శకునికి దుర్యోధనుడి మీద పగా!

0
1

[గోనుగుంట మురళీకృష్ణ గారి ‘శకునికి దుర్యోధనుడి మీద పగా!’ అనే రచనని అందిస్తున్నాము.]

ఇమేజ్ సౌజన్యం: ఇంటర్నెట్. శ్రీకృష్ణ పాండవీయం సినిమాలోని శకుని పాత్రధారి ధూళిపాళ

[dropcap]కొ[/dropcap]ద్దిరోజుల క్రితం నేను ‘శ్రీకృష్ణ పాండవీయం’ (1966) చిత్రం చూశాను. అందులో ఒక సంఘటన నన్ను అమితంగా ఆకట్టుకుంది. అదేమిటంటే –

దుర్యోధనుడు సోదరులతో కలసి పాండవులతో “మా దాయాదులై మా భోగభాగ్యములలో పాలు పంచుకుంటున్నారా! కుండుకులైన మీ గత చరిత్ర మాకవగత మేలే!” అంటాడు ఎకసెక్కంగా.

“ఆ..ఆ.. గోళకులైన మీ చరిత్రా మాకవగతమేలే! విధవరాలి బిడ్డలా మమ్ము అవహేళన చేయునది?” అంటాడు భీముడు కూడా రోషంగా.

దుర్యోధనుడు ‘ఏమీ! కౌరవులు విధవరాలి బిడ్డలా!’ అనుకుని వ్యాసుడిని పిలిపించి “విజ్ఞులైన వ్యాసదేవులే సత్యము చెప్పవలసినది. కౌరవులు గోళకులా?” అని అడుగుతాడు.

“సత్యదూరం కాదు నాయనా! మీ తాతగారైన గాంధార భూపతి మీ తల్లికి వైధవ్యయోగం ఉన్నదని తెలుసుకున్నాడు. ఆ దుష్టగ్రహ పీడ తప్పించనెంచి ముహూర్తమునకు ముందే ఆమెకొక మేకపోతుతో కళ్యాణం జరిపించి, విధవాయోగ నివారణార్థం దానిని వధించి పిదప మీ తండ్రికి ఇచ్చి కళ్యాణం జరిపించాడు. మనిషితో నైనను, మేషముతో నైనను వైదికవిధిన జరిగిన వివాహము, వివాహమే! కనుక మీ తల్లి వివాహమునకు ముందే విధవరాలు” అని చెప్పాడు వ్యాసుడు.

“గాంధార భూపతి మా జనకుడినే మోసం చేస్తాడా! దీనికి ఫలితం అనుభవించు గాక!” అంటూ అప్పటికప్పుడు గాంధారదేశం మీదకు దండెత్తి వెళతాడు. యుద్ధంలో వారిని ఓడించి గాంధార రాజు, ఆయన నూరుగురు కొడుకులను పాతాళచెరలో బంధించి, రోజుకు ఒక్క మెతుకు చొప్పున పెట్టమని ఆదేశిస్తాడు.

ఆ మెతుకులు తినటానికి వచ్చిన కొడుకులను వారించి, తండ్రి “రోజుకు ఒక్క మెతుకు తిన్నా, తినకపోయినా మనకు మృత్యువు తప్పదు. తిని చచ్చుట కంటే, మాడి మరణించి మన పగ తీర్చుటకు ఒక్కని బ్రతికించుట మేలు! కడగొట్టువాడే కాలగతికి నిలువగల ఆయుష్మంతుడు” అని చెప్పి అందరి మెతుకులు చివరి వాడైన శకునికి ఇస్తూ ఉంటారు. సోదరులందరూ శకుని కళ్ళ ముందే ఆకలికి మాడి మరణిస్తారు. చివరికి తండ్రి కూడా దుర్యోధనుడి మీద పగ సాధించమని చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేయించుకుని కన్నుమూస్తాడు. తండ్రి అస్థికలు పాచికలుగా మారతాయి. ఆ పాచికలు చేతిలోకి తీసుకుని వికటంగా, కసిగా నవ్వుకుంటాడు శకుని.

ఇంతలో చూడటానికి వచ్చిన దుర్యోధనుడు “నువ్వొక్కడివి ఏం చేయగలవు? నిన్ను చూస్తే జాలి కలుగుతుంది. వెళ్లి గాంధార దేశాన్ని ఏలుకో!” అని చెబుతాడు. శకుని తల అడ్డంగా ఊపుతాడు ఇష్టంలేనట్లు. “సరే! మా పగని చవిచూసిన మామవు. మా వైభవాన్ని కూడా చూస్తూ ఇక్కడే ఉండు” అని అంటాడు దుశ్శాసనుడు.

శకుని ఏ విధంగా పగ సాధించాడు అనే విషయం సినిమాలో చూపించలేదు. కానీ శకుని బలహీనుడు, కౌరవులను సాధించే బలం లేదు. పాండవులు మాత్రమే వారిని జయించగలరు. కానీ పాండవులు అన్యాయంగా దుర్యోధనుడి మీదకు యుద్ధానికి ఎందుకు వస్తారు? నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొట్టినట్లు వారికి ఏదైనా అవమానం ఎదురవ్వాలి. అప్పుడు కౌరవులతో యుద్ధం చేస్తారు.  అందుకే దుర్యోధనుడితో మంచిగా ఉన్నట్లు నటిస్తూ, మాయాజ్యూతంలో పాండవులను అవమానించి, అడవుల పాలు చేసి యుద్ధంలో వారి చేత కౌరవులను చంపిస్తాడు శకుని. ఆ విధంగా పగ సాధిస్తాడు అనేది ప్రాచుర్యంలో ఉన్న కథ.

‘మాయాబజార్’ (1957) సినిమాలో శకుని పాచికలు వేసేటప్పుడు అవి గాలిలోకి లేచి వింతవింత ధ్వనులు చేస్తూ ఉంటాయి. “మామా! ఏమిటీ ఆక్రోశం?” అని అడుగుతాడు దుశ్శాసనుడు. “అవును. ఆక్రోశమే! వాటికి ఆత్మశాంతి కావాలి” అంటాడు శకుని.

‘పాండవ వనవాసం’ (1965) లో కూడా “ఇవి మామూలు పాచికలు కావు అల్లుడూ! వీటికి మహత్తరమైన శక్తి ఉన్నది. మనం పలకమన్న పందెం పలుకుతాయి” అని అంటాడు. ఈ రెండు చిత్రాలు ‘శ్రీకృష్ణ పాండవీయం’ కంటే ముందే వచ్చాయి కనుక పైన చెప్పిన కథ ఎప్పటినుంచో ప్రాచుర్యంలో ఉన్నదని చెప్పవచ్చు.

అయితే అసలు వాస్తవం ఏమిటంటే —

తిరుపతి వేంకట కవులు రచించిన ‘పాండవోద్యోగ విజయములు’ నాటకంలో ఒక సంఘటన చెబుతారు. కౌరవ పాండవులు, బలరామకృష్ణులు బాల్యంలో ఉన్నప్పుడు కౌరవులు పాండవులను చూసి “కుండుకులు” అని ఎగతాళి చేస్తూ ఉంటారు. భర్త బ్రతికి ఉండగానే వేరొక పురుషుడితో సంతానం కన్న స్త్రీకి పుట్టిన వారిని కుండుకులు అని అంటారు. చిన్నపిల్లలు అవటం చేత పాండవులకి మాటకు మాట అనటం చేతగాక కృష్ణుడికి చెప్పుకుంటారు. “మీరు కౌరవులను గోళకులు అని పిలవండి” అని చెబుతాడు కృష్ణుడు. భర్త చనిపోయిన స్త్రీకి జన్మించిన వారిని గోళకులు అని అంటారు. అందుకు కోపం వచ్చి కౌరవులు ఈ విషయం గురించి తల్లిని అడుగుతారు. తనని మొదట మేకపోతుకు ఇచ్చి వివాహం చేసి, దాన్ని వధించి, తర్వాత మీ తండ్రికి ఇచ్చి చేశారు అని తల్లి వాస్తవం చెబుతుంది. తిరుపతి వెంకట కవులు చెప్పింది ఇంతవరకే!

గాంధార రాజుని బంధించటం, చెరలో పెట్టటం ఆయన అస్థికలు మాయ పాచికలుగా మారటం ఇదంతా పుక్కిటి పురాణం. ఆనోటా ఈనోటా వ్యాపించి ఉండవచ్చు.

వాస్తవానికి మహాభారతంలో శకుని సోదరులు కురుక్షేత్ర యుద్ధం వరకూ బ్రతికే ఉంటారు. చివరిదాకా పోరాడి చివరలో పద్దెనిమిదవ రోజున సహదేవుడి చేతిలో మరణిస్తారు. పైగా శకునికి  నూరుగురు సోదరులు అని కూడా భారతంలో లేదు. అచలుడు, వృషకుడు, బృహద్బలుడు అని ముగ్గురి పేర్లు మాత్రమే శకుని సోదరులుగా చెబుతారు కవిత్రయం.

ధృతరాష్ట్రుడు అంధుడు, కౌరవులు బాలురు అవటం వలన వారిని సంరక్షించే నెపంతో శకుని హస్తినాపురానికి వచ్చి పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. తన సోదరుడు స్వభావం చేతనే అసుయాపరుడని అతడిని రాజ్యం నుంచీ పంపివేయమని గాంధారి భర్తతో చెబుతుంది. కానీ తన బిడ్డలతో సన్నిహితంగా ఉంటూ శ్రేయోభిలాషిలా నటించే శకునిని వెళ్ళగొట్టలేక పోతాడు ధృతరాష్ట్రుడు. కుమారులతో కూడా “మీ మేనమామకి దూరంగా ఉండండి” అని చెబుతుంది గాంధారి. అయినా దుర్యోధనుడు తల్లి మాట లెక్కచేయడు. శకుని దుర్యోధనుడితో సన్నిహితంగా ఉండటానికి అసలు కారణం ఇది!

శకుని పాచికలు మాయా పాచికలు కాకపోతే ధర్మరాజు ప్రతిసారీ ఓడిపోవటానికి కారణం ఏమిటి? అని సందేహం వస్తుంది. దానికి కూడా మహాభారతంలో జవాబు ఉన్నది. “ధర్మరాజుకి అక్షక్రీడ అంటే ప్రీతి. కానీ అందులో అతడికి ప్రావీణ్యం లేదు. కాబట్టి నేను సులభంగా ఓడించగలను” అని అంటాడు శకుని దుర్యోధనుడితో.  కాబట్టి సినిమాలో చూపించిన శకుని పగ పూర్తిగా కల్పితం.

యన్.టి.ఆర్., పురాణ కథలను ఎక్కడెక్కడో ఉన్నవి వెతికి, మూల కావ్యాలలో లేకపోయినా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ‘సీతారామ కళ్యాణం’ సినిమాలో కూడా శివ ధనుర్భంగం తర్వాత రాముడు జనకుడి విడిది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అప్పటికి ఇంకా వివాహం జరగలేదు. దశరథ మహారాజుకి కబురు పంపిస్తాడు జనకుడు. వారి రాక కోసం వేచి ఉంటారు అందరూ. ఆ సమయంలో శూర్పణఖ రాముడిని చూసి, సీత లాగా రూపం మార్చుకుని ఆయన్ని ఆకట్టుకోవటానికి పాట పాడుతూ నాట్యం చేస్తూ ఉంటుంది. ఆమెని చూసి నిజమైన సీత అనుకుని రావణుడు కూడా రాముడి లాగా రూపం మార్చుకుంటాడు. ఇద్దరూ పాట పాడుకుంటూ అడవి లోకి వెళతారు. ‘ఆమె ఇంకెక్కడికి పోతుంది?’ అనే ధీమాతో రావణుడు నిజరూపం ధరిస్తాడు. శూర్పణఖ ఉలిక్కి పడి “అన్నయ్యా!” అంటూ నిజరూపం ధరిస్తుంది. ఆమెని చూసి నివ్వెరపోతాడు రావణుడు. ఇంతలో నారదుడు వచ్చి “ఇలా వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు కాబట్టే మిమ్మల్ని రాక్షసులు అన్నారు” అంటూ చురక అంటిస్తాడు.

ఈ సంఘటన ‘విచిత్ర రామాయణం’ అనే జానపద సాహిత్యం నుంచీ తీసుకున్నారని, నారద పాత్ర పోషించిన కాంతారావు ఒక సందర్భంలో చెప్పారు. ఇలాంటి వన్నీ కల్పనలు అయినా ఆసక్తి గొలుపుతూ ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here