వీక్ పాయింట్స్ ఉన్నా చూడదగ్గ ‘సేనాపతి’

7
5

[dropcap]’సే[/dropcap]నాపతి’ తెలుగు సినిమా. ఇది ఆహా ఓటీటీ ప్లాట్‍‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.

ఎన్నో వీక్ పాయింట్స్ ఉన్నప్పటికీ ఈ సినిమా చాలా బాగుంది. తప్పని సరిగా ప్రతి ఒక్కరూ చూసి తీరవలసిన సినిమా ఇది.

2017లో విడుదల అయిన తమిళ సినిమా ‘8 తూట్టాక్కల్’ (8 తూటాలు)కు ‘సేనాపతి’ రీమేక్.

1949లో అకీర కురసొవ దర్శకత్వం వహించిన జపనీస్ చిత్రం ‘నోరా ఇను’ (‘స్ట్రే డాగ్’) అధారంగా ఈ తమిళ సినిమా ‘8 తూట్టాక్కల్’ తీయబడింది.

అకీర కురసొవ తన దర్శకత్వ ప్రయాణం ప్రారంభించిన తొలి సంవత్సరాలలో తీసినప్పటికి తన ఇతర చిత్రాలకి ఏ మాత్రం తీసిపోని విధంగా తీశాడు ఈ చిత్రాన్ని అని ప్రశంశలు అందుకుంది ఈ నోరాఇను (స్ట్రే డాగ్).

***

సేనాపతిలో ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ నటన హైలైట్.

అతనిలో ఆ స్పార్క్, ఈజ్ ఇంకా ఎక్కడికీ పోలేదు. డైలాగ్ డెలివరీలో అతను తనదైన ప్రత్యేక బాణి అక్కడక్కడా పాత్ర పరిమితి చేసినంత మేరకు చూపించాడు. కాకపోతే హాస్యానికి అసలు అవకాశం లేని పాత్ర. ఒక రకంగా చెప్పాలి అంటే నెగెటివ్ షేడ్స్ ఉన్న యాంటీ హీరో.

భీతి కొలిపే సంఘటనతో ప్రారంభం అయి, ఒక విధమైన ఇబ్బందికరమైన వాతావరణంలో నడుస్తూ సడన్‌గా ఒక దశలో ఈ కథ పాకాన పడుతుంది. ఇలాంటి పాత్ర రాజేంద్రప్రసాద్‍కి పూర్తిగా కొత్త. అయినా సునాయాసంగా కొట్టిన పిండిలా చేసేశాడు. గతంలో ‘మిష్టర్ వి’లో కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ధరించినా, ఈ సినిమాలో పాత్ర చాలా వైవిధ్యమైనది.

మనకు హాస్యనట చక్రవర్తిగా తెలిసిన రాజేంద్రప్రసాద్ ‘ఆ నలుగురు’లో కంటతడి పెట్టించాడు. ఇందులో అబ్బ ఎంత క్రూరుడు, ఏ మాత్రం మానవత్వం లేదే అన్నట్టు నటిస్తూ ఒక్కసారిగా తన పాత్ర పట్ల మనలో జాలి పుట్టిస్తాడు.

అతడు లేకుంటే ఈ సినిమా చూడలేమేమో అన్నట్టు నటించి పారేశాడు. ఒకసారి మళ్ళీ రాజేంద్రప్రసాద్ పాత సినిమాలన్నీ చూడాలబ్బా అనిపించింది. నూటికి నూరు మార్కులు కొట్టేశాడు రాజేంద్రప్రసాద్.

***

తమిళ సినిమాలో కీలక అంశాలు అలాగే ఉంచి… ఒరిజినల్ మూవీ రైటర్ అండ్ డైరెక్టర్ శ్రీ గణేష్, మరో ముగ్గురు రచయితలు రాకేందు మౌళి, హుస్సేన్ షా కిరణ్, వసంత్ జుర్రుతో కలిసి కథలో మార్పులు చేశానని, కొత్త పాత్రలు పరిచయం చేశానని ‘సేనాపతి’ దర్శకుడు పవన్ సాదినేని పవన్ తెలిపారు. రీమేక్ అనేది పక్కన పెడితే… ‘సేనాపతి’ ఎలా ఉంది?

***

ఇంతకూ కథ ఏమిటి?:

తాను చేయని నేరానికి బాల్యంలో ఎనిమిదేళ్లు బాల నేరస్తుల శాలలో ఉన్న కృష్ణ (నరేష్ అగస్త్య), అక్కడి వార్డన్ ప్రోత్సాహంతో, కష్టపడి చదివి ఎస్ఐ అవుతాడు. పోలీసులు అంటే అతనికున్న భయాన్ని, ఏహ్యతని పోగొట్టి ఆ వార్డన్ ఆ కుర్రాడిని సమాజానికి ఉపయోగపడేలా చేస్తాడు. ఒక మంచి మనిషి ఎదుటివాళ్ళలో ఎలాంటి మార్పు తీసుకు రాగలడో అన్నదానికి ఆయన ఉదాహరణగా నిలుస్తాడు. ఆ పాత్ర మనకు తర్వాత ఎప్పుడూ తారసపడదు కానీ ఉన్న కాసేపు ఆ పాత్ర పలికిన సంభాషణలు ప్రభావవంతంగా ఉన్నాయి. వ్యక్తిత్వాన్ని సానపెట్టేట్టు ఉన్నాయి ఆయన మాట్లాడిన మాటలు.

ఎవరికీ అన్యాయం జరగకూడనేది కృష్ణ ఆశయం. ఐపీఎస్ కావాలనేది అతడి లక్ష్యం. విధి నిర్వాహణలో భాగంగా సివిల్ డ్రస్‍లో వెళ్ళి ఓ క్రిమిన‌ల్‌తో పోరాడే స‌మ‌యంలో అతడి స‌ర్వీస్ రివాల్వ‌ర్‌ పడిపోతుంది. సివిల్ దుస్తులు ధరించి వెళ్ళటం వల్ల రివాల్వర్‌కి ఉండే తోలు పటాక నడుముకు ఉండదు. అతని ఏకాగ్రత అంతా నేరస్తుడి మీద పెట్టడంతో కృష్ణ తన సర్వీస్ తుపాకి పడిన విషయం గమనించడు.

అది ఎవరికి దొరికింది? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది? అది చేతులు మారుతూ వెళ్ళి రాజేంద్రప్రసాద్ వద్దకు ఎలా చేరింది?

రాజేంద్రప్రసాద్ పాత్ర ఎందుకు దోపిడీలకు పాల్పడుతుంది, హత్యలు ఎందుకు చేస్తుంది. అతని నేపథ్యం ఏమిటీ ఇవన్నీ కథలో కీలక అంశాలు.

హైదరాబాద్ సిటీలో ఓ బ్యాంకు దోపిడీకి, వరుస హత్యలకు ఆ గన్ ఎలా సాక్ష్యంగా నిలిచింది? గన్ మళ్లీ తన చేతికి రావడం కోసం కృష్ణ ఎటువంటి ప్రయత్నాలు చేశాడు? బ్యాంకు దోపిడీ చేసిన మూర్తి అలియాస్ కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్) కథ ఏమిటి? కృష్ణ, మూర్తి ఎలా కలుసుకున్నారు? చివరకు, ఏమైంది? అనేది సినిమా.

***

మన మెదడులో నిరంతరం రెండు పొట్టేళ్ళు ఎదుగుతూ ఉంటాయి. ఒకటి మంచికి ప్రతీక అయితే రెండవది చెడుకి ప్రతీక. మరి ఏ పొట్టేలు బలోపేతం అవుతుంది అంటే, మనం ఏ పొట్టేలుని పెంచి పోషిస్తామో ఆ పొట్టేలు ఎదిగి స్థిరపడి, మన గుణాలని, మన ప్రవర్తనని శాసిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే.

అందుకే మంచి పుస్తకాలు చదవటం, మంచి వ్యక్తుల సమూహంలో ఉండటం, ఒక పద్దతిగల జీవన విధానం కలిగి ఉండటం వలన మంచి పొట్టేలుని పెంచి పోషించుకోవచ్చు. ఈ విధానానికి ఉదాహరణ కృష్ణ పాత్ర.

“నువ్వు ఎలాంటి వాతావరణంలో ఉన్నా, మంచి వాడిగా ఉండాలి అంటే మంచిగా ఉండొచ్చు” అని బోధ చేస్తాడు వార్డెన్ అతనితో. బాల్యం నుంచి బాలనేరస్తుల శాలలో పెరిగినా మంచి వాడిగా ఎదుగుతాడు కృష్ణ.

“నీకు పోలీసులు అంటే అసహ్యం ఉంటే, నీవే పోలీసుగా ఎదిగి, ఒక మంచి పోలీసు ఎలా ఉండాలో నలుగురికి చూపి, మంచి పనులు చేయవచ్చుగా” అని అతనికి లక్ష్యాన్ని నిర్దేశిస్తాడు ఎదిగే వయసులో ఉన్న కృష్ణతో వార్డన్.

ఈ మాటల ప్రభావంతో మంచి వాడిగా ఎదుగుతాడు, బురదలోంచి ఎదిగిన కమలంలా కృష్ణ.

– రాజేంద్రప్రసాద్ పాత్ర దీనికి పూర్తిగా వ్యతిరేకం. చక్కటి ఉద్యోగం, చక్కటి సంసారం, భార్య పిల్లలు హాయిగా ఉంటుంది అతని జీవన విధానం. మంచివాడిగా ఉంటూ, అత్యుత్తమ జీవనవిధానం కలిగిన వాడిగా ఉండినా, ఒక పైసా కూడా లంచం తీసుకోకుండా జీవించినా,

“నీ మంచితనమే నీ కష్టాలకి కారణం, భార్యని కోల్పోయావు, పిల్లలు సుఖంగా లేరు, తిరగబడు, తప్పో ఒప్పో ఒక్కసారి దొంగతనం చేయి, నీ పిల్లలకి మంచి జీవితాన్ని కలగజేయి.” అని నిరంతరం అతని అంతరాత్మ బోధిస్తూ ఉంటుంది. అతను కూడా తన పట్ల తాను సెల్ఫ్ పిటీతో ఉంటూ, అంతరాత్మ చేసే ఈ చెడు బోధని పాటిస్తాడు.

-ఇక్కడి నుంచి ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణ ఈ సినిమా యావత్తు. నిజానికి సినిమా ముగింపు సన్నివేశాల వరకు కూడా ఒకదానిని ఒకటి కలుసుకోవు ఈ రెండు పాత్రలు. ఈ రెండు పాత్రల మధ్య అనుసంధానం చేస్తూ ఉండేది తుపాకి.

హీరోయిన్ పాత్ర నిడివి, పరిమితి చాలా తక్కువే అయినా, కీలక వార్తని బ్రేకింగ్ న్యూస్‌గా రావటానికి ఉపయోగపడుతుంది. ఆ రకంగా తీస్కున్నా ఈ పాత్రకి ప్రాముఖ్యత ఉన్నట్టే. ఉత్తి ఆటబొమ్మగా మలచలేదు హీరోయిన్ పాత్రని.

ఏ ఒక్క పాత్ర అనవసరంగా ఉండదు ఈ సినిమాలో. అద్భుతమైన స్క్రీన్ ప్లేకి ఉదాహరణ గా చెప్పుకోవచ్చు ఈ సినిమాని.

***

స్నాప్ ఫ్లాష్ బాక్ (మెరుపు పద్దతిలో చిన్న చిన్న ఫ్లాష్‌బాక్‌లు) నారేషన్ భలేగా నచ్చింది నాకు ఈ చిత్రంలో.

యండమూరి వీరేంద్రనాధ్ నవలలో, “ఓ పాఠకుడా ఈ సంఘటన జరగటానికి సరిగ్గా ఒక గంట ముందు ఏమి జరిగిందో తెలుసుకుందాం” అంటూ పాఠకుడిని కాస్త వెనక్కు తీసుకువెళతాడు.

ఒక్కోసారి “అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే, ఓ రెండు రోజులు వెనక్కు వెళ్ళాలి” అంటూ కథనం సాగిస్తారు .

సరిగ్గా ఈ పద్దతిలో, ఒక సంఘటన చూపిచ్చి, ‘అరె ఇదెలా జరిగింది’ అని ప్రేక్షకుడు ఆశ్చర్యపోతుండగా, క్రమంగా స్క్రీన్ మసక మసకగా మారి, ఓ గంట వెనుక ఏమి జరిగిందో చూపిస్తాడు దర్శకుడు.

‘ఓహ్! అలా జరిగిందా’ అని ప్రేక్షకుడు రిలీఫ్ ఫీల్ అవుతాడు.

ఈ టెక్నిక్‍ని దాదాపు నాలుగయిదు సార్లు వాడారు దర్శకుడు. కానీ ప్రేక్షకుడికి ఎక్కడా అయోమయం కలుగదు, బోర్ కొట్టదు.

***

దాదాపు పాతిక సంవత్సరాల క్రితం హిందీలో ‘సత్య’ అనే సినిమా తీసేటప్పుడు రాంగోపాల్ వర్మ పెద్ద ఎత్తున ప్రచారం ఏమి చేసుకున్నాడంటే, ఒక వ్యక్తిని చంపేటప్పుడు గానీ నేరం చేసేటప్పుడు గానీ, ఒక నేరస్తుడు ఎంతగా సంఘర్షణ అనుభవిస్తాడో కళ్ళకు కట్టినట్టు చూపే ప్రయత్నమే ఈ ‘సత్య’ అని.

ఇంతకూ నేతిబీరకాయలో నెయ్యి ఎవరికయినా దొరికిందో లేదో గానీ ఆ ‘సత్య’ సినిమాలో అటువంటి లక్షణాలు ఏమీ కనిపించలేదు నాకు. కల్లు మామ అన్న పాట ఒకటి, ఊర్మిళ డాన్సులు ఒకటి రెండు మాత్రం గుర్తున్నాయి.

‘శూల్’ తీసేటప్పుడు అదే చెప్పాడు రాంగోపాల్ వర్మ. కానీ, అప్పటికి గ్లామర్ హీరోయిన్ గా వెలిగి పోతున్న రవీనాటాండన్‌కి ఇచ్చిన పాత్రకి సింపుల్‌గా మేకప్ చేసి, వెరైటీగా, ప్లెయిన్ కాటన్ చీరలు కట్టి చూపించటం పైన పెట్టిన శ్రద్ధ ఇంకే అంశాల మీద పెట్టలేదు అప్పుడు ఆయన.

ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, ఈ చిత్ర దర్శకుడు అది సాధించాడు.

నూటికి నూరుపాళ్ళు ఒక హంతకుడి మానసిక సంఘర్షణని మనకు కళ్ళకు కట్టినట్టు చూపాడు. రాజేంద్రప్రసాద్ పాత్ర అనుకోకుండా ఒక పసిపాపను తుపాకితో కాల్చి చంపేసినప్పుడు అతని పడ్డ వేదనకి మనం కూడా విపరీతంగా స్పందిస్తాము.

విధిలేని పరిస్థితులలో అతను మిగతా బుల్లెట్స్ ని ఉపయోగిస్తూ వెళ్ళినప్పుడు మనం కూడా “అంతే కద, అతని తప్పేమి ఉంది, ఇంకేమి చేస్తాడు. తప్పదు మరి ఆ పరిస్థితిలో” అని రాజేంద్రప్రసాద్ పాత్రకి వత్తాసు పలుకుతాం.

దర్శకుడి పనితనం ఇలాంటి సందర్భాలలో బాగా నచ్చుతుంది మనకు.

మళయాళ దర్శకుడు జోషీ – మమ్ముట్టీ, తిలగన్, విష్ణువర్ధన్ ప్రధాన పాత్రలతో తీసిన “కౌరవర్” (తెలుగు డబ్బింగ్- కంకణం/తెలుగు రీమేక్ – ఖైదీగారు మోహన్ బాబు) సినిమాలో సీనియర్ నటుడు తిలగన్ నిజానికి ఒక మాఫియా డాన్.

చివరికి అతని చితికి పోతాడు. అతను చెడ్డవాడు అన్ని విధాలా. కానీ అతను పగబట్టి, వృద్ద్ధాప్యంతో శరీరం సహకరించకున్నా, కుంటి కాలు వేసుకుని, ఒక నాటు తుపాకి తయారు చేయించుకుని ఒక పోలీసు ఆఫీసర్ (విష్ణువర్ధన్) ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని హతమార్చాలని చూస్తాడు. ఒక దశ వరకు మనం ఆ పాత్రతో మమేకం అయిపోయి అతను గెలవాలని కోరుకుంటాం. పోలీస్ చావాలని కోరుకుంటాం. విష్ణువర్దన్ మమ్ముట్టికి ఒక కీలక రహస్యం చెప్పి కన్ను మూస్తాడు. మమ్ముట్టి తిలగన్‌ని ఆపాలని చూస్తాడు. అప్పటిదాకా తిలగన్‌కి వత్తాసు పలికిన ప్రేక్షకుడు, తిలగన్‌కి, మమ్ముట్టికి జరిగే పోరాటంలో మమ్ముట్టి గెలవాలని, తిలగన్ ఓడిపోవాలని కోరుకుంటాడు, “ఛ ఈ పాడు ముసలాడి మొండితనం మండిపోనూ, వీడు చస్తే పీడ విరగడ అయిపోతుంది” అని అప్పటి నుంచి భావిస్తాడు ప్రేక్షకుడు.

మంచి కావచ్చు, చెడు కావచ్చు తాను చెప్పదలచుకున్న విషయాన్ని ఇంత ప్రభావవంతంగా చెప్పి ప్రేక్షకులని తన వెంబడి తీసుకువెళ్ళగలిగే నేర్పు ఉండే దర్శకుడు జోషి. తాను ఎలాంటి రియాక్షన్ ప్రేక్షకుడిలో కలిగించాలి అనుకుంటాడో అలాంటి రియాక్షన్ సునాయాసంగా కలిగిస్తాడు. హిందీలో మహేష్ భట్‌లో కూడా ఈ లక్షణం కనిపిస్తుంది.

ఈ చిత్ర దర్శకుడు పవన్ సాదినేనిలో ఆ లక్షణం నాకు పుష్కలంగా కనిపించింది. తాను కావాలనుకున్నప్పుడు ప్రేక్షకులని ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, భయపెడతాడు, నిట్టూర్చేలా చేస్తాడు.

***

గూండాల నాయకుడు బబ్లూ పాత్ర యొక్క అమాయకత్వం నవ్వు పుట్టిస్తుంది.

కృష్ణ వచ్చి ప్రశ్నలు అడిగీ అడగకనే అనవసరమైన రహస్యాలన్నీ చెప్పి నాలుక కరచుకున్న విధానంలోనే అతని అమాయకత్వం తెల్సి పోతుంది. నవ్వుకుంటాం.

తన భార్యని ట్రాప్ చేసిన తన అనుచరుడిని అతను నెరనమ్మిన విధానం, అతని అమాయకత్వం, మంచితనం చూసి జాలి కల్గుతుంది.

చివరికి ఆ పాత్ర ఒక కీలక దశలో కన్ను మూసిన విధానం మనతో కంట తడిపెట్టిస్తుంది.

***

“నేను ఏ నాడు ఒక్క పైసా లంచం తీస్కోలేదు. నా పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాను. అందుకే బాంక్ దోపిడికీ సిద్దపడ్డాను” అని ఎంతో ఎమోషనల్‌గా చెప్పిన రాజేంద్రప్రసాద్ పాత్ర పట్ల ప్రేక్షకులకి సానుభూతి కలిగేలా మలిచారు. కారణం ఏదైనా కావచ్చు, నేరం తాలూకూ పరిణామాలు మంచిగా ఉండవు అన్న నీతిని చెప్పదలచుకున్నాడు దర్శకుడు. కానీ ఈ నీతి వాక్యాలని పెద్దగా ప్రభావవంతంగా చెప్పలేదు. ఒక అండర్ కరెంట్ లాగా చెప్పారు.

కానీ రాజేంద్రప్రసాద్ లోని నేరప్రవృత్తి తాలూకు వెర్షన్ ప్రభావవంతంగా చెప్పాడేమో దర్శకుడు అని అనిపిస్తుంది.

***

ఇక నాకు తోచిన మరి కొన్నిఅంశాలు మీతో పంచుకుంటాను.

నేరుగా ఓటీటీ ప్లాట్‍‌ఫామ్‌లో విడుదల అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రభుత్వ సెన్సార్ పరిధిలోకి రాకపోవటం అన్నది శోచనీయమైన విషయం. దీన్ని తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం తక్షణమే వీటిని సెన్సార్ పరిధిలోకి తీసుకురావలసి ఉంది.

ఎందుకు అంటారా, అక్కడికే వస్తున్నా.

తమకు లభించిన ఈ అకారణమైన స్వేచ్ఛ వల్ల దర్శక రచయితలు తబ్బిబ్బు అయిపోయి సభ్యసమాజం అసహ్యించుకునే బూతుల్ని సర్వసాధారణంగా మాట్లాడే మాటల్లాగా చలామణిలోకి తెస్తున్నారు.

ఈ సినిమాలో పాత్రలు అక్కడక్కడా ఇలాంటి బూతుల్ని చాలా మామూలుగా మాట్లాడేస్తుంటాయి. ఇంట్లో పెద్దలతో, పిల్లలతో కలిసి కూర్చుని చూడటానికి ఇబ్బంది ఎదురయ్యింది.

అదేవిధంగా పడగ్గదిలో ఏ జంట అయినా చేసేది ఒకటే. దాన్ని ఇంతవిచ్చలవిడిగా చూపాల్సిన అవసరం ఉందా? లేచిన వేళ మంచిదయింది , దేవుడి దయ వల్ల ఈ సినిమాలో ఆ విధమైన ఇబ్బంది ఎదురుకాలేదు.

గూండాలు ఉండే ఏరియాలు, మురికివాడలు, దిగువ మధ్య తరగతి ఇళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రి శవాగారాల వాతావరణం చూపటంలో అరవ సినిమాలతో పోటీ పడి అసహ్యంగా చూపటంలో ఈ సినిమా దర్శకుడు ఏ మాత్రం వెనుకంజ వేయలేదు.

ఇవి ఈ సినిమాలో పంటి కింద రాయిలాగా తోచిన అంశాలు.

టైటిల్స్ అన్నీ ఇంగ్లీష్ అక్షరాలలోనే వేశారు. ఇది తెలుగు సినిమా కద, తెలుగులో వ్రాయవచ్చు కద. ఖర్మ.

సినిమా తెరపై పేర్లు (క్రెడిట్స్) వేసే విషయంలో ఈ సినిమా దర్శకుడు కూడా చాలా మంది ఆధునిక దర్శకులలాగా, నాకు నచ్చని పంథాని అవలంభించాడు. అది ఏమిటి అంటే, తుపాకీ ఈ సినిమా కథలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి అత్యంత నాణ్యమైన గ్రాఫిక్స్‌ని ఉపయోగించి ఆ తుపాకి తయారు అయ్యే విధానం అందులో తూటాల్ని ఎక్కించే విధానం, ఆ తూటా పేలిన తర్వాత తుపాకి లోంచి వెలువడి ఎలా ప్రయాణిస్తుంది అన్న వివరాలు చాలా చక్కగా చూపించారు.

ఇప్పుడు ప్రేక్షకుడు ఆ గ్రాఫిక్స్‌ని చూడాలా, నటీనటుల పేర్లు చూడాలా? లక్షలు తగలేసి ఈ విధమైన ఉపయోగం లేని భావుకత్వం ఎందుకు ప్రేక్షకులనెత్తిన రుద్దుతారో అర్థం కాదు.

అందుకే భట్ క్యాంప్ నుంచి వచ్చే సినిమాలు చూడమని యువదర్శకులకు నేను సలహా ఇస్తాను. మహేష్ భట్, విక్రం భట్‌ల సినిమాలలో ఈ విషయంలో కొత్త దర్శకులు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. హాయిగా ప్రేక్షకుడికి టైటిల్స్ మీద పూర్తి ఏకాగ్రత కలిగేలా చూపుతారు భట్ క్యాంప్ వాళ్ళు. అంతే కాదు సినిమా నడుస్తున్నప్పుడు సైతం కథని చెప్పటంలో కావచ్చు, కథనాన్ని నడపటంలో కావచ్చు, ఫోటోగ్రఫి విషయానికి వస్తే చీకటి వెలుగుల మిశ్రమాన్ని వాడటంలో కావచ్చు, ఎక్కడా కూడా సినిమా అనేది విజువల్ కమ్యూనికేషన్ టూల్ అన్న అంశాన్ని మహేష్ భట్, విక్రం భట్‌లు తూచా తప్పకుండా పాఠిస్తారు. సంగీతం, పాటల సాహిత్యం ఇంకో ఆకర్షణ వారి చిత్రాలలో.

ఇదేంటి ‘సేనాపతి’ సినిమా గూర్చి చెప్పబోయి, మహేష్ భట్ సినిమాల గూర్చి చెబుతున్నాను అనుకుంటున్నారా, ఈ కథ, జానర్ ఇవన్నీ కూడా మహేష్ భట్ క్యాంప్‌కి, ఆర్జీవీకి ఇష్టమైన అంశాలు కాబట్టి ఈ సినిమాని చూసేటప్పుడు ఆయా సినిమాలతో పోలిక అవసరం అయింది. ఇక పోతే రాజు గారి పెద్ద భార్య మంచిది అన్న చందంగా కూడా తీస్కోవచ్చు ఆ ఇతర సినిమాలపట్ల నా పొగడ్తలని.

ఫోటోగ్రఫీ, సంగీతం, గందరగోళ పరిచే లైటింగ్, అక్కడక్కడా బూతులు, చండాలంగా ఉండే మురికివాడల లొకేషన్స్, ఇవీ ఈ సినిమాకి సంబంధించి వీక్ పాయింట్స్. అవి నచ్చేవారు ఉంటారేమో. ఎందుకంటే, ఇటీవల జాతి రత్నాలు, ఈ నగరానికి ఏమయ్యింది వంటి సినిమాలు చాలా మందికి నచ్చాయి కద.

ఇన్ని వీక్ పాయింట్స్ ఉన్నప్పటికి ఈ సినిమా చాలా బాగుంది.

***

నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వరి కండ్రేగుల‌, హర్షవర్ధన్, రాకేందు మౌళి, ‘జోష్’ రవి, సత్యప్రకాష్, పావని రెడ్డి, జీవన్ కుమార్ తదితరులు

ఎడిటర్: గౌతమ్ నెరుసు

ఒరిజినల్ స్టోరి: శ్రీ గణేష్

మాటలు: రాకేందు మౌళి

సినిమాటోగ్రఫీ: వివేక్ కాలెపు

సంగీతం: శ్రవణ్ భరద్వాజ్

నిర్మాతలు: విష్ణుప్రసాద్, సుష్మితా కొణిదెల

దర్శకత్వం: పవన్ సాదినేని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here