[dropcap]క[/dropcap]నుబొమ్మలు చిట్లించో కళ్ళు ముడిచో
పెదాలు బిగించో మూతి విరిచో
నువ్వున్న చోటుని వెతుకుతాను.
దిక్కులకి చూపుని తిప్పుతాననీ
ఆకాశానికి తలని ఎత్తుతాననీ
చెప్పడమిప్పుడు అప్రస్తుతం.
నేలచూపులెందుకననుకుంటాను కానీ తప్పని ప్రస్తుతం.
చూస్తే ఆకాశం వెన్నెల అవ్వదు.
నక్షత్రాలకి అందం అమావాస్యప్పుడే కాబోలు.
ఉన్నావా అని గుప్పిట్లో ఇసుకను జారవిడుస్తూ
నిందించేది నిన్నా? అలలనా? తీరాన్నా?.
ముగింపు వాక్యం ఒక్కటీ దొరకదు.
భావరహితభరితమేదైనాసరే శూన్యావస్థనుకోనా.
ఎక్కడనే ఆచూకీ ఇక వద్దు.
నిర్లిప్తత ఇప్పుడు పొమ్మన్నా పోదు.
దొరుకుతావనుకున్నాసరే వెతుకులాట మరిపై వద్దు.