ఆహా ! సేనాపతి!!

4
2

[dropcap]మె[/dropcap]గాస్టార్ ఫ్యామిలీ లో మగపిల్లలు దాదాపు అందరూ హీరోలు గా, ప్రొడ్యూసర్స్ గా వెండితెరపై తమ వెలుగులను ప్రసరిస్తున్న సమయంలో ఆడపిల్లలు కూడా తామేం తక్కువ కాదంటూ, ప్రొడక్షన్ రంగంలో, ఓటిటి లో కాలూని, తమ సత్తా చాటుతున్నారు. మొన్న నాగబాబు కూతురు నిహారిక “ఒక చిన్న ఫ్యామిలీ స్టొరీ”తో, ఇప్పుడు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల, ఆమె భర్త విష్ణు ప్రసాద్ నిర్మాతలుగా మొదట జీ5 లో ‘షూట్ ఎట్ ఎలైర్’ సిరీస్ , ఇప్పుడు “సేనాపతి” సినిమా నిర్మించారు. 31 డిసెంబర్ 2021 ‘ఆహా’ లో విడుదల చేశారు.

డైరెక్టర్ పవన్ సాదినేని గతంలో రెండు సినిమాలు తీసినా ఈ “సేనాపతి” సినిమాతో మాత్రం తన ప్రత్యేక ముద్రని సినీరంగంలో వేయడానికి ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.

తన డెబ్యూ  మూవీ ‘మత్తు వదలరా’ లో ప్రధాన పాత్రలో మెప్పించిన నరేష్ అగత్స్య., ఈ సినిమాలో కూడా తనను తాను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్  పాత్రలో, హీరోగా ప్రెజెంట్ చేసుకున్నాడు.

ఈమధ్య దివంగతులైన పాటల రచయిత వెన్నెలకంటి గారి కుమారుడు ‘రాకేందు మౌళి’ ఇందులో హుస్సేన్ అనే  పాత్రను పోషించడమే కాకుండా మాటల రచయితగా –  సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, కుటుంబంలో అస్తవ్యస్తమౌతున్న మానవ సంబంధాలను, వ్యవస్థలోని అవకతవకలను చాలా సూటిగా, సున్నితంగా డైలాగ్స్ రూపంలో అందించారు.

చదరంగం పావులలో ‘సేనాపతి’ ఎంత ముఖ్యమో, ఈ ‘సేనాపతి’ చిత్రంలో కథకు, అన్ని పాత్రలకు, అన్ని సన్నివేశాలకు అంత ముఖ్యమైన  ప్రధాన సూత్రధారి అయిన ‘మూర్తి’ పాత్రలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ అద్భుతంగా నటించి, ఆ పాత్రలోని అన్ని ఎమోషన్స్ ని పండించి మెప్పించారు.

ఇక కథ విషయానికొస్తే –

బాల్యంలో కృష్ణ తను చేయని తప్పుకి జువినైల్  జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు, నిజాయితీ మానవత్వం కలిగిన ఒక జైలర్ “నీలాగే తప్పు చేయని చాలామంది పిల్లలు ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నారు. నీలా ఇంకొకరికి జరగకూడదు అంటే, వాటిని అరికట్టే అధికారం గల పోలీస్ ఆఫీసర్ వి అవ్వాలి” అన్న సలహా ఇవ్వడంతో కృష్ణ ఎస్సైగా  పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయి, ఇంకోపక్క ఐ.పి.యస్. అవ్వాలని సివిల్స్ కి ప్రిపేరవుతుంటాడు. ఒక చిన్న కేసు సందర్భంగా స్టేషన్ కి వచ్చిన హీరోయిన్  టీవీ జర్నలిస్టు (జ్ఞానేశ్వరి) పాత్ర ప్రవేశం తో వారిద్దరి మధ్య ‘లవ్ ట్రాక్’ అనుకుంటున్న సమయంలో ఊహించిన సంఘటన జరుగుతుంది. తన పై అధికారి సి.ఐ పురుషోత్తం ఆదేశాల మేరకు కృష్ణ ఒక క్రిమినల్ ని పట్టుకునే ప్రయత్నంతో తన సర్వీస్ రివాల్వర్ పోగొట్టుకున్న  సందర్భంలో అసలైన ఉత్కంఠ ప్రారంభమౌతుంది.

పోగొట్టుకున్న తన  సర్వీస్ రివాల్వర్ ని హీరోయిన్ సహాయంతో కృష్ణ వెదుకుతున్న సమయంలో  సిటీలలో చాలా సాధారణంగా జరుగుతున్న మాఫియా, రివాల్వర్స్ అమ్మకం, దందాలు, డ్రగ్స్, అక్రమ సంబంధాలు, చిన్న మొత్తం కోసం పెద్ద నేరాలకు  సైతం పాల్పడుతున్న యువతరం, దానికి దారితీసిన వ్యవస్థలోని అవకతవకలు బాగా చిత్రీకరించారు దర్శకులు.

అదే సమయంలో బ్యాంకు రాబరీ జరగడం, ఐదేళ్ల చిన్న పాప పొరపాటున బుల్లెట్ తగిలి చనిపోవటం, ఆ బుల్లెట్టు కృష్ణ పోగొట్టుకున్న సర్వీస్ రివాల్వర్ నుండి వచ్చిందని పంచనామా లో తెలుసుకున్న పోలీసు యంత్రాంగం అప్రమత్తమై, కృష్ణ ను సస్పెండ్ చేసి, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా (అమృతం) హర్షవర్ధన్ ని నియమించడంతో కథ వేగం పుంజుకుంటుంది.

సస్పెండ్ అయిన కృష్ణ, తన బాధ్యతగా భావించి అనఫీషియల్ గా హర్షవర్ధన్ కి సహకరిస్తూ ఇన్వెస్టిగేషన్లో పాలుపంచుకుంటూ ఉంటాడు. ఆ క్రమంలో ఊహించని విధంగా మరి కొన్ని హత్యలు జరగడంతో ఒకానొక స్థితిలో వారిద్దరు కూడా కొంత అయోమయానికి గురవుతారు.చివరి పదిహేను నిమిషాలు సస్పెన్స్, సెంటిమెంట్ కలగలిసి డైరెక్టర్ ప్రతిభ, మాటల రచయిత నైపుణ్యం, నటకిరీటి నట విశ్వరూపం, మిగిలిన పాత్రల పాత్రోచిత సంభాషణలు ప్రేక్షకులను మెప్పిస్తాయని అనడంలో సందేహం లేదు.

అసలు ఆ రివాల్వర్ మూర్తి చేతికి ఎలా వచ్చింది, ఆ బ్యాంక్ దొంగతనం ఎందుకు చేయవలసి వచ్చింది, ఆ దొంగిలించిన డబ్బు ఏమైంది, పోలీసులు ఆ దొంగలను పట్టుకుని రివాల్వర్ని కనుక్కున్నారా , ఆ రివాల్వర్ లోని ఏడో బుల్లెట్ ఎవరికి తగిలింది? ఎనిమిదో బుల్లెట్ ఎవరికి తగల బోతుంది అని ప్రేక్షకుల ఊహలకు కళ్ళెం వేస్తూ ఊహించని మలుపులతో  ఎడ్జ్ ఆఫ్ ది సీట్లో కూర్చో పెట్టగలిగాడు దర్శకుడు పవన్ సాధినేని.

“దానె దానె పర్ లిఖా హోతాహై  ఖానె వాలే కా నామ్. బుల్లెట్ బుల్లెట్ మే లిఖా హోతాహై  మర్నే వాలె కా నామ్.” అన్న హర్షవర్ధన్ డైలాగ్ తో సినిమా ముగుస్తుంది. ఆ ముగింపు చివరి ట్విస్ట్.

ఉత్కంఠకు గురి చేసే సంఘటనలు, హృదయాన్ని కదిలించే సన్నివేశాలు, డైలాగ్స్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి.

సమగ్రంగా కథనంతా చెప్పడం కంటే, కంటి ముందు ప్రత్యక్షమవుతున్న కొన్ని కఠిన జీవిత సత్యాలు, మానవ మనస్తత్వాలు, జీవన పోరాటం లో ఓటమి, నిస్సహాయత, ఒక్కసారైనా గెలవాలన్న వ్యర్థ ప్రయత్నం …వంటి వాటిని సినిమాలో చూడటమే బాగుంటుంది. అనవసరమైన పాటలు సన్నివేశాలు లేకుండా, కథను మాత్రమే ప్రజెంట్ చేయడం, సినిమాలోని ప్రతి పాత్రకూ ఏదో ఒక సందర్భంలో,  ఏదో ఒక లింక్, ప్రాధాన్యత ఉండటం బావుంది. అనారోగ్యంతో బాధపడుతూ, ‘బ్లాక్ టీ’ ని  తాగుతుండే  సేనాపతి ‘మూర్తి’ పాత్ర ఎలా ముగుస్తుంది, దానిలో రాజేంద్రప్రసాద్ ఎలా జీవించాడు అన్నది సినిమా చూస్తేనే సమంజసంగా ఉంటుంది. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా,  కుటుంబ సమేతంగా ఇంట్లోనే చూడదగ్గ క్రైం డ్రామా చిత్రం ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here