[dropcap]గో[/dropcap]పగాని రవీందర్ రచించిన కవిత్వ విమర్శనా వ్యాసాల సంపుటి ‘శతారం’. శతారం అంటే వజ్రాయుధం. ముందే విమర్శనా వ్యాసాలు, పుస్తకం పేరు వజ్రాయుధం కాబట్టి విమర్శకుడు కవులపై వజ్రాయుధంగా విరుచుకు పడ్డాడనుకుంటే పొరపాటు. ఇవి సహృదయము, సదవగాహనతో చేసిన సద్విమర్శనాత్మక వ్యాసాల సంపుటి. ఇందుకు గోపగాని రవీందర్ అభినందనీయుడు. స్వయంగా కవి అయిన గోపగాని రవీందర్‍కు తోటి కవుల హృదయలను, అంతరంగాలను, వారి కవితల్లో దర్శించి, ఆయా కవితల్లో దాగి ఉన్న వారి హృదయ రహస్యాలను గ్రహించి చేసిన హృదయపూర్వక విమర్శల సంపుటి ‘శతారం’. ఈ పుస్తకంలో మొత్తం 75 వ్యాసాలున్నాయి. ‘కాళోజీ నా గొడవ – కవులకు దిక్సూచి’ అన్న వ్యాసంతో ఆరంభమై, ‘గుల్జార్ హృదయ రాగాలే ఆకుపచ్చ కవితలు’ అన్న వ్యాసంతో ముగుస్తుందీ పుస్తకం,
“అనేకమంది కవుల ఆలోచనా ధోరణులను, అభివ్యక్తి వైవిధ్యాలను ఒక్క చోట భద్రపరిచింది. పోటీ పరీక్షల అభ్యర్థులకు, సాహిత్యకారులకూ సమానంగా ఉపయోగపడుతుంది ఈ పుస్తకం” అన్నది ‘గుల్దస్తా మెరుపులు’ అన్న ముందుమాట రాసిన ఏనుగు నరసింహారెడ్డి అభిప్రాయం.
“మూడు దశాబ్దాల పైబడి తెలుగు కవిత్వ రంగంలో వచ్చిన పరిణామాల పరంపరను అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసాలు చదవడం అవసరం. అత్యాధునిక కవిత్వ ధోరణుల సారాన్ని, సారాంశాన్ని ఆకళింపు చేసుకోవాలంటే, ఈ వ్యాసాలు చదివి తీరాలి. 1990ల తరువాత తెలంగాణ నుంచి వందలాది మంది కవులు సాహిత్యరంగంలోకి వచ్చారు. వారి కవితా రీతులు, వారి కవిత్వంలోని వస్తువు, నిర్మాణం, అభివ్యక్తి, శైలీ విన్యాసం, భాషా వైవిధ్యం గురించి ఈ వ్యాసాలు విపులంగా వివరిస్తాయి” అని గుడిపాటి ‘కవిత్వ విమర్శ విస్తృతికి తోడ్పాటు’ అన్న ముందుమాటలో అభిప్రాయం వ్యక్తపరిచారు.
ఈ పుస్తకానికి ‘శతారం’ అని పేరు పెట్టడం వెనుక నేపథ్యాన్ని వివరిస్తూ రచయిత ‘కృతజ్ఞతాభివందనాలు’లో “ఆ ఆయుధానికి (వజ్రాయుధం) ఎంత శక్తి ఉందో, కవుల, రచయితల కలాలకు కూడా అంత శక్తి ఉంది. అందుకే ప్రతి రచన కూడా నా దృష్టిలో శతారమే. జీవనోత్సాహ సమరాన్ని జ్వలించే రచనే ‘శతారం’” అని రాశారు.
ఇందులోని 75 వ్యాసాలలో పలు సందర్భాలలో విమర్శకుడి హృదయం స్పష్టమవుతుంది. విమర్శ అంటే విశ్లేషణ. చీల్చి చెండాడటం. తప్పొప్పుల పట్టిక కాదు. కవి హృదయాన్ని గ్రహించి, కవితలో పొందుపరిచిన హృదయావేశాన్ని, అంతరంగ లోతులను తాను దర్శించి పాఠకులకు విశ్లేషించి వివరించటం విమర్శ పని. ఆ పనిని ఈ సంపుటి లోని వ్యాసాలలో విమర్శకుడు సంపూర్ణంగా నిర్వహించాడని అర్థమవుతుంది.
‘మట్టి మనుషులను ప్రేమించిన కవి’ అన్న వ్యాసంలో కవి రాజేశ్వరరావు ‘కందిలి’ కవితా సంపుటిలోని కవితలని విమర్శిస్తూ “కవి హృదయానికి ప్రేముండాలి. మనస్సుకు రెక్కలు మొలవాలి. ఒక దుఃఖం వెనుక ఒదిగిన కారణాన్ని పట్టుకోవాలి. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ద్రవించే భాషలోనే చెప్పాలి. అలోచనలు కల్గించాలి. లేకపోతే ఆ కవిత్వమెందుకూ పనికిరాకుండా పోతుంది” అంటాడు.
ఈ రకంగా ఈ సంపుటిలోని వ్యాసాలలో కేవలం తాను ప్రస్తావిస్తున్న కవి అంతరంగాన్ని ఒడిసిపట్టుకుని ప్రదర్శించటమే కాదు, కవితల లక్షణాలను, కవులకు ఉండాల్సిన లక్షణాలను, కవితా సృజనకు ఆవశ్యకమైన భావావేశం వంటి అనేకానేక విషయాలను విమర్శకుడు ప్రస్తావిస్తాడు. అంటే, ఈ పుస్తకం చదవటం కేవలం విమర్శా వ్యాసాల సంపుటి చదవటం మాత్రమే కాదు, కవిత రచనలోని మెళకువలను తెలుసుకోవటం కూడా అన్నమాట. కవులకు, కవితా ప్రేమికులకు, విమర్శకులకు అత్యంత ఆనందన్ని కలిగించే ఉపయోగకరమైన పుస్తకం ఇది.
***
రచన: గోపగాని రవీందర్ (9440979882)
వెల: ₹ 260/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
గోపగాని రమణశ్రీ, ఇంటి నెం 6-41/1A,
అంకితివాడ, లక్షెటిపేట,
మంచిర్యాల జిల్లా – 504215