[dropcap]“మే[/dropcap]నకా.. హళా.. మేనకా..” రంభ, ఊర్వశి, ఘృతాచి, తిలోత్తమాది సఖుల పిలుపులకు దూరంగా, ఫల పుష్ప గుల్మాదుల దాపున కూర్చొని ఉన్నాను. సిరిమువ్వల సవ్వడులు, సంగీత నాట్య కళా రవళులకు దూరంగా, తదేకంగా భూలోకం వైపునే నా దృష్టి నిగిడ్చి ఉన్నాను.
శకుంతల.. నా ప్రియపుత్రిక శకుంతల ఇన్నాళ్లకు కణ్వాశ్రమం నుండి భర్త దుష్యంతుని సన్నిధికి బయలుదేరబోతున్నది. నా అంతరంగం ఆనందోద్వేగాలతో పరిపూర్ణమైపోతోంది. ఎన్ని నాళ్ళ నుండి ఈ శుభఘడియ కోసం ఎదురుచూస్తున్నాను!
కానీ, నా హృదయాంతరాళాన ఏదో చిన్న అనుమానం ఎప్పుడూ కదలాడుతుంది. నా ప్రియపుత్రిక అనన్య సామాన్య సౌందర్యరాశి అయిన శకుంతలకు కూడా నా నుదుటి వ్రాతే రాసాడా ఆ బ్రహ్మ!
భర్తృ పరిత్యక్తను నేను. నా శకుంతలకు.. ఒకవేళ అలా జరిగితే..!
దేవలోకానికి చెందిన అప్సరస గణములలో అగ్రగణ్యనైన నేను వేరు, నా ధర్మం వేరు, నా జాతి వేరు, నా వృత్తి వేరు. అసలు మా లోకమే వేరు. నేను సమాధాన పడినట్లుగా మానవకాంత అయిన శకుంతల సమాధానపడగలదా!
నేనైతే నిర్లిప్తంగా అన్నీ వదిలేసుకుని దేవలోకం చేరుకున్నాను. చావుపుట్టుకలు లేని దేవలోకంలో నా వృత్తిధర్మంగా ఇంద్రాది దేవతలకు నా నాట్యవిన్యాసాన్ని ప్రదర్శించుకుంటూ కాలం గడిపేస్తున్నాను. ఇది నా జన్మ. నా విధి.
నిజానికి ఆ నిర్లిప్తతను పొందటం ఎంత క్షోభ! విశ్వామిత్రుని, కన్నబిడ్డను వదిలి వచ్చే ఆ క్షణాన నా హృదయం ఖండఖండాలుగా చీల్చబడలేదా!
భూలోకంలో క్షత్రియుడైన ‘విశ్వరథుడు’ వసిష్ఠునితో పోటీపడి తపస్సు చేయసాగాడు. అతని దీక్షకు బ్రహ్మ ప్రత్యక్షమై, “రాజర్షీ! విశ్వామిత్రా!” అని సంబోధించి వెంటనే అదృశ్యమైనాడు. ఆశాభంగం చెందిన విశ్వామిత్రుడు మరింత పట్టుదలతో బ్రహ్మర్షి కాగోరి ఘోరతపము ఆచరించసాగాడు.
చెప్పొద్దూ! విశ్వామిత్రుడిలోని క్షత్రియతేజస్సుకి, పట్టుదలను సూచించే నాసిక సొగసుకు, కళ్ళలోని తీక్ష్ణతకు తన మనసు వశము తప్పింది ఏనాడో! భూలోకానికి వెళ్లి ఒక్కసారి ఆయన బాహుబంధాలలో ఇమిడిపోవాలన్న తమకం కలిగింది. కానీ అలాంటి స్వేచ్ఛ మాకెక్కడిది!
నా అదృష్టమో, దురదృష్టమో, అదే సమయంలో ఇంద్రుని పిలుపు వచ్చింది. విశ్వామిత్రుడి తపస్సు వల్ల తన స్థానానికి ఎక్కడ ప్రమాదం వస్తుందోనని భయపడిన ఇంద్రుడు ఆ తపస్సు చెడగొట్టే కార్యాన్ని నాకు అప్పగించాడు.
నా మనస్సు తుళ్ళితుళ్ళిపడింది. వెంటనే ఒప్పుకుంటే, వేయికళ్ళు ఉన్న ఇంద్రునికి అనుమానం వస్తుందని – రాగరంజితమైన నా మోముని కిందకు దించుకొని, ప్రేమోత్సాహంతో కంపిస్తున్న నా గొంతును, భయంవల్ల కలిగిన గగుర్పాటు అన్నట్లు నటిస్తూ మెల్లగా పలికాను..
“బ్రహ్మర్షి వసిష్ఠుడినే పుత్రశోకసాగరంలో ముంచిన అనివార్య తేజస్వియైన విశ్వామిత్రుడికి నీతో సహా దేవతలందరూ భయపడతారు. ఉగ్రస్వభావంతో అతిశయించే అతని వద్దకు భామలు పోగలరా! ఆయన కోపాగ్నికి నేను బలి కావాలా?” అన్నాను నిష్ఠూరంగా.
మరీ నటన కొనసాగిస్తే మరొకరికీ కార్యాన్నప్పగిస్తాడీ ఇంద్రుడు. అందుకే బలవంతాన ఒప్పుకున్నట్టు, “అయిననూ నీ ఆజ్ఞ మేరకు నా శక్తి కొలది అతని మనసును మన్మథుని స్వాధీనమయ్యేలా చేయుదు”నని పలికాను.
ఆ జ్ఞాపకాలు ఎప్పుడు తలుచుకొన్నా అమందానందకందళిత హృదయారవింద అవుతుంది ఈ మేనక.
విశ్వామిత్రుడి తపోవనానికి మలయమారుతాలను తోడు తీసుకొని, దేవపుష్పాలంకృతనై చేరుకొన్నాను. అన్నీ నాకు అనుకూలంగా మలుచుకొన్నాను. దీర్ఘతపస్సులో మునిగి ఉన్న విశ్వామిత్రుని సౌందర్యాన్ని, మగటిమిని కనులారా కాంచి ‘అనిమిషత్వం’ ఇన్నాళ్లకు సార్ధకమైంది కదా అని పరవశించాను. నేను ధరించిన దేవపుష్పాల పరిమళాన్ని మలయమారుతం అతని వద్దకు మోసుకువెళ్లింది కాబోలు, కళ్ళు తెరిచాడు.
నా మనసు పూర్తిగా వశం తప్పింది. కానీ అతనికి ఎక్కడ అనుమానం వస్తుందోనని గమనించనట్టుగా పక్కనే ఉన్న పుష్కర సరస్సులోకి దిగి జలకాలాడసాగాను. నా అందచందాలు, కామోద్దీపక చేష్టలు, నా చేతి వేళ్ళ నుండి వెదజల్లబడిన జలబిందువులు అతని మోముపై వాలి, మనస్సు పూర్తిగా తపస్సు నుండి మరలిపోయిందని, శరీరం నా పొందుకోసం తపిస్తోందని నాకర్థమైంది.
పరస్పర కామోద్రిక్తులమై సర్వసుఖాలు అనుభవించాం. ఇప్పుడు కదా నా స్త్రీత్త్వం సార్థకమైంది!
ఇంద్రుడి పంపున అప్సరసలం ఇలాంటి కార్యాలు నిర్వర్తించటం మా కర్తవ్యం. కానీ ఈ విశ్వామిత్రుడు ఉన్నాడే.. నా మనశ్శరీరాలలోని ప్రతి కణాన్నీ ఆక్రమించుకున్నాడు.
ఎన్ని ఏళ్ళు గడిచాయో! మనసులో ఇంద్రునికి కృతజ్ఞతాంజలులు సమర్పించుకున్నాను.
ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవకపోవడమే నా దురదృష్టం.
నా కడుపు పండి ఒక ఆడపిల్ల జన్మించింది. అప్పుడే, అందరి పురుషులకు మల్లేనే ఈ విశ్వామిత్రునికీ కర్తవ్యం గుర్తుకొచ్చింది. సంసార జంజాటంలో చిక్కుకున్నానే అని చింతించి నిర్ధాక్షిణ్యంగా నన్నూ, బిడ్డనూ వదిలి వెళ్ళిపోయాడు.
ఇంద్రుని మనసు కుదుటపడింది. వెంటనే తిరిగి రమ్మని నన్ను అజ్ఞాపించాడు. పసిబిడ్డ .. ఆడపిల్ల! గత్యంతరం లేక అక్కడే మాలినీ నదీ తీరాన, మెత్తటి ఇసుక తిన్నెలపై బిడ్డను ఉంచి స్వర్గానికి వెళ్ళిపోయాను.
ఇలాంటి పనులు ఎన్నోసార్లు చేశాను. కానీ ఈ చిన్నారి పసిబిడ్డ అమాయకమైన మోము నన్ను వెంటాడుతూనే ఉంది. నా చూపులు ఇక్కడి నుంచి ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. ఆకాశంలో వెళ్తున్న పక్షుల గుంపులను దారి మరల్చి, వాటిలో మాతృత్వ భావం కలిగించాను. అవి బిడ్డను రక్షించడానికి గుమిగూడేలా చేశాను. శిష్యగణములతో అటుగా వస్తున్న కణ్వమహర్షికి ఆ పక్షుల రావాలు వినపడేలా చేశాను.
చంద్రరేఖ వలె కాంతులీనుతున్న బాలికను చూసి కణ్వమహర్షి ఆమెను పుత్రికగా స్వీకరించి. శకుంతలాల (పక్షుల) చేత రక్షించబడినది కనుక ‘శకుంతల’ అని పేరుపెట్టి అపురూపంగా పెంచసాగాడు.
దినదినప్రవర్ధమానంగా సౌందర్యరాశిలా, వనదేవతలా ఎదుగుతున్న శకుంతలను చూసి నా మనసు ఉప్పొంగిపోయేది. దినములో ఒక్కసారి అయినా ఆమె అందచందాలను, ఆటపాటలను గాంచనిదే నాకు తృప్తిలేదు. యౌవనశోభతో అలలారుతున్న నా శకుంతలను వరించే వీరుడెవ్వరు అన్నదే నా ఆత్రుత.
జన్మతః క్షత్రియురాలు, కానీ తండ్రి లక్షణాలు ఏవీ రాలేదు. పెంచిన తండ్రి కణ్వుని ధర్మాచరణయే శకుంతలకు అబ్బిన ఆస్తి.
ఒకనాడు దుష్యంత మహారాజు వేటకై అరణ్యాంతరాలలోకి వచ్చి, కణ్వాశ్రమ ప్రాంతం వైపు రావడం గమనించాను. త్రసుడు, కాళింది అనే దంపతులకు జన్మించిన ఇలినుడికి రథంతరి యందు జన్మించినవాడు దుష్యంతుడు. అతని తాత మలినారుడు. నాయనమ్మ సాక్షాత్తు సరస్వతీ నది. అసాధారణమైన వీరత్వంతో బాలహరిణాదులను పట్టుకునే నేర్పు మాత్రమే కాక సింహ శార్దూలేభములను క్రీడగా పట్టుకునే వీరాధివీరుడు. అతని పరిపాలనలో ప్రజలు రోగదుఃఖాదులు లేక, విఘ్న నష్టాదుల బారిని పడక, సుఖజీవనులై ఉన్నారు. నా కూతురికి సరియైన జోడి అనుకొని, వారి వివాహాన్ని మనఃస్పూర్తిగా ఆకాంక్షించాను.
దుష్యంతుడు ఒంటరిగా ఉన్న శకుంతలను చూశాడు. ప్రసన్నచిత్తుడయ్యాడు. ప్రేమమనస్కుడయ్యాడు. మునికన్య యేమోనని వెనుకాడాడు. క్షత్రియపుత్రిక అని తెలుసుకొని సంతుష్ఠమనస్కుడయ్యాడు.
“నీ అందమైన రూపం, నీ మేని ప్రకాశం, మచ్చలేని గుణాలు — ఏమిటి! ఈ వల్కలాజినాలు, వన్యఫలాశనాలు, విటప కుటీరావాసమేమిటి” అన్నాడు.
“నా భార్యవై అపార రాజ్యసంపదలు, ఎత్తైన మేడలలో బంగారు కట్టడాలలో సకల సుఖాలను పొందవలెను సుమా” అన్నాడు.
వింటున్న నా మది ఆనందతరంగితమైంది.
మన్మథ బాణ పరంపరకు వశమైనా, ధర్మబద్ధమనస్క అయిన శకుంతల, “ధర్మస్వరూపులు మా తండ్రి కాసేపటిలో వస్తారు. వారు వచ్చి కన్యాదానం చేసినచో నాకు అభ్యంతరం లేదు” అని చెప్పింది.
నాకు సంతోషమైంది. నా వలె కాదు కదా ఈ శకుంతల!
అందుకే, “నాకు జన్మించబోయే కుమారునికే యౌవరాజ్య పట్టాభిషేకం చేయా” లన్న షరతు విధించింది.
‘అతడే భరత వంశ మూలపురుషుడు అవుతాడు శకుంతలా’ అని మనస్ఫూ ర్తిగా ఆశీర్వదించాను.
అన్నిటికీ అంగీకరించాడు దుష్యంతుడు. బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, రాక్షసం, ఆసురం, గాంధర్వం, పైశాచం అనే అష్టవిధ వివాహ పద్ధతులలో ఉత్తమ క్షత్రియులకు యోగ్యమైన గాంధర్వ వివాహానికి బాలికను ఒప్పించాడు. వారిరువురు ఆనందడోలికలలో తేలియాడారు. అద్వైత ప్రణయ సిద్ధిని పొందారు. స్త్రీ పురుషులు సంసారం వలన ఏ అమృతాన్ని కోరుకొంటారో అది పొందారు.
ఆనాడు ఏది కోరుకొన్నానో అది నాకు అందింది.. అందలేదు! ఇదుగో.. ఇక్కడ.. ఈ శుష్కమైన ‘అమృతాన్ని’ నిత్యమూ గ్రోలుతున్నాను. సరే.
“అమాత్యాదులను పంపించి కణ్వమహర్షి అనుమతితో నిన్ను నా అంతఃపురానికి రప్పించుకుంటాను” అని శకుంతలకు మాటయిచ్చి మరలిపోయాడు దుష్యంతుడు.
కణ్వమహర్షి వచ్చాడు. సున్నితమైన శృంగార హావ భావాలతో, సిగ్గుతో తలవంచుకొని, కొద్దిగా భయపడుతున్న తన కూతురిని చూశాడు. దివ్యదృష్టితో జరిగిన వృత్తాంతం తెలుసుకున్నాడు. ‘గాంధర్వం’ శాస్త్రసమ్మతమేనని సమ్మతించాడు. “నీ గర్భాన జనించేవాడు సమస్త భూమిని పాలించగల మహావీరుడవుతాడు” అని దీవించాడు. మహర్షి ఆశీఃప్రభావంతో ప్రతిభావంతుడైన కుమారుడు జన్మించాడు. తరతరాల అనేక వంశాల సద్గుణాలన్నీ పుణికిపుచ్చుకున్న వాడు, అరచేతిలో చక్రరేఖ కలవాడు, చక్రవర్తి కాగల లక్షణాలున్నవాడు, నా మనవడు ఎంత ముద్దులొలుకుతున్నాడో!
కణ్వమహర్షి జాతకర్మాది క్రియాకలాపాలు జరిపి, ‘భరతుడు’ అని నామకరణం చేసాడు. దుష్యంతుడు యౌవనంలో సాధించిన వీరత్వాన్ని భరతుడు బాల్యంలోనే సాధించాడు. పులులు, ఖడ్గమృగాలు, ఏనుగులు మొదలైన వాటిని వేటాడి, పట్టి, చెట్లకు కట్టివేస్తుండేవాడు. ఆ బాలుడి సాహసాన్ని గమనించి ఆశ్చర్యపడిన మునులందరూ ‘సర్వదమనుడు’ అని పిలవ సాగారు.
ఎదుగుతున్న కొద్దీ అతని బలము ద్విగుణీకృత మవసాగింది. ఆ బాలుడి ఉదాత్త తేజస్సు, పరాక్రమాది గుణాలను చూసి ‘సమస్త రాజ్యానికి యువరాజు కాగల సందర్భం వచ్చిన’దని కణ్వుడు గ్రహించాడు.
ఇన్నాళ్లుగా ప్రేమాభిమానాలతో పెంచిన శకుంతలను అత్తవారింటికి పంపటం మనసుకు కష్టమనిపించినా, తన కర్తవ్యం ఏమిటో ఆ మహర్షికి తెలుసు. గొప్ప తపస్వులైన శిష్యులను తోడిచ్చి, రాజాస్థానానికి శకుంతలను, కుమార భరతుడిని పంపించాడు.
ఇదీ ఈనాటి నా ఉద్విగ్నతకు కారణం.
సామంతులు, మంత్రులు, పురోహితులు, ప్రధానులు, పౌరజనులు కూడి ఉన్న సభలోనికి ప్రవేశించింది శకుంతల. ఆందోళనాంతర్గతనై చూస్తున్నాను నేను.
కణ్వాశ్రమంలో ఆనాడు తన పట్ల చూపిన వలపు, ఆదరణ, దయ, ఆసక్తి దుష్యంతుడిలో నేడు కన్పించకపోవడం శకుంతల సూక్ష్మదృష్టికి గోచరమైంది. “ఇతడు నన్ను గుర్తించలేదా, గుర్తించినా గుర్తించనట్లు నటిస్తున్నాడా, చాలా కాలం కావడం చేత మరచినాడా, గాంధర్వ వివాహానికి ముందు పలికిన మాటలు మర్చిపోయాడా, మనసు మార్చుకున్నాడా, నూతనప్రియులు కదా ధరాధినాథులు” అని అనుమానించింది.
‘రాజులు అనేకకార్యాలలో మునిగి ఉంటారు కదా’ అని సమాధానపరుచుకున్నది.
‘అయ్యో. నిజంగా మరిచిపోతే జ్ఞాపకం చేయవచ్చు. మరిచినట్లు నటించేవాడికి ఏమి చెప్పగలము’ అని అనుకొని కూడా, అతికష్టం మీద మనసు చంపుకొని, తమ పరిచయాన్ని గుర్తుచేసింది.
“దానినంతయు నెఱింగియు నెఱుంగనివాఁడ వోలె” – దుష్యంతుడు, “నిన్ను నేను ఎరుగను. ఈ అనుచితమైన పలుకులేల? ఎక్కడినుండి వచ్చితివో అక్కడికే తిరిగి వెళ్ళుము” అన్నాడు.
హతోస్మి. ఏదైతే జరుగుతుందని భయపడుతున్నానో, అదే జరిగింది.
“దుర్మార్గుడా దుష్యంతా! ఎవరి దగ్గర సర్వసౌఖ్యాలూ పొందినావో ఆ స్త్రీ ఎవరో నీకు తెలీదా! ఇక ఎక్కడికి వెళితే నీ కెందుకు? ఎక్కడి నుండి వచ్చితివో అక్కడికే పొమ్మని చెప్పనేల! ఎక్కడికి వెళితే నీ కెందుకు! ఇక్కడే నీ భీతి బహిర్గతమౌతోంది కదా!”
ఆవేశం అయితే ఉన్నది కానీ, మనసైనప్పుడు భూలోకానికి వెళ్లే అనుమతి మాకు లేదు కదా. భగవంతుడా! ఏమి చేయాలి నేను!
శకుంతల మోము తెల్లబోయింది. కన్నులు ఎర్రబారాయి. నయనాల నుండి అశ్రుబిందువులు కారసాగాయి. కానీ ఆమె కేవలం మేనక కుమార్తె కాదు. కణ్వమహర్షి ధర్మబోధలో పెరిగిన గంభీరహృదయ. అధర్మాన్ని సహించలేని ఆశ్రమవాసి.
కుపితయై, “సాక్షులు లేరని ధర్మాత్ములు అబద్ధం ఆడరాదు. వేదాలు, పంచభూతాలు, ధర్మం, ఉభయ సంధ్యలు, హృదయం, యముడు, చంద్ర సూర్యులు, పగలు రాత్రి అనే మహాపదార్థాలు నరుల వర్తనాన్ని ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. నువ్వు ఇచ్చిన వరాలు మానవులకు తెలియకపోవచ్చు కానీ, అవే సాక్షిభూతాలు సుమా! పతివ్రత, గుణవంతురాలు, అనుకూలవతి, సంతానవతి అయిన భార్యను తిరస్కారభావంతో చూసే దుర్బుద్ధికి ఇహపరసుఖాలు దక్కవు. ఇదుగో! ఈ పిల్లవాడిని గమనించు. ఇతడు నీ కుమారుడు. పున్నామనరకం నుండి రక్షించే ఈ కుమారుని ఒక్కసారి దగ్గరకు తీసుకో. పుత్ర గాత్ర పరిష్వంగ సుఖం అనుభవించు. నీటిలో నీ నీడను చూసుకున్నట్టు అచ్చు నీ ప్రతిబింబంగా లేడూ!” అంటూ నింపాదిగానైనా నిక్కచ్చిగా పలికింది శకుంతల.
“క్షత్రియులలో ఉత్తముడైన విశ్వామిత్రునికి, పవిత్రురాలైన మేనకకు పుట్టిన నేను అధర్మపరురాలను కాను” అని దృఢంగా పలికింది.
“నేనెక్కడ? నీవెక్కడ? కుమారుడెక్కడ? నేను నిన్ను ఇంతకు పూర్వం ఏనాడూ చూసి యెరుగను. ఆడువారు అబద్ధాలు ఆడుతారు అనే మాటకు సరియైనట్లు పలుకుతున్నావు” అన్నాడు దుష్యంతుడు.
“పుట్టిననాడే తల్లిదండ్రులచేత విడువబడినాను. ఇప్పుడు భర్త చేత కూడా విడువబడుతున్నాను కాబోలు” అంటూ వగచింది శకుంతల. భర్తపై, తమ వలపుపై, కుమారుని భవితపై ఆశలు వదులుకొంది. కుమారుని చేయి పట్టుకుని వెనుతిరగబోతున్నది.
ఇప్పుడు ఈ వంచిత అయిన శకుంతలకు దిక్కెవ్వరు? కొట్టుమిట్టుకులాడుతున్న ఈ మాతృ హృదయానికి సాంత్వన ఎవరు చేకూరుస్తారు? భరత వంశ చరిత్రను ఎవరైనా భవిష్యత్తు తరాల కోసం ఉన్నది ఉన్నట్లు గ్రంథస్థం చేయకపోతారా! ఈ వంశ పరంపరలో ఇంకెందరు పురుషులు వంచిస్తారో స్త్రీలను! లేదా కొందరు జరిగిన చరిత్రను మార్చి, పురుషులు ‘లోకాపవాదానికి’ గురికాకుండా, నిందలు పడకుండా, ధీరోదాత్తులుగా చిత్రిస్తూ వ్రాస్తారేమో! ఈ దుష్యంతుడినీ అమాయకుడిలా కల్పిస్తారేమో!
ఏమో! ఏదైతే నాకెందుకు? నా కూతురు శకుంతలకు న్యాయం జరగాలి.
ఎలా! ఎవరు వస్తారు! సాక్ష్యం ఎవరిస్తారు! ఆకాశం నుంచి రాజాస్థానానికి ఊడిపడి సత్యం చెబుతారా!
ఎవరు చెబితే ఈ మహారాజు సత్యాన్ని ఒప్పుకొంటాడు? ఎవరి వాక్కులను ఈ సభాసదులు అంగీకరిస్తారు? ఆకాశవాణి చెబుతుందా ఏమిటి?
ఏం, ఎందుకు చెప్పదు! ఎవరో ఎందుకు, నా కూతురికి నేనే సహాయం చేస్తాను. నేనే న్యాయం చేస్తాను. కూతురి కాపురం నిలబెట్టలేదా ఈ అప్సరాంగన మేనక!
గొంతు సవరించుకొన్నాను. ఘనాఘనము వంటి గంభీరస్వరంతో పలికాను.. ఆకాశం నుంచి.
“రాజా! ఈ భరతుడు నీకు, శకుంతలకు జన్మించినవాడు. ఈతనిని స్వీకరించు. ఈ ఇల్లాలు ఉత్తమ కీర్తి కలది. మహాపతివ్రత అయిన శకుంతల నిజమే చెప్పింది!”
నేను చేసిన పని సరియైనదే. ‘ఆకాశవాణి పలికినది సత్యము’ అని సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. నమ్మారు.
అప్పుడు దుష్యంతుడు సభాసదులనుద్దేశించి, “అలనాడు ఈమెను కణ్వమహర్షి ఆశ్రమంలో గాంధర్వ వివాహ పద్ధతిని పెండ్లాడిన విషయము నాకు, ఈమెకు తప్ప ఇతరులు ఎవరికీ తెలియదు. లోకనిందకు భయపడి నాకీమె తెలిసి ఉన్నప్పటికీ – తెలియదు అని కఠినంగా పలికాను. ఇప్పుడు అద్భుతంగా ఆకాశవాణి సత్యాన్ని ప్రకటించినది”.. అంటూ కుమారుని దగ్గరకు తీసుకుని, శకుంతలను మిక్కిలి గౌరవంతో పట్టమహిషిగా స్వీకరించాడు.
నా మనసు సమ్మోదమొందింది. నా మాతృహృదయం సంతసించింది. ఆందోళన ఉపశమించింది. ఆనందం ఆర్ణవమందింది.
అవును. నేను మేనకను. విశ్వామిత్రుడి మనసు దోచినదానను. భరతవంశానికి అంకురమైనదానను. ఇక అంతా శాంతి. ప్రశాంతి.
*
(వ్యాస, నన్నయ భారతాలు ఆధారం. ముగింపు స్వకపోలకల్పితం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా – అనాదిగా వంచితలైన వనితలకు ఇది ‘అంకితం’)