శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-5

0
1

[శ్రీమతి మాలతీ చందూర్ గారి ‘హృదయనేత్రి’ నవలపై శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]

[dropcap]ర[/dropcap]చయిత, విమర్శకులు, వీరిలో ఎవరు గొప్పవారు? అనే ప్రశ్నకు ప్రముఖ ఆంగ్ల సాహిత్య విమర్శకుడు మాధ్యూ ఆర్నాల్డ్ – తన ‘Study of Poetry’ అనే గ్రంథంలో వివరించారు. సాహిత్య విమర్శలో (literally criticism) అది తలమానికమైన గ్రంథం. ఇక్కడ, విస్తృతార్థంలో ‘Poetry’ అంటే ‘సాహిత్యం’ అని తీసుకోవాలి.

ఆయన, సాహిత్య విమర్శలో మూడు రకాల మదింపులను సూచించారు

  1. The Real Estimate
  2. The Historic Estimate
  3. The Personal Estimate

~

  1. నిజమైన మదింపు: ఇందులో ఎటువంటి పక్షపాత ధోరణి తీకుండా రచనను విశ్లేషించడం జరుగుతుంది.
  2. చారిత్రిక మదింపు: రచన యొక్క విలువ కంటే, దాని చారిత్రిక నేపథ్యాన్నే ప్రధానంగా తీసుకొని చేసేది.
  3. వ్యక్తిగత మదింపు: విమర్శలోని వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు, పాఠకుల వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా చేసేది.

ఆర్నాల్డ్ వారు మొదటి దానినే సరైన అంచనాగా తీర్మారించారు. రెండవది, మూడవది, లోపభూయిష్టమైనవే!

మాలతి గారి హృదయనేత్రిని గమనిస్తే, లోతుగా పరిశీలిస్తే, స్వాతంత్ర పోరాటాన్ని నిజాయితీగా’ – ‘as is and where is’ (ఉన్నది ఉన్నట్లు) గా చిత్రీకరించడమే ఆమెకు ముఖ్యం. అందులోని Pros and Cons ను నిర్ణయించుకోవాల్సింది పాఠకులూ, విమర్శకులూ. నిజాయితీఅన్నది రచయితకి ఉండవలసిన ప్రధాన లక్షణం. స్వాతంత్ర్య సమరంలో, సమాజంలోని అన్ని వర్గాలవారూ, తమ వంతు కృషిచేశారని చెప్పడమే ఆమె లక్ష్యం. బ్రాహ్మణులు సమాజంలో ‘unconstructive and unproductive’ వర్గమని కదా కమ్యూనిస్టుల వాదన! అది అపోహ మాత్రమే అని నిరూపించారు రచయిత్రి. ఆ వాదనను పూర్వపక్షం చేశారు. అలా అని బ్రాహ్మణులంఅతా సచ్చీలురు, నిస్వార్థపరులు అని ఆమె నవలలో చెప్పలేదు. వారిలో కూడ సుబ్బమ్మ, బుచ్చి, గోపాలరావు మామగారు, బావమరుదులు, భార్యలాంటి వారుంటారని unbiased గా చూపారు. అట్లే దళితులందరూ పీడితులు కారని, ఎదిగింతర్వాత తమ వర్గాన్నే వారు దూరం పెడతారని నందయ్య పాత్ర ద్వారా స్పష్టం చేశారు. దీనినే unbigoted, honest writing అంటారు. ‘creative genius’ కావాలంటే ఇది అత్యావశ్యకం. మాలతి గారు నిస్సందేహంగా సృజనాత్మక మేధావే!

“Creative and critical genius లలో ఖచ్చితంగా మొదటివారే గొప్ప” అని మాథ్యూ ఆర్నాల్ట్ ధృవీకరించారు. మన సంస్కృత సాహిత్య విమర్శకులు రచయితను కవిని మరింత గ్లోరిఫై చేశారు.

“అపారే కావ్యసంసారే, కవిరేవ ప్రజాపతిః” అన్నారు.

కవిని సృష్టికర్త, బ్రహ్మదేవుడన్నారు.

“రవి గాంచనిచో కవి గాంచునే కదా!” అన్నారు. సూర్యరశ్మి కూడ స్పృశించలేని అంశాలను (లోతైనవని అర్థం) సృజనశీలురు వివరించగలరు.

***

రాముడత్తయ్య రాసిన ఉత్తరం గోపాలరావులో చైతన్యాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఆమె తాను మహత్ముని బృందంలో, వలంటీరుగా చేరినట్లు తెలుపుతుంది. ఆయన హిందీ ఉపన్యాసాలను, ఆమె, ఆయన ఆంధ్రదేశ పర్యటనలో, తెలుగు లోకి అనువదించి చెబుతున్నానని వ్రాసింది. భర్త పోయిన దుఃఖంతో కుములకుండా, జీవితాన్ని సార్థకం చేసుకుంటూన్న ధన్యజీవి ఆమె! తన ఉత్తరంలో తనకు ఆత్మధృతికలిగిందని రాసింది. ఆ పదం చాలా గొప్పది. మాలతి గారే అలాంటి పదాలను వాడగలరు.

‘ఉప్పు సత్యాగ్రహం’ యావత్ భారతాన్ని కంపింపచేసింది. కానీ, భార్య పార్వతి కోసం గోపాలరావు Passive గా ఉన్నాడు. పరీక్షలయ్యేంత వరకు ‘పోరాటాల’ జోలికి వెళ్లనని అమెకు మాట ఇచ్చాడు. పైచదువుల పట్ల అతనికి అంత ఉత్సాహం లేదు. ఎంత చదివినా, తెల్లవారి క్రింద ఊడిగం చేయాల్సిందే కదా! అనుకుంటాడు. అతని భార్యా విధేయత్వం తాత్కాలికమే. మౌలికంగా అతడు స్వరాజ్య సమర విధేయుడు! ఉప్పు సత్యాగ్రహం సంవత్సరం పాటు మమ్మురంగా సాగింది.

‘గాంధీ ఇర్విన్ ఒడంబడిక’ ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం, కొన్ని అధికారాలను ఇచ్చింది ప్రజలకు. కాని ఆ అగ్రిమెంట్ ఆచరణలో అమలు కాలేదు.

మహత్ముడు ప్రజలను ‘సామూహిక శాసనోల్లంఘనం’ కాక ‘వ్యక్తిగత శాసనోల్లంఘనం’ చేయమని ఆదేశించాడు. గోపాలరావు కల్లుపాక దగ్గర పికెటింగ్‌లో పాల్గొంటూ ఉండగా, పోలీసులు లాఠీఛార్జి చేశారు. తలకి దెబ్బ తగిలింది. రాజమండ్రి జైలుకు పంపారు. అక్కడి నుంచి కడలూరుకు మార్చారు.

తాత్కాలికంగా భార్య అనే బంధం వెనక్కిలాగినా, త్వరగానే అందులోంచి బయటపడి కర్తవ్యోన్ముఖుడైనాడు గోపాలరావు, వాసుదేవరావు మామయ్య, తను పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వెళ్లినపుడు చెప్పిన ఉద్బోధ అతనికి గాయత్రి మంత్రం కంటే విలువైనది!

జైలు జీవితం, విడుదల, సంఘర్షణ

మూడేళ్ల శిక్ష అనుభవించాడు గోపాలరావు, సి. క్లాస్ ఖైదీగా.

సి క్లాస్ ఖైదీల దుఃస్థితిని ఇలా వర్ణిస్తారు రచయిత్రి.

“దోమలు, మురికి, ఉడికి ఉడకని తిండి. నల్లులు, ఇరవైనాలుగు గంటలూ లెట్రిన్ నుంచి వచ్చే దుర్వాసన.. చాలా దుర్భరంగా ఉండేవి పరిస్థితులు..”

ఆందోళన, నిరాహార దీక్ష, సత్యాగ్రహం తర్వాత సి. క్లాస్ ఖైదీలను వంట చేసుకునేందుకు అనుమతించారు.

ఈ జైలు జీవితాన్ని వర్ణించడంలో ఎంతో పరిశోధన చేసి ఉంటారు రచయిత్రి. ఆమె చెప్పే విషయాలు hypothetical (ఊహాజనితాలు) కావనీ, authentic అనీ (విశ్వసనీయమైనవనీ) మనకు అర్థమవుతుంది. దీనినీ ‘down to earth’ అంటారు విమర్శకులు.

ఖైదీలు విద్యావంతులు, చైతన్యవంతులు కాబట్టి, ఎ. బి. క్లాస్ ఖైదీల నుంచి పుస్తకాలు తెచ్చి చదువుకునేవారు. సంస్కృత, తమిళ భాషలు నేర్చుకునేవారు. అలా జైలు జీవితాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడంలో వారు వారి నాయకల నుండి స్ఫూర్తి పొందారని చెప్పవచ్చు. ఎందుకంటే జాతీయ నాయకులందరూ జైళ్లలోనే మంచి పుస్తకాలు రాశారు. అక్కడి నుంచే తమ అనుయాయులకు దిశానిర్ధేశం చేసేవారు.

గోపాలరావు జైలు నుంచి విడుదలవుతాడు. భార్య, తండ్రి అతన్ని ‘రిసీవ్’ చేసుకుంటారు. గోపాలరావు కొడుక్కి ఇప్పుడు మూడేళ్లు. పుట్టినప్పటి నుండి వాడు తండ్రిని చూడనే లేదు. రచయిత్రి ఈ సందర్భంలో ఇలా అంటారు –

“తల్లి చిటికెనవేలు పుచ్చుకు నిల్చున్న మూడేళ్ల పిల్లవాడు ఈ ‘కొత్త వ్యక్తి’ వైపు భయంగా చూస్తున్నాడు”.

గోపాలరావు జైలుకు వెళ్లేసరికి పార్వతి బాలింతరాలు. మూడు నెలల పసివాడికి తల్లి. ‘ఆమె అవసరాలను గుర్తించకుండా ఈ మహాయజ్ఞంలో దూకాడు. ఆమె తన గురించి ఏమనుకుని ఉంటుంది?’

ఇది ఒక పార్శ్వం.

‘జైలు జీవితం తనకి సుఖం ఇవ్వలేదు. కాని మానసికంగా ఒక తృప్తి.  మాతృదేశం కోసం పోరాడుతున్నానన్న గర్వం, తనకి పరిపూర్ణత ఇవి ఇస్తున్నాయి’.

ఇది రెండవ పార్శ్వం.

గోపాలరావు ఆలోచనల లోని పరస్పర విరుద్ధమైన ఉభయ పార్యాలను మన ముందుంచడం ద్వారా రచయిత్రి, ఉద్యమ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి ఉన్న తేడాను చూపారు. ఒక ఉద్యమం కోసం వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసేవారెవరికైనా ఈ మానసిక సంఘర్షణ తప్పదు.

ఇంట్లో ఆమెను దగ్గరకు తీసుకుంటాడు. ఆమె వారిస్తుంది. అతని ఆరోగ్యం బాగోలేదంటుంది.

“గోపాలరావుకు పట్టరాని కోపం, పౌరుషం, వెంటనే జాలి కూడ కలిగాయి.”

అద్భుతమైన వాక్యం ఇది. జాలి కూడ కలిగిందట! ఎవరి మీద? భార్య మీద లేక తన మీద తనకేనా? తర్వాత ఆమె burst అవుతుంది! ఆమె ఆక్రోశాన్ని అతి సహజంగా చిత్రీకరించారు రచయిత్రి. పార్వతి స్థానంలో ఎవరున్నా అలాగే పవర్తిస్తారు.

దానికి భర్త స్పందన..

“నన్ను క్షమించు పార్వతీ. దేశమాత పిలుపుముందు..”

అలా అర్ధోక్తిలో ఆపడం కూడా అతని లోని నిస్సహాయతను (అపరాధ భావం కాదు) సూచిస్తుంది.

ఆడవారు, సగటు భార్యలు, ఉద్యమకారులను ఎలా సాధిస్తారో చూడండి.

“దేశమాత పిలుపు ముందు.. పెళ్లాం పిలుపు ఎందుకు వినిపిస్తుంది లెండి? మీలాంటి

వాళ్ళు పెళ్లెందుకు చేసుకోవాలి? పిల్లల్ని..” మళ్లీ ఏడ్చింది!

చివరికి అతన్ని ‘కమిట్’ చేయించాలని చూస్తుంది. దేశసేవ చేయనని కాయితం రాసివ్వమంటుంది. అప్పుడు వాళ్ల నాన్న అతనికి ఉద్యోగం ఇప్పిస్తాడు. హాయిగా బ్రతకొచ్చునట!

అతని కమిట్‍మెంట్ ఆమెకు ఎందుకూ పనికిమాలినది. కాని అతనికి? భార్య దుఃఖం అతనిలో ఏ మార్పూ తేలేకపోయింది. మానసికంగా, శారీరికంగా సుశిక్షితుడైన సత్యాగ్రహి అతడు. ఇక్కడ మాలతి గారి కలం పదునెక్కుతుంది. విరోధాభాసాలంకారంలో గోపాలరావు మానసిక స్థితిని ఆమె అద్భుతంగా వర్ణించారు. ఇంతకంటే ఉద్యమ స్ఫూర్తికి తార్కాణం ఏముంటుంది?

“గోపాలరావుకి – ఆ మెత్తని పరుపు, ఆ గది, ఆ పరిసరాలు, కిటికీలోంచి పడుతున్న చంద్ర కాంతి ఇవన్నీ సంకెళ్ళులా తోచాయి.”

అంతవరకు బానే ఉంది. కాని,

“జైలు లోని ఆ కటికనేల, వాసన కొట్టే ఆ గొంగళి, ఆ దోమలు, అవన్నీ, సుఖంగా, చెయ్యి జారిపోయిన ఆత్మీయుల్లా తోచాయి!”

ఇదీ మాస్టర్ స్ట్రోక్! కమిట్‌మెంట్‌కు పరాకాష్ఠ! కుటుంబాన్ని బుద్బుదప్రాయంగా తృణీకరించగల మానసిక శక్తి! రాముడత్తయ్య తన ఉత్తరంలో ప్రస్తావించిన ఆత్మధృతి’! సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారంటీ ఇవ్వరా మరి? ఇంకొరయితే భార్య ఏడుపుకు, లాలనకు, చాలా రోజుల తర్వాత దొరికిన ఏకాంతానికి లొంగిపోయేవారు. కానీ గోపాలరావు నిశ్చల మనస్కుడు. ధృడచిత్తుడు,

తనవారి ధోరణి చూస్తూంటే, అతనికి ఆశ్చర్యంవేస్తుంది . పరోక్షంగా రచయిత్రి, అలాంటి సంకుచిత స్వార్థ, అపరిపక్వ మానసిక స్థాయి నుండి బయటపడలేని, పైపెచ్చు ఉన్నత మానసిక స్థాయివారిని అసమర్థులుగా పరిగణించి, నిష్ప్రయోజకులని పరిహసించేవారిని, అందరినీ తూర్పారబట్టారు తమ నవలలో. గోపాలరావు తనలో వేసుకున్న ప్రశ్నలు, ఆమె అలాంటి దేశద్రోహులకు సంధించిన సూటి ప్రశ్నలు. వ్యక్తి నుండి సమాజానికి, ప్రాంతం నుండి విశ్వానికి ఎదగలేని కుక్కమూతిపిందెలు వాళ్లు. ఆ ప్రశ్నలు ఇవి:

  1. వేలాది సంఖ్యలో జైళ్లలో మగ్గుతున్న స్వాతంత్ర్య వీరులు అందరూ ఏ లక్ష్యంతో అన్నింటినీ త్యాగం చేశారు?
  2. తిండి, బట్ట, ఉద్యోగం, ఇవేనా మనిషికి గమ్మం?
  3. సరోజినీ నాయుడు, కస్తూరి బా, జానకమ్మ గారు, రాముడత్తయ్య, వీళ్ల ఆలోచనా విధానంలో, తన భార్య ఆలోచనా విధానంలో ఎంత తేడా?
  4. ప్రతి వ్యక్తి తన స్వంతలాభం మటుకే చూసుకుని, మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతకటం సాధ్యమా?

స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారెవ్వరూ ఈ పశ్నలకు సమాధానం చెప్పనవసరం లేదు. చెప్పాల్సిన వారు పాల్గొననివారే. పాల్గొంటున్న వారిని విమర్శించేవారే.

స్వాతంత్ర్య సమరం ఒక ఎత్తు ఐతే, స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత దాన్ని సాహిత్యంగా, చరిత్రగా రచించి, తర్వాత తరాలవారికి దాని విలువను, స్ఫూర్తిని చాటి చెప్పిన వారు ఒక ఎత్తు. వారికి కూడా జాతి ఋణపడి ఉంటుంది. సినిమాలు కూడ మొదట్లో ఈ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి దోహదం చేశాయి. సాహితీవేత్తల్లో, ఈ నేపథ్యంలో రచన చేసి తన చిత్తశుద్ధిని చాటుకున్న శ్రీమతి మాలతీ చందూర్ అగ్రభాగాన నిలుస్తారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, ‘అల్లూరి సీతారామరాజులాంటి కళాఖండాలు అజరామరంగా నిలుస్తాయి. కాని విశాఖ జిల్లాలోని కృష్ణదేవిపేటలో అల్లూరి వారు అసువులు బాసిన చోట గల స్మారక చిహ్నంగాని, ఆ మహనీయుని సమాధి గాని, ఉన్న దయనీయస్థితిని చూస్తే, స్వాతంత్ర్య పోరాటాన్ని సినిమాలుగా తీసి కోట్లు సంపాదించిన, కీర్తి గణించినవారు, ఆ మాత్రం ఆ ప్రాంతాన్ని అభివృద్ధిపరచ లేకపోయారే అని ఆవేదన కల్గుతుంది. లగాన్అనే హిందీ సినిమా కూడా గొప్పదే. పన్ను మాఫీ కోసం పందెం కాసి, బ్రిటిష్ వారితో, తమలే మాత్రం అనుభవం లేని క్రికెట్ ఆడి గెలిచిన గ్రామీణుల కథ అది.

రాను రాను స్వాతంత్య్ర పోరాటం సినిమావారికి కాసులు రాల్చే ‘saleable commodity’ గా మారటం అంత ఆశ్చర్యమనిపించదు. వ్యాపారమే పరమావధి ఐనవారికి కళరెండో ప్రాధాన్యతను సంతరించుకొంటుంది. అహింసా సిద్ధాంతం, సత్యాగ్రహం, సహాయనిరాకరణం లాంటి ఉదాత్తమైన అంశాలతో సుసంపన్నమైన ఆ పోరాటాన్ని రౌద్రం, రుధిరం (ఇంకా నయం, రౌరవం అనలేదు) అంటూ పేర్లు పెట్టి, దేశకాల పరిస్థితులలో ఏ మాత్రం పొంతన లేని, ఇద్దరు సమర వీరులను అందులో ప్రధాన పాత్రలను చేసి, మాస్ మసాలాలను జొప్పించి, సంగీతాన్ని, సాహిత్యాన్ని, నృత్యాన్ని అత్యంత చౌకబారు స్థాయికి తీసుకెళ్లి, పైరవీలు, లాబీయింగ్లు చేసి, అంతర్జాతీయ వేదికల వరకు దానిని మోసి, అదే ఏకైక కళాఖండమైనట్లు మీడియా, ఒక వర్గం ప్రేక్షకులు దాన్ని, దేశంలోని ఉన్నత స్థాయిలోని వారితో సహా భట్రాజుల్లాగా పొగడుతూ ఉంటే, కళకు పట్టిన దౌర్భాగ్యాన్ని తలుచుకునే right thinking people కు వేదన కలుగుతుంది.

ముదిరిన నిరాదరణ గోపాలరావును మరింత మోటివేట్ చేసింది, తన లక్ష్యం వైపు. అతనికీ అతని భార్యకూ మధ్య ఒక మంచుతెర. తను కట్టుకునే ఖద్దరు బట్టలని గోనె పట్టలని వేళాకోళం చేసే బావమరదులు. బెజవాడ చేరుకున్నాడు.

తమ్ముడు రెవెన్యూ బోర్డులో ఉద్యోగి. త్వరలో తహసీల్దారు అవుతాడు. అతని అత్తవారు స్థితిపరులు. బుచ్చి కనీసం అన్నయ్యను పలకరించ లేదు.

తండ్రి కూడ భార్య పాడిన పాటే పాడాడు. మళ్లీ ఉద్యమంలోకి వెళ్లనన్ని రాసిస్తే, తమ్ముడతనికి ఉద్యోగం వేయిస్తాడు. తల్లి సుబ్బమ్మ సాధింపు మొదలు పెట్టింది. మళ్లీ వదినగారిని నిందించింది.

“అసలు ఈ కొంపకు చిచ్చుపెట్టింది ఆ మహాతల్లి కాదా అని? ఏమీ తెలియని పసివాడికి స్వతంత్రం అంటూ నూరిపోసి, తను చెడి, నిన్నూ నాశనం చేసింది. సర్వనాశనం అయిపోయింది. ఏం బావుకుందని?” (పుట 85)

“సంబంధం లేని అత్తయ్య నెందుకు లాగుతావ్?” అన్న గోపాలరావు ప్రశ్నకు సుబ్బమ్మగారు వెలిబుచ్చిన ఆక్రోశం ఇది!

రాముడత్తయ్య ఇల్లు, పొలం జప్తు చేశారని తండ్రి చెప్పాడు. ఆమె ఆరోగ్యం బాగలేదని, సబర్మతి నుంచి సీతానగరం వచ్చి ఉందనీ చెబుతాడు వెంకట్రామయ్య. తమ ఆస్తికి కూడా అదే స్థితి రాబోతుంటే గోపాలానికి తమకూ తెగతెంపులయిందని, కలెక్టరుకు అర్జీ పెట్టి, పల్లెటూళ్లో ఇంటిని, పొలాన్ని కాపాడుకున్నారట.

వెంటనే సీతానగరం బయలుదేరాడు గోపాలరావు.

రాముడత్తయ్య, సుబ్బమ్మగారు వర్ణించినంత దైన్యావస్థలో లేదు.

“మనిషి అనారోగ్యగా ఉన్నా, ఆమె కళ్ళు తేజంతో, ఆత్మస్థయిర్యంతో మెరుస్తున్నాయి.” (పుట 87)

అంటారు రచయిత్రి ఆమెను గురించి.

చిన్నపిల్లవాడిలా ఆమె ఒళ్లో తలపెట్టుకున్నాడు. ఆమె అతని వీపు రాస్తూంటే, ఆ స్పర్శ అతనికి ధైర్యము, ఆత్మశక్తీ యిస్తోంది. ఆమె దగ్గరకు రావడం వల్ల, అంతవరకూ అతను అనుభవించిన మానసిక సంఘర్షణ మటుమాయమైంది. కష్టాలు సంస్కారవంతుల్ని, మరింత తేజోవంతుల్ని చేస్తాయనడానికి రాముడత్తయ్యే ఉదాహరణ. అందుకే కాబోలు విలియమ్ షేక్‌స్పియర్ అన్నారిలా.

“Sweet are the uses of adversity”.

“ఇక్కట్ల ప్రయోజనాలు మిక్కిలి మధురమైనవి.”

రాముడత్తయ్యను ఆ స్థితిలో రచయిత్రి వర్ణిస్తూంటే మనకు ఆమె పట్ల ఆరాధనా భావం రెట్టింపు అవుతుంది.

“రామలక్ష్మమ్మ చిరునవ్వు నవ్వింది. ఆమె కళ్లల్లో నైరాశ్యత లేదు. మహాత్ముని నీడ ఆమెకి స్థిరత్వాన్ని, కరుణనీ సంతరించి పెట్టాయి. మూడేళ్ల జైలు జీవితం ఆమె హృదయాన్ని.. బండరాయి చేయలేదు. నవనీత సదృశం చేసింది.” (పుట 87)

స్థితపుజ్ఞతకు ప్రతిరూపంగా నిలుస్తుంది, ఈ మాటలవల్ల, రాముడత్తయ్య, మన ముందు. పరమాత్మ గీతలో సెలవిచ్చినట్లుగా

‘దుఃఖేష్వను ద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః

వీతరాగ భయక్రోధః స్థితధీర్ముని రుచ్యతే’

(భగవద్గీత రెండవ అధ్యాయం, 56వ శ్లోకం.)

‘కష్టముల యందు కుంగని వారు, సుఖముల యందు పొంgaనివారు స్థిత ధీమంతులైన మునులు.’

రాముడత్తయ్యను అటువంటి ఋషితుల్యురాలిగా అత్యున్నతంగా, ఉదాత్తంగా రూపుదిద్దారు శ్రీమతి మాలతీ చందూర్.

అదే స్థిరచిత్తంతో, స్థితమేధతో, ఆత్మధృతితో మేనల్లుడికి కర్తవ్య బోధ చేస్తుంది ఆమె దిశానిర్దేశం చేస్తుంది. గమ్యాన్ని చూపిస్తుంది. ఆ మాటలు అతనికే కాదు, ఉద్యమ జీవితానికీ, వ్యక్తిగత జీవితానికి మధ్య నలిగిపోతున్న ఎందరో సత్యాగ్రహులకు కరదీపికలు!

“బంగారాన్ని కొలిమిలో కాల్చి, సమ్మెటతో కొడతారు. ఎన్ని దెబ్బలు పడితే అంత మృదువుగా ధృడంగా అవుతుంది. సత్యాగ్రహీ అంతే! జైలు కెళ్లివచ్చినంత మాత్రాన నీ బాధ్యత తీరిపోలేదు. ముందు చెయ్యాల్సింది ఎంతో ఉంది. మహాత్ముడు చూపించిన బాటలో నడువు. పల్లెప్రాంతాలో గల మన అమాయక ప్రజలకు దేశభక్తి, స్వాతంత్రేచ్ఛ బోధించు. చెయ్యాల్సిన నిర్మాణ కార్యక్రమం చాలా ఉంది.”

అత్తయ్య మాటలు అతనిలోని లక్ష్యసిద్ధిని ద్విగుణీకృతం చేశాయి. చీరాల చేరుకున్నాడు. ఊరి బయట ఒక పాక వేసుకొని నియమవంతమైన ఆశ్రమ జీవితం గడపసాగాడు. పిల్లలకు చదువు నేర్పిస్తున్నాడు. రాట్నం వడుకుతున్నాడు. మాలతమ్మ ఇలా అంటారు.

“రైలులో చదివిన రస్కిన్ ‘Unto the Last’ పుస్తకంలోని ప్రబోధం, కాయకష్టంలో గల ఆత్మగౌరవాన్ని పూర్తిగా ఆచరణ పెడుతున్నాడు” (పుట 88).

సత్యాగ్రహులు తమ జైలు జీవితంలో పుస్తక పఠనం ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తారు.

జాన్ రస్కిన్ రాసిన ‘Unto the Last’ అనే పుస్తకం మహాత్మునిపై కూడా పరోక్షంగా ప్రభావం చూపింది. దాన్ని ఆయన ‘అంత్యోదయ’ అనీ అర్థంలో స్వీకరించారు. సర్వోదయ సిద్ధాంతాన్ని తన జీవిత లక్ష్యంగా స్వీకరించడంలో రస్కిన్ భావజాలం ఆయనకు సాయం చేసింది. సంపదను గురించి రస్కిన్ ఇలా ఉన్నారు.

“wealth can only be acquired under certain moral conditions, such as honesty and Justice.”

“నిజాయితీ, న్యాయం లాంటి నైతిక విలువల ద్వారా మాత్రమే సంపదను సమకూర్చుకోవాలి”

దీనినే మన భారతీయ సనాతన ధర్మం ‘అన్యాయార్జిత విత్తము’ విషంతో సమానమని పేర్కొంది. ఆడమ్ స్మిత్, జాన్ స్టూవార్ట్ మిల్ లాంటి ఆర్థికవేత్తల సిద్ధాంతాలను రస్కిన్ విమర్శించారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్‍ను గ్లోరిఫై చేశారు.

గాంధీజీని బాగా ప్రభావితం చేసిన గ్రంథాలు:

  1. The Kingdom of God is within you – Leo Tolstoy
  2. Unto the Last – John Ruskin
  3. Civil Disobedience – Henry Jacob Thoreau

1904లో జాన్ రస్కిన్ రచన Unto the Last చదివారు గాంధీజీ. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న ఆయన భావజాలం మహాత్ముని ఆకర్షించింది. డర్బన్ దగ్గర ఫొనెక్స్ అనే చోట ఆయన తన స్నేహితులలో కలిసి ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించి, శ్రమైక జీవన సౌందర్యంలోని మాధుర్యాన్ని తెలుసుకున్నారు. ఆరు సంవత్సరాల తర్వాత, గాంధీజీ ఆధ్వర్యం, పర్యవేక్షణతి లోనే జోహన్స్‌బర్గ్ వద్ద మరొక కాలనీ ఏర్పడింది. దానికి టాల్‌స్టాయ్ పేరు పెట్టారు.

రస్కిన్ విక్టోరియన్ ఏజ్ (1819-1900) కు చెందిన గొప్ప Prose writer, Painter మరియు విమర్శకుడు. ‘Unto the Last’ అనే వ్యాసం నాలుగు భాగాలుగా, 1860లో ‘CORN HILL MAGAZINE’ అనే మాసపత్రికలో ప్రచురింపబడింది.

‘గద్యం కవీనాం నికషం వదన్తి’ అని సంస్కృత లాక్షణికులు చెప్పారు. ‘కాదంబరి’ రాసిన బాణభట్టు, ‘దశకుమార చరిత్ర’ రాసిన దండి, ‘సాక్షి’ ఉపన్యాసాలు వ్రాసిన పానుగంటి, ‘గణపతి’ వ్రాసిన చిలకమర్తి, ‘పంచతంత్రము’ వ్రాసిన పరవస్తు చిన్నయసూరి దీనికి ఉదాహరణలు. నికషం అంటే గీటురాయి. ఒక కవి ప్రతిభ అనే బంగారాన్ని నిగ్గు తేల్చే గీటురాయి గద్యమే అని వారన్నారు. ఆయన prose ఇలా ఉంటుంది.

“Victorian England has become a manufactures of rogues, by tolerating the social conditions that make crime inevitable.

Let us reform our schools and we shall find little reform needed in our prisons”

– Ruskin’s Footnote.

గాంధీజీ ఈ గ్రంథాన్ని 1908లో గుజరాతీ భాషలోకి అనువదించారు. భగవద్గీతలోని ‘యోగః కర్మసు కౌశలమ్’ అన్న సిద్ధాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది రస్కిన్ సిద్ధాంతం. తాను చేసే పని ఏదైనా సరే, దాన్ని నిజాయితీగా నేర్పుగా చేయగలిగిన వాడు ఎవరైనా ‘యోగి’ అని పరమాత్మ చెప్పి ఉన్నాడు.

అటువంటి గొప్ప గ్రంథాన్ని జైలులో చదివి, గోపాలరావు స్ఫూర్తిని పొందాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here