శిశు పాలిక

0
3

[dropcap]సి[/dropcap]కింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణీకులతో రద్దీగా వుంది. ఉదయం పదిన్నర కావస్తోంది. కొద్దిసేపట్లో సిర్పూర్ – కాగజ్‌నగర్ నుండి సికింద్రాబాద్ వచ్చే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రాబోతుంది. ఒకటవ నంబర్ ప్లాట్ ఫాంపై భార్గవ ఆ రైల్లో రాబోయే తన శ్రీమతి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో చంకలో మూటతో నడివయస్సు గల ఆడమనిషి పల్లెటూరి వేషభాషలో భార్గవ దగ్గరగా వెళ్లి, “అయ్యా! బతుకు దెరువు కోసమచ్చిన, ఏదైనా పని చేసుకొని బతుకుదామని. మా అసుమంటోల్లుండడానికి యాడైనా నీడుంటె జర చెప్పు బాబు. నాకీ పట్నం కొత్త. నాకు నా అనేటోల్లెవరూ లేరు. జరంత దయజూపు బాపు. నీ పిల్ల జిల్లా సల్లగుంటరు” అని దీనంగా అడుగుతున్న ఆ మధ్య వయస్కురాలి వైపు పరిశీలనగా చూస్తూ, “ఏ ఊరినుండొస్తున్నావు” అన్నాడు. “మనకు పనికి రానూరు ఏ ఊరైతేంది బాపు. మాది ఓరంగల్ దగ్గర ఓ సిన్న పల్లెటూరు. ఆడ ఉండలేక యీడికొచ్చిన” అంది. అలాగా అంటూ ఆలోచనల్లో మునిగిపోయాడు.

“ఇక్కడ ఎవరూ దొరకలేదండీ, మా నాన్న ఇక్కడ రెండు మూడు వూళ్లలో ఎంక్వైరీ చేయించారు. కానీ లాభం లేక పోయింది. నేను రేపు ‘భాగ్యనగర్’కి వస్తున్నా” అని నందిని నిన్న ఫోన్లో చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. “ఏమైంది బాపు, ఏడన్న నాలాంటోల్లకి వుండడానికి ధరమశాల ఉంటే జెప్పుమన్నగద బాపూ, ఏమీ మాట్లాడుతలేరు”. అంది.

ఆమె మాటలకి ఈ లోకంలోకి వచ్చిన భార్గవ, “అవ్వా! నీ పేరేంటి?” అన్నాడు.

“యీరమ్మ”.

క్షణంలోనే ఏదో నిర్ణయించుకున్నట్లుగా “మా యింట్లో పన్జేస్తావా?”

“ఏంది బాపు మీ ఇంట్లో పనిచెయ్యాల్న – మంచిది బాపు. చేస్తగని మరి నా కుండేటందుకు యాడన్నా చోటు దొరకద్దా?” అమాయకంగా అడిగింది యీరవ్వ.

“ఉండడం, పని, తిండి, బట్టా అన్నీ మా ఇంట్లోనే, నీ కిష్టమైతే యిప్పుడే తీసుకువెళ్తా.”

“ఇదేందో ఇచిత్రంలాగా వుంది. నమ్మాల్నో లేదో తెలుస్తలేదు… నిజంగనా బాపు… ముసలిదాన్తో పరాచికాలాడ్తంరా…”

“లేదమ్మా… నిజంగానే అడుగుతున్నా. ఇప్పుడు వచ్చే ట్రెయిన్లో మా ఇంటామె వస్తుంది. ఆమె రాగానే మా ఇంటికి వెళ్లాం. ఆలోచించుకో.”

“నాకు నోట మాటస్తలేదు బాపు. పల్లెటూరి దాన్ని. మీరు చెప్పిన పని జేస్త. నా పొట్ట కింతగడిస్తే చాలు. అంతకంటే నాకింకేమి వద్దు. అయితే ఇప్పుడు అమ్మ బండిల దిగుతదా? యాడ్నుంచొస్తంది….” కుతూహలంగా అడిగింది.

‘సిర్‌పూర్ నుండి”

“సిరిపురమా. అబ్బో శాన దూరం. ఆడెవలుంటరు. మీ అత్తగారా?”

“అవును” అంటూ మాట కట్ చేస్తూ “నువ్విక్కడే ఉండు ట్రయిన్ వస్తుంది. ఆమెను తీసుకొని వస్తా. ఇక్కడ కూచో” అంటూ వస్తున్న ట్రెయిన్ వైపు కదిలాడు.

‘కాగల కార్యం గంధర్వులు తీర్చడం అంటే ఇదే కావచ్చు. నందినికి చెప్తే సర్‌ప్రైజవుతుంది.’ అనుకుంటు ఆగుతున్న రైలు ఒక్కొక్క పెట్టినే చూస్తున్నాడు. నందిని వున్న పెట్టె కన్పించింది. గబగబా నడుస్తూ పెట్టె దగ్గరికి చేరుకుని భార్య చేతిలో సూట్ కేస్ అందుకున్నాడు.

“ఎంతసేపైంది స్టేషన్‌కొచ్చి?” ప్రశ్నించింది నందిని.

“జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్. అది సరేకాని నీకో సర్‌ప్రైజ్ న్యూస్.”

“ఏమిటి?”…. నవ్వుతూ అడిగింది.

“చూద్దువుగాని పద.” అంటూ యీరవ్వ కూర్చున్న దగ్గరికి తీసుకువెళ్లాడు. “యీరమ్మా! ఇదిగో మీ అమ్మగారు” అన్నాడు నందినిని చూపిస్తూ. “దండాలమ్మా దండాలు” కళ్లలో సంతోషం కదలివస్తుంటే కదలి పోతూ అంది. కొంచెం అర్థం అయినా ఏమనాలో తోచక “ఏంటి?” అని ప్రశ్నించింది. “ఏమిటేమిటి, మనకు పనికో మనిషికావాలి. గడవడానికి ఆమెకో పని కావాలి. పద వీరమ్మా.” అంటూ స్టేషన్ బయటికి దారి తీశాడు.

“ఎవరీమె?” ఆశ్చర్యంగా అడిగింది నందిని. “నువ్వు సిర్‌పూరకు వెళ్లిన పని నేను సికింద్రాబాద్ లోనే సాధించా” కవ్విస్తూ అన్నాడు.

ఆటో స్టాండుకి వెళ్లే దారిలో అడిగింది, ‘పిల్లల్ని చూసుకోవడం వచ్చా’ అని. తననే అడుగుతుందని గమనించి “ఏంటమ్మా! పిల్లల్ని చూసుకోవడమా, ఎందుకు తెల్వదమ్మా, జూసుకుంట ఇంటి పనులు కూడా చేస్తనమ్మా” అంది.

***

యీరమ్మకు గతం గుర్తుకొచ్చింది.

“పల్లెటూరి మనిషివి. పిల్లల్ని చూడడం నీకేం తెలుసు. నువ్వు పిల్లవాడికి ఏమీ చెయ్యక్కరలేదు. అన్నీ నేను చూసుకుంటాను. వాడిని తాకే ప్రయత్నం చేయవద్దింకోసారి”

కోడలు గద్దింపుతో బిత్తర పోయింది.

“ఆ పల్లెటూళ్లో ఉంటే సరి పోయేదిగదా! నీక్కావల్సిన డబ్బులు పంపిస్తామని చెప్పినా వినకుండా ఇక్కడికి వచ్చావు. ఇంటికి పెద్ద పెద్ద వాళ్లు వస్తారు. ఆయన స్నేహితుల ముందు ఇలా దిష్టిబొమ్మలా కూచోకు. నీ కిచ్చిన రూం ఉందికదా, అందులో ఉండు. కొడుకు దగ్గర ఉండడమే కదా నీక్కావల్సింది. అలాగే వేళకింత తిని నీ గదిలో పడుండు. ఆయన మాట తీసెయ్యలేక ఒప్పుకున్నాను కానీ, నాకస్సలు ఇష్టం లేదు, నిన్నిక్కడకి తీసుకురావడం, అర్థమయ్యిందా! ఇంకోసారి ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను, పిల్లాడికి స్నానం పోస్తాను, తిండి పెడతాను, అంటూ నన్ను విసిగించకు” కోడలి కరుకు మాటలు వీరమ్మ గుండెల్ని తూట్లు చేసాయి. కోడలితో ఎదురు మాట్లాడితే కొడుకెక్కడ బాధపడతాడో, పైగా చదువుకున్న పిల్ల అని బాధను దిగమింగుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది.

‘శ.శ. మా వూల్లె ఉంటేనే బాగుంటుండె. ఈడ కొడుకు పెద్ద నౌకరి చేస్తడు. పెద్ద ఊరు, పెద్ద బంగ్ల మంచిగ వుండచ్చుననుకుంటే కోడలుకు తనంటే ఇష్టం లేదాయే. తనేమన్నా చదువుకున్నది గనుకనా, ఎక్కడన్నా పెద్ద పెద్ద వూర్లు చూసింది కనుకనా, ఏదో గా పల్లెటూర్లో పనీ పాటా చేసుకుని బతికేదాన్ని, వీనయ్య వీని చిన్నప్పుడే పైకివాయె. గప్పటినుండి వీన్ని సాది సదివిత్తి. నీ పిల్లగాడు మంచిగ చదువుతుండు వీన్ని ఆస్టల్ల చేర్పించుమని గా పెద్దసారు చెప్పితె గట్లనే ఆని ఆస్టల్ల జేర్పిత్తి. అట్ల ఆడు చదువుకుంటు, చదువుకుంటు పట్నంలనే పెరిగి ఆడనే మంచి నౌకరి జూసుకున్నడు. ఎప్పుడన్నా సెలవులకు రెండు రోజులోచ్చెటోడు. పట్నంల గీ పిల్లతో దోస్తయింది. పెళ్లి చేస్కుంటమంటే ఈనత్తగారోల్లు లొల్లి పెట్టిన ఇనకుండా ఎదిరిచ్చి పెండ్లి జేస్కున్నరు. పెండ్లి గదేందో ఆఫీసుల జేస్కున్నరట. పెండ్లి గాంగనే ఒక్కసారి ఊరికొచ్చి ఒక్క గంటుండి పోయిండ్రు. ఆ తరువాత రెండు మూడుసార్లు ఆడే అచ్చిపోయిండు. ఇన్ని పైసలిచ్చి పోతుండె. ‘బిడ్డా, నాకీడెవరున్నర్ర. నేను నీకాడికే అస్త’ అని అచ్చినప్పుడల్లా మొత్తుకున్నా ‘వద్దువు గానీ లే’ అని దాటేసిండు. ఆనికి కొడుకు పుట్టినప్పుడు కోడలు దవాకాన్ల ఉంటే ఒకసారి వచ్చి తీసకపోయి చూపిచ్చి మళ్లి ఈడనే వదిలి పెట్టిండు. పైసలిస్తడు, పనికి పోవద్దంటడు. తన దగ్గరికి తీస్కపోడు. వూరోల్లంతా ఏంది, ఈరమ్మా! కొడుకు దగ్గరికి పోవా అని ఎద్దేవా చేసినట్లడిగేటోలు. మొత్తుకోంగ, మొత్తుకోంగ మొన్నమొన్న తీస్కచ్చిండు. వాడెందు కద్దన్నడో ఇప్పుడర్ధమయితాంది. ఆడున్నా బాగుంటుండె. అందరూ తెలిసినోళ్లు పనీ పాట జేసుకుంటుండస్తుండె ఇప్పుడేం చేయాలో అర్థంగాకపాయె’ తనలో తాను గతాన్ని తల్చుకుంటూ తన గదిలో ముడుచుకు పడుకున్నది.

“అవ్వా! ఏంటి పడుకున్నవ్ లే! అన్నం తిందువు గాని” కొడుకు మాటలకి ఉలిక్కిపడి లేచింది.

“దా! అన్నం తిందువుగాని” శంకర్ సానునయంగా పలికాడు. “నువ్వు దినుబిడ్డా నేనటెంకదింట”

‘ఏమైంది ఎట్లనో వున్నవు. ఇక్కడ మనసున పడుత లేదా? మనూరికి పోతవా?” ఆమె పరిస్థితిని గమనించి ప్రశ్నించాడు.

“ఏం లేదు బిడ్డా, వూరికెనే, చేసేటందుకీడ పనేం లేకపాయె. అందుకే పండుకున్న సరేగని నువ్వు దినుపో బిడ్డా! ఎప్పుడు తిన్నవో ఏందో….” నీతో తినుడు నీ భార్య కిష్టం ఉండదు. అని అనలేకపోయింది.

“నీ ఇష్టం” అని అక్కడ్నుంచి కదిలాడు.

మనూరికి బోతవా అని అడుగుతుండు నా కొడుకు. ఈడ ఉండేటట్టులేదు. ఆని ముందట బయట పడలేదు కోడలు, ఆడేమంటడోనని. ఆనికి అనుమానం రాకుండా మెదళ్తుంది. నేను మా వూరంటే బెంగటిలిన్నననుకొంటండు, మావోడు. కోడలు కిష్టం లేకుండా తనీడ ఉండుడు కష్టం. వూరికి పోదామంటే, వూల్లె అందరేమనుకుంటరొ. ఒక్కడే కొడుకు మంచిగ సంపాయిత్తండు. తల్లి బరువైందా అని ఆడిపోసుకుంటరు. ఏం చేయాల్నో అర్ధం కాదాయే. ఆడమాత్రం ఏం పాడైందని, చేనా చెల్కనా?

“ఇగో అన్నం తిందురా!!” కోడలి కేకతో లేచి వెళ్లింది.

***

“ఏంటి వీరమ్మా! ఏదో ఆలోచనలో పడ్డావు. ఇల్లు వచ్చింది, దిగు.” భార్గవ్ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది. ఇల్లు చక్కగా ఉంది. ఇంటి ముందు ఖాళీ స్థలం. పూలచెట్లు, పచ్చటి గడ్డి. చూడముచ్చటగా ఉంది. ఇంటి ముందటి భాగంలో పెద్ద వరండాలాంటి రేకుల షెడ్డు. షెడ్డుకి ఇనుప గిల్స్ బిగించి ఉన్నాయి. చాలా విశాలంగా ఉన్న ఆ వరండా నిండా పిల్లలాడుకునే బొమ్మలు, కొయ్య గుర్రాలు, వాకర్లు, బాల్సు, బ్యాట్స్ అన్నీ చిందర వందరగా ఉన్నాయి. కింద పత్రంజ్ పర్చి ఉంది. గోడలకి చిన్న పిల్లల ఫోటో ఫ్రేములు తగిలించి ఉన్నాయి. కాంపౌండ్ గోడ దగ్గరగా రోడ్ వైపుకి ‘భార్గవ్ బేబీ కేర్ సెంటర్’ అనే సైన్ బోర్డు ఇనుపరాడ్స్ కి తగిలించి ఉంది.

“వీరమ్మా ఇదే మా ఇల్లు. ఇక్కడ మేం చిన్న పిల్లల్ని చూసుకుంటాం. అంటే ఉద్యోగాలకు వెళ్లే ఆడవాళ్లు తమ పిల్లల్ని ఇక్కడ దింపి వెళ్తారు. అంతసేపూ మనం వాళ్లని చూసుకోవాలి. ఇదివరకున్న ఆయమ్మకు ఒంట్లో బాగా లేక వెళ్లిపోయింది. కొత్త ఆయమ్మ కోసం మా ఊరు వెళ్తే అక్కడ ఎవరూ దొరకలేదు. అదే సమయంలో నువ్వు స్టేషన్లో కనిపించావు. ఇవాళ ఆదివారం కదా! అందుకే పిల్లలెవ్వరూ లేరు. రేప్రొద్దున్నే అందరూ తమ పిల్లల్ని దింపి పోతారు. మీ అమ్మకు తోడుగా ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే నిన్ను తీసుకొచ్చాం. అర్థం అయిందా?, ‘నందినీ’ వీరమ్మకు తనగది అదీ చూపించి, ఆమె ఏం చేయాలో ఎలా ఉండాలో అన్నీ వివరంగా చెప్పు. నేనట్లా వెళ్లి వస్తాను.”

***

“అమ్మా నాకు సిగ్గేత్తందమ్మా! ఇంత మంచి చీర నేనెప్పుడూ కట్టలేదమ్మా. ఇట్టా కొప్పు వేసుకోవడం కూడా నాకు కొత్త కొత్తగున్నది.” మెలికలు తిరిగిపోతూ అంది వీరమ్మ.

“వీరమ్మా! నిన్ను పెద్దగా మార్చిందేమీ లేదు. ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు వస్తారు. అందుకోసం నిన్ను కొంచెం మార్చాను. రెండ్రోజులు పోతే నీకే అలవాటవుతుంది. ఇంకో విషయం. పిల్లల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకూడదు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లో మనిషిగా మసలుకోవాలి. నీకు ఏం కావాలన్నా అడుగు. నీకేదైనా తెలియకపోతే అడిగి తెలుసుకో. ఆ!… పిల్లల్ని దింపే వేళయ్యింది. ఒక్కొక్కళ్లే వస్తారు. అదిగో రమా మేడం రానే వచ్చింది” అంటూ “హల్లో ‘అనుష్’ కమాన్” అంటూ ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంది. “ఇదిగో ఆయమ్మా! ఈ అబ్బాయి అనుష్.” అంటూ పరిచయ కార్యక్రమం మొదలు పెట్టింది నందిని.

***

“నందినీ. ఏమంటోంది ఆయమ్మ? ఇక్కడి తావరణానికి అలవాటు పడ్డట్టేనా?”

“చాలా మంచి మనిషండీ! పల్లెటూరి మనిషైనా చాలా తొందరగా ఇక్కడి విషయాలను అర్థం చేసుకుంది. ముఖ్యంగా పిల్లల్ని ఎంతో చక్కగా చూసుకుంటుంది. పిల్లలు కూడా ఆమెకు బాగా మచ్చికయ్యారు. కొంచెం మాటలోనే పల్లెటూరి యాస. అది పిల్లలకి కొంచెం కొత్తగా ఉంది.”

“అవుననుకో, కానీ నందినీ ఆ యాసలో ఎంత అందం ఉందో చూసావా! నాకైతే అలా మాట్లాడే వాళ్లుంటే అలాగే వినాలని పిస్తుంది. ఆ…. అది సరేగాని మా బ్యాంకులో కొత్తగా ఆఫీసర్ వచ్చాడు. ఆయన మిసెస్ కూడా ఏదో ఆఫీసులో పనిచేస్తుందట. ఇద్దరూ ఒకేసారి ట్రాన్స్‌ఫర్ అయి ఇక్కడకు వచ్చారు. వాళ్లకు ఒక బాబు ఉన్నాడట. మన క్రెష్ గురించి మా వాళ్ళెవరో చెప్పారట. ఈ రోజు టీ టైంలో అడిగాడు. మన కేర్ సెంటర్‌లో చేరుస్తారట.”

“అలాగా!…. ఎక్కడి నుంచి వచ్చారు?” అడిగింది నందిని.

“వరంగల్ నుంచి” చెప్పాడు భార్గవ్.

“అబ్బాయి కెన్నేళ్లుంటాయట?”

“రెండేళ్లనుకుంటా…….”

“ఎప్పుడు వస్తామన్నారు”.

“రేపుదయమే వస్తామన్నారు. వాళ్లు వచ్చేదాకా నేనుంటాను.”

***

ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో బైక్ మీద వచ్చారు శంకర్ అతని భార్యా బాబుని తీసుకొని.

వాళ్లకోసమే ఎదురుచూస్తున్న భార్గవ్ వాళ్లను గేట్ వద్ద చూడగానే లేచి ‘వెల్కమ్’ అంటూ ఆహ్వానించాడు. అప్పటికే ఇద్దరు ముగ్గురు పిల్లలు వచ్చారు. వాళ్లని నందిని అటెండ్ చేస్తోంది. వీరమ్మ లోపల ఏదో పనిలో ఉంది. దంపతుల ద్వయం ఒకర్నొకరు పరిచయం చేసుకున్నారు.

“బాబు పేరేమిటి” అడిగింది నందిని.

‘సందీప్’ చెప్పింది ఆమె.

“పిల్లల్ని మీరొక్కరే చూసుకుంటారా” అడిగింది ఆఫీసర్ భార్య మందిర.

“లేదండీ! ఆయా వుంది. ఒక్కదాన్ని చూసుకోవడం చాలా కష్టంగదా!”

“అఫ్‍కోర్స్!”

“మీ అబ్బాయి అలవాట్లు అంటే పాలు తాగించడం ఎన్నింటికి, పాలల్లో ఏం కలపాలి. హార్లిక్స్, కాంప్లాన్, ఎన్ని గంటలకు నిద్ర పోతాడు… అన్నీ కొంచెం వివరంగా చెప్పండి. నోట్ చేసుకుంటాను.”

“అలాగే” అంటూ వివరాలు చెబుతూ క్రష్‌ని పరిశీలనగా చూస్తుంది. ఆయా వస్తుందేమోనని లోపలి వైపు ఓ కన్నుంచింది.

“మేం ఏమైనా మెటీరియల్ తెచ్చివ్వాలా!” అడిగింది మందిర.

“అవసరం లేదండీ మేం అన్నీ చూసుకుంటాం. కాకపోతే దుస్తులు మాత్రం ఓ రెండుంచండి మా వద్ద.”

“అలాగే. ఏదీ మీ ఆయా కనిపించదేం?”

“లోపల ఏదో పనిలో వున్నట్టుంది. పిలవనా.”

“వద్దులెండి ఈ సారెప్పుడైనా కలుద్దాం. వస్తాం మరి ఆఫీసుకి టైమవుతోంది.”

“ఉండండి, కాఫీ తెస్తాను.”

“ప్లీజ్ వద్దండి. ఇంకెప్పుడైనా తీసుకుంటాం” అంటూ బాబువైపు చూశారు. అప్పుడే పిల్లలతో కలిసి బొమ్మలతో ఆడుకుంటున్నాడు. బాబుకి బై చెప్పి వస్తామంటూ వెళ్లిపోయారు.

“నేను కూడా వెళ్తా నందినీ, టైమవుతోంది.”

“అలాగే” అంటూ పిల్లల వైపు నడిచింది నందిని.

“ఎవరచ్చిన్రమ్మా” అంటూ లోపల్నుండి వచ్చింది, వీరమ్మ.

“ఇదిగో, ఈ కొత్త బాబు వాళ్ల అమ్మా నాన్నా.”

“ఎవరూ ఈ బాబా…” అని బాబు దగ్గరికి వెళ్లి ఎత్తుగుంది.

అచ్చం తన మనవడి లాగే ఉన్నాడు అనుకుంది, లోపల, పైకి మాత్రం ఆ విషయం తెలియనీయకుండా

“ఎక్కడ్నించొచ్చింరటమ్మా ఈల్లు.”

“వరంగల్ నుంచట” చెప్పింది, నందిని.

“వరంగల్లు నుంచా” ఒక్క క్షణం తత్తరపడబోయి తమాయించుకుంది. ఈరమ్మ. “బాబు పేరేంటమ్మా” కుతూహలంగా అడిగింది, బాబు దగ్గరికి వెళ్లి పరిశీలనగా చూస్తూ.

‘సందీప్’ అని చెప్పి అతనికి సంబంధించిన వివరాలు జాగ్రత్తగా చూస్తుంది నందిని వీరమ్మకు వివరించడానికి. “ఆఁ వీరమ్మా, ఈ బాబు వాళ్ల నాన్న అయ్యగారి ఆఫీసుకు బదిలీ మీద వచ్చారు. బాబును జాగ్రత్తగా చూసుకోవాలి. మీ అయ్యగారికి మాట రాకూడదు. తెలిసిందా!”

“అలాగే నమ్మా” అంటూ జవాబిచ్చింది.

పిల్లవాడిని తన దగ్గరికి రమ్మని బుజ్జగిస్తూనే…. ఎత్తుకో అన్నట్లు బాబు రెండు చేతులూ అందించాడు. ఎత్తుకో బోయినదల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది, వీరమ్మ.

***

“ఏయ్ ఏంటది బాబును ఎవరెత్తుకోమన్నారు నిన్ను. వాణ్ణి తాకొద్దని ఎన్ని సార్లు చెప్పాను నీకు. బుద్ధి లేదా?” అంటూ విసురుగా వీరమ్మ చేతిలోంచి లాక్కుంది కోడలు.

“అదిగాదు బిడ్డా! బుడ్డాడు కిందపడి ఏడత్తంటే ఎత్తుకుని ఆడిత్తన్నా!”

“ఏడ్చినా సరే వాడ్ని ముట్టుకోవద్దని చెప్పాను కదా! దర్టీ ఉమన్… ఛీ ఛీ మనుషులైతే ఒకసారి చెబితే వినాలి. ఆ కంపు అవతారంతో వాణ్ణి తాకొద్దని లక్షసార్లు చెప్పాను. ఎందుకు నన్నిలా విసిగిస్తావు. నీకెంత కావాలో చెప్పు నీ కొడుకుతో చెప్పి ఇప్పిస్తాను. వెంటనే మీ ఊరికి వెళ్లిపో, కోడలు పొమ్మందని చెప్పకు. నీకే ఇక్కడ ఏం తోచటం లేదని చెప్పు. మళ్లీ ఎన్నడూ ఇక్కడకు రాకు. నువ్వు పోయిన్నాడు ఆయన వచ్చి నీకు దినవారాలు చేస్తాడు. పీడా విరగడై పోతుంది.”

ముడుచుకు పోయిన మొగంతో కడుపులోంచి వచ్చే వెతను ఆపుకుంటూ తన గది లోకి వెళ్ళిపోయింది.

‘ఇంక యీడొక్క సెణం వుండొద్దు. కడుపు తీపికి యీడికొస్తే కుక్కకన్నా యీనంగా సూత్తంది, కోడలు. ఇంటికచ్చినోళ్లతోటి, తన మొగుడితోటి మంచిగనే ఉంటుంది. తనను జూడంగానే అగ్గిల వడతది. ఏం చెయ్యాల దేవుడా! నా బతుకు గిట్లయిపాయె. ఊరికి పోబుద్ధయితలేదు. ఊరోళ్లందరు ఏమంటారు, కొడుకు కోడలెల్లగొట్టినార. ఎందుకొచ్చినవ్ మల్ల ఆడనే మంచిగుండక అని చెప్పి పొడుతరు. ఈడ మాత్రం ఇగ ఉండుడు మంచిదికాదు. ఏమన్నంటె కొడుకును కట్టపెట్టాలె. అయినా ఆని కేమని చెప్పాలె. బిడ్డా నీబారియ నన్ను మంచిగ సూత్తలేదు, నీ పిల్లగాన్ని ముట్టనిత్తలేదు. అంటే ఆడేమనుకుంటాడో. ఊరికే పోతనని చెప్పి ఇంకేదన్నా ఊరికిపోత. యాడనన్న కట్టం జేసుకొని బతుకుత. యియ్యాలేమైనా సరే ఎల్లిపోతనని చెప్త. సక్కంగ టేషనుకు బొయ్యి. పట్నంబోత ఆడనే బతుకుత.’ మనసులో తనకు తనే సర్ది చెప్పుకున్నది.

“ఏంటి వీరమ్మా! ఉన్నట్టుండి ఒక్కసారే ఆలోచనల్లో పడ్డావ్?” నందిని మాటలతో ఈ లోకంలోకి వచ్చింది, వీరమ్మ.

“ఏం లేదమ్మా” అని సర్దుకుంది.

“నేను లోపలికి వెళ్తున్నా, పిల్లల్ని చూసుకో, ఆ బాబు జాగ్రత్త. మిగతా పిల్లల్లో కలిపి ఆడుకునేట్లు చూడు” అంటూ లోపలికి వెళ్ళిపోయింది నందిని. “అలాగే నమ్మా!” అంటూ పిల్లవాడిని ఎత్తుకుని ముద్దాడింది. మిగతా పిల్లలందరితో కలిపి ఆడించసాగింది.

***

‘ఏంటివ్వాళ మీ ఇద్దరి ఆఫీసులు ఒకేసారి వొదిలి పెట్టాయి మిమ్మల్ని, రోజూ మీరొక్కరే వచ్చి బాబును తీసుకెళ్తున్నారు కదా మందిరగారు. మీవారి కెలా కుదిరింది ఈ రోజు” అంటూ నవ్వుతూ అడిగింది నందిని.

“అవునండీ మీరన్నది నిజమే. మావారికి చాలా రోజుల తర్వాత ఈ రోజు కొంచెం తీరిక దొరికిందట. అందుకే ఇద్దరమూ కలిసి వచ్చాం”.

“ఏమంటుందీ మీ ఆవిడ. మీ బాబును బాగా చూస్తున్నామటనా లేక ఏమైనా కంప్లైంటు చేస్తున్నారా” పలకరించింది వాళ్ళాయన్ని నందిని. కలుపుగోలుగా మాట్లాడడం నందినికి అలవాటు.

“అబ్బే, కంప్లయింటేం లేదండీ, చాలా బాగా చూస్తున్నారట, మీరూ మీ ఆయా కూడా..”

“అవునూ, ఆయా అంటే గుర్తుకు వచ్చింది, నందినిగారూ, నేను ఎప్పుడు వచ్చినా మీ ఆయా కనిపించదేమిటి. ఆయా ఉందన్నారు గాని. ఇంతవరకు ఆవిణ్ణి చూడటం పడలేదు.”

“అబ్బే ఏం లేదండీ ఇక్కడికి దగ్గర్లోనే డయరీ ఉంది. రోజూ సరిగ్గా మీరు వచ్చేముందే పాలకు వెళ్తుంది. ఆయా దగ్గరుండి పాలు పిండించుకుని తెస్తుంది. పొద్దున్నేమో మీరొచ్చే టైముకి పెరట్లో అంట్లగిన్నెల దగ్గరుంటుంది. ఇదివరకు ఓ పనిమనిషుండేది. కానీ ఈ ఆయమ్మ వచ్చిన తర్వాత నేనుండగా వేరే పనిమనిషెందుకమ్మా అని బలవంతంగా మానిపించింది. అందుకే మీరామెను చూసే అవకాశం రాలేదు. ఎలాగూ ఇద్దరూ వచ్చారు కదా, కాస్సేపు కూర్చొని వెళ్ళండి. మా వారుకూడా వచ్చే టైమయ్యింది. కాఫీ తాగి వెళ్తురుగాని. ఇంతలో ఆయమ్మ కూడా వస్తుంది చూద్దురుగాని.”

ఇద్దరూ చిరునవ్వుతో నందిని మాట కాదనలేక కూర్చొని కబుర్లలో పడ్డారు. ఇంతలో భార్గవ్ కూడా వచ్చి వారితో కలిసి పోయాడు. “ఉండండి నేను కాఫీ తెస్తాను.” అంటూ లోపలికి వెళ్ళింది నందిని. మిగతా పిల్లల తల్లిదండ్రులు ఎవరి పిల్లల్ని వారు తీసుకెళ్ళారు.

ఇంతలో గేటు తీసుకొని పాల క్యాన్‌తో లోపలికొచ్చింది వీరమ్మ. వరండాలో ఎవరో ఉండడం చూసి షెడ్డు పక్కనే ఉన్న పెరటి గుమ్మంలోంచి లోపలికి వెళ్ళింది. అటు తిరిగి కూచోవటంతో వరండాలోని వాళ్ళకు ఆయమ్మ కన్పించలేదు. లోపల్నుండి కాఫీ కప్పుతో వచ్చిన నందిని “ఆయమ్మా! ఇలారా నిన్ను చూద్దామని వీళ్ళిక్కడ కూర్చున్నారు” అంటూ పిలిచింది.

“వస్తున్నానమ్మా!” అంటూ లోపలినుండి మాట వినిపించింది. ఆ మాట వినగానే అక్కడ కూర్చున్న వాళ్ళిద్దరి ముఖాలు ప్రశ్నార్ధకంగా మారి ఒకరి చూపులు మరొకరి చూపుల్ని ప్రశ్నించాయి. ఇదేదీ గమనించని నందిని “కాఫీ తీసుకోండి” అంటూ కాఫీ కప్పుల్ని వాళ్ల కందించింది.

కాఫీ కప్పుల్ని తీసుకొని సిప్ చేయబోతుండగా “పిలిచిన్రా అమ్మా,” అంటూ వచ్చిన వీరమ్మ ఒక్కసారిగా బిత్తర పోయింది.

శంకర్ మందిరల చేతుల్లోని కాఫీ కప్పులు కదిలి ఒంటి మీద కాఫీ ఒలికి పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here