడి ప్రాదేశిక చరిత్రలో కొద్దిగా చిన్న చిన్న మార్పులు సంభవించవచ్చు. అంతేగాని మానవ జాతిని మొత్తం ఎలా మారుస్తుంది?”
“నా పేరు డేవిడ్. మీరు అన్నది నిజం కావచ్చు కాకపోవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అతి కష్టం మీద ఈ లైసెన్స్ తెచ్చుకున్నాను. ఎలోన్ మస్క్, (Elan Musk) కుజుడి యాత్రల తరువాత కాల యంత్రాలకి కూడా ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది. కానీ ఎన్నో నిబంధనలు విధించింది. ఎంతో లంచాలు ఇచ్చి తెచ్చుకున్నాం. నిబంధనలు వ్యతిరేకించిన వారికి లైసెన్స్ పోతుంది. కంపెనీ నిబంధనలు అతిక్రమిస్తే ప్రభుత్వం శిక్ష భయంకరంగా వేస్తుంది. ఆ శిక్ష కాల ప్రయాణికుడికి కంపెనీకి కూడా విధిస్తుంది.”
ఇద్దరు దృఢకాయులు అయిన వ్యక్తులు లోపల్నించి వచ్చారు. బౌన్సర్ లలా వున్నారు.
“సార్ మెషిన్ రెడీ!”
బయట తళ తళా మెరుపులు. ఆ తరువాత ఢమరుక శబ్దం లా పిడుగులు. పెద్ద శబ్దాలతో తుఫాన్… రాజన్ అక్బర్ వీళ్ళిద్దరూ భూతకాలంలో మీ గైడ్. మీరు చేసే పనులన్నీ గమనిస్తూ ఉంటారు. దారితప్పితే శిక్ష తప్పదు.
నిశ్శబ్దం.
“ఇప్పటికైనా మీరు వెనక్కి తగ్గవచ్చు. మీ చెక్ ఇక్కడనే వుంది. వాపస్ తీసుకోవచ్చుతీసుకోవచ్చు. ఆలోచించుకోండి రాజావారు.”
నిన్ననే ఎన్నికలు జరిగాయి. 2070లో ప్రధాన పార్టీగా తన ఆగర్భ శత్రువుగా నేతృత్వం వహించే పార్టీ గెలిచింది. అనాదిగా వస్తున్న సంపద తనది అయితే ఆ డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికలలో గెలిచేవాడు. ఇలా సాధారణ పౌరుడిగా మారిపోయే అగత్యం ఉండేది కాదు. తన శత్రువు రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు వర్మ ఇప్పుడు ప్రధాని!
తన సంస్థానపు గుప్తనిధులు ఎక్కడ దాచారో తెలిస్తే ఆస్థానంలో ఉండేవాడు.
రాజా విశ్వేశ్వర్ బహదూర్ దీర్ఘంగా ఊపిరి తీసుకు వదిలాడు. అతని దవడ కండరాలు బిగుసుకుంటున్నాయి.
“డేవిడ్ గారు మీ నిబంధనలు అన్నిటికీ ఒప్పుకుంటున్నాను. ఏదీ అతిక్రమించను. ప్రయాణం మొదలు పెట్టండి. ఎక్కడ కాలయంత్రం?”
ఒక బటన్ వేలితో నొక్కి అనంత కాలగర్భం లోకి తీసుకుని వెళ్లి పోయే యంత్రం అది. పది అడుగుల పొడుగు వైశాల్యం ఉన్న గాజు పెట్టెలా ఉంది. ఏ క్వాంటం భౌతిక సూత్రాలో ఏ అధునాతన టెక్నాలజీనో రాజా విశ్వేశ్వరరావు బహదూర్‌కి అనవసరం. అర్థం కాదు కూడా.
మెరిసి వెలిగే ఆరే లైట్లు, దడ దడ శబ్దం. ఎదురుగా తెర మీద గణకం వెనక్కి తిరగ సాగింది.
2070 … 2060 …2050…
ఎన్ని సూర్యుళ్లు ఎన్ని వందల సార్లు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తూ ఉన్నారో, ఎన్ని చంద్ర బింబాలు క్షీణించి మళ్ళీ వృద్ధిచెంది మళ్లీ క్షీణించి ఎన్ని నెలలు గడిచాయో…
తెల్లటి వెంట్రుకలు మళ్లీ నల్లబడి యవ్వనవంతమై ముసలి శరీరాలు మళ్లీ పసిపాపలలా కేరింతలు కొట్టి, మళ్లీ మృత్యువు, మళ్ళీ జననం…
పుష్పించిన పువ్వులు వాడిపోయి, చెట్లు కూలి మళ్లీ మొలిచి,తుఫాన్లు ఆగి మళ్లీ వసంతంలో ఆకులు చిగురించి కాలంలో వెనక్కి వెనక్కి వెళ్ళి
1920 …1910… 1900… 1890… 1880
ఆఖరికి 1870 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ 12,13,14,15… వచ్చేసింది.
ఆ సాయంత్రం ఆరు గంటలు అయింది.
“ఇక బయటికి వెళ్ళవచ్చు!”
గాలిలో ఏదో పాత వాసన. ఎక్కడో కాకుల అరుపులు. ఒక తెల్లని కొంగల సమూహం ఒక్కసారి మర్రిచెట్టు మీద వాలుతోంది. ఎర్రటి పెద్ద సూర్యబింబం పడమర దిక్కున దుక్కి దున్నిన పొలాల అంచున అస్తమిస్తోంది.
రెండెకరాలలో ఉన్న హవేలీ. పెద్ద ఆర్చీలు గుమ్మటాలు గుమ్మాలు. హవేలీ ముందు మామిడి చెట్లు మర్రి చెట్లు.
అప్పుడే తలపాగాలు ధరించి గోచీలు పెట్టుకున్న నల్లని పని వాళ్ళు నూనె దీపాలు వెలిగించి హాలులో గదిలోకి ఉన్న మేకులకి తగిలించే పనిలో ఉన్నారు.
“మీరు ఈ లోహపు పలక మీద నిలబడాలి. అటూ ఇటూ తిరిగి నేలమీద నడవకూడదు. ఈ కాలంతో సంబంధం లేకుండా ఈ ఫలకం భూమి పైన రెండు అడుగుల దూరంలో ఉంది. “
“చూడండి! అంతే! ఎవరిని పిలవద్దు! మాట్లాడవద్దు.” రాజన్ ,అక్బర్ ఇద్దరూ యాంత్రిక స్వరంతో హెచ్చరించారు. వీళ్లు మనుషులా లేక రోబోట్లా?
ఒక పెద్ద ఆరు గుర్రాల బండి హవేలీ ముందు ఆగింది. దాంట్లోంచి తలపాగాలు ధరించి చొక్కాలు లేకుండా పంచెలని గోచీలుగా ధరించిన పాలేర్లు నల్లటి పెట్టెలు డజను మోసుకుంటూ హవేలీ వెనక వైపు వెళ్లారు. వెనుకనున్న వేప చెట్ల మధ్య తవ్వడం మొదలుపెట్టారు. ఒక గంటలో కాగడాల వెలుతురులో గోతులు తవ్వడం పూర్తయింది. అన్ని పెట్టెలు గోతులలో పాతిపెట్టడం పూర్తయింది. వాటిల్లో ఏముంది? ఇంకేముంటుంది? బంగారపు నాణాలు ఏమో! రైతుల దగ్గర వసూలు చేసిన శిస్తుడబ్బులు ఇంగ్లీష్ కలెక్టర్‌కి కట్టగా మిగిలినవి దాస్తున్నారు. ఆ రోజుల్లో బ్యాంకులు లేవు. పల్లెటూర్లలో బందిపోటు దొంగల భయం ఎక్కువ. భూమిలో బంగారం దాయటం ఒకటే సురక్షితమైన మార్గం. ఉన్నట్లుండి హవేలి వెనక ద్వారం తెరుచుకుంది. శరీరమంతా బంగారు హారాలు ధరించి తలపాగా బుంగ మీసాలతో రాజాలా ఉన్న పురుషుడు బయటకు వచ్చాడు.
ఆయనతో పాటు ఇద్దరు స్త్రీలు కూడావచ్చారు. రాణివాసపు స్త్రీల ఆహార్యంలో ఉన్నారు. వారి పట్టు చీరలు బంగారు నగలు కాగడాల వెలుతురులో మెరుస్తున్నాయి వారిద్దరూ ముసలి రాజుతో ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాగడాల వెలుగులో స్పష్టంగా కనిపించింది… ఒక స్త్రీ శ్వేత వర్ణపు యువతిలా ఉంది. ఒక స్త్రీ భారతీయ యువతి లా ఉంది. వారిద్దరూ ఆయనతో ఏదో వాగ్వాదం చేస్తున్నారు. ఆయన చేతితో సైగలు చేస్తూ లేదు లేదు అని అన్నట్లు గా వాదిస్తున్నాడు.
అతనే తన ముత్తాత కి తాత! ఇంతలో ఇద్దరు చిన్నపిల్లలు పదేళ్ల వారు బయటకు వచ్చారు. ఒకడు ఆంగ్లేయ బాలుడిలా ఉన్నాడు. ఒకడు భారతీయ బాలుడిలా ఉన్నాడు.
“అయ్యో వాళ్లే తన పూర్వీకులు. తన వంశం తనని దూరం చేసింది.”
రాజా బహదూర్ విశ్వేశ్వర్ తన శరీర వర్ణం చూసుకున్నాడు . బంగారు రంగు శిరోజాలు, తెల్లని శరీరవర్ణం, నీలి కళ్ళు. తనని తన వంశాన్ని సంకరజాతి అని సజాతీయుడు కారని అప్పటినుంచీ దూరం చేస్తూనే ఉన్నారు. ఆస్తిలో సగం వాటా రావాల్సిన ముత్తాత పట్టణాలకు వలస వెళ్ళిపోయాడు.
ఇప్పుడు జరిగిందంతా అర్థమవుతోంది.
గుర్రాల డెక్కల చప్పుడు… హవేలీ భవనం ముందు ఇద్దరు ఆజానుబాహులైన వ్యక్తులు దిగారు. రాజవంశీకులలా ఉన్నారు. మీసాలు. తలపాగాలు. అంగీలు. కానీ చేతుల్లో పదును అయిన అంచుల కత్తులు.
వాళ్లు హవేలీ వెనకవైపు పరిగెత్తారు.
అడ్డుకోవటానికి పాలేర్లు కర్రలు తీసి సాముగరిడీలు చేయసాగారు.
అయినా అది వ్యర్థం. ఆ ఆగంతకులు కత్తులు దూసి అందర్నీ తలలు నరుకుతున్నారు.
“అయ్యో తాతా! తాతా!… నిన్ను నువ్వు రక్షించుకో!వాళ్ళు వస్తున్నారు!”
రాజా విశ్వేశ్వర్ తను కాలయంత్రం లోఉన్న చోటు నుంచి బయటకు దూకి పరుగెత్తసాగాడు.
క్షణాలలో నాలుగు తలలు తెగిపడ్డాయి. 1870లోని ముత్తాత తాత నేలపై పడ్డాడు. రాణులిద్దరూ తలలు తెగి విగతజీవులై పట్టుచీరలు రక్తసిక్తమై నేలపై ఒరిగిపోయారు. భీకరమైన దృశ్యం. తొంగి చూస్తున్న చిన్నపిల్లలు మాత్రం హవేలి లోపలికి పారిపోయారు.
విశ్వేశ్వర్ పచ్చిక మీద పరుగెత్తసాగాడు.
పచ్చని చెట్ల వాసన. పచ్చగడ్డి వాసన… కాలికి అడ్డంగా ఎలుక ఏదో ఒకటి పరిగెత్తింది…
సీతాకోక చిలుకలు నాలుగు జుంయ్ మని చప్పుడు చేస్తూ చేతులకు అడ్డంగా వచ్చాయి.
ఆ ధనం తనది. శతాబ్దాలుగా తనని ఆయన రెండవ భార్య ఆంగ్లో-ఇండియన్ పుత్రుడి వారసుడిగా అవమానించి డబ్బు రాకుండా చేశారు…
ఆ ఆగంతుకులు ఎవరో హవేలీని కూడా కాజేసి ఉంటారు. అనంతమైన విలువ గల బంగారాన్ని కూడా దొంగిలించి ఉంటారు.
యంత్రంలో అలారం మోత అర్ధరాత్రి దయ్యపు ఘోషలా గుడ్లగూబ అరుపులా మోగసాగింది. రాజన్ అక్బర్ అనే పేరు గల రోబోట్లు పెద్ద యాంత్రిక స్వరంతో అరవసాగాయి.
“తప్పు చేస్తున్నావు రాజా విశ్వేశ్వర్! వెనక్కి రా! నిబంధనలు అతిక్రమించావు! నీకు మరణశిక్ష తప్పదు! లేకుంటే చరిత్ర గతి మారిపోతుంది.”
ఒకసారి తెలివి తెచ్చుకొని మళ్లీ కాల యంత్రపు తలుపులు తోసుకొని లోపలికి దూకాడు విశ్వేశ్వర్.
“సారీ! ఆవేశంలో బయటికి దూకాను. కానీ ఏమీ చేయలేదు. ఎవర్నీ ఆపలేదు. ఏ సంఘటనలూ మార్చలేదు. ఎవరినీ చంపలేదు. వాళ్లు చంపదగిన వారే. మా ముత్తాతని చంపారు. ఆస్తి కాజేశారు. ఈ రోజే ఈ తేదీలోనే హవేలీ వారిది అయినట్టు దస్తావేజులో ఉంది. ఇది అక్రమం. అది తెలుసుకోవటానికే వచ్చాను.”
కాలయంత్రం కదిలి తిరిగి ప్రయాణించ సాగింది.రాజన్,అక్బర్ తుపాకులు అతనిమీద ఎక్కుపెట్టారు.
1870 …1890 …1900… 1920…
నువ్వు తప్పు చేసావు . చరిత్రగతి మార్చేసావు.
1940 …1950… 1990… 2000…
“దీనికి ప్రభుత్వానికి మేం సమాధానం చెప్పుకోవాలి. కోట్ల రూపాయలు చెల్లించాలి.”
“ఆ మొత్తం నేనే ఇస్తాను. ఇంత చిన్న విషయానికి చరిత్ర గతి మారుతుందా?”
…2070 జూన్ 15వ తారీకు. సమయం తెల్లవారు జామున 4 గంటలకు.
“ఇక బయటకు. దిగు! నిన్ను చంపము!. నువ్వు వేరే చరిత్రలోకి… మేము వేరే చరిత్ర లోకి. వెళ్లిపోవాల్సిందే!
రాజా విశ్వేశ్వర్ కాలయంత్రం నుంచి బయటకు వచ్చాడు.
అదే ఆఫీస్. అదే బోర్డు… అదే కానీ ఏదో తేడా.
“ఖాల యంత్రం ఖుంఫెణీ”
“ఖాలంలో ఎఖ్ఖడికైనా తీసుకెళ్లబడును.”
“సర్కారు అనుమతి కలదు. షరతులు వర్తిస్తాయి”
ఏదో మార్పు. గాలి లో వాసన కూడా వేరే. అదే ఆఫీస్ అవే వైరులూ… అదే టేబుల్. అదే మనిషి.
అదే టేబుల్ కానే కాదు, అదే మనిషి కానే కాదు.
పెద్ద కళ్ళు జులపాల జుట్టు …ఫెజ్ టోపీ… ఎవరో అరబ్ మనిషిలా ఉన్నాడు.
బయట కాలయంత్రం కదిలింది.
“వెళ్ళకండి! నన్ను నా ప్రపంచం లోకి తీసుకు వెళ్ళండి ! రాజా బహదూర్ విశ్వేశ్వర్ అరవసాగాడు.
అతని శరీరం చెమటతో వర్షంతో తడిసి పోయింది.
కాలి బూట్లకి మాత్రం1870 నాటి మట్టి అంటుకుని వుంది.
ఒక చచ్చిన ఎలుక, నాలుగు సీతాకోకచిలుకలు నిర్జీవంగా ఉన్నాయి. సీతాకోకచిలుక రెక్కలు మాత్రం నీలిరంగు బంగారు రంగుతో మెరుస్తున్నాయి. వాటికి భిన్నంగా నల్లటి పురాతన పందికొక్కు తోక కొద్దిగా కదులుతోంది.
ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద మార్పా!
టేబుల్ వెనుక ఉన్న అరబిక్ వ్యక్తి ఆశ్చర్యం నుంచి తేరుకొని ఒక మెషిన్ గన్ అతనికి ఎక్కుపెట్టాడు.
“ఇది ఏ దేశం? ఏ కాలం? దేశ ప్రధాని ఎవరు?” అడిగాడు విశ్వేశ్వర్.
“ఇది కూడా తెలియదా? ఎక్కడి నుంచి వచ్చావు?ఎక్కడికి పోతున్నావ్?”
బయట దడ దడ గా ధారగా వర్షం కురుస్తోంది.
“నిన్ననే కదా షేక్ మహమ్మద్ బిన్ సులేమాన్ జీవితకాలపు అధ్యక్షుడయ్యాడు!”
ఎక్కడో పెద్ద చప్పుడుతో పిడుగు పడింది.
ఆ చప్పుడులో మెషిన్ గన్ చప్పుడు కూడా కలిసిపోయింది…