[dropcap]ఇ[/dropcap]దేమి లోకం..ఇదేమి లోకం
ఆకలి దప్పుల నెప్పుల వాళ్ళొక పక్క..
నెగడు వెలుగులో నిషాను నింపుకున్న వారొకపక్క
రోకటి పోటులా పేదరికం
తాడూ బొంగరంలేని జీవితం
ఊగిసలాడే క్షణాలను సంబాళిస్తుంది
గుబాళింపులు నోచుకోని మనుషులే
ఎటుచూసినా
దిగులు గాయాలతో
దీనత్వపు చూపులతో
నిరాశను ఊతం చేసుకుని
నైరూప్య చిత్రంలాంటి బతుకును
నిర్మోహంగా వెచ్చజేస్తుంటారు
ఉద్వేగాల చలిని పారదోలేందుకు
నడకలు నేర్చిన నాగరికత
బడుగు జీవుల ఆశలపై
కర్కశంగా అడుగులు వేస్తూనే ఉంటుంది
నాట్యమయూరిలా
ఎంగిలాకుల్లా విసిరేసిన జీవితాలకు
కోయిల పాటలుండవు
కాపాడే దేవతలుండరు
ఆకురాల్చే శిశిరాలై
మౌనాన్ని భూజానేసుకుని
సాగిపోతుంటారు
కాల్చేస్తున్న వారి చూపుతో
లోపలి కొలిమంటుకోని నాడు
ఎన్ని కార్తీక దీపాలు వెలిగిస్తేనేమి