అనిర్వచనీయమైన అలౌకికానందం కలిగించే ‘శబరి’

0
2

[డా. బాలశౌరిరెడ్డి హిందీలో వ్రాసిన ‘శబరి’ నవల తెలుగు అనువాదాన్ని పరిచయం చేస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]

[dropcap]రా[/dropcap]మాయణంలో శబరిపాత్ర చాలా చిన్నది. రామలక్ష్మణులు అరణ్యంలో సీతాన్వేషణ చేస్తూ వచ్చినప్పుడు వారికి అతిథి మర్యాదలు చేస్తుంది. అంతవరకే, శబరి పాత్ర. ఆ తర్వాత ఎక్కడా ఆమె ప్రసక్తి ఉండదు. ఆమె ఎవరో, ఎక్కడ పుట్టిందో పుట్టుపూర్వోత్తరాలు చెప్పడు వాల్మీకి. కానీ శబరి సంపూర్ణ జీవితం గురించి గతంలో ఒక పుస్తకం వచ్చింది. ఇది చాలావరకు కల్పిత కథ. అయినా అప్పట్లో విశేష ప్రఖ్యాతి పొందటమే కాకుండా, ఇప్పుడు చదివితే ఒక మంచి పుస్తకం చదివిన అనుభూతి కలుగుతుంది. దీనిని రచించినది బాలశౌరిరెడ్డి.

రచయిత పరిచయం:-

యాభైయ్యవ దశకంలో మహాత్మాగాంధీ ప్రేరణతో అనేకమంది తెలుగువారు హిందీ నేర్చుకుని ప్రవీణులైనారు. వారు హిందీ సాహిత్యంలోని అనేక కథలను, వ్యాసాలను, నవలలను తెలుగులోకి అనువదించి తెలుగువారికి పరిచయం చేశారు. కానీ బాలశౌరిరెడ్డి తెలుగు సాహిత్యంలోని అనేక కథలను, వ్యాసాలను, పురాణాలను హిందీలో రచించి హిందీ మాతృభాషగా గల ఉత్తర భారతీయులకు పరిచయం చేసారు. వాటిలో కవిత్రయంగా పేరుపొందిన నన్నయ, తిక్కన, ఎర్రన గురించి, ఇంకా క్షేత్రయ్య, రామదాసు, త్యాగరాజు వంటి భక్తకవుల గురించి ఇలా ఎన్నో వ్యాసాలు రచించారు. అలాగే శబరి గురించి ఒక నవల హిందీలో రచించారు. ఇది కల్పిత కథ అయినా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వారు రూ. 2000 బహుమానంగా ఇచ్చి ప్రోత్సహించారు. 1961లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు బి.ఏ. పరీక్షకు పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు.

బాలశౌరి రెడ్డి కడప జిల్లా, పులివెందుల తాలుకా, గొల్లల గూడూరు అనే ఊళ్ళో 1927లో జన్మించారు. వీరిది మధ్య తరగతి వ్యవసాయం కుటుంబం. దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారి విశారద, ప్రచారక పరీక్షలలో ఉత్తీర్ణులై, అనంతరం హిందీ సాహిత్యాధ్యయనం కోసం ఉత్తర దేశానికి వెళ్లి 1947లో సాహిత్యరత్న, సాహిత్య అలంకార్ పరీక్షలలో ఉత్తీర్ణులైయ్యారు. అప్పటికే హిందీ అభ్యసించిన ఆంధ్రులు హిందీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. బాలశౌరిరెడ్డి తెలుగు సాహిత్యాన్ని హిందీ వారికి పరిచయం చేయాలని ‘శబరి’ నవలను 1961లో రచించారు. దీనిని వెలగా రామకోటయ్య చౌదరి గారు, శ్రీరామ్ చంద్ గారు సంయుక్తంగా తెలుగులోకి స్వేచ్చానువాదం చేశారు.

కథ క్లుప్తంగా :-

సృష్టిలో మార్పు అనేది ఒక్కసారిగా రాదు. క్రమేపీ వస్తుంది. పసిడి రాజుగారి కిరీటంగా తలమీద కూర్చోవాలన్నా, ఆభరణాలుగా శరీరాన్ని అలంకరించాలన్నా ముందు మట్టినుంచీ మనకు ముడిలోహం లభిస్తుంది. దానినుండీ అసలు లోహాన్ని విడదీయాలంటే అనేక మార్పులకు గురికావాలి. స్వచ్ఛమైన సువర్ణం వచ్చిన తర్వాత కరిగించి, కావలసిన ఆకారంలోకి రూపొందించాలి. ఇన్ని మార్పులకు గురి అవుతుంది. అదేవిధంగా శబరి పుట్టుకతోనే భక్తురాలిగా పుట్టలేదు. నిర్దాక్షిణ్యంగా బాటసారుల ప్రాణాలు తీసే దొంగల నాయకురాలిగా పుట్టింది. క్రమేపీ ఆమెలో మానవత్వం పరిమళించింది. అదెలా జరిగినదంటే-

దండకారణ్యంలో అనేక ఋష్యాశ్రమాలు, ఆటవికుల గూడాలు, చిన్న చిన్న పల్లెలు ఉన్నాయి. ఒక ప్రాంతంలో ఉన్న శబరుల గూడెం నాయకుడికి లేక లేక ఒక ఆడపిల్ల పుట్టింది. తమ జాతి పేరు గుర్తుండేటట్లు ఆ పాపకి శబరి అని నామకరణం చేశాడు. నాయకుడికి పుత్రసంతానం లేకపోవటం వలన కుమార్తెకి సాముగరిడీలు, గుఱ్ఱపుస్వారీ, విలువిద్య, కుస్తీపట్టటం, ముష్టియుద్ధo, దోపిడీ చేయటం మొదలైన కులవిద్యలన్నీ నేర్పించాడు.

శబరులు కిరాతులు. మానవత్వం అంటే ఏమిటో వారికి తెలియదు. సాటి మానవులు వారికి మృగాలతో సమానం. ఆహారం కోసం మృగాలను వేటాడినట్లే విలువైన వస్తువుల కోసం బాటసారుల ప్రాణాలు నిర్ధాక్షిణ్యంగా హరించి వారిని దోపిడీచేస్తారు. శబరి యుక్త వయస్కురాలు అయిన తర్వాత గూడానికి నాయకురాలు అయింది. ఆ దారిన ఎవరైనా వస్తున్నారు అనే సమాచారం అందితే చాలు, అనుచరులను తీసుకుని, చెట్లచాటున, పొదలచాటున నక్కి వారిని దోపిడీ చేయటం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య.

శబరిని పెళ్లి చేసుకుని తను గూడెం నాయకుడు కావాలని రాహులుడి కోరిక. రాహులుడిని గిరిక ప్రేమిస్తుంది. అతను శబరి వెంటపడుతూ ఉంటాడు. ఇక్కడ కొంతకాలం పాటు త్రికోణ ప్రేమకథ నడుస్తుంది. తర్వాత ఒకరోజు శబరి సమీపంలోని పల్లెకు దోపిడీకి వెళ్ళింది. అక్కడ ఒక ఇంట్లో వృద్ధురాలు జబ్బుతో మూలుగుతూ పడుకుని ఉంది. శబరిని చూడగానే “నువ్వేనా శబరివి? నీ గురించేగా ఇక్కడివాళ్ళు అందరూ చెప్పుకుంటూ ఉంటారు. నువ్వు బందిపోటు దొంగవని, నరరూప రాక్షిసివని, ప్రాణాలను బలిగొంటావని! నా భర్త బ్రతికి ఉన్నన్నాళ్ళు ఇంకొకరికి అపకారం చేయకుండా కష్టపడి జీవించాము. ఆయన్ని మీ వాళ్ళే బలి తీసుకున్నారు. ఇంకా నా దగ్గర ఏమున్నదని మళ్ళీ వచ్చావు? నీకు కావలసింది నా ప్రాణమేగా! తీసుకుఫో!” ఆయాసంతో వగరుస్తూ అరిచింది వృద్ధురాలు. శబరి మాట్లాడలేదు. అక్కడ నుంచీ మౌనంగా బయటకు నడిచింది. తన జాతి అంటే జనంలో అంత అసహ్యం ఉందా? అనిపించింది.

మరికొన్ని రోజుల తర్వాత మరో సంఘటన జరిగింది. ఆ అడవి మార్గాన ఓ పెళ్లిబృందం వెళుతూన్నదన్న వార్త శబరి అనుచరులకు తెలిసింది. వాళ్ళు వెళ్లి పెళ్లిబృందాన్ని నిరోధించారు. శబరి అనుచరులకు, పెళ్లిబృందానికి పోరు ఘోరంగా జరిగింది. ఆ పోరులో శబరుల చేతిలో పెళ్లికుమారుడు హతుడయ్యాడు. పెళ్లికూతురు భర్త శవంమీద పడి గోలుగోలున విలపించింది. ఇంతలో శబరి అక్కడికి వచ్చింది.

ఆమెని చూడగానే పెళ్ళికూతురు కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి. “పాపిష్టి పొట్టకోసం ప్రాణాలను బలికొంటావా! జీవించటానికి మీకిక మార్గమే లేదా! కాళ్ళ పారాణి ఆరకముందే నా ముత్తైదు భాగ్యాన్ని దోచుకున్నావు. నూరేళ్ళ పంటైన నా జీవిత సౌభాగ్యాన్ని మొగ్గలోనే తుంచి వేశావు. నాకు దక్కని సంసార సుఖం నీకు కూడా దక్కకుండా పోతుంది. తీరని ఆవేదనతో, మనశ్శాంతి లేక జీవితాంతం కుళ్ళికుళ్ళి కృశించి పో! ఇది నా శాపం” అంటూ “నేను కూడా నా భర్త దగ్గరకే వెళుతున్నాను” అని కత్తితో గుండెల్లో పొడుచుకుని పడిపోయింది.

ఈ రెండు సంఘటనలు శబరి మనసులో గాఢముద్ర వేశాయి. ఆ రోజు అడవిలో కూర్చుని ఉంది. “జీవించటానికి మీకు వేరే మార్గమే లేదా!” అనే పెళ్లి కూతురి మాటలు ఎటు చూసినా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. భూమి, ఆకాశం, వాయువు, చెట్లు, పుట్టలు అన్నీ నిలదీసి ప్రశ్నిస్తూఉన్నట్లు అనిపించింది. “అందరూ దారి దోపిడీలు చేసి, ప్రాణాలు హరించే బ్రతుకుతున్నారా! జీవించటానికి వేరే మార్గమే లేదా!” తనలో తాను అనుకున్నట్లు పైకే అన్నది.

“ఉన్నది” పక్కనుంచీ వినబడింది. శబరి తలతిప్పి చూసింది. అక్కడ ఒక ముని కుమారుడు నిలబడి ఉన్నాడు. అతడి పేరు కరుణ. పేరుకు తగినట్లుగానే అతడి కళ్ళల్లో కరుణ తొణికిసలాడుతూ ఉంది. అతడు ఇంతక్రితం కూడా ఒకటీ రెండు సార్లు ఈ ప్రాంతాల్లో కనిపించాడు. “చరాచర వస్తువులన్నిటికీ జన్మభూమి భూమాత. అన్నపూర్ణ స్వరూపిణి. ఆమె గర్భంలో లెక్కలేనన్ని నిధులూ, నిక్షేపాలు ఉన్నాయి. కరుణామయి అయిన భూమాతని నమ్ముకో! నువ్వూ, నీ జాతి సుఖపడతారు” అన్నాడు. “చక్కటి తరుణోపాయం చూపారు స్వామీ!” శబరి మొట్టమొదటి సారిగా ఎలాంటి కల్మషం లేకుండా ఆ మునికుమారుడికి నమస్కరించింది.

అప్పటి నుంచీ శబరి ఇకనుంచీ జంతువులను వేటాడటం గానీ, దారి దోపిడీలు చేయటం గానీ చేయకూడదు అని శబరులందరికీ కట్టడి విధించింది. చెట్లను చదును చేసి వ్యవసాయం చేసి, కష్టపడి జీవించాలి అని ఆదేశించింది. అనతికాలంలోనే శబరుల కృషి ఓ రూపాన్ని ధరించింది. దండకారణ్యంలోని కొంతప్రదేశం సుక్షేత్రమైన మాగాణి అయింది. చేలు పచ్చటి పైర్లతో ముచ్చటగా ఉన్నాయి. తమ శ్రమ ఫలించిందని అందరూ సంతోషించారు..

శబరజాతిలో కలిగిన పరివర్తనని, వారి కృషిని గమనిస్తున్న కరుణముని శబరిని అభినందించాడు. అప్పుడప్పుడు వారిద్దరూ అడవిలో కలుసుకునేవారు. కరుణ ఆమెకి ఏవేవో కొత్తకొత్త విషయాలు చెబుతూ ఉండేవాడు. సాధువర్తనంతో జీవించటం ఎంత ఆనందం కలిగిస్తుందో చెప్పేవాడు. శబరి తనకి దక్కలేదన్న ఉక్రోషంతో ఉన్న రాహులుడు శబరికి, కరుణకి మధ్య ఉన్న అభిమానానికి, స్నేహానికి అపార్థాలు కలిపిస్తూ గూడెంలో అందరికీ చెప్పాడు. యవ్వనంలో ఉన్న ఇద్దరికీ పొత్తు కలిసిందనీ, ప్రతిరోజూ కలుసుకుని సరసాలు ఆడుకుంటూ అడవంతా తిరుగుతూ ఉంటారనీ పుకార్లు పుట్టించాడు.

ఈ పుకార్లు ఇటు శబరుల గూడెంలోనూ అటు మునిపల్లె లోనూ ఈ పుకార్లు దుమారం రేపాయి. కరుణ తండ్రికి కోపం వచ్చి ప్రాయశ్చిత్తంగా పక్షం రోజులు కుమారుడికి ఉపవాస శిక్ష విధించాడు, ఆశ్రమం విడిచి వెళ్లకూడదని కట్టడి విధించాడు. తండ్రి ఆజ్ఞకు ఎదురు చెప్పలేక కరుణ తలవంచాడు. రోజూ కలుసుకునే కరుణ పదిరోజులుగా ఎందుకు రావటం లేదో అని శబరి ఆందోళన పడింది. చివరకి అతడికి తండ్రి విధించిన శిక్ష గురించి తెలిసింది. చూడటానికి మునిపల్లెకి వెళ్ళింది. ఉపవాసదీక్ష వల్ల అతని ఆరోగ్యం భంగమై, పరిస్థితి ఆందోళనకరంగా మారి చివరికి అతడిని మృత్యువు కబళించింది. అతడి దేహాన్ని శ్మశానానికి తీసుకు వెళుతున్న మునులకు శబరి ఎదురైంది. శబరిని చూడగానే కరుణ తండ్రి ఉగ్రుడై ఆమెని దుర్భాషలాడి, కుమారుడి స్థితికి ఆమే కారణమని నిందించాడు.

తన మిత్రుడు, తన జాతికి మార్గదర్శనం చేసిన మార్గదర్శి కరుణ మరణం, అందుకు తనే కారణం అని అందరూ దుర్భాషలాడటం.. వీటితో శబరికి విరక్తి కలిగింది. శబరుల మధ్య తను ఇక జీవించలేదు, ఎటైనా వెళ్లి మనశ్శాంతిగా జీవించాలని నిర్ణయించుకుంది. రోజంతా ప్రయాణం చేసి సమీపంలోని ఒక పల్లెను చేరుకుంది. కానీ ఆ ఊరిలో వారంతా శబరిని దొంగల నాయకురాలిగా గుర్తించి “ఓసీ! పాతకీ! నరరూప రాక్షసివి, మా గ్రామానికి ఎందుకు వచ్చావు? పో ఇక్కడినుంచీ!” అంటూ దుర్భాషలాడారు. ఆమె మీద రాళ్ళవర్షం కురిపించారు.

శబరి మళ్ళీ అడవిలోకే వెళ్ళింది. ఆమెకి జరిగిన అన్యాయానికి ప్రకృతి కోపించిందా అన్నట్లు ప్రచండమైన గాలి, వాన ముంచెత్తింది. మహావృక్షాలు, క్రూరమృగాలు కూడా ఆ ప్రకృతి విలయతాండవానికి ఎదురు నిలవలేక పోయాయి. గ్రామస్థులు రాళ్ళు రువ్వటం వాళ్ళ శబరి ఒళ్లంతా గాయాలు అయినాయి. ఆకలితో కడుపు మండిపోతున్నది. నిస్సత్తువతో నడవలేక పడిపోయింది. స్పృహ లేకుండా అలా ఎంతకాలం ఉందో తెలియలేదు ఆమెకి. కళ్ళు తెరిచి చూసేసరికి చల్లటిగాలి వీస్తూంది. తనొక వెదురుమంచం మీద పడుకోబెట్టబడి ఉంది. గాయాలకు ఆకుపసర్లతో కట్లుకట్టి ఉన్నాయి.

ఎదురుగా ఒక మహర్షి నిలబడి ఉన్నారు. అయన కరుణాపూరిత నేత్రాలతో ఆమె వంకే చూస్తూ ఉన్నాడు. శబరి తొట్రుపాటుగా లేచి కూర్చుంది. ఆయన వంక భయంగా చూసింది. “ఇది పంపా సరోవరతీరంలో గల మతంగ మహర్షి ఆశ్రమం. ఇక్కడ నీకే భయమూ లేదు” అన్నాడు పక్కనే ఉన్న ముని.

“తల్లీ!” అని పిలిచారు మతంగమహర్షి.

“లేదు. నేను తల్లీ అని పిలిపించుకోవటానికి అర్హురాలిని కాను” బెదిరిపోతూ అన్నది.

“పొరపడుతున్నావు తల్లీ! నీవెంతో పుణ్యాత్మురాలివి” అన్నారు మహర్షి.

“కాదు స్వామీ! నేను నీచ జాతి స్త్రీని”

“మానవులందరూ ఒకటే జాతి. ఉచ్చనీచాలనే తారతమ్యమే లేవు”

“నా గతమంతా మలినమైంది స్వామీ!”

“కాదు. నీ మనసు పవిత్రమైనదని నాకు తెలుసు. గడచిపోయిన గతంతో మనకు నిమిత్తం లేదు. భవిష్యత్తుకై పాటు పడటమే మన కర్తవ్యం” అన్నారు మహర్షి.

తనని అసహ్యించుకోకుండా, శపించకుండా, ఆదరంగా చూసేవారు ఇంకా ఉన్నారా! శబరి కళ్ళవెంట నీళ్ళు కారాయి. అయన పట్ల అనిర్వచనీయమైన భక్తితో ఆమె మనసు నిండిపోయింది. ఆరోజు నుంచీ ఆమె జీవితంలో నూతన అధ్యాయం మొదలు అయింది.

మతంగమహర్షి ప్రతిరోజూ నదీ స్నానానికి వెళతారు. అయన వెళ్ళే దారిలో రాళ్ళు, ముళ్ళు తీసివేసి, నీళ్ళు చల్లి, మెత్తటి పువ్వులు పరచేది శబరి. పువ్వులు దొరకని రోజున తామరాకులను పరచేది. ఆశ్రమ వాకిలి ఊడ్చి,శుభ్రం చేసి రంగవల్లులు దిద్దేది. అయన కట్టుకునే నారవస్త్రాలను ఉతికి, అక్కడి చెట్ల కొమ్మలకు ఆరవేసేది. ఆశ్రమంలోని జింకలను, లేళ్ళను, కుందేళ్ళను ప్రేమతో సాకేది.

మహర్షుల వారు ఆశ్రమవాటిక లోని ఇతర మునులందరినీ ఒకచోట చేర్చి ప్రతిరోజూ రామకథ వినిపించేవారు. సంతానం లేక దశరథ మహారాజు పరితపించటం గురించి ఒకరోజు, మరోరోజు పుత్రకామేష్టి ద్వారా నలుగురు కుమారులు కలిగారనీ, యుద్ధవిద్యలు నేర్చుకుంటున్నారనీ, ఇంకొకరోజు విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్ధం రామలక్ష్మణులను తీసుకువెళ్లటం గురించి ఇలా రోజుకొక సంఘటన గురించి చెప్పేవారు. సీతారాముల కళ్యాణం, కైక రెండు వరాలు కోరటం, రాముడు అరణ్యాలకు తరలి వెళ్ళటం, భరతుడు రాముడి ప్రతినిధిగా రాజ్యం చేయటం, అడవిలో శూర్పణఖ రాముడిని చూసి మోహించటం, రావణుడు మయారూపంలో వచ్చి సీతను అపహరించటం, రామలక్ష్మణులు సీతను వెతుక్కుంటూ అరణ్యంలో తిరగటం మొదలైన విషయాలు అన్నీ చెప్పేవారు. అందరితో పాటు శబరి కూడా ఆ విషయాలు అన్నీ వింటూ ఉండేది.

“ఆ తర్వాత ఏమైంది స్వామీ!” అని అడిగింది ఒక రోజు.

“ఇప్పటివరకూ జరిగింది అంతవరకేనమ్మా! ఆ పై కథ విధాతకే తెలియాలి” అన్నారు మతంగమహర్షి.

కొన్నాళ్ళు గడిచిపోయాయి. మతంగమహర్షి జీవసమాధి పొందపోతున్నట్లు మునిపల్లెలో ప్రకటించారు. ఆ వార్త విని శబరి కన్నీరుమున్నీరు అయింది. “కన్నది తల్లిదండ్రులే అయినా నాకు మరో జీవితం చూపించినది మీరే! మీరే నాకు తల్లీ, తండ్రీ! మిమ్మల్ని విడిచి నేను ఉండలేను. నేను కూడా మీతో పాటు జీవసమాధి అవుతాను” అన్నది. మహర్షి ఆమెను అనునయించారు. దగ్గర కూర్చోబెట్టుకుని “నీవు కారణ జన్మురాలివి. నీ వలన లోకానికి మంచి జరగవలసి ఉన్నది. త్వరలో నీకు రామదర్శనం కలుగుతుంది. అప్పటి వరకూ రామనామం జపిస్తూ నిరీక్షించు” అంటూ ఆమె చెవిలో ఒక రహస్యం చెప్పారు.

ఆ మర్నాడే మతంగమహర్షి జీవసమాధి అయ్యారు. మహర్షి తనకిచ్చిన ఆదేశం ప్రకారం వారు సమాధిలో ప్రవేశించగానే శబరి దాన్ని నాలుగు పలకల రాతితో మూసివేసింది. సమాధి నుంచీ రెండు దివ్యజ్యోతులు పైకిలేచాయి. అవి గాలిలో నిరాధారంగా నిలబడిపోయి వెలుగుతూ ఉండిపోయాయి. ఆ పంపాసరోవర ప్రాంతంలోనే ఆశ్రమం కట్టుకుని రామనామం జపిస్తూ నివసించసాగింది శబరి.

అందరూ ఎదురు చూస్తున్న రోజు సమీపించింది. రాముడు సోదర సమేతుడై ఋష్యాశ్రమాలు దర్శిస్తూ ఇక్కడికి రాబోతున్నాడట. మునిపల్లె అంతా శుభ్రం చేసారు. మామిడాకులు తోరణాలు కట్టి అలంకరించారు మునులందరూ. రాముడి దర్శనం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. అప్పటికి శబరి వృద్ధురాలైంది. శరీరంలో జవసత్వాలు సన్నగిల్లాయి. జుట్టు తెల్లబడింది. నడుము వంగి పోయింది. అయినా లేని ఓపిక తెచ్చుకుని పువ్వులను సేకరించింది. మెత్తటి సజ్జ తయారు చేసింది. పళ్ళు కోసుకువచ్చింది. పంపా సరసు నుంచీ తియ్యటి నీరు తెచ్చింది. శ్రీరాముడి దర్శనం కోసం నిరీక్షిస్తూ క్షణం ఒక యుగంలా గడపసాగింది.

“అమ్మా!” కుటీరం బయట నుంచీ వినిపించింది. బయటకు వచ్చి చూసింది. ఎదురుగా ఆకాశంలో నుంచీ నీలిమేఘం నేలకు దిగివచ్చినట్లు నిలబడి ఉన్నాడు శ్రీరాముడు. మెరుపుతీగ వంటి మేనిఛాయతో లక్ష్మణుడు అన్నగారి చెంతనే ఉన్నాడు. ఇది కలా, నిజమా! అన్నట్లు నిశ్చేష్టురాలైంది. “అమ్మా! నేను వచ్చాను తల్లీ!” మళ్ళీ అదే కంఠం. “వచ్చావా రామా! ఇన్నాళ్ళకి దయ గలిగిందా!” అంటూ పాదాలపై పడింది శబరి. ఆనందాశ్రువులతో పాదాలను అభిషేకించింది.

లోపలికి ఆహ్వానించి సజ్జ పైన కూర్చోబెట్టింది. “ప్రయాణపు బడలికతో ఆకలై ఉంటుంది. ఈ పళ్ళు తినండి స్వామీ!” అంటూ ఒక్కొక్క పండే కొరికి రుచి చూసింది. వగరుగా ఉన్నవి అవతల పెట్టి తియ్యగా ఉన్నవి అందించింది. ఆమె ముదుసలి రూపాన్ని అసహ్యించుకోలేదు రాముడు. ఆ ఎంగిలి పళ్ళు ఆప్యాయంగా ఆరగించాడు. లక్ష్మణుడికి ఆశ్చర్యం కలిగించింది. “అన్నయ్యా!” అంటూ వారించాడు.

తమ్ముడి మనోభావం గ్రహించాడు రాముడు. “భక్తికి ఎంగిలి అనేది లేదు తమ్ముడూ! భక్తుల హృదయమే భగవంతుడి నివాసం. భక్తులకు, భగవంతుడికి భేదమే లేదు. శబరిది సాత్వికమైన శుద్ధభక్తి. అలౌకికమైన ప్రేమ.

‘పుంస్త్వే స్త్రీత్వే విశేషోవా జాతి నామా శ్రిమాదహః

నకారణం మధ్బజనే భక్తి రేవహి కారణమ్’

(స్త్రీ పురుష భేదాలు గానీ, కులమత భేదాలు గానీ ఏ ఒక్కటీ నన్ను ఆరాధించుటకు మూలం కావు. కేవలం భక్తే ప్రధానమైనది) అన్నాడు.

ఆరగింపు అయిన తర్వాత “నాకు తప్పక మీ దర్శనం అవుతుందని మతంగుల వారు చెప్పారు రామా! వారే మీకొక రహస్యం చెప్పమని నన్ను ఆదేశించారు. ఋష్యమూక పర్వతం పైన సుగ్రీవుడు అనే వానరరాజు ఉన్నాడు. అతడితో చెలిమి చేస్తే సీతాన్వేషణలో అతడు నీకు సహాయం చేస్తాడు. ఈ విషయం మీకు తెలుపమని చెప్పారు మతంగుల వారు” అన్నది శబరి. “నా జీవితలక్ష్యం నెరవేరింది. ఇక నాకు కైవల్యాన్ని ప్రసాదించు రామా!” అంటూ అంజలి ఘటించింది.

“తథాస్తు” అన్నాడు రాముడు. శబరి చితుకులను పోగుచేసింది. అప్పటికే అక్కడికి చేరుకున్న మునుల దగ్గర పశుపక్ష్యాదుల దగ్గర శలవు తీసుకుంది. రాముడికి నమస్కరించింది. చితికి నిప్పు అంటించి, తాను అగ్నిలో ప్రవేశించింది. మరుక్షణం ఆమె దివ్యదేహంతో గగన తలంలోకి వెళ్ళిపోయింది. పంపా సరోవరం నుంచీ ఒక పాయ చితి మీదగా ప్రవహించి రాముడి పాదాలను ప్రక్షాళనం చేసింది.

“ఈ పాయకు శబరి జ్ఞాపక చిహ్నంగా శబరీనది అని నామకరణం చేస్తున్నాను.” ప్రకటించాడు రాముడు. మునులందరూ ఆ నదికి నమస్కరించారు. ఇదీ శబరి కథ!

***

ఇది హిందీ నుంచీ తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేసిన నవల. ఎక్కడా హిందీ ఛాయలు కనిపించవు. మొత్తం చదివిన తర్వాత ఒక అనిర్వచనీయమైన అలౌకికానందం కలుగుతుంది పఠితులకు.

 

ప్రతులు దొరికే చోటు ‘వేణు పబ్లికేషన్స్, రామయ్యర్ వీధి, మదాసు – 17’ అని ఇచ్చారు పుస్తకంలో. ప్రచురణ : ఆగస్ట్ – 1961. దీని వెల అప్పట్లో 6 రూపాయలు. మొత్తం పేజీలు: 285. ఈ పుస్తకం ఇప్పుడు ఆ చిరునామాలో దొరకటం అసాధ్యం. గ్రంథాలయాల్లో దొరకవచ్చు. ఇంత మంచి పుస్తకం చదివే అవకాశం వస్తే అది ఎవరికైనా సువర్ణావకాశమే!

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న హిందీ నవల

(ఇది పుస్తక సమీక్ష కాదు, పుస్తక పరిచయం. సమీక్ష అంటే కథలోని లోటుపాట్లు అన్నీ చెప్పాలి. విశ్లేషించాలి. ఈ పుస్తకం చాలామందికి అందుబాటులో ఉండదు గనుక పరిచయం మాత్రమే చేస్తున్నాను- గోనుగుంట మురళీకృష్ణ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here