(సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటకు ఆర్.శ్రీవాణీశర్మ గారి వ్యాఖ్యానం)
పల్లవి:
ఆదిభిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
చరణం:
తీపి రాగాల ఆ కోకిలమ్మకు
నల్లరంగునలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
చరణం:
తేనెలొలికే పూలబాలలకు
మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని
ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
చరణం:
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప
దరిజేరు మన్మథుని మసిచేసినాడు..
వాడినేది కోరేది..
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు
దనుజులను కరుణించినాడు.. వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు.. వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి…
ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు
ఆదిభిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది..
~
తెలుగు సాహిత్యంలో వున్న ఎన్నో ప్రక్రియల్లో, భక్తి గీతాలు, ఆధ్యాత్మ సంకీర్తనలు, భక్తి శతకాలు, తత్వాలు కూడా విస్తృతంగా కనిపిస్తాయి. సినీ గీత సాహిత్యంలో కూడా ఎన్నో అత్యున్నత స్థాయి భక్తి మరియు ఆధ్యాత్మిక గీతాలు వందలాదిగా భక్తులైన రసజ్ఞుల హృదయాల్లో కొలువుతీరి ఉన్నాయి. ఎందరో సుప్రసిద్ధ సినీ గేయ రచయితలు రాశిలో వాసిలో, సంకీర్తనలకు ఏ మాత్రం తీసిపోని, సాహితీ సంపదను ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగు తెరకు అందిస్తూనే వున్నారు. భక్తి పాటలు సులభంగా మనల్ని ఆకట్టుకోవడానికి కారణం, అవి భగవంతుని రూపాన్ని, తత్వాన్ని, లీలలను ఆవిష్కరించడమే!
భక్తులకు భగవంతుడు చాలా దగ్గరివాడు. అందుకే మనం ఆయనతో ఆడుకుంటాం, పాడుకుంటాం, పోట్లాడుకుంటాం. అతనితో పరాచకాలు కూడా ఆడతాం. అయినా ఆయనకన్నా ఆప్తమైన ఆత్మబంధువు మనకు ఎవరున్నారు? ‘మనకు ఏ దిక్కు లేదు’, అనిపించినప్పుడే కదా మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటాం? ఆయన కాకపోతే మనల్నిఎవరు కరుణించాలి? దేవుడి మీద కాకపోతే మనం ఇంక ఎవరి మీద అలగాలి? ఈ భావాలను వెలిబుచ్చడానికి పనికొచ్చే గొప్ప సాధనం నిందాస్తుతి. భక్తి శతకాలలో దీనికే అగ్రస్థానం. నిందాస్తుతి అంటే పైకి తిడుతున్నట్టు, గేలి చేస్తున్నట్టు, కనిపిస్తూనే స్తుతి చేయడం. ప్రేమగా, ముద్దుగా పరమాత్ముని మనసారా ప్రశంసించుకోవడం! మురిసిపోవడం!
‘నిందాస్తుతి’ అనే ఇంత గొప్ప సాహితీ శైలిని, ‘సిరివెన్నెల’ చిత్రం కోసం సీతారామశాస్త్రి గారు ‘ఆది భిక్షువు వాడినేది కోరేది’, అనే పాటలో ఎంతో చతురతతో ఉపయోగించి, హృద్యమైన గీతాన్ని రచించి, సాహితీ లోకంలో ఆ పాటకు ఒక చిరస్థాయిని కల్పించారు. అమృతాన్ని ఒలికించే బాలుగారి గళంలో ఆ పాట మరిన్ని రాగాల, భావాల, గమకాల సొబగులను కూర్చుకొని మనందరికీ అమృతరసానందాన్ని అందించింది. ఈ పాట శివతత్వాన్ని, శివ లీలలను, ఆయన ఆగ్రహ, అనుగ్రహాలను చక్కగా ఆవిష్కరించింది.
ఇక పాట విశ్లేషణలోకి వెళ్దాం.
“ఆదిభిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది.”
కోరిన కోరిక తీరలేదని, కోరిన వరాలు అందలేదని, దేవుడిని ఎంత ఘాటుగా విమర్శిస్తున్నట్టున్నాయో కదా ఈ వాక్యాలు! ఇది మనకు బాహ్యంగా కనిపించే అర్థం. ఆ పరమశివుడే ఆదిభిక్షువై, భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడుపుతుంటే ఆయన దగ్గర నేను ఏ వరాలను భిక్షగా అడగాలి, ఇవ్వటానికి తన వద్ద బూడిద తప్ప మరేమీ లేని పేదవాడు కదా, అలాంటి వాడిని ఏమని కోరాలి, ఏది అడగాలి, అని బాహ్యంగా కనిపించే అర్థం.
లక్ష్మీపతి అయిన శ్రీపతిలాగా మనమంతా ఆశించే సిరులేవీ మన శివయ్య దగ్గర కనిపించకపోయినా, వాటన్నింటికీ మించిన శాశ్వతమైన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే పరమశివుడు, తనకు తానుగా వరాలిచ్చే వాడనీ, మనము ఏమీ అడగాల్సిన అవసరం లేదనీ, అడిగే స్థాయి కూడా మనకు లేదనీ, మనకు కావాల్సినవన్నీ అతడే చూసుకుంటాడు, అనేది సీతారామశాస్త్రిగారు గట్టిగా, గుట్టుగా చెప్పిన అసలైన భావన.
“తీపి రాగాల కోకిలమ్మకు
నల్ల రంగునలమిన వాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చిన
వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది.”
తేనెలూరే కమ్మని స్వరంతో పాడే కోకిలమ్మకు నల్లని రంగును అద్దిన వెర్రివాడనీ, భయంకరంగా ఉరుములతో గర్జించే మేఘాలకు తెల్లని మెరుపు హంగులు అద్దిన అమాయకుడనీ, ఇటువంటి అస్తవ్యస్త పనులు చేసే స్వామిని ఏమని అడగాలి, ఏమివ్వమని కోరుకోవాలి అనేది, పైకి కనిపించే అర్థం.
అయితే కోయిల మధురమైన కంఠస్వరం ముందు ‘నలుపు’, అనే ప్రతికూలత లెక్కలోకి రాదు. కరుకుగా గర్జించే మేఘాలు మెరుపులతో మురిపిస్తాయి. ఎంతో అందంగా అద్భుతంగా అనిపిస్తాయి. ఆ మెరుపు చూడాలంటే, ఆ గర్జనను భరించాల్సిందే. ఉరుములు మెరుపుల వెనుక చల్లని వర్షం అనే సానుకూలత ఉంది. అంటే బాహ్యంగా కనిపించే అనుకూలతలు, ప్రతికూలతలు భగవంతుని దృష్టి కోణంలో మరోరకంగా ఉంటాయని, సీతారామ శాస్త్రి గారు వేదాంత రహస్యాలను మనకు సుతిమెత్తగా అందిస్తున్నారు. ఒకవైపు నుంచి, దేవుడు గొంతు నిచ్చినవాడికి రూపం ఇవ్వలేదని, రూపం ఇచ్చిన వాడికి గొంతు నివ్వలేదనీ ఆక్షేపిస్తూనే, దేవుడి పథకంలోని సమతౌల్యతని చూపిస్తున్నాడు కవి. ఒకటి లోపంచేస్తే, దాన్ని మరో శక్తితో పూడుస్తాడన్నమాట. భగవంతుని ప్రపంచంలో అన్యాయంలేదు.
“తేనెలొలికే పూల బాలలకు
మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
బండ రాళ్ళను చిరాయువుగ జీవించమన
ఆనతిచ్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది”.
తేనెలొలికే పూలకు మూడే, మూడు రోజుల ఆయువిచ్చి, ఎందుకూ పనికిరాని బండరాళ్లను శాశ్వతంగా జీవించమని ఆనతిచ్చిన తిక్క స్వామిని మనం ఏమని అడగాలి, ఏమని కోరాలి అని నిందాస్తుతి.
అంతర్లీనంగా ఈ చరణం మనకు జీవిత తత్వాన్ని, రహస్యాన్ని బోధిస్తుంది. మనం ఎలా ఉన్నాము.. ఎంతకాలం జీవించాము.. అన్నది ముఖ్యం కాదు. కాకి లాగా కలకాలం జీవించడం కన్నా.. అన్నట్టు, పరోపకారంలోనే మన లక్ష్యం, లక్ష్యసాధన దాక్కుని వున్నాయి. పరిమళాలను, తేనెలను అందించే పువ్వుకీ, నిశ్చలంగా కదలకుండా కలకాలం జీవించే బండరాయికీ, సృష్టిలో ఉన్న ప్రతిచరాచరానికీ, దేని జీవిత పరమార్థం దానికి ఉన్నాయి. శివమయమైన ఈ జగత్తంతా – సత్యం, శివం, సుందరమే.. అన్నది శాస్త్రి గారు విప్పి చెప్పిన పరమ రహస్యం.
“గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప
దరిజేరు మన్మథుని మసిజేసినాడు
వాడినేది కోరేది
వర గర్వమున మూడు లోకాల పీడింప
తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది.”
పార్వతీదేవితో కళ్యాణం జరపి లోకకళ్యాణం చేయాలని నడుము కట్టిన మన్మథుడిని మసి చేసిన వాడినీ, తాము పొందిన వరాలతో ముల్లోకాలను పట్టి పీడించే రాక్షసులను కరుణించే బోళా శంకరుడిని ఏమి అడగాలి, ఏమి కోరాలి అనేది ఈసడింపు మనకు పైపైన కనిపిస్తుంది.
మన్మథుడి మాయ, సృష్టి కార్యానికి దారితీసి, సంసారమనే మోహంలో పడేస్తుందని తెలిసిన ఆదియోగి, ఆ మాయను బూడిద చేసినా, అతనికి శాశ్వతత్వాన్ని, రతీదేవికి నిత్య మాంగల్యాన్ని ప్రసాదించాడు. అంటే పైకి కనిపిస్తున్న కఠినత్వం వెనుక ఎంతో కారుణ్యం దాగి ఉందని మనకు అర్థమవుతుంది. దుర్మార్గులను అంతం చేయాలంటే వారు ఎక్కువ పాపాలు చేయాలి కాబట్టి, వారు కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. పాప భారాన్ని మోయలేని భూదేవికి విమోచన కలిగించడానికి జరిగే జగన్నాటకమది. ఆ తిక్కశంకరుడికి, ‘తన లెక్కలు తనకు ఉన్నాయ’ని ఎంతో చాతుర్యంగా చెప్పారు సిరివెన్నెల గారు.
“ముఖ ప్రీతీ కోరేటి ఉబ్బు శంకరుడు
వాడినేది కోరేది.. ముక్కంటి ముక్కోపి..
ముక్కంటి ముక్కోపి.. తిక్క శంకరుడు..
ఏది కోరేది, వాడినేది అడిగేది.”
‘ముఖస్తుతి చేస్తే చాలు, మాయలో పడిపోతాడు, పొగడ్తలకు ఉబ్బిపోతాడు, మూడు కన్నుల వాడు, ముక్కోపి, తిక్క శంకరుడ’ని, మద్దుముద్దుగా చేసిన ముచ్చటైన విమర్శలు మనకు సహజంగా వెంటనే స్ఫురిస్తాయి..
మనం స్తుతించినా, స్తుతించకపోయినా, తల్లి తండ్రి తానే అయ్యి, మనల్ని కాచేవాడు బోళా శంకరుడు. మనసారా శివ నామాన్ని తలచుకుంటే చాలు, ఆయనపై మనకున్న ఆ కాస్త ప్రేమకే వెన్నలా కరిగిపోతాడు ఆ మంచుకొండ తండ్రి. మూడవకన్ను ఉంది కాబట్టే, ఆ జ్ఞానాగ్నిలో మన అజ్ఞానాన్ని దగ్ధం చేస్తాడు. ముక్కోపి కాబట్టే అవసరమైనప్పుడు ఆగ్రహించి, సరైన త్రోవలో నడిపిస్తాడు. తిక్క శంకరుడు కాబట్టే సర్వ ప్రాణులను సమానంగా ప్రేమిస్తాడు. అవ్యాజమైన ఆ ప్రేమే ఆయన వెర్రితనం. పాపాత్ములను సైతం ఆదరిస్తాడు. ఈ ప్రపంచాన్ని, శరీరం వదిలేసి, బూడిద కుప్పగామారి, ఆత్మ రూపంలో ఒంటరిగా ఘోషిస్తున్నప్పుడు, ఆ భస్మాన్ని ధరించి, రుద్రభూమిలో మనకు తోడుగా నిలుస్తాడు ఆ రుద్రుడు. ఇంతటి ఘనమైన శివ తత్వాన్ని ఎంతో భావగర్భితంగా, నిందాస్తుతిలో రచించి, మన అందరి మనసులనూ కొల్లగొట్టడం సీతారామశాస్త్రిగారికి సులభ సాధ్యం.