శతధన్వుడు

0
3

[dropcap]పూ[/dropcap]ర్వం భూలోకంలో శతధన్వుడనే రాజుండేవాడు. అతని భార్య శైబ్య. ఆమె ధర్మాచరణమున గొప్ప ఆసక్తి కలిగినది మరియు పతివ్రత. సత్యం, శాంతం, శౌచం, దయ, వినయం వంటి సకల సల్లక్షణాలతో విలసిల్లుతూండే మహా ఇల్లాలు. ఆ దంపతులిద్దరూ దేవాధిదేవుడైన ఆ జనార్దునుడిని భక్తితో జప హోమార్చన ఉపవాసాదిక్రియలతో అనునిత్యం ఆరాధిస్తుండేవారు.

ఒకరోజు ఆ రాజదంపతులు (కార్తీక పౌర్ణమి సందర్భాన) గంగానదిలో స్నానం చేసి, ఉపవసించి ఉన్న తరుణాన, అనుకోకుండా వారి కంట ఒక పాషండుడు పడ్డాడు. కాని, దురదృష్టవశాత్తు అతడు మహారాజుకు మిత్రుడు. తప్పనిసరి అయి, రాజు అతడితో ఆదరపూర్వకంగా సంభాషించాడు. శైబ్యకు ఈ విషయం తెలిసివున్నందున ఆమె ప్రాయశ్చిత్తంగా సూర్యుడిని ప్రార్థించింది. పైగా చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయేది.
ఆ దంపతులింటికి వచ్చి యథావిధిగా విష్ణువును ఆరాధించారు. దానధర్మాలు చేశారు. ఇంకా చాలాకాలం పాటు విష్ణుభక్తిని కలిగి జీవితాంతం మెలిగారు. కొంతకాలానికి శతధన్వుడు మరణించాడు. మహా పతివ్రత అయినందున అతని పత్ని శైబ్య కూడా భర్తతో పాటు సహగమనం చేసి తనువు చాలించింది. పాషండ సంభాషణ ఫలితంగా ఆ రాజుకు కుక్కజన్మ సంప్రాప్తించింది. విష్ణుభక్తి తత్పరత చేత తిరిగి శైబ్య కాశీరాజుకు కూతురిగా పుట్టింది. ఆమెకు పూర్వజన్మ ఙ్ఞాపకం ఉంది.

యుక్త వయస్సురాగానే  కాశీరాజు ఆమెకు వివాహం తలపెట్టేసరికి, ఆమె తండ్రిని వారించింది. పూర్వజన్మ జ్ఞానం చేత తన భర్త విదిశానగరంలో కుక్కగా పుట్టినట్లు తెలుసుకున్నది. అక్కడకు వెళ్లి అలా  జన్మించిన భర్తను చూసి, హృదయం ద్రవించి చక్కని ఆహారాన్ని తినడానికి రోజూ పెట్టేది. పూర్వజన్మ ఙ్ఞాపకం లేని ఆ శునకం తన జాతి లక్షణాన్నే ప్రదర్శిస్తూ ఆమె చుట్టూ తిరుగుతూంటే, ఆ కాశీరాజ తనయకు ఏం చేయడానికీ పాలుపోలేదు.

అప్పుడామె తన పతికి నిజం చెప్పడం ఎంతో ఉత్తమమని భావించి, ఆ శునకం చెవిలో “నీవు శతధన్వమహారాజువు, పూర్వజన్మలో విష్ణుపూజాసక్తుడివై ఉండీ, ఒక పాషండుని దర్శించిన పాపానికి ఇలా అయ్యావు” అని చెప్పింది. ఆ జీవి గొప్ప నిర్వేదం చెంది, ఒక కొండ శిఖరాన్నెక్కి అక్కడ్నుంచి దూకి తనువు చాలించింది. తరువాత ఒక నక్కగా పుట్టింది.

కాశీరాజు తనయ అది కూడా తెలుసుకుని, ప్రయత్నవశాన ఆ నక్కను చేజిక్కించుకొని తిరిగి అదే బోధ చేసింది. నక్కరూపంతో ఉన్న శతధన్వుడు చింతిస్తూ నిరాహారంగా ప్రాణాలు విడిచి, ఈసారి తోడేలు జన్మ ఎత్తాడు. తిరిగి ఆమె ప్రయత్నించి, ఆ తోడేలుకు నిజమేమిటో చెప్పగా అటుపైన గ్రద్ధ, కాకి జన్మలు సంప్రాప్తించాయి. ఆయా జన్మల్లోనూ ఆమె తన పతిని మరణేచ్ఛవైపు మరలించింది. తదుపరి కొంగ, నెమలి జన్మలు సంప్రాప్తించాయి.

చివరికా రాజు నెమలిజన్మలో ఉండగా – జనకచక్రవర్తి చేస్తున్న అశ్వమేధయాగంలో దీక్షాంత స్నానవేళ, నెమలికి స్నానం చేయించి పూర్వజన్మలన్నింటి క్రమాన్ని గుర్తుచేసేసరికి, ఆ పక్షిరూపాన్నీ త్యజించి, జనకప్రభువు పుత్రుడై పుట్టాడు.

అటుపైన ఆమె తన తండ్రిని వివాహానికి ప్రేరేపించగా, ఆ రాజు స్వయంవరాన్ని ఏర్పాటుచేశాడు. జనక మహారాజు పుత్రుడు ఆ స్వయంవరానికి రాగా ఆమె తన పతిని గుర్తించి, తిరిగి రాచజన్మలోనే అతడ్ని కలుసుకున్నది. అతడు చిరకాల మామెతో సుఖించి, తన తండ్రి గతించాక  విదేహ రాజ్యాన్ని పరిపాలించాడు. చాలా యజ్ఞాలు చేశాడు. బహుదానాదికాలు జరిపించాడు. న్యాయంగా భూమిని పరిపాలించాడు. శత్రురాజుల్ని జయించాడు. పుత్రవంతుడయ్యాడు. క్షాత్రధర్మం ప్రకారం తన ప్రాణాల్ని యుద్ధభూమిలో వదిలాడు. ఆమె వెనుకటిలాగే సహగమనం చేసింది.

యుద్ధంలో మరణించడం చేత వీరస్వర్గాన్ని అలంకరించాడు విదేహరాజు. పతివ్రత గనుక ఆమెకూడా ఇంద్రాదిలోకాలకు పైనున్న యక్షలోకాలకు చేరుకుంది. దీనితో పాటు విష్ణు పూజాదురంధరులైనందున ఆ ఇరువురూ చిరకాలం స్వర్గసౌఖ్యాలనుభవించి, మోక్షదాయకమైన విష్ణుపదం పొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here