[శ్రీపార్థి గారు రాసిన ‘శకునం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]భ[/dropcap]ర్త పోయిన తరువాత అనసూయమ్మకు దేవుడి మీద భక్తి, నమ్మకాల మీద ఆరాటం బాగా పెరిగిపోయాయి. ఎంతగా అంటే, బయటికి వెళ్లాలంటే గంటల పంచాంగం చూడాల్సిందే, బల్లి మీద పడితే బంగారు బల్లిని ముట్టుకునేదాకా ప్రాణ భయమే, పిల్లి ఎదురయితే ఇక అంతే.
దానికి కారణం లేకపోలేదు, ఆమె భర్త అకాల మరణం చెందటమే, ఓ రోజు అత్యవసర పని నిమిత్తం ఆందోళనతో బయటికి వెళ్తున్న ఆమె భర్తకు ఇంటి గుమ్మంలో నల్ల పిల్లి ఎదురయింది. అదేమీ పట్టించుకోకుండా ఆయన వెళ్తుంటే
“నల్ల పిల్లి యేదురయింది, అపశకునం. ఈ వేళ మీరు బయటికెళ్లొద్దు” అంటూ అనసూయమ్మ అడ్డుపడింది
“అది పాల కోసం వచ్చినట్టుంది. ఇన్ని పోసి అక్కడ పెట్టు, తాగేసి అదే పోతుంది” అంటూ ఆయన వడివడిగా బయటకు వెళ్లిపోయాడు. అలా వెళ్లిన వాడు మళ్లీ ఇల్లు చేరకుండానే ఆయన మరణవార్త ఆమె చెవిలో పడింది. పిల్లి ఎదురు రావడం వల్లే ఆయన పోయాడనే నమ్మకాన్ని ఆమె స్థిరం చేసుకుంది. గుండెపోటుతో ఆయన పోయాడని డాక్టర్లు నిర్థారించినా, అవేమీ ఆమె చెవికెక్కలేదు. వయసుతో పాటు నమ్మకాలు కాస్తా మూఢనమ్మకాలు అయి కూర్చున్నాయి. ఇక అప్పటి నుండి ఆమె అనుమానాలన్ని పెను భూతాలు అయ్యాయి.
అనసూయమ్మ నోరు పెద్దదే గాని మనసు మంచిదే. నోరు పెద్దది చేస్తే మాత్రం ఎవరూ ఆ చుట్టుపక్కల ఉండటానికి దడుస్తారు. అలాంటి అనసూయమ్మకు నల్ల పిల్లితో కష్టాలు మొదలయ్యాయి.
***
ఓరోజున మంత్రోచ్చారణ చేస్తూ తులసి చెట్టుకు పూజ చేసి నీళ్లు పోస్తున్న అనసూయమ్మకు ఏదో అలికిడైనట్టుగా వుంటే పక్కకు తిరిగి చూసింది. అంతే ఆమె గుండె గుభేల్‌మంది.
“ఇంకేముంది నా కొంపంతా అపవిత్రం అయింది. రండిరో ఎక్కడ చచ్చారే అంతా” పెద్దపెద్దగా అరవడం మొదలుపెట్టింది.
దీంతో ఇంట్లోవున్న అనసూయమ్మ మనవడు ఇరవై యేళ్ల బండబాబు, అనసూయమ్మ కూతురు సరళ, ఆమె చెల్లెలు సీతమ్మ ఒక్కసారిగా బయట వసారాలోకొచ్చారు.
“చూసారా, మా ఆయనను చంపిన మొద్దు నల్ల పిల్లి ఆ గేటు కన్నంలోంచి మళ్లీ ఇంట్లో కొచ్చింది. దాన్ని చూస్తేనే మహాపాతకం, అది ఇంట్లోకి వచ్చిందంటే మళ్లీ ఎవరికో మూడిందన్నమాటే. ఇహ నా వల్ల గాదు శుభ్రం చేసుకున్నది అంతా మంటగలిసిపోయింది” గగ్గోలు పెట్టడం ప్రారంభించింది.
“ఓరే బండసచ్చినోడ, చూస్తూ అల నిలబడ్డావే, ఆ పిల్లి కాళ్లు విరగ్గొట్టి బయటికి పంపిచేయి”
“ఈ రోజు పండగని నిన్నటి నుండి కాళ్లు చేతులు పోయేలా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను” గట్టిగట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది,
“నువ్వుండవే అమ్మమ్మ” అంటూ పిల్లి వెనకాల పడ్డాడు ఆమె మనవడు బండబాబు.
అది అరుస్తూ గుండ్రంగా అక్కడే తిరుగుతుంది. ఇట్లా కాదని కర్రొకటి పట్టుకొని దాని మీదకు వెళ్లాడు బండబాబు, అది బెదిరిపోయి, ఒక పక్కగా నిలబడి చూస్తూన్న అనసూయమ్మ మీదకి లంఘించుకుంది. ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని ఆమె ఒక్కసారిగా కింద కూలబడిపోయింది. ఈ గందరగోళంలో ఆ మొద్దు పిల్లి అనసూయమ్మను రాసుకుంటూ ఆమె మీద నుండి వెళ్లింది. ఈ పరిణామానికి అందరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. సందెట్లో సడేమియా అనుకొని ఆ పిల్లి తీసి వున్న గేటులోంచి బయటకు పరుగులు తీసింది.
ఇప్పుడు ఈ ముసల్దాని పరిస్థితి ఏంటా అనుకుంటూ చేతిలో వున్న కర్రకు కాలు చుట్టలా చుట్టి కొయ్యలా నిలబడిపోయాడు బండబాబు.
ఇక అనసూయమ్మ పెద్ద పెద్దగా శోకాలు పెట్టడం మొదలుపెట్టింది. ఆ శోకాలతోనే సబ్బుతో, పిండితో, ఆవు పంచకంతో, గంగాజలంతో స్నానాలు చేసి ఇల్లంతా శుద్ది చేసుకొని తులసి చెట్టుకు పూజ చేసినాక గాని ఆమె మనసు స్థిమితపడలేదు. అయినా మనసులో ఇంకా ఏదో శంక పీకుతూనే వుంది.
***
“ఓరే బండబాబు, అసలే ఈ రోజు పండగ. నాకు ఒంటి పూట భోజనం, పొద్దుటి నుండి పచ్చి గంగ కూడా ముట్టుకోలేదు. కళ్ళు తిరుగుతున్నాయి. ఈ పిల్లి రొదతో ఇంత కాలం అయింది. మేమంతా గుడికి వెళ్తున్నాం. ఇల్లు జాగ్రత్త. మళ్లీ ఆ మొద్దు పిల్లి ఇంట్లోకి రాకుండా కాపలా కాయి. ఆ గేటుకు ఏ తాడో వైరో కట్టు”
మనవడికి అన్ని జాగ్రత్తలు చెప్పి అనసూయమ్మ కూతురు చెల్లెలితో కలిసి గుడికి వెల్లింది.
***
“ఇదిగో బండబాబు అనసూయమ్మగారు అరటిపళ్ళు ఇమ్మన్నారు”
చేతిలో పళ్ళ కవరుతో లోపలికొచ్చాడు బండబాబు వయసున్న పక్కింటి డుమ్మెడు. ఈ డుమ్మెడు ఉత్త భయస్థుడు, వట్టి అమాయకుడు.
“ఇదిగో డుమ్మె, మొద్దు పిల్లి ఒకటి రోజు ఇంట్లోకొచ్చి ఇబ్బందిపెడుతోంది. అది లోపలికి వస్తే చెప్పు, పట్టుకొని దూరంగా వదిలేద్దాం” అంటూ పళ్ళ కవరు తీసుకుని తాడు కోసం లోపలికెళ్లాడు బండబాబు.
“అలాగే” అంటూ డుమ్మెడు అక్కడే చిన్న సిమెంటు గద్దె మీద కూచున్నాడు.
చేతిలో తాడుతో బండబాబు బయటికొస్తుండగా కనబడిందా దృశ్యం. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తోక పైకి లేపి గేటు కన్నంలోంచి వయ్యారంగా లోపలికొస్తోంది నల్ల పిల్లి. అది చూసిన బండబాబుకు చిర్రెత్తుకొచ్చింది. మళ్లీ పిల్లి లోపలికొచ్చిందని అమ్మమ్మకు తెలిస్తే ఇక అంతే, అనుకొని దాన్ని పట్టుకోవడానికి తయారయ్యాడు.
“ఒరే డుమ్మె, ఆ గేటు దగ్గర వుండు పిల్లి బయటికి వెళ్లకుండా, అది లోపలికెళ్లకుండా ఇటు నేను తరుముతాను”
ఇద్దరు చెరోవేపు తరుముతున్నారు. వున్న పళంగా ఈ అటాకింగ్ ఊహించని పిల్లి బెదిరిపోయి అక్కడే గుండ్రంగ తిరుగుతూ బయటికి వెళ్లడానికి ప్రయత్నించిది. బండబాబుకు అమ్మమ్మ ఎప్పుడు ఇంటికొస్తుందోనని టెన్షన్ పెరిగిపోయింది.
ఈ లోపు అది బండబాబు కాళ్ల సందులో నుండి ఇంట్లో ఓ గదిలోకి దూరింది, ఇదే అదనుగా అది బయటకు రాకుండా డుమ్మెడిని కాపలాగా వుంచి ఒక్క ఉదుటున వెళ్లి గోనేసంచి ఒకటి తీసుకొచ్చాడు బండబాబు. గదిలో ఓ మూల నక్కి కూర్చున్న దానిపై గోనే సంచి వేసి దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. జాగ్రత్తగా దాన్ని ఓ బుట్టలో పెట్టి ఇంటికి తాళం వేస్తుండగా..
అపసోపాలు పడుతూ, ఆయాసపడుతూ అనసూయమ్మ గుడి నుండి ఇల్లు చేరింది కూతురు, చెల్లెలితో కలిసి
“ఈ దరిధ్రం మళ్లీ ఇల్లు చేరింది, దీన్ని వదిలించుకుంటే గాని నాకు మనశ్శాంతి వుండదు. ఒరే నాయనా, మళ్లీ ఈ చుట్టు పక్కల కనపడకుండ దీన్ని ఎక్కడైనా దూరంగా వదిలేసి రండి. మీకు పుణ్యం ఉంటుంది” కాళ్లు కడుక్కుంటు అంది
దాన్ని దూరంగా వదిలేయడానికి తీసుకెళ్లారు బండబాబు, డుమ్మెడు.
***
ఉపవాసాలు, ఒక్కపొద్దులతో షుగరు, బీపీ పెరిగిపోయి కళ్లు తిరిగి నిలుచున్న చోటనే డామ్మని పడిపోయింది అనసూయమ్మ ఓ రోజు. ఇంట్లో వాళ్లు కంగారుపడి ఆమెకు సపరిచర్యలు చేసి కొంచెం స్థిమితపడ్డాక ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్దామని కుర్చిలో కూర్చోబెట్టి బయటకు తీసుకొస్తుండగా..
స్వాగతం-సుస్వాగతం అని పలుకుతున్నట్టుగా ఠీవిగా నడుచుకుంటూ వస్తున్న నల్ల పిల్లి గేటు దగ్గర ఆమెకు ఎదురయింది. అంతే ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి.
“అమ్మ నాయనో, శకునం బాగులేదురో, ఇంకేముంది నల్ల పిల్లి మళ్ళీ దాపురించింది, మా ఆయనలాగే ఇది నన్ను మింగేసేటట్టుంది, ఈ శని నన్ను వదిలేలా లేదురో, నేను ఆస్పత్రికి రాను బాబో” అంటూ పెద్ద పెద్దగా శోకాలు పెట్టడం మొదలుపెట్టింది. దీంతో వున్నది కాస్తా మరింత పెరిగింది బీపీ.
“మ్యావ్ మ్యావ్” అంటూ గోడ మీదకు చేరి అనసూయమ్మను చూస్తూ అక్కడే కూచుంది నల్ల పిల్లి.
అనసూయమ్మను ఉన్న పళంగా ఆస్పత్రికి పట్టుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు.
***
ఆస్పత్రిలో చేరిన నాటి నుండి నల్ల పిల్లి ఆలోచనలే ఆమెను ముసిరాయి. అంతకు ముందు తన మీద నుండి దూకి వెళ్లడం, ఇప్పడు ఎదుర్రావడం ఆమెను తీవ్రంగా భయపెట్టసాగింది. రాత్రి కలల్లోను అది వదల్లేదు. దానివల్ల తనకు కీడు జరుగుతుందని ఆమె నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. దాని ప్రాయశ్చిత్తం కోసం పూజలకు పునస్కారాలకు ఆస్పత్రిలో తావు లేకుండా పోయింది. దాంతో తను మళ్లీ ఇల్లు చేరుతానన్న నమ్మకం ఆమెకు పూర్తిగా అడుగంటిపోయింది.
“అయ్యా! డాక్టరు బాబు, ఇక్కడ నాకు దిన దిన గండం నూరేళ్ల ఆయుషులాగా వుంది. ఇప్పటికి ఆస్పత్రిలో చేరి వారం అయింది. నన్ను తొందరగా పంపిద్దురు, ఇక్కడ ఉండలేక పోతున్నాను” అంది రెండు చేతులతో దండం పెడుతూ వేడుకోలుగా
“ఇక మీ ఆరోగ్యం పూర్తిగా కుదుట పడింది. మీరు ఈరోజే మీ ఇంటికి వెళ్లొచ్చు” అన్నాడు డాక్టరు.
“ప్రాణం నిలుస్తుందంటారా!”
“మీకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. నిక్షేపంగా ఇంటికెళ్లొచ్చు,”
***
నల్ల పిల్లి గురించి ఆలోచిస్తూనే ఆమె ఇల్లు చేరింది. గేటు తీసి లోపలికి అడుగుపెట్టింది అనసూయమ్మ, నోట్లో ఎలుకను కరుచుకొని ఎదురుగా గద్దె మీద కూచుని వుంది నల్ల పిల్లి.
దాన్ని చూసిన మరుక్షణం ఆమెకు గుండె ఆగినంతపనయింది. అలా దాన్ని చూస్తూనే ఇంట్లోకి వెళ్లింది.
కొద్ది సేపటికి అనసూయమ్మ గొంతు గట్టిగా వినపడింది గేటుదాకా
“ఒరే! బండబాబు ఆ పిల్లికి ఇన్ని పాలు పొయ్యి.”