Site icon Sanchika

షేక్స్పియర్ గారి పరిపూర్ణ పరిచయం

[dropcap]ఒ[/dropcap]క్కసారైనా వానలో తడవని వారుండనట్టే, టెన్త్ లోనో, ఇంటర్లోనో, డిగ్రీలోనో షేక్‌స్పియర్‌ని చదవని వాళ్లుండరు. ఆ పాఠం పరిధి, నదిలోనుంచి ఓ చెంచాడు నీళ్లు రుచి చూసినంత మాత్రమే! దానివల్ల విద్యార్థులకి షేక్‌స్పియర్ యొక్క సృజన శక్తి కానీ ఆయన ప్రత్యేకత కానీ అర్థం చేసుకునే అవకాశమే లేదు. ఇక మానవ ప్రకృతిని నిశితంగా గమనించి రచనలు చేసిన ఆయన మేధ, మానవత్వం పట్ల ఆయనకున్న ధృఢనమ్మకం, నిబద్ధత, ఆయన సౌందర్యభావన, సుకుమారత అవగాహన చేసుకునే సవాలే లేదు. ఒక వేళ, ఆ టీచర్ మమేకమై ఆ రచన యొక్క గొప్పతనం వివరించబోయినా ఆ నాటకాన్నిఆస్వాదించే వయసు కూడా మనకి ఉండేది కాదు (కొందరు మాష్టార్లు ఆ ఇంగ్లీష్ డ్రామా డైలాగులు తాదాత్మ్యంతో పలుకుతూ క్లాస్ రూమ్‌లో అటూ ఇటూ నడుస్తూ, హావభావాలతో నటిస్తూ చెప్పేవారు). ప్రశ్నల జవాబులు బట్టీ పట్టి పరీక్షల్లో మార్కులు సంపాదించే గోలలో మాత్రమే మనముండేవాళ్ళం. చదువయ్యాక జీవితపు గందరగోళంలో షేక్‌స్పియర్ సాహిత్యం చదవాలన్న స్పృహే రాలేదు.

స్వయంగా టీచర్ అయిన, కాళ్ళకూరి శేషమ్మగారు మొత్తం షేక్‌స్పియర్ రచనలన్నింటినీ, ఆయనపై గౌరవాభిమానాలతో లోతుగా అధ్యయనం చేశారు. అంతటి మేధో శ్రమ చేసి, తనకు తాను, సంతృప్తి పడి ఊరుకోకుండా అందరికీ చెప్పాలనుకోవడాన్ని బట్టి శేషమ్మగారిలో, మనసా, వాచా, కర్మణా ఒక ఉత్తమ ఉపాధ్యాయ సుగుణం ఆమె రక్తంలో, హృదయంలో ఇంకిపోయిందనిపిస్తుంది. అందువల్లే ‘షేక్స్పియర్‌ను తెలుసుకుందాం’ అనే పేరుతో, ఆ ప్రపంచప్రసిద్ధ నాటకకర్త, గొప్పకవిని మనకి పరిచయం చెయ్యడానికే ఈ పుస్తకం రాశారు.

మానవ బలహీనతలను చక్కగా పట్టుకుని, కథ అల్లడంలో షేక్‌స్పియర్ అనితర సాధ్యుడు. వాటి ఆధారంగా వారి జీవితాలు తిరిగే మలుపులని, తన కథల్లో అద్భుతంగా అల్లుకుపోవడంలో గొప్ప శక్తి సంపన్నుడు. ప్రపంచ నాటక రచయితల్లోనే ప్రథముడిగా నిలబడ్డ గొప్ప సృజనశీలి షేక్‌స్పియర్. మేధావి. ఆయన గొప్ప హాస్యరస ప్రధాన నాటకాలూ, అలాగే అద్భుతమైన విషాద నాటకాలూ రాయడం అబ్బురం అనిపిస్తుంది. వాటిల్లో అందమైన కవిత్వం కూడా ఉండేదట. మనుషుల మస్తత్వాలను, అతి దగ్గరగా గమనించి రాసిన రచనలు కనుకే నాలుగున్నర శతాబ్దాలుగా వెలుగులు జిమ్ముతూ నిలబడే ఉంది ఆయన సృజన.

16వ శతాబ్దపు గొప్ప కథకుడు. ద్రష్ట అయిన షేక్‌స్పియర్, నటునిగా జీవన ప్రస్థానం ప్ర్రారంభించి, తనకు తాను చక్కని వ్యక్తిత్వం ఏర్పరచుకుని, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాటకకర్తగా, కవిగా చిరస్థాయిగా నిలిచారు. ఈయన ఇంగ్లాండ్ జాతీయ కవి. ఆయన సౌందర్య భావన అతి సుకుమారం. ఒక స్త్రీని ‘వెన్నమీగడలరాణి’ అనగల సున్నితమనస్కుడు. ఆయన వాడిన భాషా, శైలీ, ఊహాశక్తీ అమోఘం. 26వ సంవత్సరంలో మొదలు పెట్టి 52 ఏళ్ళ వయసు వరకూ రచనలు చేశారు. ఆయన మానవజాతిపై ప్రేమతో, వారి భావి ఉన్నతంగా ఉండాలని మనఃపూర్వకంగా ఆశిస్తూ, తన రచనల ద్వారా అందుకు తగిన సూచనలిచ్చాడంటారు, రచయిత శేషమ్మగారు.

షేక్‌స్పియర్ వివిధ సందర్భాలలో, తన పాత్రల చేత జీవితం గురించి చెప్పించిన  నిర్వచనాలు, ఇంతకాలం  గడిచినా నేటికీ సూక్తులుగా చలామణీలో ఉన్నాయంటే ఆయన గొప్పతనానికి వేరే తార్కాణం అక్కరలేదేమో!

రచయిత, ఎనిమిది డ్రామాలను తీసుకుని వాటిలోని కథల్నిచెప్పి, ముఖ్యమైన విషయాలను విశ్లేషిస్తూ, పాఠకులు ఆ నాటకం ఎందుకు చదవాలో రచయిత పరిశీలన పేరిట, ఆమె తన అభిప్రాయం కూడా చెబుతూ మార్గదర్శనం చేస్తూ వెళ్లారు. సాహిత్యంపై అభిరుచి ఉన్న ప్రతి పాఠకుడూ చదివి తీరాల్సిందే అన్నట్లుంటాయి షేక్‌స్పియర్ రచనలు. మానవులందరిలోనూ ఉండే ప్రేమ, ద్వేషం, వాత్సల్యం, అసూయ అనే నాలుగు ప్రధానమైన భావోద్వేగాలను, వాటి పరిణామాలను అత్యద్భుతంగా చిత్రించిన రచనలు ఆయనవి. వారిది ఉత్తమ శ్రేణి ఆంగ్ల భాష. మానవ ప్రకృతిని బాగా గమనించిన గొప్ప మానవతావాది ఆయన.39 నాటకాలు,154 సానెట్లూ రాశారు.  ‘షేక్‌స్పియర్ శైలి ప్రత్యేకత కలిగి ఉండడమే గాక, కఠినమైనది’ అని కూడా అంటారు.

రచయిత తీసుకున్న ఎనిమిది నాటకాలూ అత్యంత ప్రసిద్ధమైనవి. యాజ్ యు లైక్ ఇట్, మర్చంట్ ఆఫ్ వెనిస్, ఒథెల్లో, రోమియో జూలియట్, జూలియస్ సీజర్ మొదలైనవి. ఆయన చారిత్రాత్మక నాటకాల్లో జూలియస్ సీజర్‌కి ప్రముఖ స్థానం ఉందని చెబుతూ, ఆ నాటకాలను పరిచయం చేసి మనకి ఆ నాటకాలు చదవాలనే ఆసక్తి కలిగించారు. ఈమె వృత్తిరీత్యా ఉపాధ్యాయిని అవడం వల్ల తన విద్యార్థులకు చెప్పే క్రమంలో పుస్తకం రాయడం అనేది, సామాన్య పాఠకునికి కూడా సులభగ్రాహ్యం అవడానికి బహుధా తోడ్పడింది.

పద్నాలుగు పంక్తులుండే పద్యాల వంటి ‘సానెట్లు’ కూడా ఎంతో విలువైనవి. షేక్‌స్పియర్ 154 సానెట్లు రాసినా, వాటిల్లో ‘కాలమహిమ’ అనే అంశం చాలా విశిష్టమైనది. కాలం విలువ తెలుసు కాబట్టే, కాలమహిమను గురించి 14 సానెట్లలో వివిధ రకాలుగా వర్ణించారట. వైవిధ్యభరితమైన ఆయన రచనలు ఆయన మనోవైశాల్యానికి ప్రతీకలు. శేషమ్మ గారు కొన్ని సానెట్లను, సరళమైన భాషలో అనువాదం చేసి మనకు చూపించారు.

షేక్‌స్పియర్ తన రచనల్లో జాతీయ భావం, మాతృదేశం పట్ల ప్రేమా చక్కగా వ్యక్తపరిచారు. త్రికరణ శుద్ధిగా మానవుని ఉన్నతిని కోరిన వ్యక్తి కనుకనే ఆయనకంత ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఆయన రచనల్లో, శృంగారం, హాస్యం, అద్భుత కవిత్వం, మంత్రతంత్రాలూ, కుటిలత్వం, పదాడంబరం కూడా ఉండేవట. తర్వాత, తర్వాత నాటి ట్రెండ్‌ని బట్టి విషాదాలు వదిలి, చివర్లో శుభం ఉండే నాటకాలు రాశారట. ఆయన నాటకాల్లో ఎక్కువగా చర్చించబడిన పాత్ర ‘టు బీ ఆర్ నాట్ టు బీ’ అనుకునే హేమ్లెట్. వీరి నాటకాల్లో, ఆసక్తిదాయకమైన సీన్లుంటాయి. సాంప్రదాయ శైలీ, స్వేచ్ఛ శైలీ కలిసి ఉంటాయి.

ఇంతటి గొప్ప రచయితకి ఆ కాలంలో బిరుదులూ, సన్మానాలూ లభించలేదట. కేవలం హాస్య విషాదాలను అద్భుతంగా నిర్వహించగలిగిన బ్రహ్మాండమైన రచయితగా మాత్రమే గుర్తింపు పొందారట.

మనుషుల్లో ఉండే లోటుపాట్లూ, వాటివల్ల కలిగే పరిణామాలూ ‘అయ్యో!’ అనిపించేట్లు అద్భుతంగా రచించినా, ఆయనది ఆశావాదమే అంటారు శేషమ్మగారు. మానవతావిలువలు పెంచాలన్న తపన ఆయా రచనల్లో కనబడుతుంది. ‘సమాజం గొప్పది, అది విలువలతో వర్ధిల్లుతుంది’ అని నమ్మేరాయన. గొప్ప పరిశీలనా శక్తి వల్ల, మనుషుల గురించి  పూర్తి అవగాహన ఉండడం వల్ల మానవులలో ఉండే క్రూరత్వాన్నీ, ఔన్నత్యాన్నీ పట్టుకోగలిగారు షేక్‌స్పియర్.

ఆ రోజుల్లో నాటకాలకి మంచి ఆదరణ ఉండేదట. ఇంగ్లాండ్ రాణి, ఆమె ఆస్థానంలోని ఉద్యోగులూ నాటకాలు చూసేవారట. ఆయన స్వయంగా రాజాస్థానంలో ఉద్యోగి కావడం వల్ల అక్కడి ఉద్యోగులనూ, రాజవంశీకులనూ, సైన్యాధిపతులనూ ఇంకా అక్కడ జరిగే అరాచకాలనూ దగ్గరగా గమనించి రచనలు చేయడం వల్ల ఆ యా పాత్రల్లో సహజత్వం కనబడుతుంది. రాజు కర్తవ్యమేమిటీ అన్నది కూడా స్పష్టంగా చెప్పగలిగారాయన.

ఆయన పరిశీలనా శక్తి అమోఘం. మనిషి స్వార్థంతో వచ్చే అనర్థాలను రచనల్లో చెప్పడం వల్లే ఆ పాత్రలు 450 ఏళ్ల తర్వాత కూడా సజీవంగా నిలబడ్డాయి. అందుకే  షేక్‌స్పియర్ ని ‘క్రియేటివ్ జీనియస్’ అంటారు. షేక్‌స్పియర్ తన ఇరవై ఆరవ సంవత్సరంలో మొదలు పెట్టి, ఒక ఇరవై ఆరేళ్లపాటు మాత్రమే రచనలు చేసినా, ప్రపంచ రచయితలలోనే స్ఫూర్తిని నింపగలిగిన గొప్పతనం ఆయనది.

బుచ్చిబాబు గారు, తన ఒకానొక సాహిత్య వ్యాసంలో, షేక్స్‌పియర్ గురించి రాస్తూ, ‘గొప్ప ద్రష్ట షేక్‌స్పియర్. అందువల్లనే ఆయనపై వచ్చినన్ని పుస్తకాలు  ప్రపంచంలో మరి ఏ ఇతర కవిపైనా రాలేదు. ప్రపంచం మొత్తంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఆయన గురించి రాస్తుంటారు, మనిషి అంతరంగ వికాసానికి ఉపయోగపడే ఎలిమెంట్ ఆయన రచనల్లో ఉండడమే ఆయన విజయ రహస్యం’ అని పేర్కొన్నారని రచయిత ప్రస్తావించారు.

యాభై రెండు సంవత్సరాలే జీవించిన షేక్‌స్పియర్ జననం మానవజాతికి గొప్ప కానుక అనుకోవచ్చు. మానవుని పట్ల సంపూర్ణ గౌరవంతో, ఆశావహ దృక్పథంతో రాసిన అమృత హృదయుడు కనుకనే ఆయన పొందిన ఖ్యాతికి ఆయన అర్హుడు. విషాదాంత నాటకాల్లోని పాత్రల విజయాలూ, పతనాలూ ప్రేక్షకునిలో మనోవిశ్లేషణ జరగడానికి ఉపయోగపడతాయి. ఈర్ష్యతో ఇతరుల జీవితాలను నాశనం చేద్దామనుకునే వారిలో ఉండే క్రూర లక్షణాలను వదులుకునే నీతి పాఠాలుగా కూడా, ఈ నాటకాలుండడం వీటి శాశ్వతత్వం వెనక ఉన్న రహస్యం అనుకోవాలి.

A.C.BRADLEY, షేక్‌స్పియర్ విషాదాంత నాటకాలపై చేసిన విశ్లేషణ గురించి కూడా రచయిత క్లుప్తంగా వివరించారు. ఈ పుస్తకం చదివాక మనకి, షేక్‌స్పియర్‌ని పూర్తిగా చదవాలనే తృష్ణ కలుగుతుంది. ఆయన రచనలు, పాఠకులకే కాక రచయితలకు కూడా గైడ్ వంటివి. అంతటి ఆదర్శప్రాయమైన రచనలు చేసారు షేక్‌స్పియర్. ఆయన వ్యక్తిగత జీవితపు వివరాలను కూడా పొందుపరిచారు రచయిత. అందరికీ ఉపయోగపడే ఈ పుస్తకాన్ని వ్యయ ప్రయాసలకోర్చి, మన ముందుంచిన శేషమ్మ గారు ఎంతైనా అభినందనీయురాలు.

ఈ పుస్తక రచన వెనుక ఆమె లక్ష్యం నూరు శాతం నెరవేరింది. షేక్‌స్పియర్ రచనల మీద కలిగిన గౌరవంతో ఎంతో శ్రమపడి చేసిన రచన ఇది. అభిరుచి గల పఠితలకు చక్కని దిక్సూచి లాంటిది. దీని సహాయంతో మనం షేక్‌స్పియర్ రచనలను ఆస్వాదించవచ్చు. పాఠకులు ఈ పుస్తకం కొని చదివితే, రచయిత మరికొందరి ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల రచయితల రచనల్నిమనకి పరిచయం చేసే అవకాశం ఉంది. అలా జరగాలని ఆశిద్దాం.

***

షేక్స్పియర్‌ను తెలుసుకుందాం
రచన: కాళ్ళకూరి శేషమ్మ
వెల: ₹ 150/-
ప్రతులకు:
కాళ్ళకూరి శైలజ
1-9-23, శ్రీరామనగర్,
కాకినాడ,
కాకినాడ జిల్లా
Phone: 09885 401882

 

Exit mobile version