[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘శాసించావు సుమా’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]ఇం[/dropcap]తకాలం నా సంతోషం సగమే
నీ రాకతోనే అది నిండు పున్నమి
గతమంతా నా మనసు ఖాళీ
నీవు నన్ను కమ్మేశాక
నాకు కూడా చోటివన్నంత ఇరుకు
నేను నేనంటూ గొప్పగా
జబ్బలు చరిచాను ఇన్నాళ్ళూ
నీవు లేక నేను ఎక్కడని
బేలగా నిలిచాను ఈనాడు
లోకం అంతా నాదే నని
భావించాను ఓనాడు
నీవే నా లోకమని
నమ్మక తప్పని స్థితి ఈనాడు
నా పెదవులను శాసించావు
నీ పేరే జపించమని
నా అలోచనలను బంధించావు
నీ తలపులనే వరించమని
నా బతుకునే ఆదేశించావు
నీవుగా మిగిలిపొమ్మని
జన్మ జన్మకు సాగిపొమ్మని