[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]
[dropcap]మా[/dropcap] నాన్నగారికి ఉద్యోగరీత్యా బదిలీలు ఎక్కువగా అవుతూ వుండేవి. అందుకే నా హైస్కూల్ చదువంతా చాలా ఊళ్ళలో, చాలా స్కూళ్లలో జరిగింది. ఏ ఊరెడితే ఆ ఊళ్ళో కొత్త పరిచయాలూ, కొత్త స్నేహాలతోపాటు రకరకాల మనుషులు కూడా పరిచయం అయ్యేవారు. అలాగే ఒక ఊరు వెళ్ళినప్పుడు పరిచయం అయింది అభయాంబక్కయ్య.
ఆ ఊళ్ళో మేం ఒక ఇంట్లో మొదటి అంతస్తులో అద్దెకుండేవాళ్లం. కింద ఈ అభయాంబా, వాళ్లాయనా ఉండేవారు. వాళ్లకి పెళ్ళయి అప్పటికింకా ఆర్నెల్లే అయింది. అందుకని ఆ అభయాంబకి చిన్న సందేహమొస్తే చాలు “పిన్నిగారూ..” అంటూ మా అమ్మగారి దగ్గరకొచ్చేసేది. అప్పటికి మా అన్నయ్యలు వేరే ఊళ్ళో కాలేజీలో చదువుతుండేవారు. నేనూ మా ఇద్దరు చెల్లెళ్ళూ ఈ అభయాంబకి బలయి పోతుండేవాళ్లం.
చాలా కొద్దిమందిలో వుండే అలవాటు మా గ్రహచారంకొద్దీ ఈ అభయాంబకి ఉంది. అదేంటంటే ఎవరి ఇంట్లోకైనా వస్తున్నప్పుడు చెప్పా పెట్టకుండా, కనీసం తలుపైనా కొట్టకుండా వేళాపాళాలేకుండా ఇంట్లోకొచ్చెయ్యడం. పొద్దున్నే అందరిళ్ళల్లో ఎంత హడావిడిగా ఉంటుందీ!.. ఒకవైపు పూజ చేసుకుని మహానైవేద్యం పెట్టుకోవాలని మా అమ్మగారు హడావిడిగా ఉండేవారు. పూజ ముగించుకోవాలీ, నైవేద్యం పెట్టుకోవాలీ.. ఆ తర్వాత ఆఫీసుకి వెళ్ళే మా నాన్నగారికీ, స్కూలుకి వెళ్ళే మాకూ భోజనం పెట్టి పంపించాలి. ఈ పనులన్నీ పొద్దున్నే తొమ్మిదిగంటలకల్లా అయిపోవాలి. అంత హడావిడిగా ఉన్న మా అమ్మగారి దగ్గరకి పువ్వుతాంబూలం, పండుతాంబూలం నోము పట్టి అవివ్వడానికి పొద్దున్నే వచ్చేది ఈ అభయాంబ. వీధితలుపుకి కర్టెన్ ఉండదు కనక లోపల హాల్లోకి వచ్చేసేది. అక్కడనించి, “ఎవరర్రా అక్కడా, కాస్త ఈ కర్టెన్ పక్కకి పట్టుకోండి, మడి కట్టుకున్నానూ..” అనేది. మేం ముగ్గురం స్కూళ్లకెళ్ళాలని పుస్తకాలు సద్దుకుంటూ, హోం వర్కులు పూర్తి చేసుకుంటూ బిజీగా ఉండేవాళ్లం. నువ్వెళ్ళంటే నువ్వెళ్ళంటూ ఒకళ్లకొకళ్ళం సైగలు చేసుకుని, ఆఖరికి గుమ్మానికి దగ్గరగా ఉండేవాళ్లం వెళ్ళి కర్టెన్ లాగి తలుపు మీద వేసేవాళ్లం. అప్పుడు దాన్ని తగలకుండా ఓ పక్కనుంచి జాగ్రత్తగా వంటింట్లోకెళ్ళిపోయి, మడి కట్టుకునున్న మా అమ్మగారిని పీటమీద కూర్చోబెట్టి, పసుపురాసి, బొట్టు పెట్టి, తాంబూలం యిచ్చి, కాళ్లకు రెండుసార్లు దండం పెట్టి, రెండుసార్లూ అక్షింతలు వేయించుకునేది. రెండుసార్లెందుకంటే మరి పువ్వుతాంబూలం, పండుతాంబూలం రెండు నోములు కదా! అందుకన్న మాట. (ఈమాట తర్వాత మా అమ్మగారినడిగితే చెప్పేరు.) ఈ లోపల స్టౌ మీదున్న పులుసు పొంగిపోవడమో, పెడుతున్న పోపు మాడిపోవడమో జరిగేది. అక్కడికీ మా అమ్మగారు ఒకసారి ఆమెతో చెప్పేరు, “అంత పొద్దున్నే మడితో ఇవ్వక్కర్లేదమ్మా, సాయంత్రం చీకటిపడేలోపల ఇవ్వచ్చూ..” అని అబ్బే.. “కాదండి పిన్నిగారూ, కథ చెప్పేసుకున్నాక తాంబూలం ఇవ్వకపోతే ఎలాగో ఉంటుందండీ..” అనేది. ఆమాట విని మా అమ్మగారు మన సంప్రదాయాన్ని పడిపోకుండా నిలబెడుతున్న అభయాంబని చూసి మురిసిపోయేవారు.
ఒక్కొక్కసారి ఏ తెల్లారకట్ట లేచేదోమరి తెల్లారేసరికల్లా ఇంత పెద్దగిన్నెలో వడియాలపిండి తెచ్చేసి, మా వంటింటి వెనకాలున్న డాబా మీద వడియాలు పెట్టేసేది. ఆవిడ తలుపుతోసుకుని వచ్చేసరికి, మాలో ఒకళ్ళు పళ్ళు తోముకుంటూ, ఇంకోళ్ళు జడలేసుకుంటూ, ఇంకోళ్ళు ఇంకా కాఫీలు తాగుతూ రకరకాల అవస్థల్లో ఉండేవారం. ఆమె కివేవీ పట్టేవి కావు. తిన్నగా స్వంతింట్లో కొచ్చినట్టు వచ్చెయ్యడం, తన పని తను చేసుకుపోవడం. ఆవిడ అలా డాబామీద వడియాలు పెట్టుకుంటూ కూర్చుంటే పొద్దున్నే అక్కడ పని చేసుకోవలసిన మాకు ఎంత ఇబ్బందో ఆ అభయాంబకి అర్ధమయ్యేది కాదు.
స్కూల్‌కి వెళ్ళే హడావిడిలో జడలు వేసుకున్నాక పువ్వుల్లా రిబ్బన్లు కట్టుకుంటుంటే ఏ కందిపప్పు తీసికెళ్ళడానికో వచ్చి అట్టే నిలబడిపోయేది. ఏం కావాలని అడిగితే “అలా ఆ రిబ్బన్లు కట్టుకునే బదులు ఆ టైములో పిన్నిగారికి కాస్త సాయం చెయ్యొచ్చుకదా! పాపం వంటింట్లో ఒక్కావిడా అవస్థ పడుతున్నారూ..” అనేది. ఆ మాట చెవిన పడగానే మా మొహాలు మాడిపోయేవి, మా అమ్మగారి మొహం చాటంతయ్యేది.
ఇలా చాలా కారణాలవల్ల మా అమ్మగారికి అభయాంబ అంటే ఇష్టం యేర్పడిపోయింది. ఆ మాత్రానికైతే మాకేమీ అభ్యంతరం లేదు కానీ, అస్తమానం ఆ అభయాంబని చూపించి మా అమ్మగారు మమ్మల్ని “ఆ అభయాంబని చూసి నేర్చుకోండి. ఎంత వినయం, ఎంత విధేయత, ఎంత ఒద్దిక, ఎంత మడీ, ఎంత తడీ..” అంటూ ఓ పెద్ద లిస్టు చదివేవారు. అది నాకూ, మా చెల్లెళ్ళిద్దరికీ నచ్చేదికాదు. ఈ అభయాంబ గొడవ ఎలా వదల్చుకోవాలిరా బాబూ అని రాత్రింపగళ్ళు ఆలోచించేవాళ్ళం.
ఒకసారి మాకా అవకాశం వచ్చింది. మాకు బాగా దగ్గరివాళ్ళు యెవరో చనిపోతే మా అమ్మగారూ, నాన్నగారూ ఓ మూడురోజులపాటు ఊరు వెళ్ళాల్సివచ్చింది. మేమింకా చిన్నవాళ్ళం కదా! ఒక్కళ్ళనీ వదిలి వెళ్ళలేరు. అలాగని వాళ్ళతోకూడా తీసికెడదామంటే స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి.
అలాంటి సమయంలో ఈ అభయాంబ “మీరు వెళ్ళిరండి పిన్నిగారూ, ఈ మూడురోజులూ వాళ్ళని నేను చూసుకుంటానూ..” అంటూ మా అమ్మగారికి అభయం ఇచ్చేసింది. పాపం మా వాళ్లకి ఇంకోదారి లేకపోయింది.
ఆ మూడురోజులూ పొద్దున్న టిఫినూ, మధ్యాహ్నం, రాత్రీ భోజనాలూ హోటల్ నుంచి తెచ్చి పెట్టమని ప్యూన్‌కి పురమాయించేసేరు మా నాన్నగారు. ఇంక అభయాంబ మాకు చేసేదల్లా మేం ఇంట్లో ఏమీ ముట్టుకోకూడదు కనక మాకు కావల్సినవి తీసి అందించడం. మేం స్కూల్‌కి టైముకి వెళ్ళేలా చూడడం.. అంతే..
అంతే.. అప్పుడే నాకు బ్రహ్మాండమైన అవిడియా వచ్చేసింది. దాన్ని వివరంగా మా చెల్లెళ్ళిద్దరికీ చెప్పేను. వాళ్ళెప్పుడూ నా వెనకాలే.. వెంటనే సరేననేసేరు. ఆ మర్నాడు పొద్దున్నే మొదలుపెట్టెసేం మా ప్లాన్.
పైనుంచి కింద ఎక్కడో వున్నఅభయాంబకి వినపడేలాగా అరిచేం..
“అభయాంబక్కా… అభయాంబక్కా… అలమార్లో మా బట్టలున్నాయి తీసివ్వవూ…!”
మడికట్టుకుని వంట చేసుకుంటున్న తను మడిబట్ట విడిచి, వేరే బట్ట కట్టుకుని వచ్చి, మాకు కావల్సినవి యిచ్చి వెళ్ళింది. పది నిమిషాలు కాకుండానే మళ్ళీ
“అభయాంబక్కా… అభయాంబక్కా.. ఇటుపక్క గూట్లో మా టిఫిన్ బాక్సులున్నాయి, తీసివ్వవూ…!”
“అభయాంబక్కా… అభయాంబక్కా… అటుపక్క గూట్లో నా కలర్ పెన్సిల్స్ ఉన్నాయి. తీసుకుందామంటే అవి తగిలేలా పక్కన బట్టలున్నాయి. కాస్త తీసిపెట్టవూ…!”
“అభయాంబక్కా… అభయాంబక్కా… మేవీ బట్టలు ఎక్కడ పెట్టుకోవాలీ…!”
“అభయాంబక్కా… అభయాంబక్కా… ఈ తలుపు గడియ మాకందటల్లేదు.. కాస్త తీసి వెళ్ళవూ…!”
“అభయాంబక్కా… అభయాంబక్కా… ఈ కంచాలు పైకి పెట్టి వెళ్ళింది మా అమ్మ.. తీసిపెట్టవూ…!”
పాపం.. అభయాంబక్క మడిబట్ట మార్చుకుని వచ్చి ఒకసారీ, మర్చిపోయి మడితోనే వచ్చేసి, తర్వాత నాలిక్కర్చుకుని, తడిబట్టతోనే వంట పూర్తిచేసుకుంటూ మరోసారీ, మడో తడో తెలీని మధ్యావస్థలో ఇంకోసారీ ఆ రోజు పొద్దున్న మేడ ఎక్కడం దిగడం… ఎక్కడం దిగడం.. ఎక్కడం దిగడం.. చేసేసరికి మేము స్కూల్ కి వెళ్ళే టైముకి పాపం నీరసం వచ్చేసినట్టు కనిపించింది.
ఇంక ఈ పూటకి వదిలేద్దాం అనుకుని ముగ్గురం స్కూల్‌కి వెళ్ళిపోయేం. సాయంత్రం ఇంటికొచ్చేక మళ్ళీ మొదలెట్టేం. కానీ ఈసారి ప్లేటు మార్చాం..
“అభయాంబక్కా… అభయాంబక్కా…ఈ హోటల్ వాడి కూర బాగులేదు. లోపల జాడీల్లోంచి కొంచెం ఊరగాయ తీసిస్తావా…!”
“అయ్యో.. దానికేం భాగ్యం!” అంటూ సాయంత్రం మడి వుండదుగా అందుకని తడిబట్ట కట్టుకుని మరీ ఊరగాయ తీసిచ్చింది అభయాంబక్క.
“అభయాంబక్కా… అభయాంబక్కా…పాపం మా అమ్మ ఈ పచ్చళ్ళు మడిగా లోపల పెట్టి వెళ్లడం మర్చిపోయింది. కాస్త పెడతావా..!”
ఇలాగ మడితో లేనప్పుడు మడిగా కావాలనీ, ఉన్నప్పుడు ఇవతలివి కావాలనీ కిందకీ పైకీ తెగ తిప్పాం.. రెండోరోజుకే అభయాంబక్క మొహంలో కాస్త విసుగూ, చిరాకూ కనిపించేయి. ఇంక మూడోరోజు పొద్దున్నేపైనించి గట్టిగా
“అభయాంబక్కా… అభయాంబక్కా…ఓసారి పైకి రా..” అని పిలిచేను.
మెట్లదాకా వచ్చిన అభయాంబక్క “ఉష్.. నెమ్మది. అలా గట్టిగా అరవకు. అస్తమానం ఈ పైకీ కిందకీ తిరగడమేంటని ఆయన విసుక్కుంటున్నారు..” అంది నెమ్మదిగా.
అక్కడే మెట్లమీద నిలబడిన మా చిన్నచెల్లెలు “మరి మా అమ్మున్నప్పుడు నువ్విలాగే అస్తమానం తిరిగేదానివిగా..!” అనేసింది. అంతే.. మళ్ళీ మాట్లాడకుండా ఆవిడ కిందకెళ్ళిపోయింది.
ఆ మర్నాడు మా అమ్మగారూ, నాన్నగారూ వచ్చేసేరు. అరోజూ మర్నాడూ మా అమ్మగారికి ప్రయాణం బడలికతోనూ, ఇల్లు సర్దుకోవడంతోనూ సరిపోయింది.
మూడోనాడు సడన్‌గా, అవునూ.. అభయాంబ కనిపించట్లేదేవిటీ…అనుకుంటూ, మా మొహాలు చూసి అనుమానంగా “మీరేవైనా అన్నారా..?” అనడిగేరు.
మేం ముగ్గురం ఒకళ్ళ మొహాలొకళ్ళం చూసుకున్నాం. అంతే.. ష్..గప్ చుప్..