Site icon Sanchika

శిఖరాగ్రం

[శ్రీమతి ఆర్. లక్ష్మి రచించిన ‘శిఖరాగ్రం’ అనే కవితని అందిస్తున్నాము.]

[dropcap]శి[/dropcap]ఖరాగ్రం మీద నుంచుని చూసిన రోజు,
చుక్కలన్నీ ఎంతో దగ్గరగా కనిపించాయి.
కోర్కెలన్నీ ఎంతో సమీపంలో వెలుగు చిమ్మాయి!
వాటిని సమీపించడం ఎంతో సులభమనుకున్నాను.

విశాల భావాలతో పరికించిన రోజు,
లోకమంతా నిర్మలంగా కనుపించింది.
‘ప్రశాంతత’ అంటే అదే అననిపించింది.
ఈ లోకంలో జీవించటమే హాయనుకున్నాను.

మృదు హృదయంతో సంచరించిన రోజు,
ప్రతి హృదయం మార్దవ పూరితమనిపించింది.
మాధుర్యమంటే అదేననిపించింది.
మాధుర్యాన్ని చవిచూడటమంటే సులభమనిపించింది.

కానీ..

శిఖరాగ్రం నుండి పతనమైనపుడు
తెలుసుకోగలిగాను;
నింగికీ, నాకూ ఎంత దూరమో!
సంకుచితత ఎదలో చోటు చేసుకున్నపుడు
అర్థం చేసుకున్నాను
జీవించటం ఎంత కష్టమో!

మృదు హృదయంలో కాఠిన్యం తొంగి చూసినపుడు
తెలుసుకోగలిగాను,
మాధుర్యంగా కనిపించే అనుభూతిలో ఎంత గంభీరత ఉందో!
……
అగణితాలయిన అనుభవాల
కట్టకడపటి అంచున
తెలుసుకోగలిగాను
అనుభూతులకు మానవ హృదయం,
లయబద్ధంగా స్పందిస్తుంది
హృదయపుటౌన్నత్యాన్ని బట్టి
లయలోని మాధుర్యం కనిపిస్తుంది.

 

Exit mobile version