శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-3

0
1

[శ్రీమతి మాలతీ చందూర్ గారి ‘హృదయనేత్రి’ నవలపై శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]ప్పటికి వారం రోజుల ముందే బులుసు సాంబమూర్తి గారి ఏకైక పుత్రుడు మరణించినా, ఆ దుఃఖాన్ని దిగమింగి సభలను విజయవంతం చేయడానికి ఆయన శ్రమించారని సరోజినీ నాయుడు గారు వేదికపైన ఆయనను శ్లాఘించారు.

ఈ సంఘటనలన్నీ కథలో భాగమే. ఆయా నాయకులందరూ పాత్రలే. ఎక్కడా పాఠకులకు అసహజం అనిపించదు. అవన్నీ ఆ కాలంలో నిజంగా జరిగినవే. కల్పనలు కావు. వాటిని సమయస్ఫూర్తితో కథలో ఇమిడ్చి, కథనాన్ని సుసంపన్నం చేశారు రచయిత్రి!

గోపాలం జీవితంలో రెండో దశ:

మొత్తానికి గోపాలరావును రాముడత్తయ్య, వాసుదేవరావు మామయ్యల నుంచి వేరు చేయగలుగుతుంది సుబ్బమ్మ గారు. అతనికి వడుగు చేస్తుంది. పెళ్లి చేయాలనీ పయత్నంలో ఉంటారు. తన పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి అత్తయ్య వాళ్లు ఉన్న – డా. బ్రహ్మజోస్యుల సుబ్రమణ్యంగారు స్థాపించిన గౌతమి సత్యాగ్రహ ఆశ్రమానికి వెళతాడు. అది రాజమహేంద్రవరానికి కాస్త దూరంగా ఉన్న సీతానగరంలో ఉంది.

అప్పుడు మామయ్య అతనికి ఇలా చెబుతాడు –

“పెళ్లికి భోగం మేళం పెడతారేమో వద్దని గట్టిగా ఎదిరించు. హరిజన నిధికి డొనేషన్ ఇమ్మని, అలక పానుపు మీద కోరుకో.”

అదీ మార్గదర్శనం అంటే! అత్తయ్య ఆయనను వారిస్తే, ఆయన ఇలా చెబుతాడు మళ్లీ! గోపాలం వ్యక్తిత్వాన్ని మరింత తీర్చిదిద్దే మాటలవి!

“గోపాలం, నీ మనసుకు నచ్చింది, నువ్వు నమ్మింది మనస్ఫూర్తిగా చెయ్యి. యెవ్వరికీ భయపడకు. మహాత్ముడు మనకందరికీ బోధించిన ప్రథమ సూత్రం అంతరాత్మకు వ్యతిరేకంగా పని ఏదీ చేయవద్దని..”

దీనినే మహాకవి కాళిదాసు, తన ‘అభిజ్ఞాన శాకుంతల’ కావ్యంలో’ దుష్యంత చక్రవర్తి చేత పలికిస్తాడు.

“సతాంహి సందేహ పదేషు వస్తుషు ప్రమాణ మంతఃకరణ ప్రవృత్తయః”

“సత్పురుషులకు ఏ విషయంలోనైనా సందేహం వచ్చినపుడు, దానిని నివృత్తి చేసుకోడానికి వారి అంతరాత్మ కంటే ప్రమాణం లేదు.”

తర్వాత మేనల్లుడిని – “ఆంధ్రరత్న దుగ్గిరాలవారికి జబ్బుగా ఉందిట, వెళ్లావా?” అని అడుగుతాడు.

“ప్రతి మనిషికి స్వతంత్ర వీరుడుగా బ్రతికే హక్కు ఉంది. ఆ హక్కుకోసం పోరాడడం ధర్మం. అదే ధర్మయుద్ధం. ఈ ధర్మయుద్ధానికి భార్యా పిల్లలు శృంఖలాలు కాకూడదు. వీటన్నిటి కంటే ఉత్తమమైన లక్ష్యం మన దేశ స్వాతంత్య్రం. అది మర్చిపోకు” అని తత్త్వబోధ చేస్తాడు మామయ్య. అది గోపాలానికి హృదయానికి హత్తుకుంటుంది. తర్వాత అతడు తన జీవితాన్ని మామయ్య నిర్దేశించిన పంథాలోనే నడుపుకుంటాడు.

ఇక్కడ మాలతీ చందూర్, యాంత్రికమైన తంతు (Mechanical Ritual)కీ, నిజమైన Motivation కి తేడాను అద్భుతంగా చెబుతారు.

“గోపాల్రావుకి, రెండేళ్ల క్రితం ఉపనయనం రోజున బోధించిన గాయత్రి మంత్రం జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు పురోహితుడు ఎన్నిసార్లు చెవిలో చెప్పినా తనకి గాయత్రి కంఠస్థం అవలేదు. బోధపడనూ లేదు. ఈ రోజు మామయ్య చెప్పిన మాటలు స్పష్టంగా అర్థం అయ్యాయి. ఒక్క మాట బీరు పోకుండా ప్రతి అక్షరం అతని హృదయంలో పదిలంగా నిల్చిపోయింది.”

ఆ మాటలే గోపాల్రావును కర్తవ్యోన్ముఖున్ని చేశాయి. వ్యక్తిగత బంధాలతో రాజీ పడకుండా తన లక్ష్యం వైపు పురోగమించేలా చేశాయి. చివరకు భార్య కూడా తనను అసమర్థుడని విమర్శించినా, తల్లిదండ్రులు దూరమైనా అతడు లెక్కచేయలేదు. మామయ్య చెప్పినట్లు అంతరాత్మకు విరుద్ధంగా ఏనాడూ అతడు నడుచుకోలేదు. ఒక విశిష్ట వ్యక్తిగా తనను తాను మలచుకోగలిగాడు గోపాలరావు,

ఇక్కడ మాలతిగారు గాయత్రీ మంత్రంతో పోలిక ఎందుకు తెచ్చారు? గాయిత్రీ మంత్రం నిస్సందేహంగా శక్తివంతమైనదే. కాని అది ఒక Ritual గా recite చేసినంత మాత్రాన దాని ప్రభావం ఏమీ ఉండదు. మామయ్య మాటలు Ritualistic కావు. Realistic. అందుకే ఉపనయనం కంటే, ఉపదేశం సమర్థవంతంగా అతని మీద పని చేసిందని ఆమె స్పష్టం చేశారు.

మామయ్య మరణం అతనికొక అశనిపాతం. అంతకు కొద్దిరోజుల ముందే ఆంధ్రరత్న దుగ్గిరాల వారు పరమపదించారు. ఆయనను చీరాల-పీరాల శివార్లలో దహనం చేశారు. ఆయన అంతిమ దర్శనానికి వేలాదిమంది తరలివచ్చారు. బందరు నుంచి గుంటారు వచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నాడు గోపాలరావు. దహన సంస్కారం చూశాడు.

“ఈసారి అగ్నికి ఆహుతి అవుతున్న మానవ శరీరం చూస్తున్నపుడు అతనికి భయం కలుగలేదు. మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఒక రకమైన జిజ్ఞాస-అతనిలో చోటు చేసుకుంది” అంటారు రచయిత్రి.

మరణం జిజ్ఞాసకు కారణం కావడం జీవితం పట్ల మరింత అవగాహనను కలిగిస్తుంది. తర్వాత మామయ్య మరణ వార్త తెలుస్తుంది. హుటాహుటీన సీతానగరం ఆశ్రమానికి తండ్రితో సహా చేరుకుంటాడు. మామయ్య పార్థివ శరీరం మీద కాంగ్రెస్ జెండా. మెడ నిండా, శరీరం నిండా ఖద్దరు పూలమాలలు. వారికి పిల్లలు లేరు. తానే చేస్తానంటాడు.

ఆచారాలు మానవ సంబంధాలను ఎలా శాసిస్తాయో రచయిత్రి ఇక్కడ చెబుతారు.

“తండ్రి బ్రతికే ఉన్నాడు. పెళ్లయి నెల రోజులే అయింది. అందుకని అతడు అర్హుడు కాడు” – అన్నారు.

రాముడత్తయ్య అంత దుఃఖంలోనూ కల్పించుకొని, “ఇక్కడున్న కాంగ్రెస్ వర్కర్లలో ఎవరో ఒకరు ఆయనకు తలకొరివి పెడతారు. ఆయనకు కులాలతో పట్టింపు లేదు. ఒక్క కాంగ్రెస్ కులం ఐతే చాలు” అంటుంది.

కర్మలలో కూడ వాసుదేవరావుకి నమ్మకం లేదు.

సుబ్బమ్మగారు దిగుతారు. రామలక్ష్మనమ్మను పరిపూర్ణమైన విధవగా చూడాలని ఆమె శాడిస్టు తరహ సరదా. ‘ఆడదానికి ఆడదే శత్రువు’ అన్నమాట సుబ్బమ్మగారికి సరిగ్గా సరిపోతుంది.

రాముడత్తయ్య ఇలాంటి మూఢాచారాలకు లొంగే వ్యక్తి కాదు. తమ్ముడింటికి గాని, వేరే ఎవరింటికి గానీ రానని ఆమె స్పష్టం చేసింది. తన వల్ల ఎవరికీ ఇబ్బంది రాకూడదని ఆమె సంకల్పం. తమ్ముడితో ఇలా చెబుతుంది.

“నాకు గాని మీ బావకు గాని ఈ మూఢాచారాల మీద నమ్మకం లేదు. మీ బావకి నేను మాట ఇచ్చాను. నా రూపు వికారంగా చేసుకోననీ, దేశ సేవ చేస్తానని. ఆయన కిచ్చిన మాట నిలబెట్టుకోవడం కంటే నాకు వేరే పుణ్యం లేదు.”

అదీ వ్యక్తిత్వమంటే! ఇంకా ఇలా అంటుంది తమ్మునితో –

“నేను ఆడదాన్ని కాదు. ప్రాణం ఉన్నమానవ దేహాన్ని. ఈ ప్రాణికి దేశ సేవ తప్ప మరో గమ్యం లేదు.”

“వీటన్నిటి మధ్య రవ్వంత మమకారం ఈ గోపాలం మీద ఉంది. వీడు నా ఆశయాలకి ఒక రూపం ఇస్తాడా, ఆనాడు నా పిల్లవాడు అనుకుంటా. లేదా, నేను ఏకాకిని.”

అత్తయ్య మాటలు గోపాలం బాధ్యతను మరింత పెంచాయి. ఆమె వీరేశలింగం గారి హోమ్‍కు వెళ్లిపోయింది.

గోపాలరావు పై చదువులు, రాజకీయ ఉద్యమాలలో అతని పాత్ర, జైలు జీవితం, విడుదల, అతని లోని అంతర్ముఖుడు:

దీనిని గోపాలరావు జీవితంలో తర్వాతి దశ అని చెప్పవచ్చు. విద్య, వివాహం, సంతానం, బైలు జీవితం ఇలా పెను మార్పులు సంభవిస్తాయి. కాని శ్రీమతి మాలతీ చందూర్, అతన్ని ఈ ట్రాన్సిషన్ సమయంలో అంతర్ముఖునిగా, ఒత్తిడులకు చలించని వానిగా, ఆందోళన చెందని వానిగా (unperturbed) అత్తయ్యమామయ్యలు తనకు నిర్దేశించిన గమ్యం నుండి వెంట్రుకవాసి (hair’s breadth) తప్పనివాడిగా, భార్యపిల్లలు అనే బంధం నుండి non-attachment సాధించిన వానిగా, స్వరాజ్యసిద్ధి కోసం తనవంతు దోహదం తాను నిర్మమంగా చేసేవానిగా (Contribution of his self) – ఆ క్రమంలో తన అంతరాత్మను మాత్రమే ప్రమాణంగా తీసుకొనేవానిగా చిత్రీకరించారు. ఈ కాలంలో అతనిలో మానసిక పరిపక్వత పెరుగుతుంది. లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదురుతుంది. త్యాగాన్ని, అతి సహజమైన అంశంగా భావిస్తాడు. ఒక పవిత్ర కార్యంలో; యజ్ఞంలో తాను కూడ ఒక సమిధగా వేల్చబడటాన్ని ఆనందంగా స్వాగతిస్తాడు. జైలు జీవితం కూడా, భౌతికంగా చాలా ఇబ్బందిని కలిగించినా, మానసికంగా గోపాలరావును పెద్దగా ఇబ్బందిపెట్టినట్లు మనకు అనిపించదు.

ఇక్కడ మనం గమనించాల్సింది రచయిత్రి లోని అసాధారణ పాత్ర చిత్రణా సామర్థ్యం. పైన చెప్పిన విషయాలను వేటినీ వాచ్యంగా నవలలో చెప్పదు. పరిస్థితులు, సంఘటనలు, వ్యక్తులు, వారి దృక్పథాలు, సంభాషణలు, చర్యల ద్వారా గోపాలరావు వ్యక్తిత్వం 3-dimensional గా మనముందు రూపుదిద్దుకుంటుంది.

వ్యక్తి నుండి విశ్వం వైపు:

(From Particular to General)

(From Personal to Universal)

కావ్యప్రయోజనాల్లో ఇది అతి ముఖ్యమైంది. రచయిత తాను చెబుతున్నది ఒక ప్రత్యేక వ్యక్తి గురించి అయినా, అతని ద్వారా ఒక విశ్వజనీనతను సాధించాలి. గోపాలరావు లాంటి సత్యాగ్రహులు, కుటుంబాన్ని, చదువును, కెరీర్‍ను త్యాగం చేసి దేశం కోసం బరిలో నిల్చినవాళ్లు, దేశమంతటా చాలా మంది ఉన్నారు. పురుషులే.. కాదు, స్త్రీలు కూడ! వారందరికీ ప్రతినిధి గోపాలరావు. అట్లే జానకమ్మ గారు, రాముడతయ్య, వాసుదేవరావు గార్లు. వీరంతా నాణేనికి ఒక వైపు, అంటే సకారాత్మక పార్శ్వంలో ఉంటారు.

ఇక నాణానికి మరో వైపు కూడా చూపాలి కదా! దాన్ని ఇంగ్లీషులో ‘other side of the coin’ అంటారు. అది సహజం గానే నకారాత్మకంగా ఉంటుంది. దీనికి ప్రతినిధులు సుబ్బమ్మ, బుచ్చి, నందయ్య, గోపాలరావు భార్య, ఆమె తండ్రి మొదలైనవారు.

ఇరువైపుల వారికీ మాలతీ చందూర్ సమానమైన ప్రాముఖ్యత ఇస్తూ వెళ్లారు. చెడు లేకపోతే మంచి ఎలా గ్లోరిఫై అవుతుంది? ఒకే దేశం, ప్రాంతం, సామాజిక పరిస్థితుల్లో మనుగడ సాగిస్తున్న మనుషుల భావజాలాల్లో, దృక్పథాల్లో ఇంత వైవిధ్యం, వైరుధ్యం ఉండటం ఆశ్చర్యం అనిపించదు. Human nature itself is diverse and complex అన్నారు కదా సిగ్మండ్ ఫ్రాయిడ్!

ఈ క్రమంలో ఎవరి Point of view ను వారు సమర్థించుకోవడాన్ని రచయిత్రి సమర్థవంతంగా చూపించారు. యద్భావం తద్భవతి! ఎవర్నీ ఆమె సమర్థించడం గాని, వ్యతిరేకించడంగాని చేయరు. వారందరి దృక్పథాలను నగ్నంగా మనముందు నిలబెడతారంతే! (Lay bare) expose చేస్తారంతే.. వారి క్యారెక్టర్సును మదింపు చేయాల్సింది, ఎవరు ఎవరో తేల్చుకోవాల్సింది మనమే, అంటే పాఠకులే! ఆ విధంగా కథనంలో, పాత్రచిత్రణలో, exposure లో శ్రీమతి మాలతీ చందూర్ ఒక unique objectivity (అసమాన నిష్పాక్షికత) ను ప్రదర్శించారు. అత్యుత్తమ సృజనాత్మకతకు కావలసిన ముఖ్య లక్షణం ఇదే!

ఈ నిష్పాక్షికత నవలలో ఎలా సాధించబడిందో పరిశీలిద్దాం.

గోపాలం ప్రయివేటుగా మెట్రిక్ పరీక్షకు వెళతానని తండ్రితో చెబుతాడు, నాగపూర్‍లో. తండ్రి సంతోషిస్తాడు, ‘కొడుకు మనుషుల్లో పడుతున్నాడ’ని.

అప్పుడే సైమన్ కమిషన్ బహిష్కరణోద్యమం ప్ర్రారంభం అవుతుంది. ఆ కవిషన్ సభ్యులందరూ ఆంగ్లేయులే! వారు పర్యటించి పరిశీలించే అంశాలు biased గానీ ఉంటాయని అందరికీ తెలుసు.

విశాఖలోని బుషికొండ తవ్వకాల్లో అక్రమాలను వెలికి తీయడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘సిట్’ని నియమిస్తే ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ‘సిట్’ లోని వారంతా ప్రభుత్వ ప్రతినిధులే కాబట్టి వారి findings ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయని, సి.బి.ఐ.కి విచారణను అప్పగించాలని డిమాండ్ చేశాయి. సైమన్ కమిషన్ కూడా అలాంటిదే.

బెజవాడలో జరిగిన ‘సైమన్  గో బ్యాక్’ ప్రదర్శనలో గోపాలరావు కూడా పాల్గొన్నాడు. అప్పుడు బెజవాడ పురపాలక సంఘం అధ్యక్షులుగా ఉన్నది కాళేశ్వరరావు గారు. ఇప్పటికీ ఆయన పేర విజయవాడలోని ‘కాళేశ్వరరావు మార్కెట్’ చాలా ఫేమస్. ఆయన బహిష్కరణ తీర్మానాన్ని తమ డఫేదారు ద్వారా, కలకత్తా రైల్లో వచ్చిన సర్ జాన్ సైమన్‍కు అందింపజేస్తారు. సైమన్ దాన్ని చదివి, ప్లాట్‌ఫారంపై గల కలెక్టరుకు ఇస్తాడు.

మరి నాగపూర్ ప్రయాణం? మెట్రిక్యులేషన్? అవన్నీ గోపాలరావుకు రెండవ ప్రాధాన్యతలే! సైమన్ గో బ్యాక్ ఉద్యమమే అతనికి మొదటి ప్రయారిటీ!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here