సెనోరీటా

0
3

[dropcap]“అ[/dropcap]మ్మా సుందరీ, నా మనవడి పెళ్లి చూసి కళ్ళు మూయాలన్న కల నెరవేరుతుందా లేదా. వాడు ముప్పయ్యో పడిలో పడుతున్నాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని ఈ పట్టు ఫోను చేస్తే నువ్వే తేల్చేద్దూ” అత్తయ్య గారు ఇంచుమించు రెండేళ్ళనుండి పాడుతున్న పాటే అది.

‘అసలు వాడు నా చేతికి చిక్కాలి కానీ, చెవులు మెలెట్టి పెళ్ళి పీటల మీద కూర్చో పెట్టునూ??’ ఇలా సుందరి వాపోవడం రోజుకి ఓ సారైనా జరిగే తంతే.

‘ఈ రోజే స్ఫూర్తి ఇచ్చిన కబురు విని ఆవిడ ఎలా స్పందిస్తారో.’ అనుకుంది సుందరి.

‘స్ఫూర్తికి ఇప్పుడు ముప్పయేళ్ళు దాటి పోయాయి. పెళ్లి మాట ఎత్తితే మాత్రం ఒంటికాలు మీద లేస్తున్నాడు. పెద్దలు ఎవరిని చూస్తే వారిని కట్టుకోవడానికీ ఇవి మా రోజులా ఏవిఁటీ. అత్తయ్యగారి రోజుల్లోనైతే మా రోజుల్లోలా కూడా కాదు. చూడడాలూ అవీ కూడా లేవు’ ఆలోచనల సుడుల్లో చుట్టుకుపోతూ అనుకుంది సుందరి.

ఆఫీసు పని ఒత్తిడిలో చాలా అలిసిపోయింది సుందరి. మునుపు మూడొందల ఉద్యోగులున్న ఆఫీసు ఇప్పుడు ముప్పై మందితో నడుస్తోంది. మునుపు పది మనుషులున్న చోట ఇప్పుడు ఓ యంత్రం. పనులకు యంత్రాలు, మాటలకు యంత్రాలు, చివరకు కాఫీ టీలకీ యంత్రాలే. ఒకటేంటి అన్నిటికీ యంత్రాలే.

ఆఫీస్ నుంచి బయలుదేరింది సుందరి. ఆటోమేటిక్ కారు. అన్నీ సెట్ చేసి, సీటులో జాగిలపడి కూర్చుంది.

‘మామూలుగా ఐతే స్ఫూర్తి పెళ్లి గురించి చెపితే ఎగిరి గెంతేసినంత పని చేస్తారు అత్తయ్యగారు. కానీ, ఇంటికి వెళ్లి ఎలా చెప్పాలా అని నేడు ఆలోచించే పరిస్థితి వచ్చింది. అసలూ విషయం అర్థమవుతుందో లేదో కూడా తెలియదు. ఏది ఏమైనా చెప్పక తప్పదు’. ఆటోమేటిక్ షాఫర్-ఫ్రీ కారు కనుక, ట్రాఫిక్ చూడవలసిన పనిలేదు. కారు దాని మానాన అది దూసుకు పోతోంది. అంతకంటే వేగంగా పరుగులు తీస్తున్నాయి సుందరి ఆలోచనలు.

ఆలోచనల వేగాన్ని, కారునూ ఆపమని కారులో ఉన్న గూగులమ్మకు చెప్పి నిర్దేశించింది, ఎప్పుడూ వెళ్లే రెస్టారెంటుకి తీసుకెళ్లమని ఆనతి ఇస్తూనే. ఆ డ్రైవ్-ఇన్ రెస్టారెంటు వద్దకు వచ్చి ఆగింది. ఖాళీగా దొరికిన పార్కింగ్‌లో ఇమిడిగ్గా కారు తనను తాను ఇముడ్చుకుంది. ఆర్డరు ఇవ్వడం కోసం టచ్-స్క్రీనుకి దగ్గరగా నిలబడి ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా కాఫీ ఆర్డరు చేసింది సుందరి బాట్ సహాయంతో. ఒక చిక్కటి కాఫీకి కావలసిన పాళ్ళు కూడా చెప్పింది. రోబో సర్వీస్‌తో ఆర్డరు పూర్తైంది. ఆన్‌లైన్ పేమెంటు కాబట్టి టిప్పులకి తావే లేదు.

అలసిన కళ్ళూ, యంత్రాలతో రోజల్లా మాట్లాడిన మనసూ ఒక మనిషి కోసం మాట కోసం తహతహలాడాయి. కానీ ఆ రోజులు వెళ్లిపోయాయి. కాలం ముందుకు దూసుకుపోతోంది. కాలంతో పాటు మారుతున్న పరిస్థితులూ. గతం గతః అనుకుని, రోబో తెచ్చిన మెషిన్ కాఫీని తాగింది. కారును ఇంటివైపుకి పయనమవ్వమని ఆదేశించింది. సీట్లో జాగిరపడి సన్నగా వినిపిస్తున్న చిట్టిబాబు వీణ వాయిద్యం వింటోంది సుందరి. కారులో అన్నీ మారినా తన చిన్ననాటి జ్ఞాపకాలైన చిట్టిబాబు కచేరీల వీణా వాయిద్యం మాత్రం మారలేదు. ఆనాడు తాతగారితో కలిసి కచేరీలకు వెళ్లిన జ్ఞాపకాలు మాత్రం మదిలోతుల్లో మృదు మధురంగా నిలిచిపోయాయి. నాటి గ్రామఫోన్ రికార్డులంత మధురంగా కాకున్నా, నేటి స్టీరియో సౌండు ఎఫెక్టుతో కృత్రిమంగా అనిపించినా, ఆ కమ్మని వాయిద్యం వింటూంటే రోజంతా పడిన అలసట ఒక్కసారిగా మాయమవుతుంది. మనసు తేలిక పడుతుంది. రోజు మొత్తమ్మీద తాను ప్రశాంతంగా గడిపేది ఆ కొద్ది నిముషాలే.

మరో అరగంట ఇట్టే గడిచి పోయింది. బంగళా ముందు కారు ఆగింది. సువిశాలమైన గేట్ వద్ద ఆగిన కారు, సుందరి వేయబోయే సీక్రెట్ కోడ్ కోసం వేచి వుంది. కోడ్ వేసిన మరు క్షణం రిమోట్ గేట్ తెరుచుకుంది.

పూర్వం ఆ గేట్ చిన్నగా వుండేది. ఇప్పుడు రెండింతలు అయ్యింది. ఆ రోజుల్లో, రామయ్య వచ్చి గేట్ తీసేవాడు. ‘అమ్మగోరూ’ అంటూ పలకరించి, ‘అలసి పోనారమ్మా’ అంటూ ఆప్యాయంగా మాట కలిపేవాడు. ఆవేళ వచ్చిన తపాలాలు అందించి, రోజంతా ఎవరెవరొచ్చారో చెప్పి కానీ లోపలికి వెళ్లనిచ్చేవాడు కాదు. ఇప్పుడు రామయ్య చోటులో రిమోట్ కంట్రోల్ చేరింది. కబుర్లకు బదులు కోడ్‌లు వచ్చాయి. ఇవన్నీ గుర్తుంచుకోవడానికో ఆదేశించడానికో కూడా మన నోరుని ఉపయోగించ కుండా గూగులమ్మకో అలెక్సాకో ఉత్తర్వులు జారీ చెయ్యడం.

సుందరి అత్తగారి పుణ్యమా అనీ గూగుల్ కాస్తా గూగులమ్మ అయ్యింది.

సుందరి పెళ్ళైన కొత్తల్లో నూకాలమ్మ పని చేసేది. ఇరవై ఏళ్ళుగా తెలిసిన వ్యక్తి. నూకాలూ అంటూ నోరారా పిలిచేవారు. దాంతో పొద్దస్తమానూ కబుర్లు చెప్పేవారు.

మాడర్నైజేషన్ పేరిట పదేళ్ల నుంచీ జరిగిన అన్ని మార్పులతో సమంగా పెరిగిన ఇంట్లో నూకాలుకి బదులు గూగుల్ వచ్చింది. “ఏవిటోనే ఈ గూగులమ్మ కనిపించదూ వినిపించినా ఓ పట్టాన అర్థమై ఛావదు” అంటూ విసుక్కుంటారు అత్తగారు.

“ఒసేయ్ గూగులమ్మా” అని విసుగంతా మేళవించి పిలిస్తే పలకదు. అదేమైనా నూకలమ్మేంటీ, కోపాన్నీ విసుగునీ, ఆప్యాయతనూ తెలుసుకునేందుకు. అస్సలు పలికేది కాదు.

“అలా కాదు అత్తయ్యగారు, ‘హే గూగుల్’ అనాలి” అని చెప్పేది సుందరి.

“అంత వయ్యారంగా పిలుస్తే కానీ పలకదుటేఁ” బుగ్గ నొక్కుకుంటూ అన్నారావిడ.

నూకాలు చోట్లో ఎవ్వరినీ చూడలేక, నూకాలుని తలుచుకోవడం కూడా మానేశారు.

కారు షెడ్డులోకి వెళ్ళింది, గేటు మూత పడింది. వీధి గుమ్మం వద్ద ఓపెనర్ కార్డు పెట్టి మెయిన్ డోర్ తెరిచింది సుందరి. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది.

ఆ ఇంట్లో ఇప్పటికీ మారనిది అత్తగారి గది ఒక్కటే. నవ్వారు పెట్టె మంచం, మరచెంబు, చేతి కర్ర అన్ని వస్తువుల్లోనూ పాతదనం కనబడుతూ వుంటుంది. అత్తయ్యగారి గదిలో ఆవిడతో సహా అన్ని వస్తువులూ, ఒకనాటి కాలానికి గురుతులుగా మిగిలి పోయాయి.

“ఈ తలుపు చడీ చప్పుడూ ఉండదేమో, ఎవరొస్తున్నారో, ఎవరెడుతున్నారో తెలియదనుకో. వచ్చావా అమ్మా. కాస్త కాఫీ తాగుతావేంటి” అడిగారు అత్తయ్యగారు.

“లేదు అత్తయ్యగారు, తాగే వచ్చాను. కాస్త తల నెప్పిగా ఉంది. స్టీమ్ బాత్ తీసుకుని ఫ్రెష్ అయ్యి వస్తాను” అని జక్కూసి గదిలోకి వెళ్ళింది సుందరి.

స్టీమ్ బాత్ తీసుకున్నాక తల భారమంతా తగ్గి కాస్త తేలిగ్గా అనిపించింది. హాట్ ఎయిర్ డ్రైయర్ ఎన్‍క్లోజర్లో కాసేపు నిలబడి ఒళ్ళంతా ఆరపెట్టుకుని, కాజువల్ వేర్ వేసుకుని హాల్లోకి వచ్చింది సుందరి.

శుభవార్తగా చెప్పాలన్న వార్త అత్తయ్యగారికి ఎలా చెప్పాలో తనకి బోధపడలేదు.

“రీసెర్చ్ అయ్యేదాకా పెళ్లి చేసుకోనమ్మా” అంటూ మారాం చేసిన స్ఫూర్తి, వాడితోనే చదివిన ప్రజ్ఞనే కోడలిగా తెస్తాడేమో అన్న అనుమానమైతే బలంగా వుండేది. కానీ…ఇలా, సెనోరిటా అనే…….

‘ఏది ఏమైనా అత్తయ్యగారికి చెప్పవలసిందే. ఈరోజే దానికి మంచి రోజు. ఆయన కూడా ఊళ్ళో లేరు. లేకపోతే మాటా-మాటా పెరిగి ఇల్లు రణరంగం అవుతుంది. ఇప్పుడైతే ఆవిడకి నిదానంగా చెప్పి బోధపరచవచ్చు’ అనుకుంది సుందరి.

“అత్తయ్యగారూ, ఎట్టకేలకు మన స్ఫూర్తి పెళ్ళికి ఒప్పుకున్నాడు” టూకీగా అంది.

“అదేఁవిటే అమ్మా, ఆ మాట ఇంత నెమ్మదిగా చెపుతావూ. నాకు తెలుసమ్మా, నా మనవడు నా మనసు కష్టపెట్టే పని చేయడు. హిందుస్తానీ ఐనా పరవాలేదు, అరవమ్మాయైనా పరవాలేదు, నే బతికుండగా చేసుకోరా అన్నాను. నా కోరిక తీరుతోందన్నమాట. మొత్తానికి అదేదో కంప్యూటరో ఏదో. అందులో దొరికిందన్నమాట వాడికోసం తపస్సు చేస్తున్న పిల్ల” అన్నారు.

సుందరి ఏం మాట్లాడకపోయే సరికి, “నీకు కోడలు నీకు ఆట్టే నచ్చలేదుటేఁ? ముభావంగా ఉన్నావూ?” ఆగలేక ప్రశ్న వేసి మళ్ళీ తమాయించుకుని సమాధానం కూడా ఆవిడే చెప్పారు.

“రోజులు మారాయి సుందరీ. దానికి తగ్గట్టు మనమూ మారాలి మరీ. వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటే చాలు. మనకంత కంటే కావలసిందేముందే.”

ఎప్పటికప్పుడు అభ్యుదయభావాలు కలిగిన ఆవిడ మరో సారి ప్రగతిశీల తత్వాన్ని నిరూపించుకున్నారు.

“మనకి మాత్రం ఇప్పుడు మడులా, దడులా. లోకంతో పాటు మనమూ మారలేదూ.. ఎక్కడి పిల్లైతేనేం, మనింటి కోడలయ్యాక మనకు ముద్దే” అన్నారు.

కళ్ళ నీళ్ల పర్యంతం అయ్యింది సుందరికి. ముప్పయ్యైదేళ్ళ అనుబంధం. ఆ తరానికి చెందిన వారు ఇప్పుడు ఈ వైభోగం కూడా చూడాలా అని బాధ వేసింది.

“అత్తయ్యగారూ, మన స్ఫూర్తి చేసుకోబోయేది సెనోరిటా అనీ, అమ్మాయి కాదు. ఆడ రోబో. ఇప్పుడు జపాన్ మున్నగు దేశాల్లో మనుషులను కాకుండా రోబోలనే సహజీవనానికి ఎన్నుకుంటున్నారు. అలాగ మనవడు కూడా ఇప్పుడు సెనోరీటాను…….” చెప్పింది సుందరి

“రోబో అంటే?” అన్నారు అత్తయ్యగారు.

“మన ఇంట్లో డిష్ వాషెర్, వాషింగ్ మిషనూ అవీ ఎలా ఉన్నాయో అలాగన్నమాట. నూకాలమ్మకు బదులుగా ఇప్పుడు మనం వాటినే కదా మన పనులకు వాడుకుంటున్నాము. అలాగే, అందంగా అమ్మాయిలా చేయ బడిన యంత్రం. బొమ్మ” అన్న సుందరి మాట ఆవిడ మేధాశక్తి అందలేదు.

“ఏవిటోనే అమ్మా నాకేమీ బోధ పడలేదు” ఆ ఒక్క మాటతో తన గదిలోకి వెళ్లి ఆ పెట్టె మంచం మీద కూలబడ్డారు.

మరునాటి లాంచ్‌కి కావలసిన పనులన్నీ మరోసారి చూసుకుని, మొబైల్‌లో రిమైండర్లు పెట్టుకుని, లాంచ్‌కు వున్న ప్రోడక్ట్ డీటెయిల్స్ మరోసారి లాప్టాప్‌లో చెక్ చేసుకుని, ‘ఇంక పడుక్కోవాలి, రేపు మళ్లీ ముఖ్యమైన రోజు’ అనుకుంటూ తన గదిలోకి వెళ్లి రిమోట్‌తో డోర్ లాక్ చేసి, ఏసీ ఆన్ చేసుకుని మంచమ్మీదకి వాలింది సుందరి. ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది.

***

తెలతెలవారుతూనే మెలుకువ వచ్చింది సుందరికి.

రోజూలా మొబైల్ అలారం సుందరిని నిద్ర లేపలేదు. పక్షుల కువకువ రాగాలు వినిపించ సాగాయి. ఎప్పుడూ మూసి వున్న కిటికీలు, దళసరి కర్టన్ల తెరలకు బదులుగా వెచ్చని సూర్యకిరణాల కాంతులు అరుణోదయమంటూ తేజంగా మేనును తాకి, తట్టి లేపాయి. ఏసీ చల్లదనానికి బదులు చిరుగాలులు గిలిగింతలు పెట్టసాగాయి. పారిజాత సుమాల సుంగంధాలతో చిరుగాలి మత్తెక్కించింది. రంగు-రంగుల పక్షుల కువకువలతో ప్రకృతి అందాలు. పల్లెటూరి పచ్చదనం.

పల్లెటూరు అంటేనే ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోకుండా కృత్రిమత్వానికి దూరంగా వున్నట్టు. ఆ వాతావరణంలోని ప్రశాంతమైన స్థితి. గలగల మని సెలయేళ్ళు, గట్టున చెట్లు. కొమ్మ కొమ్మకో సన్నాయి పాట. ఆప్యాయతలకూ, ఆత్మీయతలకూ నిలయాలుగా ఇళ్ళకు మధ్య దూరం తక్కువ మనసులు చేరువ ఎక్కువ.

ఆ వనాల నడుమ నాట్యాలాడుతున్న మయూరాలు. చెంగున ఉడుతల గెంతులు. పిచ్చుకల కిచకిచలు. అంతలో వానర నేస్తం సుందరి చేతికి అందించిన జాంపండు. ఆశగా నోట్లో పెట్టుకోబోయింది… ఆశా భంగం.

ఇప్పుడు నిజంగా వచ్చిన మెలకువ.

పచ్చటి వనాలు కనుమరుగయ్యాయి. కాంక్రీట్ వనాలు దర్శనమిచ్చాయి. యంత్రాల ఘోష, వాతావరణ కాలుష్యం, వాహనాల హోరు, కనుమరుగైన నదులు, మురికి నీటన చెరువులు. అన్నీ యథాతథంగా కనిపించాయి.

వీటన్నిటికీ తోడైన మరో నూతనత్వమే, తమ కోడలు సెనోరీటా.

ఇప్పుడు ఏ ఇంటా కనబడని రేడియోలో పూర్వం విన్న ఆ పాట సుందరి చెవుల్లో మ్రోగింది. జ్ఞాపకాల తెరల్లోంచి వెలుపలకి వస్తూ….

“ఎక్కడికెళుతోందీ…లోకం ఏమైపోతోందీ…”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here