Site icon Sanchika

శిశిరం

(మంగు కృష్ణకుమారి గారు రచించిన ‘శిశిరం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.)

[dropcap]శి[/dropcap]శిరం అంటే మూతి ముడుచుకోవాలా?
వసంతం కోసం ఆరాటంగా చూడాలా?

ఆరుగురు ఆడపిల్లల తల్లి ఆ ప్రకృతి మాత!
మెత్తని పొత్తిళ్ళలో బిడ్డల
ఆట పాటలూ, వినోదాలూ
పురుషుడికి చూపి చూపి మురుస్తుందని మరచేవా?

ఏ కాలానా తన ఋతు ధర్మం మరువనిదే ప్రకృతి తల్లి
ఆకులు రాల్చిన శిశిరాన్ని చూసి నవ్వుతూ
‘మీ వసంతక్క వస్తుందే, అల్లరి చేయకు హుష్!’
అంటుంది! తెలుసుకో చెల్లెలా..

వసంతం వగలూ హొయలూ
నవ్వులూ హుషారులూ నడుస్తూ ఉండగానే
గ్రీష్మం వచ్చేస్తుంది. ఎండలు కాల్చినా
అమ్మ గుండెలో ప్రేమ పొంగులే..
తమ్ముడూ విన్నావా?

గ్రీష్మానికి మాత్రం అలుపూ సొలుపూ
లేవనుకున్నావా? చిత్తడి వానలు నేలతల్లిని తడిపేసి
నింగికీ నేలకీ వేసే వంతెనలు..
అత్తా మరచేవా?

తడిసీ అలసిన మనసులకి చల్లని కిరణాలతో
మురిపించే వెన్నల మాసాలు
శరదృతువు నిర్మలమయిన దీపాలు
నీకెంత ఇష్టమో నాకూ గురుతే పెద్దమ్మా..

మంచుని తెచ్చే హేమంతం మరీ మరీ
వణికించే ‘చలి పులి’ ని వదిలేస్తే
పళ్ళు కటకటలాడి వేళ్ళు కొంకరులు
పోయే వారి పాలిటి వరంలా మళ్ళా వచ్చే శిశిరం!
మామ్మా ఈ అనుభూతి నీదేగా!

శిశిరాన్ని వద్దనొద్దు. చీకటి వస్తేనే వెలుగు విలువ తెలిసేది,
ఎండలు కాస్తేనే‌ వాన కావాలనేది! వానలో తడిస్తేనే వెన్నెల
వెలుగుల మెఱుపులకి ఎగబడేది

వెన్నెల స్నానాలు చేస్తేనే చలి కుదుపులకి ఎదురు చూసేది!
అది ఋతు ధర్మం

ఇది మన ఆరాటం..
తమ్ముడూ శశిరాన్ని తగ్గించకు..
చెల్లెలా, వసంతం వస్తుందని మరువకు

Exit mobile version