[dropcap]వీ[/dropcap]రకేతుమహారాజు తన పరివారంతో వేటకు బయలుదేరాడు. ఆయన తనకు తన పరివారానికి రెండురోజులు సరిపోయేట్టు ఏనుగలు, గుర్రాల మీద పెద్ద పాత్రలతో నీళ్ళు తీసుకవెళ్ళాడు.
వారు దట్టమైన అడవిని చేరుకుని అడవిలో ఎంతదూరం వెళ్ళినా ఏ జంతువూ తారసపడలేదు. అయినా పట్టువదలక అడవిలోకి మరింత దూరం వెళ్ళారు. అక్కడ వారికి అనేక జంతువులు, పక్షులు నేలమీద పడి కనిపించాయి! వాటికి అల్లంత దూరంలోఒక భీకర రాక్షసుడు పడి మూలుగుతున్నాడు!
అడవిలో తినకూడని ఆకులు, పండ్లు తిని ఈ విధంగా రాక్షసుడితో సహా జీవాలన్నీ పడిపోయాయేమో అని రాజు తలచాడు.
ఎందుకైనా మంచిదని రాజు తన పరివారంతో బిగ్గరగా “అందరూ ఆయుధాలు సిద్ధం చేసుకోండి…ఒకవేళ ఆ రాక్షసుడు లేచి మన మీదకు వస్తే వాడిని తుద ముట్టిద్దాం” అని అన్నాడు.
ఇంతలో ఆ రాక్షసుడు నీరసంగా లేచి “మహారాజా నా ఆకారం చూసి తమరు తప్పు అంచనా వేశారు కానీ నేను శాపగ్రస్తుడయిన కుంతల దేశరాజు కీర్తివర్మని. నేను వెయ్యి సంవత్సరాల క్రితం కుంతల దేశాన్ని పరిపాలించేవాడిని, అప్పట్లో నా పొరుగు దేశం అమరసీమ కరవులో చిక్కుకుంది.ఆ దేశపు రాజు ధర్మతేజ నా దేశంలో పారే రత్నధార నది నీళ్ళు తన రాజ్యంలో పారేట్టు కాలువ త్రవ్వించమని అర్థించాడు. అప్పట్లో నాకు ధనగర్వం, సైనిక బల గర్వంతో అమరసీమకు నీళ్ళు ఇవ్వకుండా అక్కడి ప్రజల్ని,రాజును బాధ పెట్టాను. ఆయనను బాధ పెట్టాను కాబట్టి, ఆయన మంచితనం నాకు శాపంగా పరిణమించింది, అందుకే భీకర రాక్షసుడిగా మారిపోయాను! వెళ్ళి ధర్మతేజ కాళ్ళ మీద పడి అమరసీమకు కాలువలు త్రవ్వించి ఆదేశంలో నీటి కరవు లేకుండా చేస్తానని చెప్పాను. నాకు కలిగిన దుస్థితికి ధర్మతేజ ఎంతో చింతించి,నేను త్వరలోనే బాగు పడాలని ఆకాశం వైపు చూసి ప్రార్థించాడు. చిత్రంగా ఆకాశంనుండి ఆకాశవాణి నాశాపానికి విరుగుడు సూచించింది.”
“రాజా నీవు అమరసీమకు నీళ్ళు ఇవ్వడమే కాకుండా, అడవుల్లోకూడా నీటికుంటలు త్రవ్వించు. నీవు చేసే మంచి పనివల్ల కరువొచ్చినా అడవి జంతువులు, పక్షులు ఎన్నో బతుకుతాయి, నీ వలన మరొక రాజో, మహానుభావుడో ప్రేరణ పొందితే నీకు శాప విమోచనం అవడమే కాకుండా, మరింత ఉత్తమ జన్మ పొందుతావు” అని ఆకాశవాణి చెప్పింది.
రాక్షసుడు చెప్పిన మాటలు విని వీరకేతు మహారాజు ఆశ్చర్యపోయాడు.
ఇంకా రాక్షసుడు ఈవిధంగా చెప్పాడు”నా భీకర ఆకారం చూసి అందరూ భయపడటం వలన, నేను ఈ అడవిలోని కొండ గుహలో తల దాచుకుని నా శక్తితో ఒక్కడినే ఎన్నో నీటికుంటలు త్రవ్వాను, జలపాతాలనుండి కాలువలు త్రవ్వి జంతువులు, పక్షులకు నీటి కరవు లేకుండా చేశాను. కానీ తీవ్ర కరవు ముంచుకొచ్చి కుంటలు, కాలువలు ఎండిపోయాయి, ఇంకెక్కడైనా నీటి జాడ ఉంటుందని జంతువులు, పక్షులతో బయలుదేరాను, ఎంతదూరం వెళ్ళినా నీటిజాడ కనబడలేదు! అందుకే దాహంతో నేను,ఆ జీవాలు పడిపోయాము. అదృష్టవశాత్తు తమరు కనబడ్డారు” అని నీరసంగా చెప్పాడు. వెంటనే వీరకేతు మహారాజు తన పరివారంతో ఏనుగుల మీద ఉన్న నీటి గుండిగలను దింపించి రాక్షసుడి దాహం తీర్చటమే కాకుండా,చిన్న జంతువుల దాహం కూడా తీర్చాడు!
వెంటనే మేఘాలు కమ్ము కొచ్చి విపరీతంగా వర్షం కురిసింది. వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది! రాక్షసుడి రూపం క్రమేపీ మారిపోయి, పూర్వపు రూపం కీర్తివర్మగా మారిపోయాడు! కీర్తివర్మ అందరికీ నమస్కరించాడు. అప్పుడు ఆకాశం నుండి ఆకాశవాణి ఈ విధంగా పలికింది “కీర్తివర్మా నీ శాపానికి విమోచన లభించింది, అప్పటి గర్వం వదలి అందరికీ మేలు చేయాలనే నీ తలపు నిన్ను ఉత్తముడిగా తీర్చిదిద్దింది. అందుకే నీవు దేవతల లోకం చేరుకుంటున్నావు” అని ఆశీర్వదించింది. చెట్లు చిగురించాయి, పక్షులు ఎగిరాయి, జంతువులు లేచి నిలబడ్డాయి, అవి ఎవ్వరికీ హాని చేయలేదు.అల్లంత దూరంలో జలపాతం తిరిగి నీటితో బళ్ళున క్రిందికి దూకింది! పక్షులు ఇంపైన పాటలు పాడసాగాయి!
అన్నిటికన్నా ముఖ్యంగా తన పరిధిలో మంచి పని చెయ్యాల్సిన కీర్తివర్మ గర్వంతో ఇంకొక రాజుకు, రాజ్యానికి అన్యాయం చేయడం వలన పొందిన శాపం వీరకేతు మహారాజుని ఆలోచింప చేసింది. రాక్షసుడైన రాజు తనలో కలిగిన మంచి మార్పు వలన ఉత్తమలోకాలు పొందాడు.
అప్పటినుండి వీరకేతు మహారాజు వేట మానివేయడమే కాకుండా,ఇతర రాజ్యాల మీద దండయాత్రలు కూడా మానివేశాడు. ఇతర రాజ్యాలలో కరవు సంభవిస్తే తనవంతు సహాయం చేయడమే కాకుండా,వారి రాజ్యాలలో కాలువలు త్రవ్వించి ఆనకట్టలు కట్టించాడు. వీరకేతు మహారాజు మంచితనాన్ని ప్రజలు కథలుగా చెప్పుకోసాగారు. అలా మేలు పొందిన రాజ్యాలలో ఆయన విగ్రహాలు నెలకొల్పారు! వీరకేతు మహారాజు పేరు చరిత్రలో లిఖించబడింది.