శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-8

0
2

[శ్రీమతి మాలతీ చందూర్ గారి ‘హృదయనేత్రి’ నవలపై శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap] రాత్రి బాణసంచాల శబ్దాలతో చాలామంది నిద్రపోలేదు. కానీ గోపాల రావుకు రాత్రంతా నిద్ర పట్టక పోవడానికి కారణం మాత్రం అది కాదంటారు మాలతి.

“ఈ దేశం ఏమైపోతుందోనన్న మనోవేదన! ప్రభంజనంలా వీస్తున్న మతకల్లోలాలూ, అసహనం, క్రోధం.. ఇవి ఈ స్వాతంత్య్రాన్ని ఎక్కడికి తీసుకోపోతున్నాయనే బాధ!” (పుట 108)

దీనినే ‘భావి దర్శనం’ అంటారు. ఒక క్రియేటివ్ జీనియస్‌కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఇది. ‘దార్శనికత’ అనేది కావ్య ప్రయోజనాల్లో ఒకటి. గోపాల రావు లాంటి సమరయోధుల ద్వారా, దేశంలో జరుగబోయే పరిణామాలను ఆమె సూచించారు.

గోపాల రావు విజయోత్సాహలలో పాల్గొనలేదు. కాందిశీకులకు ఇతోధిక సేవ చేయాలని ఎంత చెప్పినా వినకుండా ఢిల్లీ వెళ్లాడు.

“భారత రాజధాని నవ్వటం మర్చిపోయింది. ఎక్కడ చూసినా శోకం, భయం” (పుట 109)

ఈ రెండు వాక్యాలు చాలు, Post-Independence India పరిస్థితిని చెప్పడానికి. హిందూ ముస్లింల సయోధ్య కోసం మహాత్ముడు నిరాహర దీక్ష ప్రారంభించాడు. కోట్లాది భారతీయులు ‘నిస్సహాయంగా’, ‘దూరంగా’, ‘దానిని’ ‘చూస్తూ’ ఉండేవారు.

ఈ పై వాక్యంలో ‘నిస్సహాయంగా’ అనే పదంతో చాలా ‘వెయిట్’ పెట్టారు మాలతి. అలా చూస్తున్నవారిలో గోపాల రావు కూడా ఉన్నాడు. నవలకు అతడు Protagonist (ముఖ్యపాత్ర) అయినా, దేశ పరిస్థితుల్లో అతడూ కోట్లాదిమందిలో ఒకడు మాత్రమే. అందుకే అతనిని ‘మహాసముద్రంలో నీటి బిందువు’తో పోల్చారు రచయిత్రి.

“ఒకవేళ గాంధీజీ ప్రాయోపవేశం చేస్తే? ఆయన అహింసావాదం, నిరాహారదీక్ష అనేవి ఎంత పదునైన ఆయుధాలో మరొకసారి ఋజువయింది.”

స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏర్పడిన catastrophe (గడ్డు పరిస్థితి) ని మనముందు ఆవిష్కరించటానికి, మాలతీ చందూర్ ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని ఎంతో జాగ్రత్తగా, బాధ్యతగా వాడారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ పరిస్థితిలోని సీరియస్‌నెస్ (వ్యగ్రత) తేలిపోతుంది. ·

మొత్తానికి ఇరువర్గాల, దేశాల మధ్యా ఒక అవగాహన, సానుభూతి ప్రకటితమవగా, గాంధీజీ జనవరి 18న తన నిరాహారదీక్షను విరమించారు.

ఒక హిస్టారికల్ ఫిక్షన్‌ను రాసేటప్పుడు, chain of events ను వర్ణించేటప్పుడు, chronological order ను రచయిత maintain చేయాలి. దానిని అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు రచయిత్రి. సంఘటనలు జరిగిన తేదీలను authentic గా ఉటంకించారు. దీని వల్ల రచనకు credibility పెరుగతుంది. ఇది నవల మొదటనుండి మనకు కనబడుతుంది. దీని వల్ల “ఇది కేవలం ఫిక్షన్ మాత్రమే కాదు, actual history కూడా!” అని మనకు ఎప్పటికప్పుడు విశదమవుతూ ఉంటుంది.

కాని ఆ సయోధ్య శాశ్వతం కాదని రచయిత్రి చెబుతారు. ఆ తాత్కాలిక ప్రశాంతతను ఆమె ఒక అద్భుతమైన Metaphor (రూపకం) ద్వారా ఆవిష్కరించారు. ఉపమ (Simile) కంటె రూపకం (metaphor) ను ఉపయోగించడం కష్టం. పోల్చకుండా, రెండు విషయాల మధ్య (ఉపమానం, ఉపమేయం) అభేదాన్ని చూపడం అంత సులభం కాదు. దాన్ని నవలలో అక్కడక్కడ ప్రభావవంతంగా ఉపయోగించారు మాలతమ్మ.

“అగ్నిపర్వతం కొన్నాళ్లు మామూలు కొండలాగా నిరపాయంగా కనిపిస్తూనే లోలోపల సెగలు, పొగలు కక్కుతూ, లావా కళపెళమంటూ కాగుతూ ఉంటుంది. హిందూ ముస్లింల సయోధ్య తాత్కాలికంగా, పైకి స్థిరపడినట్లు కనిపించినా లోపల అగ్ని రాజుకుంటూనే ఉంది.” (11వ అధ్యాయం, పుట 110)

అలంకారాలు వాడేటప్పుడు ‘భాష’ను సహజంగా, దాని స్వంతమైన నేటివిటీ, ఇడియం (జాతీయత) ను త్యాగం చేయకుండా వాడాలి. లావాను ‘కళపెళమంటూ’ అని వర్ణించడం తెలుగుతనం. మామూలు కొండ ‘ఉపమానం’ – హిందూ ముస్లింల మధ్య తాత్కాలిక సయోధ్య ‘ఉపమేయం’. లోపల అగ్ని రాజుకుంటూ ఉండడం రెండింటిలో అభేద ధర్మం. ‘సెగలుపొగలు కక్కడం’ తెలుగుతనం.

అశ్వఘోషుడు తన ‘సౌందరానందము’ అనే కావ్యములో ఒక రూపకమును ఉపయోగించాడు.

་”కామవ్యాధుని చేత మానవ హరిణములు సంహరింపబడు చున్నవి.”

ఇందులో ‘కామము’ అనే దుర్గుణం అరిషడ్వర్గములలో ఒకటి. దానినే ఒక వేటగానిగా, మానవులు అనే జింకలు అతనిచే చంపబడుతున్నారని.. ఎంత నిర్దయగా వ్యాధుడు దుర్బల శరీరమనస్కులైన జింకలను కూల్చుతాడో, అట్లా, కామం కూడా మానవుల చిత్తములను బలహీన పరచి, నశింప చేస్తుంది.

రూపకంలో ఇంత వివరణ ఉండదు. శక్తివంతమైన imagery (భావసామగ్రి) ఉంటుంది. దాని ద్వారా ఒక సమగ్రమైన Image (భావచిత్రం) మన ముందుకు తెస్తారు సృజనశీలురైన కవులు, రచయితలు. వ్యాధుడు, జింకలు ఇక్కడ ఇమేజరీ. కామ పీడితులైన మానవుల దుస్థితి ఇమేజ్.

మాలతీ చందూర్ గారు రాసింది నవలైనా, ఆమె imagery, image లు కావ్య గౌరవాన్ని పొందడానికి ఎంతైనా ఆమె అర్హులు. పై రూపకం ప్రాచీన కావ్య ప్రబంధాల స్థాయిలో ఉంది. అగ్నిపర్వతం, లావా, సెగలు, పొగలు, మామూలుకొండ ఆమె ఉపయోగించిన ఇమేజరీ. తాత్కాలికంగా స్థిరపడినట్లు కనిపిస్తున్న హిందూ ముస్లింల సయోధ్య ఇమేజ్. ఇమేజ్‌ను ఒక వంటకం అనుకొంటే ఇమేజరీ అది రుచిగా రావటానికి కావలసిన ingredients. Ingredients (దినుసులు)లో ఏ మాత్రం సమతౌల్యత తప్పినా వంటకం చెడిపోతుంది.

“కొండ అద్దమందు కొంచెమై ఉండదా” అన్నాడు వేమన. Creative genius కొండలాంటివాడు. అతన్ని as it is గా, సూక్ష్మంగా చూపించటమే లచ critical genius ల పని. మాధ్యూ ఆర్నాల్డ్ గారు మాత్రం creative genius ల పక్షపాతి.

‘సంచిక డాట్ కామ్’ అన్న ప్రముఖ అంతర్జాల వార పత్రిక ఉంది తెలుగులో. దాని సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ గారు. శోభకృత్ ఉగాది ప్రత్యేక సంచికలో సంపాదకీయం రాస్తూ, ఇలా అన్నారు.

“‘సంచిక’ దృష్టితో రచయిత భగవంతుడి కన్నా ఎక్కువ. సృష్టికి ప్రతిసృష్టి చేసే వాడు రచయిత. విమర్శకులుగా చలామణి అయ్యేవారు రచయితను చిన్నచూపు చూడటం ఈ మధ్య కనిపిస్తూంది. రచనను సమీక్షించడం రచయితను ఉద్ధరిస్తున్నట్లుగా, ఆయన ఎలా రాయాలో వీరు డిక్టేట్ చేసి, ఆయన కంటే తాము అధికులుగా భావించుకోవడం, చూపించుకోవడం, జరుగుతూంది. రచయిత లేకపోతే, రాయకపోతే, విమర్శకునికి ఉనికి లేదు, సాహిత్యం లేదు.”

సరిగ్గా ఇదే ఆర్నాల్డ్ చెప్పారు. కాని మాలతీ చందూర్ గారి లాంటి సాహితీ శిఖరాల రచనలను పరిశోధనాత్మకంగా అధ్యయనం చేయాల్సినపుడు, విమర్శకుడు పై విషయాలు గుర్తుంచుకోవాలి. ఆమె రచన లోని sublime elements (అత్యున్నత అంశాలు)ను వెలికి తీయడంలో విఫలమైనా ఫరవాలేదు కాని, misinterpret చేయకూడదు. “Brevity is the soul of wit” అని షేక్‌స్పియర్ మహాశయుడు చెప్పినట్లు, “అల్పార్థంబుల ననల్పార్థంబును వెలయించెద”నని పిల్లలమర్రి పినవీరభద్రకవి వెల్లడించినట్లు, మాలతి గారి నవలలు చిన్నవి. కాని లోతైనవి. 200 లోపు పేజీలతో ఉంటాయి. వాటి మీద రాసే సిద్ధాంత గ్రంథాలు 150 పేజీలకు తగ్గకూడదంటే, ఆ నిబంధనను ఎంత ఆలోచించి పెట్టారో తెలుస్తుంది. ఒక్క పదాడంబరం లేకుండా, ఒక్క చిన్న వాక్యంలో ఆమె గురుతరమైన భావాన్ని ఆవిష్కరించగలరు. అదీ పదాడంబరం లేకుండా, సులభంగా! సుబోధకంగా.

ఇక గోపాలరావు స్వాతంత్ర్యానంతర మానసిక స్థితికి వద్దాం. గాంధీజీ దారుణ హత్యకు గురయిన తర్వాత అతడు పాదరక్షలు త్యజించటానికి తీర్మానించుకున్నాడు. ఆ మహనీయుని హత్యకు తనకు తాను విధించుకొన్న వ్యక్తిగత ప్రాయశ్చిత్తంగా మనం దీనిని భావించవచ్చు. ఒక దశాబ్దం గడిచింది. కాలాన్ని రచయిత్రి interpret చేసిన తీరు అద్భుతం! మనం కాలాన్ని నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలలో లెక్కిస్తాం. కాని అది లెక్కలకు లొంగేది కాదు. అందుకే దాన్ని ‘eternity’ అన్నారు. అంటే శాశ్వతమైనది, నిత్యమైనది. దీనినే ceaseless (ఆగనిది), eternal, Perpetual (unending) అని అన్నారు.

‘Eternity’ కి ఆంగ్ల నిర్వచనం ఇది – “Eternity is Time, without an end or a state of existence outside time, especially the state which some people believe they will pass into after they have died.”

“ఒక ఉనికి గాని అంతముగాని లేనిది, కాలము అనేదానికి బాహ్యంగా ఉండేది. మరణం తర్వాత కొందరు, తాము అందులోకి వెళతామని అనుకొనేది.”

ఈ నిర్వచనంలో ఆధ్యాత్మిక అంతర్భావనలున్నాయి (Philosophical undertones). ఇంత క్లిష్టమైన విషయాన్ని మాలతీ చందూర్ ఎంత సులభంగా వివరిస్తారో చూద్దాం.

“ఒక దశ గడిచింది. పదేళ్లు ఒక మనిషి జీవిత కాలములో ముఖ్యమే కావచ్చు. ఈ అనంతయాత్రలో పదేళ్ళు అనగా ఎంత? ఇసుకరేణువులో నూరోవంతు? విరుచుపడే సముద్ర కెరటాలలోని నీటి తుప్పరలో ఎన్నో వంతు? ఉదయ సూర్యుని కిరణాల వంపులో చిక్కుకు ఎగిరే ధూళి కంటె అతి స్వల్పమైంది.. తను గడిపిన ఈ పదేళ్ల కాలం!” (పుట 110)

కాలాన్ని ఎంత తాత్త్వికంగా చెప్పారో! దానికి భౌతిక రూపం లేకపోయినా ఇసుకరేణువు, నీటి తుప్పర, సూర్యకిరణాల వంపులో ఎగిరే ధూళి.. ఇలాంటి ఇమేజరీ ద్వారా కాల స్వరూపాన్ని వివరించారు రచయిత్రి.

కాలం మనం అనుకొనే దాన్ని బట్టే ఉంటుంది. యద్భావం తద్భవతి. సుదీర్ఘంగా వేచి ఉండాల్సి వచ్చినపుడు అది ఎక్కువగా తోస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు, ఏదైనా పనిలో ఏకాగ్రతతో నిమగ్నమైనపుడు, అది తొందరగా గడిచినట్లనిపిస్తుంది. ఇదంతా మన భావన మాత్రమే. ఏ పరిస్థితిలోనైనా గంట అంటే గంటే! అరవై నిమిషాలే. 55 నిమిషాలు గాని 65 నిమిషాలు కాని కానే కాదు.

హైదరాబాదు మెట్రోలో నేను చాలా కాలం ప్రయాణించాను, ఒక బిజినెస్ స్కూల్లో డీన్ (అకడమిక్స్) గా పని చేసేటప్పడు. రోజూ ఎల్.బి.నగర్ నుంచి పంజాగుట్ట వరకు ప్రయాణించేవాడిని. ఒక రోజు ప్లాట్‌ఫారం మీద ఒక ఆసక్తికరమైన సంభాషణ విన్నాను. నాన్- పీక్ అవర్స్‌లో ఎనిమిది పది నిమిషాలకు ఒక మెట్రో రైలు ఉంటుంది. అప్పుడే ఒకటి వెళ్ళినట్లుంది. ఒక యువకుడు ఒక పెద్దాయనను ఇలా అడిగాడు –

“సార్ నెక్స్ట్ ట్రయిన్ ఎప్పుడొస్తుంది?”

అక్కడ డిస్‌ప్లేలో 7 ని॥ చూపిస్తూనే ఉంది. అతడు దాన్ని చూడలేదు.

పెద్దాయన జవాబు. “ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒకటి వదుల్తాడు బాబు! ఫ్రీక్వెన్సీ బాగుంటుంది లే.’’

“అయితే ఇంకా ఎనిమిది నిమిషాల వరకు లేదా?” యువకుడి స్పందన.

అవి ఎనిమిది నిమిషాలు. ఇద్దరి దృక్పథంలో ఎంత తేడా?

గోపాల రావులో జరిగే ఆత్మమథనం, కుటుంబంతో జరిగే సంఘర్షణ, విలువల వైరుధ్యం, మొక్కవోని అతని కమిట్మెంట్

అతని ఆత్మమథనమంతా అతని ఈ క్రింది స్వగతంలో ఆవిష్కరించారు రచయిత్రి.

‘చుట్టూ ఉన్న పరిస్థితులలో తనెందుకు ఇమడలేకపోతున్నాడు? భార్య పార్వతికి తనకి మధ్య సన్నిహితత్వం ఎందుకు కలగడం లేదు? అందరు భార్యాభర్తలు ఇలాగే ఉంటున్నారా? డబ్బు, అధికారం తప్ప ప్రశాంత జీవితం – స్థిరమైన ఆదర్శాలు – వీటికి విలువ లేదా? తన చుట్టూ వారికి లేని తపన, అశాంతి తనకెందుకు?’ (పుట 111)

అన్నీ ప్రశ్నలే! మరి వాటికి సమాధానాలు? అవి ప్రశ్నల్లోనే ఉన్నాయి, గోపాల రావు సరిగా ఆలోచిస్తే. ఒక ఆదర్శానికి కట్టుబడ్డ, ఆ ఆదర్శాన్ని చిన్న చూపు చూసే, ఇద్దరు దంపతుల మధ్య, వారు అటు, ఇటు కావచ్చు, తీవ్రమయిన ఒక ఇనుప తెర ఏర్పడుతుంది. సోక్రటిస్ అంతటి వేదాంతికే తప్పలేదిది. ఆ ఆదర్శం, భావజాలం

సోక్రటిస్‌కు, గోపాలరావుకు ఉన్నంత ఉదాత్తమైనది కాకపోవచ్చు, అసలు అది కాదు కీలకం! దృక్పథాల్లో వైరుధ్యం. భర్త లంచగొండి. భార్యకది ఇష్టం ఉండదు. భార్య Spendthrift, అంటే దుబారాగా ఖర్చుచేస్తుంది. తన భర్త సంపాదనను బట్టి ఆమె ఖర్చు ఉండదు. భర్తకు అది గిట్టదు. భార్య గొప్ప రచయిత్రి. సమాజంలో ఆమెకు మంచిపేరు ఉంది. భర్త దానిని సహించలేడు. భర్తకు కులపిచ్చి లేదు. భార్యకు వల్లమాలిన కులాభిమానం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వైరుధ్యాలు. అందరూ రాముడత్తయ్య, వాసుదేవరావు మామయ్య ల్లాగా ఉండరు. ఉన్నా చాలా అరుదుగా ఉంటారు.

పార్వతి, గోపాలరావుల మధ్య ఏర్పడిన ఇనుప తెర అలాంటిదే! ఎందుకు ఆమెకు తనకు సన్నిహితత్వం కలగడం లేదు? అన్న ప్రశ్నకు జవాబు తర్వాతి ప్రశ్నల్లోనే ఉంది.

ప్రశ్న:-

అందరు భర్తలు ఇలాగే ఉంటున్నారా?

సమాధానం:

లేదు.

ప్రశ్న:-

డబ్బు, అధికారం తప్ప.. ఆదర్శాలు వాటికి విలువ లేదా?

సమాధానం:

లేదు.

ప్రశ్న: –

తన చుట్టూ వారికి లేని తపన తనకెందుకు!

అదే అతని ముఖ్యమైన లోటు.

ఇక్కడ సమాధానాలన్నీ పార్వతి వైపు నుంచేనని మనం గ్రహించాలి. కొడుకుతో కూడా ఇదే దూరం ఏర్పడింది. అయితే అది ఇంకో రకమయినది.

ఈ స్వగతాలు (Soliloquy) నాటక సాహిత్యంలో పాత్రచిత్రణకు బాగా సహాయపడ్డాయి (characterisation). దీనికి దగ్గరగా ఉండేదే Monologue. అంటే వ్యక్తి తన వైపునుంచి చెప్పే సుదీర్ఘమైన మాటలు. Dialogue అంటే ఇద్దరి మధ్య నడిచే సంభాషణ. డయా అంటే ‘ద్వి’ అని అర్థం. సినిమాలను నాటకాలను విశ్లేషించేటప్పుడు ‘డైలాగులు’ బ్రహ్మాండగా చెప్పాడని అంటుంటారు. అది తప్పు. ఒక్కరు చెప్పే మాటలు మోనోలాగ్‌లు.

ఈ రెండింటి ద్వారా రచయితలు, పాత్రల అంతరంగ ఆవిష్కరణ చేస్తారు. Soliloquy ను నటుడు బిగ్గరగా చెప్పుకుంటాడు (ప్రేక్షకులకు/పాఠకులకు తెలియాలని!). అది లోలోపల చెప్పుకునేది. కాని మోనోలాగ్ ఇంకో పాత్రతో చెప్పేది. మొదటిదాన్ని చెప్పే సమయంలో స్టేజి మీద ఆ నటుడు తప్ప ఎవరూ ఉండరు.

విలియమ్ షేక్‌స్పియర్ నాటకాలలో, ఈ స్వగతాలు ఎంతో ప్రసిద్ధిని పొందాయి. వాటిల్లో కొన్ని భాగాలు ఇంగ్లీషు భాషలో నానుడుల స్థానాన్ని (Proverbial status) పొందాయి.

‘House of cards’ అన్న టీ.వీ. సిరీస్ చాలా పుసిద్ధిచెందింది. సీజన్-2 లోని మొదటి ఎపిసోడ్‌లో ‘ఫ్రాంక్ అండర్‌వుడ్’ అన్న పాత్ర ఇలా చెబుతుంది తన స్వగతాన్ని. ఆ పాత్ర కల్పితం. సిరీస్‌లో అమెరికా దేశపు 46వ రాష్ట్రపతిగా ఆయన ఉంటారు. అధికారము, రాజకీయాల మీద ఆయన ఆ స్వగతంలో వ్యక్తం చేస్తారు తన భావాలని ఇలా.

“Every Kitten grows up to be a cat. They seem so harmless at first, small, quiet, lapping up their saucer of milk. But once their claws get long enough, they draw blood-sometimes, from the hand that feeds them.”

అట్లే,

“The road to power is paved with hypocrisy. There will be causalities.”

వినడానికి దారుణంగా ఉన్నా ఇవి నగ్న సత్యాలు. పిల్లి పిల్లలు మొదట సుకుమారంగా అమాయకంగా ఉంటాయి. క్రమంగా, పెద్దవై, పంజాలు బలిసి, గోళ్ళు వాడివైతే, అన్నం పెట్టిన వాడి చేతినుంచే రక్తాన్ని తాగుతాయి.”

“అధికారం పొందే మార్గమంతా కపటంతో కూడి ఉంటుంది. దానిలో ఎన్ని మరణాలు!”

~

ఫ్రాంక్ అండర్‌వుడ్ ద్వారా రచయిత పలికించిన ఈ స్వగతం రాజకీయ నాయకుల నుద్దేశించినది. ‘హృదయనేత్రి’ నవలలో నందయ్య పాత్ర అలాంటిదే. ఎంతో స్నిగ్ధంగా ప్రారంభమైన అతని జీవితం, రాజకీయాల్లో రాటు తేలేకొద్దీ, ఎంత స్వార్థపూరితంగా, కపటంగా మారుతుందో మాలతిగారు గొప్పగా చిత్రీకరించారు. ఈ గ్రంథంలో నందయ్య మీదే ఒక విశేష ప్రకరణం ఉంది. దానిలో ఆ విషయాన్ని సమగ్రంగా చర్చిద్దాం.

గోపాల రావు స్వగతాలు, ఇతర పాత్రలతో చెప్పిన మోనోలాగ్లు ‘హృదయనేత్రి’ నవలను మరింత లోతుగా పరిశోధించే వీలును కలిగిస్తాయి.

భార్య, కొడుకు శ్రీనివాస్‌లు తన పట్ల ‘విధేయతతో కూడిన ఉదాసీనత’ (obedient apathy) ని చూపిస్తున్నారని గోపాల రావుకు అర్థం అవుతుంది. ఈ పద బంధాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. వారి ప్రవర్తనలో ఉదాసీనత ఉంది. కానీ అది అవిధేయతగా లేదు. ఇలాంటి పద బంధాలను సృష్టించడాన్నే Dexterous use of words అన్నారు లాక్షణికులు. రెండూ కొత్త పదాలేమీ కాదు. వాటిని నేర్పుగా కలపడం వల్ల, పార్వతి, శ్రీనివాస్ క్యారెక్టర్లను సజీవంగా మన ముందు నిలబెట్టారు మాలతమ్మ.

కొడుకు బి.ఎ. పాసయినపుడు తర్వాత “ఏం చేస్తావ్?” అని తండ్రి అడిగితే “ఇంకా ఏమీ నిశ్చయించుకోలేదు” అంటాడు. “బి.ఇడి. చదువు” అంటే, ‘జవాబు చెప్పడం అనవసరం’ అన్నట్లు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here