Site icon Sanchika

రంగుల హేల 20: సెంటి-మెంటల్స్

[box type=’note’ fontsize=’16’] “మన మనసులో ఒక మూలనున్న ఈ సెంటిమెంట్స్ ఎంత వదిలించుందామన్నా మనల్ని వదలవు. అయితే మీ తార్కిక తెలివిని నమ్ముకోండి. దాన్ని ఎమోషన్స్ డామినేట్ చెయ్యకుండా చూసుకోండి” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల” కాలమ్‌లో. [/box]

[dropcap]బా[/dropcap]గా చదువుకున్న మా పెద్ద మావయ్య మా అందరినీ  “సెంటిమెంటల్ ఫూల్స్ కాకండర్రా!”  అనేవాడు. తను ఆ రోజుల్లో బి. ఏ. పాస్ అయ్యి ఊర్లోనే వ్యవసాయం చేసేవాడు. చదువుకుని ఉద్యోగం చెయ్యలేదని ఆయన మీద ఊరందరి ఆరోపణ. ఎప్పుడూ ఇంగ్లీష్ నవల్స్ చదివేవాడు. ఇంటినిండా ఇంగ్లీష్ పుస్తకాలే. రీడర్స్ డైజెస్ట్ లాంటివి పోస్ట్‌లో వచ్చేవి. మేధావి అని అందరూ అతన్ని మెచ్చుకునే వారు. పెళ్లి ససేమిరా వద్దన్నాడు. అన్న మాట మీద నిలబడ్డాడు. ఎవరిమాటా వినలేదు. బ్రహ్మచారిగా ఉండి పోయాడు.

మేం రక్త సంబంధం, బంగారు తల్లి ఇంకా అలాంటి విషాదాంతాలున్న సినిమాలు చూసొచ్చి చూడని అమ్మకూ, నానమ్మకూ కళ్ళకు కట్టినట్టు చెప్పి వాళ్లతో కూడా  కళ్లనీళ్లు పెట్టిస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు మావయ్య మా మీద కోప్పడేవాడు, “ సెంటిమెంటల్ ఫూల్స్ అంటారు మీలాంటివాళ్లనే” అంటూ.

“సెంటిమెంట్స్ లేని జీవితమేం జీవితం రా! బతుకంటే బంధాలూ, అనుబంధాలూనూ!” అనేది మా పెద్దక్కయ్య. ఆవిడ ఆ సినిమా టైపే మరి. “మిమ్మల్ని ఎవడూ బాగు చెయ్యలేడు. సినిమా కథలు మరీ మరీ చెప్పుకునేడవండి” అనేవాడు విసుగ్గా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ.

ఏమిటో ఎంత వద్దనుకున్నా మనుషులకి ఈ  సెంటిమెంట్స్ ఉంటూనే ఉంటాయి.  హాల్లో టీవీలో పాత సినిమా వస్తుంటే  అప్పటి కేరెక్టర్ ఆర్టిస్ట్‌లు ఎస్వీ రంగారావు, గుమ్మడి, అంజలీదేవి, జి.వరలక్ష్మి లాంటి మహానటుల  డైలాగులు కిచెన్లో వంట చేసుకుంటూ వింటుంటేనే కళ్లనీళ్లు జల జలా రాలతాయి. గొంతుల్లోనే అంత నటన చూపే వారు వాళ్ళు .

మన మనసులో ఒక మూలనున్న ఈ సెంటిమెంట్స్ ఎంత వదిలించుందామన్నా మనల్ని వదలవు. ఈ మధ్య మా మావయ్యని గుర్తు చేసే సంఘటనలు రెండు జరిగాయి.

మా సొంత అన్నయ్య అమెరికాలో ఉన్నాడు. ఫోన్‌కి అందుబాటులో లేడు. రాఖీ పండగొచ్చింది. ఎక్కడ విన్నా  మైకుల్లో  చెల్లెమ్మా, అన్నయ్యా, మేరె ప్యారీ బెహెనా అంటూ పాటలు హోరెత్తుతున్నాయి. నాలో సెంటిమెంట్ పొంగింది. మా పెద నాన్న కొడుకు నంబర్ ఉంటే వాడికి ఫోన్ చేశాను. “నువ్వు కూడా అన్నయ్య వే కదరా! అందుకే రాఖీ పండగని కాల్ చేసానురా! ఎలా ఉన్నావ్ ?” అన్నాను. వాడొక సెకన్ సంతోషించి, తన వివరాలు చెప్పి నా క్షేమాలడిగి నాకు వరసకు అన్నయ్యలు ఇంకా నలుగురు ఉన్నారనీ వాళ్ళకు కూడా ఫోన్లు చెయ్యమని చెప్పాడు. ఆ  తర్వాత వరసగా ఆ నలుగురి  విశేషాలూ చెప్పి ఫోన్ పెట్టేసాడు. కాసేపటికి మెసేజ్ బాక్స్‌లో వాళ్ళ నంబర్లొచ్చిపడ్డాయి.

ఏదో ముచ్చటపడి వీడితో రెగ్యులర్‌గా టచ్‌లో లేకపోయినా పలకరిస్తే మిగిలిన కజిన్స్ అందరితో కూడా మాట్లాడమని ఉచిత సలహా ఇస్తాడేంటి? వాళ్ళందరి విశేషాలూ ఒకసారే వినడంతో కలగలిసిపోయి ఎవరెక్కడున్నారో తలలో కెక్కలేదు. వాడు చేసిన ఇర్రిటేషన్‌కి ఒక గంట బుర్ర వేడెక్కింది. నా చెంపలు నేనే వేసుకున్నాను. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదే కదా మరి. రాఖీ పండగ రోజు అక్క చెల్లెళ్లంతా, అన్నదమ్ముల్ని వాటేసుకోవాలని రూలుందా ఏమిటి ? కాపీ కల్చర్ కాకపోతే!

మరోసారి ఈ సంఘటన మరిచిపోయి (షార్ట్ మెమరీ ప్రాబ్లెమ్ వల్ల) మదర్స్ డే రోజున అమ్మని తల్చుకుని బెంగపడ్డాను. అమ్మకి ఆప్తులైన వారెవరున్నారు అని గుర్తు చేసుకున్నాను. సీత పిన్ని అని మా అమ్మకి చెల్లెలి వరస ఒకావిడ ఉండేవారు. అమ్మా , ఆవిడా ఒకరికొకరు ఆప్యాయంగా ఉండేవారు. ఆవిడ మా ఊరిలోనే ఉంటారు. ఆ సీత పిన్ని కొడుకు రమణకి ఫోన్ చేసి కుశలప్రశ్నలడిగి “మీ అమ్మ కివ్వరా! మాట్లాడతాను” అన్నా. ఇచ్చాడు. “పిన్నమ్మా! నేను చిట్టిని” అన్నాను. ఆవిడ నన్ను గుర్తు పట్టింది. “మీ అమ్మ వెళ్ళిపోయింది కదా!” అంది బాధగా.

“ఎలా ఉంది పిన్నీ నీ ఆరోగ్యం?” అనడిగాను.

ఆవిడ “ఎలా ఉంటానే తల్లీ! వయసయి పోయాక బతక్కూడదే!” అంటూ ఓ అర్ధగంట ఆమె అనారోగ్యం విషయం వర్ణించి, వర్ణించి తన ప్రతి అవయవం గురించి వివరంగా చెప్పింది. వెంటనే ఆ నొప్పులన్నీ నాకు ట్రాన్స్ఫర్ అయిపోయాయి. మోకాళ్ళూ, నడుమూ, మెడా, చెయ్యీ నడుస్తూ మాట్లాడడం వల్ల నెప్పులందుకున్నాయి.

ఆ తర్వాత తన కోడలు, కొడుకు తాను ఆశించిన విధంగా ప్రేమాభిమానాలతో చూడడం లేదనీ, తన కూతురికి వాళ్ళు పెట్టుపోతలు సరిగా జరపడం లేదనీ వాపోయి ఆ విషయమై నేను మా కజిన్ గాడిని గట్టిగా నిలదియ్యమని  వాక్రుచ్చింది. ఇంకా, ఇంకా అనేక నిష్ఠూరాల విశేషాలు ఆవిడ చెబుతూ పోయింది. ఫోన్ ఇద్దరిలో ఎవరం పెట్టామో లేక కట్ అయ్యిం దో  తెలీలేదు.

‘మావయ్యా! ఎక్కడున్నావురా! ఎంత మంచి వాడివిరా! ఎన్ని జీవిత సత్యాలు చెప్పావురా!’ అనుకుంటూ బీరువాలోంచి ఫామిలీ ఆల్బం తీసి అందులో ఉన్న మావయ్య ఫోటోని తాకి కళ్ళకద్దుకున్నా!

“ఏడిశావులే! నేను చెప్పిందంతా పోయిందా? ఇదే మరి సెంటిమెంటల్ ఫూల్ అవ్వడం అంటే!” అని మావయ్య నవ్వినట్లనిపించి నాకూ నవ్వొచ్చింది.

“ప్రాక్టికల్‌గా ఉండి చావండి. ఇలాంటి ఫీలింగ్స్‌ని మూటకట్టి కాస్త మూలకి పెట్టండి. మీ తార్కిక తెలివిని నమ్ముకోండి. దాన్ని ఎమోషన్స్ డామినేట్ చెయ్యకుండా చూసుకోండి” అనేవాడు సుమీ!

Exit mobile version