Selected letters of Ananda K Coomaraswamy – పుస్తక పరిచయం

0
2

[dropcap]నే[/dropcap]ను ఆనంద కుమారస్వామి రచనలను కొన్ని సంవత్సరాలుగా చదువుతున్నాను. ఆయన గురించిన సమాచారం వికీపీడియాలో ఇక్కడ https://en.wikipedia.org/wiki/Ananda_Coomaraswamy. గత కొద్ది సంవత్సరాలలో ఆయన రచనలను కొన్నిటిని మళ్ళీ మళ్ళీ చదివిన సందర్భాలు కూడా లేక పోలేదు. ఇటువంటి విషయాలను చదివే వారు పెద్దగా లేరు ఈ కాలంలో అని నిశ్చితాభిప్రాయం రావటం మూలాన ఈ విషయాల గురించి రాయటం మానుకున్నాను. చదివినా ఆవేశకావేశాలకు లోనయ్యేవారే ఉంటారు చాలా వరకు అర్థం చేసుకొని ఆలోచించే వారికంటేను. అయితే ఇటువంటి గాఢమైన విషయాలు మెదడులో దాచుకొని మథనపడే కంటే రాసి భద్రపరుస్తే కొంత భారం తగ్గుతుంది. కొంత సాంత్వన. అందుకనే ఈ పరిచయ వ్యాసం.

ఈ వ్యాసంలో ప్రస్తావించింది అంతాను “Selected letters of Ananda K Coomaraswamy” అన్న కుమారస్వామి లేఖల సంకలనం గురించి. ఇవన్నీ 1900-1947 మధ్య కాలంలో అప్పటి కాలపు ప్రపంచ మేధావులకు ఆయన రాసిన లేఖలు.

నేను భారతీయత అంటే ఏంటో తెలుసుకోవాలని తాపత్రయ పడ్డ కాలంలో నాకు దేశ మూలాలని పరిచయం చేసిన సాహితీ గురువులలో ఆనంద కుమారస్వామి ఒకరు. భారతీయ సంస్కృతి గురించి ఆంగ్లంలో ఇంత చక్కగా రాసిన రచయితలు ఇంకొకరు నాకు తారసపడలేదు ఇప్పటి దాకా. భారతీయ ధార్మిక జీవనంపై పాశ్చాత్య సంస్కృతి మరియు భౌతిక వాదం (మెటీరియలిజం) వగైరాల ప్రభావం గురించి కుమారస్వామి రాసినంత గాఢంగా సునిశిత పరీశీలనా దృష్టితో రాసినవారు అతి కొద్దిమంది ఉన్నారు. ఈ లేఖల సంకలనంలో కూడా అడుగడుగునా కనిపించేది ఆ చింతనే. ఆధునికతకూ సంప్రదాయానికి మధ్యన జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం గురించిన ఆలోచనలే అంతానూ ఈ పుస్తకంలో.

ఆధ్యాత్మిక చింతన ప్రధానంగా ఉన్న తూర్పు దేశాల సంస్కృతులకీ ఆధునికత మరియు భౌతిక వాదంతో కూడుకున్న పశ్చిమ సంస్కృతులకీ జరుగుతున్న సంఘర్షణను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని అంటారు కుమారస్వామి. ఈ సంఘర్షణ కేవలం ఒక దేశానికో జాతికో సంబంధించినది కాదనీ సంప్రదాయానికి సంప్రదాయ వ్యతిరేకతకు మధ్యన జరుగుతున్న సంఘర్షణగా దీన్ని చూడాలనీ అంటారు కుమారస్వామి.

పారిశ్రామిక విప్లవం దాని తాలూకా సైన్సుటెక్నాలజీ వగైరాల వల్ల పుట్టుకొచ్చిన ఆధునికతకు మునుపు పశ్చిమ దేశాలలో ఉండే సంప్రదాయాలు సంస్కృతులు కూడా ఇలానే సంఘర్షణకు లోనయ్యాయని అంటారు ఆయన. ఆ కాలం నుంచే తమ తమ సంప్రదాయ ఆధ్యాత్మిక చింతన నుంచి ఆ సమాజాలు మెల్లగా వేరు పడ్డాయని అంటారు. తన బాధల్లా ఈ సంప్రదాయంతో వైరం అనే విషయం గురించేనని స్పష్టం చేస్తారు కుమారస్వామి. అన్ని జాతులకు అంతర్లీనంగా సనాతనంగా ఉన్న మత ధర్మాలలో తత్వాలలో ఎన్నో సామ్యాలు ఉన్నాయని, చిక్కల్లా ఆ సంస్కృతులని సమూలంగా పెకిలించి అందరిని అన్ని సంప్రదాయాలకు దూరం చేసి అందరిని ఒకేలాగా ఆధునీకరించాలన్న ఆలోచనలో ఉన్నదని అంటారు కుమారస్వామి.

పాతకాలపు సంస్కృతులవన్నీ మూఢ నమ్మకాలని కొట్టి పడేసిన ఆధునిక సమాజం మరొక పెద్ద మూఢ నమ్మకంలో బతుకుతోందని అంటారు ఆయన. అది హద్దులులేని అపరిమిత భౌతిక పురోగతి మరియు అవదుల్లేని నిరంతర ప్రగతి సాధ్యం అనే నమ్మకమని అంటారాయన. ఆధ్యాత్మిక వికాసాన్ని మరియు మనిషిలో సహజంగా ఉండే ఆధ్యాత్మిక చింతనను పక్కన పెట్టి అవధులు లేని భౌతిక పురోగతి అనే కొత్త దేవుడు వచ్చిన కాలమిదని అంటారాయన.

క్రైస్తవ మిషనరీలు తమ నమ్మకాలను గొప్పగా చెప్పుకోటం కోసం ఇతర సంస్కృతులని తక్కువగా చూపే ప్రయత్నం చేశారు. వలస పాలకుల పాలనలో ఆఫ్రికాలోనైనా ఆసియాలోనైనా జరిగినది ఇదే. ఆయా సంస్కృతుల గురించి ఆ మిషనరీలు తెలుసుకున్నది కూడా సెకండ్ హ్యాండ్ విజ్ఞానమే అని, వారు ఇతరులకు హిత బోధ చేసే ముందు క్రైస్తవాన్ని ఎంతగా అధ్యయనం చేసారో ఇతర మతాలను కూడా అంతే స్థాయిలో అధ్యయనం చేయాలనీ అంటారు కుమారస్వామి. ఈ క్రైస్తవ మత ప్రచారకులకి తూర్పు దేశాల గురించి తెలిసిన కొద్ది విషయాలు కూడా హేతువాద రచయితలో లేదా ఆధ్యాత్మిక విషయాలలో స్వానుభవం లేని వారో లేదా మత శాస్త్రము (థియాలజి) విషయంలో బొత్తిగా అనుభవం లేని వారో రాసిన రచనల ద్వారా తెలుసుకున్నదే అని అంటారాయన. ఈ మత ప్రచారకుల పనిలో నిజాయితీ లోపించిందని అంటారు కుమారస్వామి.

భారతదేశాన్ని చాలా ఆలస్యంగా డిస్కవర్ చేసిన నెహ్రును గురించీ, రాజకీయ విషయంలో తప్పితే మరే విషయంలో కూడా ముస్లిము కాని జిన్నా గురించీ తలుచుకుంటే తనకు ‘అయ్యో పాపం’ అనిపిస్తుందని అంటారు కుమారస్వామి.

కుమారస్వామిని చదువుతున్న వారికి కొంచెం కష్టంగా అనిపించే వాక్యాలు కొన్ని ఉంటాయి ఆయన రచనలలో. ఆయన వర్ణాశ్రమ ధర్మాలని పూర్తిగా సమర్థించారు. అయితే ఇక్కడ కుమారస్వామి చెబుతున్నది మార్క్సిస్టులు సంస్కర్తలు దుయ్యబట్టే అగ్రకుల ఆధిపత్య ధోరణి గురించి కాదు. నిజానికి నేటి కాలంలో వెనుకబడ్డ కులాలుగా గుర్తింప పడుతున్న హస్తకళాకారులు చేతి పనిముట్ల వారు మరియు ఉత్పత్తి కులాల వారి గురించీ విశ్వకర్మ కులాల వారి గొప్పదనం గురించీ కుమారస్వామి రాసినంతగా రాసినవారు ఆయన కాలంలో లేనే లేరు నాకు తెలిసి. ఆయన ఎక్కువ తక్కువలని చూడలేదు వర్ణ వ్యవస్థలో. స్వతః ఆయన ఎలాగూ బ్రాహ్మణుడు కాడు కాబట్టి ఆ పేరు మీద ఆయనను ఆడిపోసుకొని మనం సాధించేది ఏమి లేదు. కుమ్మరి కమ్మరి కంసాలి వడ్రంగి శిల్పి మొదలైన వారి వృత్తి ధర్మంలో సనాతన ధర్మ సారాన్ని దర్శించారు కుమారస్వామి. వారందరిలో గొప్ప కళాకారులని చూసారు ఆయన (చూడు: ఆయన రాసిన “The Indian Craftsmen” –  https://archive.org/details/indiancraftsman00coomuoft)

గత శతాబ్దం గర్వించదగ్గ గొప్ప భారతీయ మేధావి డీ ఆర్ నాగరాజ్ తన “ఫ్లేమింగ్ ఫీట్” అన్న పుస్తకంలో కంచ ఐలయ్య రాసిన “నేను హిందువునెట్లయిత” పుస్తకం గురించి రాస్తూ ఇలా అంటారు. “The theme of victims of the ‘machine-vaad’ should be taken up as seriously as we take the communities suffering under ‘manu-vaad’, at all levels of theory and practice. If Kancha Ilaiah accepts this proposition, then his book has to be substantially rewritten” అని అంటారు. మనువాదం గురించి మాత్రమే కాదు మెషీన్ వాదం గురించి కూడా ఆలోచించాలి అంటారు నాగరాజ్. యాంత్రిక విప్లవం యొక్క జగన్నాథ రథ చక్రాల కింద ముందుగా నలిగింది పైన చెప్పుకున్న చేతి పని ముట్ల వారు వారి సంస్కృతులు వారి జీవన విధానాలే. కుమారస్వామి వర్ణాశ్రమ ధర్మాల గురించి రాసినది అర్థం కావాలంటే డీ ఆర్ నాగరాజ్ పేర్కొన్న మెషీన్ వాద్ గురించి ఆలోచించాలి.

తాను వర్ణ వ్యవస్థను తీవ్రతరం చేయటాన్ని సమర్థిస్తానని అది కూడా ముఖ్యంగా బ్రాహ్మణుల విషయంలో అంటారు కుమారస్వామి. బ్రాహ్మణులు వారి ధర్మాన్ని నిర్వర్తించటంలో విఫలం చెందితే వారిని ఆ వర్ణం నుంచి వెలి వేయాలంటారు ఆయన. అయితే కుమారస్వామి ఇక్కడ బ్రాహ్మణుడు అంటే నేటి కాలపు బ్రాహ్మణులు కానే కారు. ఉద్యోగాల కోసం ఆస్తుల కోసం పొట్ట కూటి కోసం లేదా అమెరికాలో స్థిరపడటం కోసం జీవితాలు ధారపోసుకునే ఆధునిక బ్రాహ్మణుల గురించి కాదు ఆయన తాపత్రయ పడేది.

 అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి రచన అయిన “జగజ్యోతి”లో ఒక పదం అడపా దడపా వస్తూ ఉంటుంది – “కుక్షింభరుడు” అని. కూమారస్వామి బ్రాహ్మణుడు అన్నప్పుడు ఈ కుక్షింభరులైన నేటి కాలపు బ్రాహ్మణుల గురించి కాదు ఆయన రాస్తున్నది. కుక్షింభరుడు అంటే ఏంటో నిఘంటువు అర్థం చూడండి

materialist, n. కుక్షింభరుడు; కుక్షింభరి; భౌతికవాది; ప్రత్యక్షంగా కనిపించేదే ప్రధానమని వాదించే వ్యక్తి; అనాత్మవాది; లోకాయతికుడు;

materialistic, adj. కుక్షింభర; ప్రాపంచిక; భౌతిక; లోకాయత;

materialism, n. కుక్షింభరత్వం; భౌతికవాదం; లోకాయతం; భోగలాలసం;

కుక్షింభరుడు

1. తన పొట్ట నింపుకొనుటే లక్ష్యముగా కలవాడు — స్వార్థపరుడు.

“వాడు వట్టి కుక్షింభరుడు. ఏది ఏ మయినా తన పొట్ట గడిస్తే చాలు.”

బ్రాహ్మణుడు అనేవాడు డబ్బు వ్యామోహంలో పడితే అతనిని వైశ్యుడిగా గుర్తించాలని ఇంజనీరు అవుతే శూద్రునిగా గుర్తించాలని అంటారు కుమారస్వామి. దీని అర్థం తాను ఆయా కులాల వారిని తక్కువ చేసినట్టు కాదని ఎవరూ ఇంజనీరు అవ్వకూడదు డబ్బు సంపాదనలో పడకూడదు అని చెప్పినట్టు కాదనీ వ్యవస్థలో ఉన్నతమైన స్థానం వీరికి చెందకూడదు అనటం మాత్రమే తన ఉద్దేశమని అంటారు ఆయన. ఈ విషయంలో తన అభిప్రాయం ఎంత భారతీయమో చెబుతూనే ప్లేటో కలలు కన్న ఆదర్శ సమాజం కూడా ఇటువంటిదే అని గ్రీకు తత్వవేత్త ప్లేటో “రిపబ్లిక్” ను గుర్తుకు తెస్తారాయన.

మరొక చోట సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని గురించి ఒక మాట రాశారు. రాధాకృష్ణన్ గారి రచనలలో మనకి తారసపడే హిందూ మతం సనాతనమైనది కాదని, అది ఆధునిక పాశ్చాత్య చరిత్రకారుల హిందూ మతంకి దగ్గరగా ఉందని అంటూ నిజానికి రాధాకృష్ణన్ గారికి హిందూ ధర్మం కంటే కూడా బహుశా క్రైస్తవమే బాగా అర్థమయిందేమో అని అంటారు.

వేదాంత సారాన్ని మించినది ఏది లేదు అంటూ రమణ మహర్షి స్థాయి దార్శనికుడు యూరోపులో తనకు తారస పడలేదని అంటారు. తన కాలంలో చెలామణిలో ఉన్న ఆధునిక వేదాంతుల మీద తనకు పెద్ద నమ్మకం లేదని తనకు మిషనరీ స్వామిజీల మీద నమ్మకము తక్కువనంటూ తొందరపడి ఎవరినీ తాను రమణ మహర్షి స్థాయిలో లెక్కించనని అంటారు. అది ఆఖరికి వివేకానంద స్వామి ఐనా సరే ఆయనను రమణుల స్థాయిలో తాను పరిగణించనని అంటారు. అదే రామకృష్ణ పరమహంస తన కాలంలో ఒక వేళ బతికి ఉంటే అప్పుడు ఈ విషయంలో తన అభిప్రాయం మారచ్చునేమోనని అంటారు కుమారస్వామి.

సంప్రదాయం అన్నది కాలాతీతమైన విషయం అని అందులో సనాతనంగా ఉండే సూత్రాలు కొన్ని ఉంటాయని కాలాన్ని చీకటి యుగం ప్రాచీన యుగం అంటూ లెక్కపెట్టటంలో అర్థం లేదని అంటారు కుమారస్వామి. ప్రపంచంలోని అన్ని సమస్యలకు పశ్చిమ దేశాల నాగరికతలోనే పరిష్కారం ఉంది అని అనుకోవటం మూర్ఖత్వం అని అంటారు ఆయన. ఈ నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ట క్రైస్తవంలో కనపడుతుంది అని క్రైస్తవులు తమ మతం పరమ సత్యమని విశ్వసిస్తారని అంతే కాక తమ మతం మాత్రమే నిజం అని అనుకుంటారని అంతటితో ఆగక ప్రపంచం మొత్తానికి ఆ క్రైస్తవ నాగరికతనే అంటగట్టటానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారని అంటారు ఆయన.

ఇంగ్లాండులో ఒక యూనివర్సిటీ లోని థియాలాజి (మత శాస్త్రము) శాఖలో ప్రొఫెసర్ ఒకాయన గురించి చెబుతూ ఇలా అంటారు కుమారస్వామి. ఆ ప్రొఫెసర్ ప్రపంచంలోని జనాభా మొత్తానికి క్రైస్తవం చెప్పించి వారి వారి సంస్కృతులని నాశనం చేయటం ప్రతీ పశ్చిమ దేశ పౌరుని బాధ్యత అని నమ్ముతారట. ఆయన ఈ నమ్మకం వెనుక కారణం ఏమిటంటే ఇతర దేశాలలో మతము అంటూ ఎదో ఒకటి ఉండవచ్చునేమో కానీ ఆ మతము అన్నది క్రైస్తవ మతం కానందున దానిని నిర్ములించాల్సిందే అని ఆయన విశ్వాసం అట. ఇటువంటి అభిప్రాయాలు ఉన్న వలస పాలకులు మరియు పాశ్చాత్య పాలకులు ఉన్నంత కాలం ప్రపంచ శాంతి అన్నది సిద్ధించటం కల్ల అని అభిప్రాయపడ్డారు కుమారస్వామి. ఈ పాలకుల దృష్టిలో పాశ్చాత్య సంస్కృతి మాత్రమే పురోగతి చెందినది మిగిలినవన్నీ వెనుకబడిన సంస్కృతులే అని అంటారు కుమారస్వామి. నెహ్రూ అయినా కానీ చియాంగ్ కై షేక్ అయినా కానీ పేరుకి మాత్రమే ఆసియాకు ప్రతినిధులని తన దృష్టిలో వీరి ఆత్మలు ఎప్పుడో పరాధీనం అయిపోయాయని అంటారాయన.

మరొక చోట మఱకేచ్ (మొరొక్కో దేశం) పాషా అమెరికాను ఉద్దేశించి అన్న మాటలు అప్పటి బోస్టన్ హెరాల్డ్ పత్రికలో వచ్చిన విషయం ప్రస్తావించారు. ముస్లీము ప్రపంచానికి అద్భుతమైన అమెరికా ప్రపంచం మరియు అతి గొప్ప అమెరికా జీవన విధానం అక్కర్లేదని అన్నాడట అప్పట్లో ఆ పాషా. అమెరికా దేశము ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ తనలా మారాలి అన్న కోరికతో తహ తహలాడుతున్నాయి అని అనుకుంటూ ఉంటుందనీ ఆ అభిప్రాయం తప్పనీ అది నిజం కాదనీ అంటారు కుమారస్వామి. మొరొక్కో పాషా అన్న ఆ మాటలు ముస్లిం ప్రపంచానికి మాత్రమే కాక ఇంచు మించుగా ఆసియా ఖండం మొత్తానికి వర్తిస్తుందని అంటారు ఆయన. యూరోపు పాలకులు మరియు మేధా వర్గం ఈ విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని అంటారు కుమారస్వామి. ఈ మేధావుల వర్గం తూర్పు సంస్కృతులని తెలుసుకోవాలంటే అప్పటికే తమ మూల సంస్కృతి నుంచి వేరు పడిపోయిన వారితోనో జీవనోపాధి కోసం పాలకుల మీద ఆధారపడిన వారితోనో మాత్రమే సంభాషిస్తే ఉపయోగం లేదని అంటారు ఆయన.

మీరు వెళ్తున్న మార్గం తప్పు అన్నప్పుడు ఆ మార్గంలో ఎంత పురోగతి సాధిస్తే ఏం లాభము అని ప్రశ్నిస్తారు ఆయన. భౌతిక పురోగతి మరియు అభివృద్ధి అన్నవి ఏవైతే ఉన్నాయో వాటి వ్యామోహంలో పడి ఎటుపోతున్నారో కూడా గుర్తించలేని స్థితిలో ఉన్న పశ్చిమ దేశాల సంస్కృతిని చూసి ఆసియా తప్పటడుగు వేయకూడదని అంటారు ఆయన. ఆసియా ప్రజలు తమ సంస్కృతి లోనే ఉంటూ తమను తాము సంస్కరించుకోగలరని అంత మాత్రానికి మూలాలకి దూరమై పాశ్చాత్య సంస్కృతిని ఆరాధించాల్సిన అవసరం లేదని అంటారు ఆయన.

ఆధునిక కాలం నాటి స్కూలు పిల్లవాడికి ప్లేటోకి తెలియని విషయాలు కొన్ని తెలిస్తే తెలియవచ్చును గాక అంత మాత్రం చేత ఆ స్కూలు పిల్లవాడు ప్లేటో కంటే గొప్ప మేధావి అవ్వడు అని అంటారు కుమారస్వామి. పాశ్చాత్య దేశాలలో అవసరమైన దానికంటే ఎక్కువ భౌతిక సంపత్తి కూడబెట్టుకున్నారని ఈ సంపదని ఎలా వాడాలో తేల్చుకొనే మేధాశక్తిని విచక్షణను వారు కోల్పోయారని అంటారాయన.

అయితే వైద్య రంగంలో సాధించిన గొప్ప ప్రగతిని పాశ్చాత్య మేధస్సుకు సాక్ష్యంగా కొందరు పేర్కొంటారని అంటూ ఆ విషయం గురించి తన అభిప్రాయం తెలియజెప్పారు రచయిత. కేవలం భౌతిక ప్రపంచం గురించే ఎన్నో ఏళ్ళు పరిశోధన చేస్తే ఎదో ఒక విషయంలో ఆ మాత్రం ప్రగతి సాధించటంలో ఆశ్చర్యమేమీ లేదంటారు ఆయన. ఐతే వ్యాధి నిర్ములన కోసం చేసే curative వైద్యానికి వ్యాధి నివారించటానికి చేసి preventive వైద్యానికి ఉన్న తేడా గుర్తించాలి అంటారాయన. పూర్వ కాలం వారి ఆహార పద్ధతులు నేటి మన పద్దతుల కంటే విశిష్టమైనవనంటూ మనకు మల్లే వీధికి ఒక డెంటిస్టు ఉండాల్సిన అవసరం వారికి అప్పట్లో ఉండేది కాదు అంటారు కుమారస్వామి. నేటివ్ అమెరికన్ జాతుల వారిని వెనుకబడిన జాతులుగా అమెరికా పాలకులు ముద్ర వేశారని ఐతే ఆ నేటివ్ అమెరికన్ జాతుల వారు వలస పాలకులని మాయదారి రోగాలను మోసుకొచ్చే వారిగా భావించే వారని అంటారాయన.

ఇతర సంస్కృతుల వారిని తమ మతములోనికి మార్చేయాలని ఒక మతమార్పిడి ఉన్మాదం పాశ్చాత్య దేశాలలో ప్రబలంగా ఉందని అంటారు ఆయన. ఐతే ఈ మతమార్పిడి చేయాలనే ఉన్మాదానికి గురైన మిషనరీలు సంస్కృతిని నాశనం చేయకుండా కేవలం మతాన్ని మాత్రమే మార్పు చేయాలని తాపత్రయపడతారని అంటారు ఆయన. అంటే culture ను అలాగే అట్టిపెట్టుకొని కేవలం religion మారితే చాలని ఆ మిషనరీల తాపత్రయం. ఐతే పాశ్చాత్య దేశాలు అప్పటికే తమ మూలాల నుంచి వేరు పడి లౌకికవాదం ముసుగులో పడిపోయినందున సంస్కృతిని మతాన్ని వేరు చేయగలం అని భ్రమ పడతారని అంటారు కుమారస్వామి. ఆ లౌకికవాద దృక్పథం నుంచి బయటకి వచ్చి భారతదేశం లోని ప్రత్యేక పరిస్థితులని అవగాహన చేసుకోవాలంటారాయన. భారతదేశంలో మతాన్ని సంస్కృతిని వేరు చేయటం అంటే ఆత్మని దేహాన్ని విడదీసినట్టే అని అంటారు కుమారస్వామి. హిందూ మతం అన్నది భారతదేశానికి సంబంధించిన ప్రతి అంశంలో పూర్తిగా చొచ్చుకొని పోయి ఉందని చివరికి భారతీయ భాషలలో కూడా మతపరమైన భావనలు స్వతః సిద్ధంగా ఉన్నాయని కాబట్టి ఈ జాతి మతాన్ని మార్చాలంటే దేశీయ భాషలని కూడా మార్చాలని దానికొక కొత్త భాష కనిపెట్టాల్సి వస్తుందని అంటారాయన. కేవలం భాష విషయంలోనే కాక భారతదేశం నుంచి హిందూ మతాన్ని పారద్రోలాలంటే సంగీతం సాహిత్యం వగైరాలన్నిటిని సమూలంగా మార్చాల్సి వస్తుందని ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదని గుర్తించి ఈ మిషనరీలు ఈ పనికి పూనుకోవాలని అంటారు కుమారస్వామి. ఇది అసాధ్యమైన వ్యవహారమే కనుక మిషనరీల ప్రభావానికి లోనైన భారతదేశంలో మత మార్పిడి జరగకపోయినా దేశం లౌకిక వాదానికి బానిస అవుతుందని అంటారు ఆయన. ఇది దాదాపు డెబ్బై ఏళ్ల నాటి మాట ఈ విషయంలో మనం సాధించిన ప్రగతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక వేళ భారతీయ సంస్కృతిని మార్చకుండా ఒక కొత్త తరహా “భారతీయ క్రైస్తవం” ప్రతిపాదించాలని ఉవ్విళ్లూరే మిషనరీలు కూడా కనీసం ఒక పదిహేను ఏళ్ళు భారతీయ జీవనంలో మమేకమై అటు తర్వాత మతమార్పిడి కార్యక్రమాల కోసం నోరు తెరిచే ప్రయత్నం చేయాలనీ అంటారు ఆయన. నిజంగా ఎవరన్నా ఇటువంటి పనికి పూనుకుంటే పదిహేనేళ్ళు అయ్యాక భారతీయ ధార్మిక జీవన మూలాలు సరిగ్గా అర్థం చేసుకుంటే అసలు మత మార్పిడికి పూనుకోవాల్సిన అవసరమే వారికి కనపడక పోవచ్చును అని అంటారు కుమారస్వామి.

తనకు క్రైస్తవ మత ప్రధాన విలువల పట్ల ద్వేషమేమి లేదని ఐతే ఆ విలువలకు ఒక విశ్వజనీనత ఆపాదించి అన్ని చోట్ల అదే విలువల ప్రచారం చేయాలని అనుకోవటంలోనే తనకు ప్రధాన అభ్యంతరం అని అంటారు ఆయన. కాబట్టి హిందూ దృక్కోణంలో క్రైస్తవం గురించి తనకేమి ద్వేష భావమేమి లేదనీ ఈ దేశంలో మతానికి సంస్కృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తించిన క్రైస్తవ మత ప్రచారకర్తలు మత మార్పిడి కోసం దేశీయ సంస్కృతులని నాశనం చేయాలని అనుకోవటం గురించే వచ్చింది చిక్కంతా అంటారు ఆయన.

తన మతాన్ని ఇతర మతాలతో పోల్చే హక్కు ఎవరికీ లేదని ఒక వేళ అలా పోల్చాలి అని అనుకొనే వారు ముందుగా ఇతర మతాల మూల భావాలని వారి వారి భాషలలో అధ్యయనం చేయాలని అన్నారు. హేతువాద మేధావుల అనువాదాలను చదివి ఇతర దేశాల మతాలను గురించి తెలుసుకోవాలని అనుకోవటం ప్రమాదకరం అని అంటారు కుమారస్వామి. హేతువాదులకి ప్రాక్పశ్చిమ మతశాస్త్రాలలో ప్రవేశం తక్కువని మత గ్రంథాలలోని భావాల గాఢతను గుర్తించే శక్తి మరియు జిజ్ఞాస వారికి ఉండదని అభిప్రాయపడ్డారు ఆయన.

తన ఉద్దేశంలో ఏ నాగరికతకూ మరొక నాగరికత నుంచి ఏదో కొత్త విషయం నేర్చుకోవలసిన అవసరం పెద్దగా లేదని అంటారు ఆయన. ఎవరన్నా పశ్చిమ దేశాల వారు భారతీయ జ్ఞాన సారం కొరకు ఈ దేశానికి వస్తే వారికి ఆయన ఇచ్చే సందేశం ఇదేనట. “మీరు భారత దేశానికి వచ్చి జ్ఞానం సంపాదించాల్సిన అవసరం ఏమి లేదు మీ దేశ సంప్రదాయాలలోకి తొంగి చోశారంటే మీకు ఇవే భావనలు కనపడతాయి. తూర్పు దేశాల సంప్రదాయాలు ఏవో మీకు తెలియని కొత్త విషయాలని చెప్పవు మీరు మర్చిపోయిన మీ దేశ సంప్రదాయాలను మీకు గుర్తు చేస్తాయంతే” అంటారు ఆయన.

ఎన్లైటెన్మెంట్ (Enlightenment) మరియు ఫ్రెంచి విప్లవానంతరం పుట్టుకొచ్చిన పారిశ్రామిక సమాజానికీ పరంపరానుగత కుల వ్యవస్థకి సామ్యం ససేమిరా కుదరదని అంటారాయన. భారతీయ ధార్మిక జీవనానికి మూల స్తంభమైన వంశానుగత కుల వ్యవస్థను తక్కువ చేయటం వెనుక రహస్యం ఇదే అంటారాయన. మానవ సంబంధాలు మరియు విలువలు మంటగలిసిన పారిశ్రామిక యుగంలో ఉత్పత్తి అన్నదానికి లాభాపేక్షను మించిన పరమార్థం లేదనీ అందుకనే ప్రతి పనికి దైవత్వాన్ని ఆపాదించి కుల ధర్మంగా రూపొందించిన వ్యవస్థకు పారిశ్రామిక యుగంలో గుర్తింపు లేదని అంటారు ఆయన.

ఇప్పటి కాలానికి మల్లే పర్యావరణ విధ్వంసాన్ని అభివృద్ధి లేదా ప్రగతి పేరుతో భూమాతపై చేసే అత్యాచారాన్ని ధర్మ పరాయణుడైన ఏ రాజు సమర్ధించడని ఇటువంటి ఘోరమైన పర్యావరణ విధ్వంసం అన్నది ప్రజాతంత్రంలోనూ అది తీసుకువచ్చిన పారిశ్రామిక మార్కెట్టు పెట్టుబడి దారీ విధానంలోనే సాధ్యం అని అంటారాయన.

పారిశ్రామీకరణ మరియు పాశ్చాత్య నాగరికత యొక్క ప్రభావానికి లోనైన ఏ సంప్రదాయ సమాజంలోనైనా మొదట జరిగేది వంశానుగత వృత్తుల సంస్కృతుల విచ్ఛినమే అని అంటారాయన. మనిషి కేవలం తిండి కోసమే బ్రతకడని (man does not live by bread alone) పరంపరానుగత వృత్తులు సంస్కృతులు అంతర్ధానమవటం వలన ఆ పరంపరల తాలూకా తర్వాతి తరాలు కోల్పోయే వెల కట్టలేని సంపద ఎంతో ఉంటుందని అంటారు ఆయన.

జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి అన్న వాదన గురించి పారిశ్రామిక నాగరికత యొక్క వైశిష్ట్యం గురించి కొన్ని చర్చలు చేసారు కుమారస్వామి గారు. హద్దులు మీరిన కోరికలు కోరుకుంటూ ఉండటం ఆ కోరికలు తీరటానికి కొత్త సాంకేతికతను తయారు చేసుకోవటం నాగరికత కాదని అంటారు ఆయన. ఇప్పుడు మనం కనీస అవసరాలుగా భావించే కొన్ని సాధనాలు కూడా నేటి యుగంలో మట్టికీ మనిషికీ ఒక అగాధం ఏర్పాటటం వలన ఏర్పడిన అవసరాలే అని అంటారు ఆయన. మనం కేవల కాలక్షేపానికి ఉపయోగించే పరికరాలు వినోద సాధనాలు కూడా మనకి మౌలిక అవసరంగా మారిపోవడానికి కారణం ఉదరపోషణకై మనం చేసే ఉద్యోగాలు మన మనసుకు సాంత్వన ఇవ్వనందువలననే అని అంటారు .

విలువల గురించి ఆదర్శ జీవితం గురించిన చర్చ జరగాల్సిన అవసరం ఉంది అంటారు కుమారస్వామి. మానవ జీవిత లక్ష్యాలను నిర్దేశించాక ఆ లక్ష్యానికి అనువైన సాధనాలను జీవన విధానాలను రూపొందించుకోవాలని అంటారు ఆయన. ఉత్పత్తి విషయంలో రాశి కంటే కూడా నాణ్యత ముఖ్యం అని అంటారు .

నియంతృత్వానికి తాను వ్యతిరేకిని అంటూ ప్రజాస్వామ్యాన్ని కూడా తాను పెద్దగా సమర్థించనని అంటారాయన. తనని పాలించే వాడు తనకంటే గొప్పవాడు అవ్వాలి కానీ తనలాంటి వాడే అవటం వల్ల పెద్దగా ఉపయోగం లేదని అంటారు .

డాక్టర్ నైబర్ అనే అతను ఒక పుస్తక సమీక్షలో ఇలా రాశారట “Indian caste system as “the most rigid form of class snobbishness in history” అని. అంటే భారతీయ సమాజంలో కనపడే కులవ్యవస్థను మించిన వర్గ దురహంకారం మరెక్కడా ఉండదని ఆయన అభిప్రాయమట. సామాజికంగా ఎదగాలి అన్నఆశయమే భారతీయమైనది కాదనీ అమెరికా ఐరోపా దేశాల వారిలాగా “keeping up with the joneses” అంటే పొరుగింటి వారి స్థోమతను చూసి అసూయ పడి వారిలాగా జీవించాలని తాపత్రయపడే లక్షణం భారతీయులకి లేదనీ అటువంటి సమాజంలో వర్గ దురహంకారానికి తావు లేదనీ వాదిస్తారు కుమారస్వామి.

నిజానికి నేటి పారిశ్రామిక ప్రజాస్వామ్య దేశాలలో కంటే కూడా భారతీయులకి తమతమ గ్రామసభల్లోనూ కుల సంఘాలలోనూ అసలైన ప్రజాస్వామ్యం, స్వీయ ప్రభుత్వం మరియు గుర్తింపు ఉండేవి అని అంటారాయన. ఇది మాత్రమే కాక ఏ.ఎం. హోకార్ట్ అన్నరచయిత రాసిన “Les Castes” అన్న పుస్తకం గురించి ప్రస్తావిస్తూ అందులో ఆ రచయిత రాసిన “hereditary service is quite incompatible with our industrialism, and that is why it is always painted in such dark colors.” అన్న వాక్యాన్ని గుర్తుకు తెస్తారు కుమారస్వామి ఒక లేఖలో. ఆ వాక్యానికి అర్థం ఏమిటంటే పారిశ్రామిక విప్లవానంతరం ఏర్పడిన సమజాలలోని వ్యవస్థలకూ వంశానుగత పరంపరలతో ముడిపడి ఉన్న సంస్కృతులకూ ససేమిరా పొసగదని అందుకే అటువంటి సంస్కృతులను కించపరిచే విధంగా ప్రచారాలు జరిపించారనీ అంటారు హోకర్ట్. హోకర్ట్ రాసిన ఆ పుస్తకం నేను చదవటం జరిగింది. వర్ణాశ్రమ ధర్మ ఆధారిత సంస్కృతులను అధ్యయనం చేయాలని అనుకునే వారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. ఒక వేళ ఆ విషయం పైన ఇప్పటికే నిశ్చితమైన అభిప్రాయం ఉన్నా సరే తప్పక చదివి తీరాలి. వర్ణాశ్రమ వ్యవస్థలో అణచివేతకు స్థానం లేదనీ ఒకవేళ ఉందని వాదించినా ఇప్పటి పారిశ్రామిక సమాజంలో ఉన్న అణచివేతకంటే అది తక్కువేనని అంటారు హోకర్ట్.

మరొక లేఖలో స్వేచ్ఛను గురించి ఆసక్తి కరమైన చర్చ చేసారు కుమారస్వామి గారు. స్వేచ్ఛ అన్నది తన సంస్కృతితో కలిసి జీవించటంతో ముడిపడి ఉంటుందనీ నిజానికి ఉన్నత వర్గాల వారికే వారికి నచ్చినట్టు వ్యవహరించే స్వేచ్ఛ ఇంకా తక్కువగా ఉంటుందని వారిమీద ఉన్న విధి నిషేధాలు మిగిలిన సామాజిక వర్గాల మీద ఉండదని అంటారు కుమారస్వామి.ఈ విషయం అర్థం చేసుకోవటం కష్టమని ఒకవేళ అమెరికా వారికి కుల వ్యవస్థను గురించి చెప్పి మీకు నచ్చిన కులాన్నిమీరు ఎంచుకోండి అని అంటే వారంతా కులభ్రష్టుల లాగా వ్యవస్థకు వెలుపల ఉండటానికే ఇష్టపడతారని అంటారు కుమారస్వామి. విధి నిషేధాలు లేకుండా బతకటమే అమెరికావాసులకి ఇష్టమని అంటారాయన. ఇది ఎవరినో తక్కువ చేయటానికి చెప్పిన వ్యాఖ్యలు కావు. ఇందులో చాలా గాఢమైన అర్థం ఉంది. విశ్వనాథ గారు తన నవలా సాహిత్యంలో ఒక చోట “అన్ని ధర్మాలు పోయి ఇష్టమనే కొత్త ధర్మమొచ్చింది” అంటారు ఒక చోట. నాకు నచ్చింది నేను చేయగలగడం అన్నది సమాజ ఉన్నతికి చిహ్నం అని అనుకుంటున్న ఈ రోజులల్లో అమెరికాను ఏలుతున్న ఉన్నత వర్గాల వారి దగ్గరకి వెళ్ళి వర్ణాశ్రమ ధర్మానికి చెందిన అధికార విధి నిషేధాలను గురించి చర్చిస్తే బహుశా వారు ఈ విధి నిషేధాలు నాకు అక్కర్లేదు అని ఆ వ్యవస్థకు వెలుపల ఉండటానికే ఇష్టపడచ్చును అని కుమారస్వామి గారి ప్రతిపాదన.

కుల వృత్తుల విధి నిషేధాలు మనకు నచ్చక పోవటానికి కారణం ఆ విలువలకు పారిశ్రామిక సమాజాలకు సామ్యం కుదరకపోవడం వల్లనే అని అంటారు కుమారస్వామి గారు మరోసారి ఇంకొక లేఖలో. ఒక కుటుంబంలో తల్లి తండ్రుల పైన ఎంతో బాధ్యత ఉంటుందని వారు ఎన్నో కట్టుబాట్లకు తలొగ్గి ఒక భాద్యత కోసం పని చేస్తూ ఉంటారని అదే కుటుంబంలో ఉండే పిల్లల మీద ఏ బరువు బాధ్యతలు ఉండవని వారు వారికి నచ్చిన తీరులో బతుకుతూ ఉంటారని అదే విధంగా వర్ణాశ్రమ ధర్మానికి అనుగుణంగా ఉన్న సమాజాలలో ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరించే స్వేచ్ఛ ఉన్నత కులాలలో వారికి చాలా తక్కువని అంటారు కుమారస్వామి. స్వేచ్ఛ అంటే నచ్చినట్టు ఉండటం అని ఆ పదానికి ఉన్న పరిధిని తగ్గించివేసి అందరిని చిన్న పిల్లల లాగా ఉండమనటం అన్నది సహేతుకమైన ఆలోచన కాదనీ అయినా ఇప్పటి సమాజం అటు వైపే ప్రయాణం సాగిస్తోందనీ అంటారు కుమారస్వామి మరొక లేఖలో. పారిశ్రామిక సంస్కృతులలో ఒక పౌరుడు ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఇది చేయతగినదేనా అని ఆలోచించటం ఆపేసి ఇది చేస్తే నాకెంత డబ్బొస్తుంది అని ఆలోచించటం ప్రారంభించాడనీ విలువలతో బేరీజు వేసే లక్షణం పాశ్చాత్య సమాజాలలో పూర్తిగా నాశనం అయిపోయిందనీ ఇంకా ఆ పరిస్థితి ఈశాన్య సంస్కృతులలో రాలేదనీ అంటారాయన. ఇది ఆయన రాసినప్పటి మాట.ఇప్పటి ఆధునిక భారతం ఎప్పుడో డబ్బుకి దాసోహం అయిపోయిందన్న విషయం అందరికి తెలిసినదే

ఇప్పటికీ ఆధునిక పాశ్చాత్య యాంత్రిక జీవనానికి పారిశ్రామిక సమాజానికి దూరంగా ఉండగలిగిన వారికి సనాతనమైన భారతీయ సంస్కృతికి చెందిన కొన్ని ప్రాథమిక మౌలిక నైతిక సూత్రాల ఆధారంగా పాశ్చాత్య జగత్తుని విమర్శించటం సాధ్యపడుతుందని అంటారు కుమారస్వామి. అమ్నాయ పీఠాలకు చెందిన శంకరాచార్యుల ప్రవచనాలు (ఉదా: ప్రస్తుత పూరీ శంకరాచార్యులు) ఈ కోవకి చెందినవి నా ఉద్దేశంలో.

ఇటువంటి విషయాలలో మౌలిక సిద్ధాంతాల ఆధారంగా చర్చ జరగాలంటే ప్రధానమైన అడ్డంకి మతాంతరీకరించాలన్న ఆవేశమేనని (prosletysing fury) అంటారు కుమారస్వామి. ఐరోపా దేశాలకి అమెరికా దేశాలవారికి మాతాంతరీకరణ లేదా తమవి కాని సంస్కృతులను ధ్వంసం చేయాలన్న బలమైన కాంక్ష ఉందని అంటారు రచయిత. ఈ మతాంతరీకరణ అన్నది అన్నిటి కంటే ఎక్కువగా విద్యా వ్యవస్థలో కనిపిస్తుందని అంటారు కుమారస్వామి. వేల సంవత్సరాలు జీవించి ఉన్న సంస్కృతులను కూడా విద్యా విధానాల ద్వారా ఒక్కతరంలో నాశనం చేయవచ్చునని అంటారు కుమారస్వామి. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చాలని మానవతావాదమనో మరేదో అనో నిర్మించే విద్యావిధానాలలో ఇటువంటి దోషాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయని అంటారు కుమారస్వామి. ఫలానా జాతిని వెనుకబడిన జాతి అని మరొక జాతిని అభివృద్ధి చెందిన జాతి అనటంలోనూ ఈ మతాంతరీకరణ భావాలు కనపడతాయని అంటారాయన. ఒక జాతిమొత్తానికి విద్య నేర్పేముందు ఆ పాలక పక్షాల వారు తమను తాము సంస్కరించుకోవాలనీ తప్పుడు చదువులు చదవటం కంటే ఏ చదువూ లేకపోవటమే కొన్ని సార్లు మంచిదని అంటారాయన.

భారతదేశంలో ఎన్నో భిన్నత్వాలు ఉన్నప్పటికీ సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా ఈ దేశాన్ని కలిపే ఏకత్వం ఒకటి ఉంది. రాజకీయ దృక్కోణంలో ఆర్థిక విషయాలలో సార్వభౌమత స్వయంప్రతిపత్తి ముఖ్యమైన విషయాలేననీ అయినప్పటికీ వాటికంటే కూడా ముఖ్యంగా మనం కాపాడుకోవాల్సినది ఈ సాంస్కృతిక ఏకత్వాన్ని అని అంటారు ఆయన. కేవలం తిండి కోసం మాత్రమే భారతదేశంలో ఎపుడు ఎవరూ బతకలేదని ధార్మిక జీవనానికి పెద్ద పీట వేసిన దేశం ఇదనీ సంస్కృతిని మతాన్ని వేరు చేసి చూడటం భారతదేశం విషయంలో సాధ్యపడదనీ అంటూ ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రము అన్నది రావాలంటే పాశ్చాత్య జగత్తు లాగా ఆర్ధిక స్వతంత్రం గురించి మాత్రమే ఆలోచిస్తే సరిపోదనీ సాంస్కృతిక ధార్మిక స్వాతంత్య్రము గురించి కూడా ఆలోచించాలని అంటారాయన. అటువంటి సంపూర్ణ స్వాతంత్య్రము మనకు సిద్ధించాలంటే మన విద్యా విధానం పైన పాశ్చాత్య సంస్కృతి యొక్క గుత్తాధిపత్యాన్ని పూర్తిగా పెకిలించి వేయాలని అంటారాయన. టెక్స్ట్ బుక్కు తయారు చేసే విషయంలో పాశ్కాత్య పాలకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించాలని అంటారాయన. అంతే కాక నాగరికత అంటే ప్రజాస్వామ్యమనీ అలాగే ప్రజాస్వామ్యాన్ని పారిశ్రామికీకరణతోనూ సంస్కృతిని శాస్త్రీయ మానవతావాదముతోనూ మతమంటే క్రెస్తవమేనని ముడిపెడుతూ అన్ని సమాజాలని మతాంతరీకరించాలన్న వాంఛ నుంచి భారతీయ సమాజానికి విముక్తి రావాలని అంటారు రచయిత.

దీని అర్థం ఏమిటంటే భారత దేశానికి స్వాతంత్య్రం లభించాలని కోరుకునే పాశ్చాత్య మిత్రులు కూడా నిజమైన స్వాతంత్య్రం అంటే భారతీయులు తమ స్వత్వాన్ని కాపాడుకుంటూ ఎన్నో మౌలిక విషయాలలో పాశ్చాత్యుల కంటే భిన్న దృక్పథం కలిగి ఉండటమే అని తెలుసుకోవాలి అని అంటారు కుమారస్వామి. పాశ్చాత్యులకి వినబడే భారతీయ గొంతుకలన్నీ అప్పటికే పాశ్చాత్య విద్యావిధానం అవలంబించిన వారివో లేదా పాశ్చాత్య విలువల ఆధారంగా ఆలోచించే వారివోనని నిఖార్సైన సనాతన హిందువుల వాదన పాశ్చాత్య మిత్రులకి వినపడే అవకాశం లేదని అంటారాయన. కాబట్టి భారతీయ సమాజాన్ని సంస్కరించాలని ఉద్దరించాలని తాపత్రయ పడే ఈ పాశ్చాత్య మిత్రులకి తన తరఫు నుంచి ఒక సూచన అంటారు కుమారస్వామి. కుల వ్యవస్థని నాశనం చేయటంలోనో, పర్దా సంప్రదాయాన్ని నిర్మూలించటంలోనో అందరికి ఒకటే చదువు చెప్పే విద్యా విధానంలోనో లేదా నాయకులని ఓట్ల లెక్కల పద్ధతిలో ఎన్నుకోవటంలోనో (count of noses) ఏదో గొప్ప స్వేచ్ఛ దాగుందనీ భారత జాతికి విముక్తి ప్రసాదిస్తున్నామని అనుకోరాదని సున్నితంగా హెచ్చరిస్తున్నానని అంటారాయన. ఈ పై సంస్కరణలను తిరస్కరించగలగటం కూడా ఒక రకమైన స్వాతంత్య్రమేనని, మొరొక్కోపాషా చెప్పినట్టు కళ్ళుమిరుమిట్లు గొలిపే అత్యంత గొప్ప అమెరికా జీవనవిధానాలను కాదనగలగటం కూడా ఒక రకమైన స్వాత్రంత్య్రమేనని అంటారాయన. స్వతంత్ర భారత దేశపు గొంతుక ఇతర దేశాలకు (అవి ఎంత గొప్పవైనా సరే!) వత్తాసు పాడేది కాకూడదనీ అది తన స్వత్వాన్ని కాపాడుకుంటూ వికసించే గొంతుక అవ్వాలనీ తన ఆకాంక్ష అంటారు కుమారస్వామి.

గాంధీ గారికి కుమారస్వామి రాసిన లేఖ ఒకటి పొందుపరిచారు ఈ సంకలనంలో. ఇందులోని కొన్ని విషయాలు నన్ను ఎంతో ఆలోచింపజేశాయి.

గాంధీ గారంటే తనకు ఎంతో ఆదరాభిమానాలని అయన తన జీవితాంతం మతాన్ని ధర్మాన్ని రాజకీయాల నుంచి వేరు చేయటాన్ని సమర్ధించలేదని కుల వ్యవస్థను సంస్కరించాలని అనుకున్నాడే కాని నిర్మూలించాలని అనుకోలేదని అంటారు ఈ లేఖలో కుమారస్వామి. ఈ రెండు విషయాలనే ప్రధానంగా ప్రస్తావించటం వెనుక మర్మాన్ని వివరిస్తారు ఈ లేఖలో తర్వాత గాంధీ మహాత్మునికి. ధర్మానికి అనుగుణంగా రాజు ప్రజలని పాలించటము అన్నది భారతీయమైన ఆలోచన అని నిజానికి సంప్రదాయ సమాజాలన్నిటిలో ఇటువంటి భావనలే ఉండేవని అంటారు ఆయన. రాజు అనేవాడు రాజధర్మానికి లోబడి పాలన చేయని పక్షంలో అతనిని ధర్మరాజని ప్రజలెన్నడూ కీర్తింపజాలరని అంటారు కుమారస్వామి. రాజు అన్న వాడు ఎప్పుడూ నిష్పక్షపాతంగా వ్యవహరించగలగాలనీ స్వార్థ ప్రయోజనాల కోసం పాలించకూడదని అంటారు ఆయన. ఈ విధమైన స్వీయ నియంత్రణ విచక్షణ అన్నది ప్రభుత్వాన్ని పాలించే ప్రభువుకి ఉండాలి అని గాంధీ గారు కూడా విశ్వసించటం శ్లాఘనీయం అని అంటారు కుమారస్వామి

జాతి వ్యవస్థను గురించి గాంధీగారితో ప్రస్తావిస్తూ ఇలా అంటారు కుమారస్వామి. ప్రతీ మనిషికి స్వతః సిద్ధంగా గల గుణ స్వభావాలను అనుసరించి బతుకు తెరువు చూసుకొనే వెసులుబాటును స్వేచ్ఛను కలిపించటమే కుల వ్యవస్థ పరమార్థమని పారిశ్రామిక సమాజాలలో పూర్తిగా వర్గ నిర్ములన జరిగినా సరే ప్రతి మనిషికి న్యాయం జరగదని అంటారు కుమారస్వామి.చిన్న చేపను పెద్ద చేప తినటమనే మత్స్య న్యాయమే ప్రధాన సూత్రంగా నిర్మించిన సమాజంలో అందరికి న్యాయం జరగటం అసంభవమని అంటారు కుమారస్వామి. సామాజిక ప్రగతికి నిరుద్యోగం అన్నది తప్పనిసరి పరిస్థితిగా భావించే ఆధునిక సమాజంలో సమన్యాయం జరుగుతుంది అనుకోవటం పెద్ద భ్రమ అంటారు కుమారస్వామి. కేవలం ఆర్ధిక స్థితి గతుల ఆధారంగా మాత్రమే ఒక వ్యక్తి జీవిక నిశ్చయించటం అన్న ప్రధాన సూత్రం మీద ఆధారపడిన పారిశ్రామిక సమాజంలో సామజిక న్యాయం అసంభవం అని అంటారు కుమారస్వామి ఈలేఖలో.

ఎరిక్ గిల్ అనే మేధావి ఆధునిక ఫ్యాక్టరీ వ్యవస్థను క్రైస్తవ విరుద్ధమని అన్నాడని ఆ విధంగా ఆలోచిస్తే ఈ ఫ్యాక్టరీ వ్యవస్థ హిందూ ధర్మానికి కూడా విరుద్ధమైనదే అని అంటారు కుమారస్వామి. యాంత్రిక ప్రగతి అనే రథ చక్రం కింద నలిగిపోయే దయనీయ స్థితిలో ఆధునిక కార్మికుడు ఉన్నాడని ఎందరో మేధావులు అభిప్రాయపడ్డారని అంటారు కుమారస్వామి. నాణ్యతను బట్టి తన పనితనాన్ని బేరీజు వేసుకునే సాంప్రదాయ కళాకారుని స్థాయి నుంచి వేగానికి రాశికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే మరమనిషి స్థాయికి ఆధునిక శ్రామికుడిని దిగజార్చామని అంటారు కుమారస్వామి. పరంపరానుగతమైన కులవృత్తులని గౌరవించటం అన్నది భారతీయులకి సంస్కృతి సిద్ధంగా అలవడినదని ఈ కులవ్యవస్థ ప్రాతిపదికనే అద్భుతమైన అమెరికా జీవన విధానాన్ని భారతీయులు నిర్ద్వందంగా తిరస్కరించాలనీ తప్పని సరి పరిస్థితిలో ఆత్మ రక్షణార్థం అప్పద్ధర్మంగా స్వీకరించాల్సి వస్తే అది వేరే విషయమని అంటారాయన. కుల వృత్తులని వదులుకుంటే పారంపరిక సంస్కృతుల విచ్చిన్నం జరగటం తప్పదని అంటారాయన. కుల ధర్మాల గురించి ఇంతకు మునుపు ప్రస్తావించిన ఏ ఎం హోకర్ట్ అన్న మేధావి ఇలా అన్నారట. పరంపరానుగతంగా జీవిక కోసం అవలంబించే ప్రతీ కుల వృత్తి కూడా ఒక పవిత్ర బాధ్యతనీ అది భగవంతుడి సమక్షంలో చేసే అర్చకత్వం వంటిదేనని అన్నారట. అస్పృశ్యతను గురించి కూడా గాంధీకి రాసిన ఈ లేఖలో ప్రస్తావించారు కుమారస్వామి గారు. భారతీయమైన విధి విధానాలను అవలంబిస్తూనే అస్పృశ్యత అనే సమస్యకు సమాధానం వెతకాలి అని అభిప్రాయపడ్డారు కుమారస్వామి. ఐతే దీనితోపాటే పరమ దౌర్భాగ్యమైన పరిస్థితిలో అమెరికా వంటి దేశాలలోని యాంత్రిక పరిశ్రమలలో పని చేస్తున్న చైను బెల్టు కార్మికుల వంటి వారిని గురించి కూడా ఆలోచించాలని చురకంటించారు ఈ లేఖలో. భారతీయ సమాజాన్ని సమూలంగా సంస్కరించి పాశ్చాత్య పారిశ్రామిక సమాజం అనే భూతల స్వర్గము యొక్క విధి విధానాలను అవలంభించాలనే వాదనను కుమారస్వామి తన ప్రతి రచనలో ఖండిస్తూనే వచ్చారు. ఈ లేఖలో కూడా అదే పంథా అవలంబించారు.

గాంధీ మహాత్మునికి కళల గురించిన భారతీయమైన దృక్పథం లేదని కళ అంటే బొమ్మలు గీయటం రంగులు వేయటం అనేటువంటి అమాయకమైన ఆలోచనలను గాంధీ కలిగి ఉన్నాడని ఆక్షేపిస్తారు మరో చోట కుమారస్వామి. కళ అన్నది కేవలం సొంత ఇష్టాయిష్ఠానికి సంబంధించిన వ్యవహారం కాదని స్మృతి శృతులకి సంబంధించిన జ్ఞాన సారం మొత్తం కళలలో ఇమిడి ఉందని అంటారు కుమారస్వామి.

ఆభరణాలను ధరించటంలో గాంధీ మహాత్ముని దృక్పథాన్ని కూడా కుమారస్వామి తప్పు బట్టారు మరో లేఖలో. తగిన స్థాయిలో ఆభరణాలతో అలంకరించుకోటానికీ మోతాదుకు మించి ఆడంబరాలకు పోయి ఆభరణాలు ధరించటానికి చాలా తేడా ఉందనీ ఆ తేడాలను గుర్తించకుండా ఎవరూ ఆభరణాలను ధరించరాదు అని గాంధీ అనటం హాస్యాస్పదమని అంటారు కుమారస్వామి. ఇదంతా కూడాను సమాజం మొత్తాన్నీ సన్యాసం స్వీకరించమనే కుటిల ప్రచారంలో భాగమని అంటారు కుమారస్వామి. గాంధీకి సన్యాసం స్వీకరించే హక్కు ఉన్నదనీ ఆ హక్కును తాను పూర్తిగా సమర్థిస్తాననీ ఐతే సమాజంలో ప్రతి వ్యక్తిని తనకుమల్లే సన్యాసిగా మార్చాలని గాంధీ భావించటం పెద్ద తప్పని అంటారు కుమారస్వామి. గాంధీ మార్గం అవలంబిస్తే సమాజంలో అందరికి అకాల వైరాగ్యం సంభవిస్తుందని దాని పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయని అంటారు కుమారస్వామి. గాంధీజీతో కొన్ని విషయాలలో ఏకీభవించినప్పటికీ తనకి ఎన్నో విషయాలలో ఆయనతో అభిప్రాయ బేధాలున్నాయని అంటారాయన. గాంధీజీ ఆలోచన సరళి అంతానూ విక్టోరియన్ భావజాల ప్రభావితమైనదని ఆయన ఈ విచిత్ర ఆలోచనలకు మూలం అదేనని అంటారు కుమారస్వామి. గాంధీజీని ఒక మునిగా (saint) తాను గౌరవిస్తానని కానీ ఆయన మహా జ్ఞాని కాడని అంటారు కుమారస్వామి. తాను మహర్షిని కాకపోయినను మహా జ్ఞానిని కాకపోయినను కూడా తను ఎవరి అభిప్రాయాల ఆధారంతో మాట్లాడుతున్నానో వారిలో ఋషిత్వం మరియు జ్ఞానము రెండు కలగలిసి ఉన్నాయని అంటారు .

ఇక్కడ 1880లో జార్జ్ బర్డ్ వుడ్ అనే మేధావి ప్రతిపాదించిన విషయం ఒకటి ప్రస్తావిస్తారు కుమారస్వామి. పాశ్చాత్య విద్యా విధానం భారతీయులలో వారి సొంత సాహిత్యం పట్ల వారిదైన కళల పట్ల విద్వేషం పెంచిందనీ అంతే కాక వారి సాంప్రదాయ జాతీయ మత ధర్మాల పట్ల విరోధాన్ని పెంచిందని అంటారట బర్డ్ వుడ్. పాశ్చాత్య విద్య ప్రభావం వలన భారతీయులకి వారి సొంత గృహ వాతావరణం అంటే ఈసడింపు ధోరణి అలవడిందనీ వారి తలిదండ్రుల పట్ల అగౌరవం, అక్క చెల్లెళ్ళ పట్ల మరియు భార్య పట్ల చిన్నచూపు కలుగుతోంది. పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి లోనైన ప్రతి కుటుంబంలో సుఖ శాంతులనేవి లేకుండా పోతోందని అంటారట బర్డ్ వుడ్. బర్ద్ వుడ్ చేసిన ఈ వ్యాఖ్యలను మర్చిపోకూడదు అంటారు కుమారస్వామి.

భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం కంటే కూడా మిగిలి ఉన్న అవశేషాల పరిరక్షణ గురించి ఎక్కువగా ఆలోచించాలని అంటారు ఆయన.ఆ సంస్కృతి కేవలం భారతీయమైనది అయినందున మాత్రమే మనము దానిని కాపాడుకోవాలని తాను అనట్లేదనీ అసలు నిజానికి సంస్కృతి అంటే ఏమిటి అంటే చూపటానికి ఈ ఆధునిక సమాజానికి భారతీయ సంస్కృతిని మించిన నమూనాలేనే లేదని అంటారు కుమారస్వామి. ఆ కారణం చేతనే అటువంటి సంస్కృతిని పరిరక్షించటం మన బాధ్యత అని అంటారాయన.

అమెరికా ఐరోపా దేశాలకు పై చదువులకు వెళ్తున్న భావి భారత విద్యా విధి విధాన నిర్మాతలైన తరాన్ని చుస్తే తనకు జాలేస్తుందని అంటారాయన. ఆ విద్యార్ధులకి పాశ్చాత్యుల మల్లే భారతీయ సాంస్కృతిక విలువలు సంప్రదాయాలు అస్సలు తెలియవని కొన్ని విషయాలలో పాశ్చాత్యులే వీరి కంటే మెరుగని అంటారు కుమారస్వామి. పాశ్చాత్య విద్యా విధానంలోని లోటుపాట్లు విదేశాలకు చదువుకోవటానికి వచ్చే ఈ భారతీయ విద్యార్ధులకి తెలిసే అవకాశమే లేదని అంటారాయన. విదేశాలలో రెండిటికి చెడ్డ రేవడి వంటి విచిత్ర వేషధారణతో జీవన విధానాలతో మనలని మనమే గేలి చేసుకుంటున్నామని అంటారు కుమారస్వామి.

స్వేచ్ఛకు నిజమైన పరిభాష తన వ్యక్తిత్వానికి అనుగుణంగా మసలుకోగలగటమేనని అంటారు కుమారస్వామి. కానీ మన నాయకుల వ్యక్తిత్వాలు ఇప్పటికే పరాధీనమై పోయాయి, మెకాలే కలగన్నట్టుగా వారిలో ఉన్నది భారతీయ రక్తమైనప్పటికీ వారి రంగు ఈ జాతికి చెందినదైనప్పటికిని వారి భావాలు , విలువలు , అభిప్రాయాలు , ఆలోచనలు అన్నియు పరాధీనం ఐపోయినవి. వారింకా భారత దేశాన్ని డిస్కవర్ చేయాల్సి ఉన్నది. ఆధునిక ప్రపంచపు అభివృద్ధి అనే మత్తు నుంచి వారు ఇంకా బయటపడలేదు. పాశ్చాత్య ఆధునిక అభివృద్ధి నమూనా ఒక వ్యవస్థీకృత అనాగరికత మరియు అరాచకం అని అంటారు కుమారస్వామి. వారి రాజ్యపాలనావిధానం ఒక చిందర వందర గందరగోళం. ఇప్పటి భారతీయ రాజకీయ నాయకులలో స్వత్వం అన్నది పూర్తిగా నశించింది వారి ముందు తరం నుంచే మిషనరీ విద్యా విధానం ప్రారంభమయింది ప్రభుత్వ ఆధీనంలో నడిచే విశ్వ విద్యాలయాలు వచ్చాయి. ఆ ప్రభావం వల్లనే ఈ నాయకులలో ఆత్మశుద్ధి లోపించింది అంటారు కుమారస్వామి. ఇది స్వాతంత్య్రము రాక మునుపు మాట అన్నది గమనించాలి మనము.

భారతదేశానికి తన స్వేచ్ఛను తాను తిరిగి పొందాలంటే ఇంకా ఎన్నో తరాలవుతుంది. ఇప్పటికైతే ఈ దేశ భవితను నిర్దేశిస్తున్న చదువుకున్న జనాభా అంతానూ అమెరికా వారికి మల్లే “సర్వ మానవ సమానత్వం” “ప్రజాతంత్రం” “అభివృద్ధి/ప్రగతి” “అక్షరాస్యత” వంటి మిధ్యా పదాల మాయలో కొట్టుకొని పోతున్నారు. కేవలం యూరోపుకూ అమెరికాకు నకలుగా ఉండటానికి మాత్రమే మరియు వారి ఆలోచనా విధానాలను కాపీ కొట్టటానికి మాత్రమే పనికొచ్చేలాగా అయిపోయింది నేటి భారతం. శూద్రుల నాగరికత వలే అయిపోయింది ఇప్పటి భారతదేశం. అంటే కష్టపడే తత్త్వం ఉన్నా కూడానూ దిశా నిర్దేశం చేసే జ్ఞాన సముపార్జన చేసే దిక్కు లేకుండా అయిపోయింది మనకు అని కుమారస్వామి గారి అభిప్రాయం. ఆధునిక నాగరికత నుంచి మనము నేర్చుకున్నది ఇదే. మేధోశ్రమను గుర్తించలేకపోవటం జ్ఞాన సముపార్జన ప్రాముఖ్యతను గుర్తించకుండా ఏ రకమైన కూడా ఆలోచన లేకుండా కదన రంగంలోకి దూకి కాళ్ళు చేతులు విరగొట్టుకొని అవిటితనాన్ని కొనితెచ్చుకుంటున్నాం అంటారు అయన. ఇక్కడ కూడా అయన శూద్రులను తక్కువ చేస్తునట్టు కాదు భావం. సమాజంలో ఉన్నత స్థానం మేధావి వర్గానికే ఉండాలని జ్ఞాన సముపార్జన అన్నది అత్యంత ఉన్నత కార్యంగా ఉండాలని ఆయన భావన. అసలేముంది ఈనాటి భారత రాజ్యాంగంలో ? వట్టి పుస్తకమేగా? కొన్ని పేజీలు కొన్ని అక్షరాలు అదేమంత కష్టం అని అనము కదా? అంబేడ్కర్ సహా ఎందరో మేధావుల జీవిత కాల శ్రమ ఉంది ఆ రాజ్యాంగ నిర్మాణం వెనుక! మేధో శ్రమను కూడా గుర్తించాలి. దేని స్థానం దానిదే దేని స్థాయి దానిదే! అదే కుమారస్వామి భావం.

ఆధునిక పాశ్చాత్య జగత్తు ఊహించిన యుటోపియా అనే ఆదర్శ ధామాలలాగా కాకుండా గాంధీ మరియు భరతన్ కుమారప్ప పంచ వర్ష ప్రణాళికల ద్వారానో లేదా కేవలం ఆర్ధిక విధి విధానాలలో మార్పు ద్వారానో ఆధునిక ప్రపంచపు సమస్యలు తీరతాయి అని భ్రమలో లేరని ఆ విషయంలో వారికి తన పూర్తి మద్దతు ఉందని అంటారు కుమారస్వామి మరొక లేఖలో గాంధీని ప్రస్తావిస్తూ. కేవలం డబ్బు సంపాదనతో మనిషిని అంచనా వేసి సమాజంలో వ్యక్తి ప్రతిష్ఠను నిర్ణయించేకంటే మానవతా విలువలకు డబ్బుకంటే పెద్ద పీట వేసే సమాజాన్నే గాంధీ కోరుకున్నాడని అంటారు కుమారస్వామి.

మీరు కలలు కన్న నవ భారతావనికి మీరిచ్చే సందేశం ఏంటని అడిగారట కుమారస్వామిని ఎవరో. దానికి అయన జవాబుగా “నువ్వు నీ స్వత్వాన్ని కోల్పోకు! నువ్వు నీలా ఉండు” అని అన్నారట. ఎన్నో ఏళ్లుగా భారతదేశంలో ప్రగాఢమైన ధార్మికవిశ్వాసాలు ప్రజల దైనందిన జీవితంతో పెనవేసుకొని పోయాయని అలాగే పరమత సహనం కూడా లేకపోలేదని అంటారాయన. ఈదేశంలోని ప్రజలు తమ సంసృతిని ధర్మాన్ని కష్ట సుఖాలలో తమ వెన్నంటే ఉండే ఆత్మీయ సన్నిహితుడిగా చూసారని అదే సమయంలో సమాజ శ్రేయస్సు గురించి తదితరులకు కూడా చేదోడుగా ఉండే మంచి మిత్రుడిలా ఆ ధర్మాన్ని వారు చూసారని అంటారాయన. పాశ్చాత్య ప్రపంచంలో మత విశ్వాసాలు సన్నగిల్లుతున్నాయని అంటారు కానీ ఇప్పటికిని భారతదేశంలో ధర్మాభిమానం అన్నది ప్రజల హృదయ మస్తిష్కాలలో మెండుగా ఉందనీ వారికి వారి మతంతో విడదీయరాని అనుబంధం ఉందని అంటారు ఆయన. ధార్మిక మత విశ్వాసానికి సామజిక శాస్త్రానికి మరియు రాజకీయాలకు ఉన్న లంకె పాశ్చాత్య ప్రపంచం వలే తెగిపోలేదని అంటారు ఆయన. పాశ్చత్య ప్రపంచంలో లాగా సంస్కృతిని మతాన్ని వేరు చేసి చూడటం అన్నది భారతదేశంలో సాధ్యం కాదని అంటారు కుమారస్వామి. ఈ భావన మనకు పరంపరానుగతంగా లభించినదని ఈ వారసత్వాన్ని మనం వదులుకోకూడదని అంటారు కుమారస్వామి.

భారతీయ స్త్రీలు మన సనాతన సంస్కృతికి గొప్ప పరిరక్షకులని అది కూడా పాశ్చాత్య సమాజం వారిని “అప్డేట్” చేసేదాకనే అని అంటారు ఆయన. అక్షరాస్యతకు సాంస్కృతిక ఉన్నతికి సంబంధం లేదని అంటారు ఆయన. నాలుగు వారపత్రికలు దినపత్రికలు తిరగేసినంత మాత్రాన మేధావులైపోరని ఎలా చదవాలో తెలియకపోయిన పర్లేదని ఏది చదవాలో తెలియక ఏది పడితే అది చదవటమే ఇంకా పెద్ద ప్రమాదమని అంటారాయన.

ఇతర దేశాలతో కేవలం ఆర్ధిక రాజకీయ సంబంధాలు మాత్రమే కాకుండా సాంస్కృతిక సంబంధాలను కూడా పునరుద్ధరించాలని అంటారు కుమారస్వామి. ఇతర దేశాలకి వెళ్లే భారతీయులు చాలా వరకు ఇంజినీరులు డాక్టర్లు రాజకీయ నాయకులు అయ్యి ఉంటారని కళాకారులని తత్వవేత్తలని దేశ ప్రతినిధులుగా మనం ఇతర దేశాలకు పంపమని అంటారాయన. ఫీజు డబ్బులు కట్టి ఏవో కొత్త పనిముట్ల గురించిన విజ్ఞానం మనం పాశ్చాత్య దేశాల నుంచి తెలుసుకోవడంలో గొప్ప ఏమి లేదని మన కళాకారులు మన సంస్కృతికి ప్రతినిధులు అయినట్టి వారు ఇతర దేశాలకు వెళ్ళి ఈ సాంస్కృతిక సంపదను ఎంతో కొంత పంచిపెట్టాలని అంటారు కుమారస్వామి. ఈ దేశం గొప్పతనం ఇతర దేశాల దగ్గర నుంచి ఏదో జిమ్మిక్కులు నేర్చుకోవటంలో లేదని ఇతర దేశాలకి ధార్మిక సాంస్కృతిక విద్యా పరిమళాలను అందించటంలో ఉందని అంటారాయన.

మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే వారికి వారి సొంత సంస్కృతికి సంబంధించిన జ్ఞానము లేదని స్వంతంగా వీరు ఆ దేశానికి ఇచ్చేది ఏమి లేదని ఇటువంటప్పుడు ఆ దేశాలతో పరస్పర అన్యోన్యత అన్నది అసాధ్యమని అంటారు కుమారస్వామి.మనకి ఇప్పుడు కావలసింది భారతీయ సంస్కృతి అణువణువునా జీర్ణించుకున్న ప్రొఫెసర్లు కానీ అమెరికా నాగరికత నేర్చిన వారు కాదని అంటారాయన.

భారతదేశంలోని పేదరికాన్ని అనారోగ్యాన్ని నిర్మూలించాలని అనుకోవటం ఉదాత్తమైన లక్ష్యమేనని ఐతే ఆధునిక అమెరికా నాగరికతకున్న సమస్యలు చాలానే ఉన్నాయని ఉదాహరణకు అమెరికాలో మానసిక రోగుల సంఖ్య చాలా ఎక్కువైపోతోందని అంటారాయన. భౌతికంగా ఏదో మంచి చేయాలని అనుకుంటూ మానసికంగా తీరని నష్టాన్ని కలిగించే అవకాశం లేకపోలేదని అంటారాయన. భారతదేశంలోని సమస్యలని చక్క దిద్దాలంటే తిరిగి స్వయం ప్రతిపత్తి గలిగిన గ్రామ పంచాయితీలు వృత్తి సమూహాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కావాలని అంటారాయన. భారతీయ సమాజాన్ని సమూలంగా విధ్వంసం చేసేసి అయ్యయ్యో ఈ దేశం ఏమిటి ఇంత దౌర్భాగ్య దశలో ఉంది? దీనిని ఎలా చక్కదిద్దాలి? అని అనటం సమంజసంగా లేదని అంటారు కుమారస్వామి. ఫ్రీ మార్కెట్ వ్యవస్థలోని గొప్ప ఏమిటి? ఒకరిపై ఒకరికి నిరంతరం పోటీనే కదా ? అందులో అంత చెప్పుకోదగ్గ మంచి ఏమీ లేదని తన అభిప్రాయమని అంటారు కుమారస్వామి.

ఆడవారికి హిందూ సంస్కృతిలో ఉన్నంత ఉన్నతమైన స్థానం అన్య సంస్కృతులలో లేదని ఆడవారి శీల మాన మర్యాదలకు మనమిచ్చినంత విలువ వేరే ఏ సమాజము ఇచ్చిన దాఖలాలు లేవని అంటారాయన. వేశ్యా సమస్య ఈ దేశానికి చెందినది మాత్రమే కాదని (పురుషులలో) జారత్వము ఉన్నంత కాలము వ్యభిచారం అన్నది ప్రతి చోట ఉండేదేనని అంటారు ఆయన. అయితే భారతదేశంలో ఈ సమస్యను పరిష్కరించిన విధానం వేరేనని అంటారాయన. వీధులలో వేశ్యలు వెంటపడి విటులకోసం ఎర వేయటం అనేది భారత దేశ గ్రామీణ వ్యవస్థలో ఉండేది కాదని, కొండకచో ఆధునికమైన నగరాలలో ఉంటే ఉండవచ్చునేమో కానీ అని అంటారు కుమారస్వామి. నిజానికి దేవాలయాలలో నాట్యగత్తెలు లేదా ఇతరములైన గాయనీమణులు గొప్పకళాకారులని వారికి సొంతమైన ఆస్తులు ఉండేవని యూరోపులో బానిసల లాగా వారిని పీడించిన దాఖలాలు లేవని అంటారు కూమారస్వామి దేవదాసీ వ్యవస్థను గురించి ప్రస్తావిస్తూ.అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేవదాసీలకి ఆత్మాభిమానం మెండని వారికంటూ ఫలానా కళలలో నైపుణ్యం ఉంటుందని యాంటీ-నాచ్ ఉద్యమాన్ని నడిపే సంస్కర్తలకు ఈ విషయాలు అర్థం కావని అసలు మూల సమస్యను వదిలేసి ఈ సంస్కర్తలు దేవదాసీల స్థాయిని దిగజార్చారని వాపోతారు కుమారస్వామి.

వేశ్యావృత్తిని వేశ్యలను భారతీయ దృక్పథంతో బేరీజు వేయాలని లైంగిక సంపర్కం విషయంలో భారతీయ ఆలోచనకూ పాశ్చాత్య దృక్పథానికి చాలా బేధం ఉందని అంటారు. ఆ విషయంపై ఎన్నో విధి నిషేధాలు ఉన్నప్పటికినీ నిజానికి హైందవ దృక్పథంలో శృంగారానికి ఉన్నత స్థానం ఇచ్చారని కేవలం జంతువులు సంతృప్తి చెందే స్థాయికి లైంగిక సంయోగాన్ని దిగజార్చలేదని అంటారు ఆయన.వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వేశ్యా సంస్కరణ అన్న విషయం గురించి సమాలోచన చేయాలనీ అంటారాయన.

ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ప్రధానంగా నష్టపోయేది దేవదాసీలేనని అంటారు ఆయన. ఏ దేవదాసీలను ఉద్ధరించడానికి ఈ చట్టాలు చేస్తున్నారో ఈ చట్టాల వల్ల ధ్వంసమయ్యేది ఆ దేవదాసీలు వారి కుటుంబాలేనని అంటారాయన.

పురాణాలు (Myths) అనేవి ఒక జాతికి చెందిన విలువైన ఆస్తులనీ ఆ జాతి వారు అక్షరాస్యులైనా సరే నిరక్షరాస్యులైనా సరే తమ గతాన్ని గురించిన జ్ఞాపకాలను పురాణాల రూపంలో పొందుపరుచుకుంటారని అంటారాయన. ఇటువంటి పురాణాలు ప్రాచ్య దేశాలలో ఇంకా సజీవ కళారూపాలుగానే ఉన్నాయని అయితే యూరోపులో ఆధునిక విద్య నేర్చిన జాతులలో ఈ పురాణాలు జానపద గాథల్లోనో లేదా కల్పిత గాథల రూపంలోనో మాత్రమే మిగిలాయని లేదంటే యూనివర్సిటీ మేధావుల మ్యూజియం పరిశోధనలకు ముడిసరుకుగా మిగిలిపోయాయని అంటారాయన. ఇటువంటి యూనివర్సిటీ పరిశోధనల్లో ఆ పురాణాలలోని మానవాతీత భావాలు దైవిక ఆధ్యాత్మిక భావాలు పక్కకు నెట్టి వేసి కేవలం మానవ పాత్రల భావ వ్యక్తీకరణలకు మాత్రమే పరిమితమవుతారని వీటి వల్ల పెద్దగా ఒరిగేది ఏమి లేదని అంటారు కుమారస్వామి. పౌరాణిక సత్యాలను నిత్యం దర్శింపజేసే జీవన విధానాలను ఒకటి రెండు తరాల ఆధునిక స్కూలు కాలేజీ వ్యవస్థలు ధ్వంసం చేయగలవని అంటారు కుమారస్వామి.

ఇప్పటికే కాదు ఎప్పటికి కుమారస్వామిని చదువుతూనే ఉంటాను నేను ఎంత చదువు చదువుకున్నాను ఎన్ని ఉద్యోగాలు వెలగబెట్టినా కూడానూ. ఆయన రచనలు చదివినవారు ప్రతీ ఒక్క విషయంలో ఆయనతో ఏకీభవించనక్కర్లేదు అలాగని భిన్నాభిప్రాయాలు కలిగినప్పుడు ఆయనను ద్వేషించి సాధించేది కూడా పెద్దగా ఏమీ లేదు. ఇదంతా “traditionalist school” అనే స్రవంతికి చెందిన ఆలోచనలు నా ఉద్దేశంలో ఇప్పటి కాలపు వారు తప్పకుండా చదవాల్సిన రచనలు ఇవన్నీ. ఇరవయ్యో శతాబ్దంలో పుట్టుకొచ్చిన తాత్విక స్రవంతులలో తప్పకుండా చదివి అర్థం చేసుకోవాల్సిన ఒక ఆలోచనాధార ఇది.

Images Credit: Internet

***

Selected Letters of Ananda K Coomaraswamy

Author: Ananda K Coomaraswamy

Pages: 512

For Copies:

https://www.flipkart.com/selected-letters-ananda-k-coomaraswamy/p/itmczyt7t67z65pg

₹250.00

https://www.amazon.in/Sel-Letters-Coomaraswamy/dp/0195623061

₹ 233.00

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here