[dropcap]’వే[/dropcap]ణు’ ఓ పేరుమోసిన ప్రభుత్వ సంస్థలో ఉద్యోగి. అతడికి ఎంతో ‘పూర్వానుభవం’ వున్నదన్న కారణంగా అతడికన్నా కూడా యింకెంతగానో అనుభవం, సాంకేతిక నైపుణ్యాలు ఉన్నవాళ్ళందరికన్నా గూడా మిక్కిలిగా, వీలుపడినంతగా ‘హయ్యరు గ్రేడు’ నిస్తూ అతనికి అపాయింటుమెంటు నిచ్చారు. ఉన్నతాధికారుల అండదండలు వున్నందున వేణు ‘ప్రతిభావ్యుత్పత్తుల’కు మరొక్క ఉదాహరణ – అదే సంస్థలో అతని భార్యకు కూడా ఉద్యోగాన్ని యిప్పించుకోగలిగాడు! భార్యాభర్తలు యిద్దరూ కూడా ప్రభుత్వ సంస్థ ఉద్యోగులు. రెండు చేతులా ఆదాయం.
వేణును అందరికన్నా గూడా అన్నీ ‘సుగుణాలు’ నిండా నిండివున్న ‘పుట్ట’ అనే అనాల్సివుంటుంది! దురలవాట్లు అనబడేవి ఏవీ గూడా లేనివాడనే చెప్పాల్సివస్తుంది! అతడు ‘టీ’ కూడా అలవాటుగా తాగడు! సిగరెట్టు కూడా కాల్చడు! వాటిని తాగనిదీ, పీల్చనిదీ కేవలం తన డబ్బులతోనే. ఎవరన్నా అందిస్తే మట్టుకు సిగరెట్టు పొగ పీలుస్తాడు. ‘విస్కీ’ రుచి చూస్తాడు!
అతడి ఆరాటమంతా ఆఫీసు పనులమీద గాదు. ఆఫీసరు వ్యక్తిగత ‘యిబ్బందుల’ మీదనే! ఆఫీసు పని గంటల్ని గడిపేది ఆఫీసు పనుల్లోగాదు – తను అందజేసిన అప్పుల్ని, వడ్డీల్ని వసూలు చేసుకునే పనులమీదనే.
ఆఫీసరు గిరీలతో విర్రవీగే వాళ్ళంతా కూడా ‘పనిడిగలుగు వాని బానిస కొడుకులే’! వేణు పై అధికారులు వేణును తమ భుజాలమీద మోస్తూంటారు! ఆఫీసులో వుండాల్సిన వేళల్లో వేణు ఆఫీసర్ల యిళ్ళళ్ళో వుంటూంటాడు. ఊరివాడు ధనికు జేరగా గోరును అన్నట్లుగా ఒకరికొకరు అండ – ‘అడవి – పులి’ లాగా ఒకరి అండతో ఒకరు ఎదుగుదల!
వేణు విత్తాన్ని’ పొదిగించే విత్తనాల్తోనే సేద్యం చేస్తూంటాడు. డబ్బును పోగేసే అన్ని కార్యరంగాల్లోనూ వేణు పొదిగివుంటాడు. తెలివిలేని మేని బలమేమిజేయరా, శిలలసేవ జేయ ఫలమేమి గలుగురా అనుకోని, సాంకేతిక నైపుణ్యాలు ఎంత మీదకు ఎదిగిస్తాయి? ఎగురవేయ బంతిని ఎందాక నిల్చురా? అనుకుంటాడు. సాంకేతిక కార్య నైపుణ్యాలమీద కాదు గురి, ‘కార్యపాలక’ నైపుణ్యాల మీదనే చూపులు. ఇహమున సుఖియింప హేమ కారక విద్య! వైపు తెలిసి పలుకవలెను! యుపముతోనే యుక్తియున్నది కనవలె. చూపులోని కుంచి చూడంగ వలయురా! దారి తెలియ బుధుల దాపున మెలగుడీ! వేళ్ళతాళ్ళు పట్టుకోని ఆకుల దాకా పాకాలి!
ధనము వలన కొంత, బలము వలన కొంత! వేణు ఆఫీసులో కూడా, గాంధీతాత ఖద్దరు బట్టల్నే వేసుకుంటాడు. మరీ ‘ధోతి’ కట్టడు గానీ, కాంగ్రేసు లాల్చీ, పైజామా ధరిస్తూంటాడు. ఆఫీసు ‘యూనిఫారం’ డ్రెస్సులు తొడుక్కోవడంలో అతడికి అన్నీ సడలింపులే, మినహాయింపులే, మనదేశంలో మల్టీనేషనల్ కంపెనీలకు లాగా! గణికిలొప్పియున్న గవ్వలు చెల్లవా! అన్నట్లుగా వేణు, భటుడు వెంటలేక ప్రభువు శోధించునా అన్నచందంగా అతడి అఫీసర్లు! గుంటపట్టు చెలమ కుల ముద్ధరించురా అన్నట్లుగా యిద్దరూ!
అందుచేత ‘లీడర్’ అన్పించుకోవాలన్నది వేణు వుబలాటం. ప్రత్యక్షంగా అతడు అలాంటి చేతలకెప్పుడూ ముందుకు రాడు. కార్మికసంఘాల్లో, కులసంఘాల్లో, ‘ప్రగతి’ సంఘాల్లో, ‘సంఘసేవా’ కార్యక్రమాల్లో తెరచాటునే వుంటూ రావాల్సిన ఫలాలన్నింటినీ జోపుకుంటాడు! దేన్నీ వదులుకోడు. ఏ త్రోవనీ విడిచిపెట్టడు. కాలిబాటల్ని, హైవేలను అన్నింటినీ తొక్కి వదులుతాడు! చెడిపె కొడుకు మిగుల చేయునచారంబు అన్నట్లుగా.
కలసివచ్చువేళ ఘనులౌదురల్పులు! వేణు అప్పట్లో ఎందుకూ పనికిరానిదని తల్చబడిన, నగరం నడిబొట్టు ఒడ్డున వున్న ఓ స్థలాన్ని గజం కొన్ని రూపాయల లెక్కన కొనిపెట్టాడు. దూరపు చూపుతో కావచ్చు. చేతినిండా డబ్బులు వున్నందున కావచ్చు. తర్వాత తర్వాత కాలంలో నగరం వాస్తూంటే ఆ బొడ్డుఒడ్డున వున్న ఆ స్థలం కాస్తా నగరం నడిబొడ్డులోకి దొర్లింది! దాంతో ఆ స్థలం విలువ ఊహకందని ఎత్తులకు ఎగిసింది. గజం లక్షలల్లో! ఆ నగరం నడిబొడ్డులో అంతస్తుల మేడ కట్టాడు. ఇంటి అద్దెలకన్నా మించి, అతడి యింటి గోడల్ని, కాంపౌండు గోడల్ని వాడుకుంటూన్నందుకుగానూ అడ్వర్టయిజింగ్ ఏజంట్లు యిస్తూండే పెద్దపెద్ద మొత్తాలు….
“వేణూ! ఇదేమిటి ‘ఫలానా అతడు’ మీ బంధుమిత్రుడు గదా! ఓ ఛోటా కంట్రాక్టరు. ఏ విధంగా చూసినా కూడా, చదువులో, ఉద్యోగంలో, డబ్బులో – నీకన్నా దేంట్లోనూ ఎక్కువ వాడు కాదు గదా! అలాంటప్పుడు అతడేమో నవాబు లాగా కుర్చీలో చేరగిలబడి వుంటే, నీవేమో అతడి ముందు మరీ చేతులు కట్టుకుని నిల్చోని వుండడమేమిటి అతడి నౌకరులా! దేనిలో కాకపోయినా ఆఖర్న వయసులో నీకన్నా పెద్దగా పండిపోయినవాడా అంటే అదీ కాదాయె! పైగా నీవు ప్రభుత్వ సంస్థ ఉద్యోగివి. దాని గౌరవాన్ని కూడా మంటకల్పుతూ చేతులు కట్టుకుని నిల్చోవడమా బంధు – మిత్రుడి ముందు! చూస్తూంటే, చూసేవాళ్ళకే సిగ్గుగా వుంది!” అని తెల్సినవాళ్ళంటే
“బయటకు చూడ్డానికి అతి వినయ, విధేయతల్ని నటించాలి! మనకన్నా తక్కువవాడ్ని కూడా ’నీవు ఎంతో ఎక్కువ వాడివి’ అన్నట్లుగా ‘మునిగచెట్టును’ ఎక్కించాలి! అప్పుడేగదా మనకు గిట్టుబాటు! తమను తాము పెద్దగా తల్చుకునేవాళ్ళు, మీలాంటి వాళ్ళు వెర్రిబాగులవాళ్ళు! నేను బోర విరిచాననుకో, అతడు బెదిరిపోతాడు. కోళ్ళను బెదరగొడితే నష్టం ఎవరికి? పిల్లికి! యజమాని దుడ్డుకర్రను భుజానవేసుకుని వస్తాడు. కోడిమాట ఏమోగాని పిల్లికి కాలు విరుగుతుంది. అతడి ముందు నేను చేతులు నలుపుకుంటూ నిల్చోగానే నా అరచేతుల మీది రోమాలేమైనా రాలిపోతాయా! అనువైన చోట కూడా అధికులం అనరాదు! అతడి డాబూ, దర్పాన్ని యింకా యింకా పెరిగేలా చూసుకోవాలి! వెలితికుండ అతడు, నిండుకుండ నేను. కంచు అతడు, కనకం నేను! జగమెరిగిన బ్రాహ్మణుడిని నేను, చాటించు వేయించుకోవాలన్న యావ వున్నవాడు అతడు! ఎరుకయుండు వాని కెరుకయే యుండును, ఎరుకలేని వాని కెరుక లేదు, ఎరుకలేని ఎరుక ఎరుగులే తత్త్వంబు! తెల్సా!” అంటాడు వేణు.
వేణుది బలమా లేక బలహీనతా? గుణమా లేక లోపమా? వేణుది పెద్ద బలహీనత ఏదో కానిదే ఆ బంధుమిత్రుడు యితడ్ని ఇంటినౌకరునులా చూస్తాడా? వేణులో అంతపెద్ద బలహీనత ఏమిటి?
ఆ ‘ఫలానా బంధు – మిత్రుడు’ ‘పెళ్ళాం వూరెడితే’ అతడు లాడ్జింగుల్లో -మగువ సరసన, మధువు బిగువున బిగుసుకుని వుంటాడు. కాంతల కౌగిళ్ళలో ఖైదీయై వుంటాడు! తన మిత్రులకు కూడా ఆ సలహాలిస్తూంటాడు! “కానైతే పుట్టు గుడ్డివాడు – ధృతరాష్ట్రుడు! పెళ్ళాం కనడానికి పోతే ఆమె సగం వెల్తి మంచాన్ని అట్లాగే ఖాళీ పెట్టాడా! పాడుపెట్టాడా? దాన్ని మరో ఆడదాంతో సాపుకోలేదా? పుట్టుగుడ్డోడికి గబ్బిలంలా చెవులతోనే తప్ప కళ్ళతో చూడలేని వాడికే ఆడదాని మీద అంతగా చూపు వుంటే యింక ‘ఏ గోలం’ కులాగా జిగేల్ జిగేల్ మనే కళ్ళున్న మనకేనా ‘అది’ వుండగూడనిది!” అంటూంటాడు! అంతటి, అలాంటి వాడి ముందు, సకల వనాల పూవుల మకరందాల్ని గ్రోలుతూండే వాడిముందు వేణు చేతులు కట్టుకుని నిల్చోవడం!?….
ఓ రోజు – వేణు ఆఫీసులో కమ్ముకున్న పొగలు. ఆ క్రితం రోజు రాత్రి – వేణు భార్య ఓ లాడ్జింగులో తన శరీరంతో వ్యాపారం చేస్తూండగా పోలీసులకు పట్టుబడిందని! పెద్దల చేతుల మూలంగా కేసు మాఫీ అయిపోయిందని!
వేణు – సతులనిచ్చి తాము సమ్మతింత్రు అన్నట్లుగా! వేణు భార్య – వెలదిచక్కదనము, వెరపైన ఈడును, తొడల మెరుపు, మోవి, తోరంపు కుచములు, ఓరకప్పు గలుగు యువిద! డబ్బు గురించి – మరుని కళలమించు, మనసు పారు! లవణమెంత దాని లాభంబునునెంత! డబ్బు ఎదుట ‘శీలం’ అప్పణం! డబ్బులకు – కచముల, కుచముల, కటి జఘనమ్ముల, వెలయునాభి సుడుల జూపి…. డబ్బుకు నీది కానిదేదీ లేదు నాలో అంటుంది పరపురుషుడి ముందు! ఒంపుసొంపుల మెరపు మెరిపించవే అని పరపురుషుడు, ‘పరువాల రాగాలు పలికించనా’ అని ఆమె! “చూసిన అందమె తిరిగి తిరిగి నను చూడనీ” అని పరపురుషుడు, “సొగసు వేణువు జేసి పలికించరా, యిక అందాల వుయ్యాల లూగించనా?” అని ఆమె. “నీకడ సురలోకభోగాలే” అని అతడు! డబ్బు గురించి – నలిగిపోయిన కలువకన్నె. కడమ విద్యలెల్ల కల్ల మాధులకురా, ‘యోగ’’ పురుషులేల యొడల పాటించును అన్న తత్వాన్ని ఆరగించి, జీర్ణించుకున్న వాళ్ళు!… డబ్బు – పూవుపిందెలట్లు భువనముల్ నిండెరా అన్నట్లుగా… సొగసుకనుల దాని సొంపుతోడ, చేరుచుండు ధనము…
ఏలాంటి సాంకేతిక నైపుణ్యాలు కల్గిలేని వేణు జాతీయ స్థాయి ‘శ్రమరత్న’ పురస్కారానికై సిఫారసు చేయబడ్డాడు అధికారుల చేత! ‘అబ్బ’యున్న వాని కన్నియున్నట్టులే!
వేణు జాతీయస్థాయి ‘శ్రమరత్న’ల్లో ఒకడుగా కలుపబడ్డాడు ఏలాంటి ‘శ్రమ’లు తెలియకుండానే! వేణు దేశ ప్రథమ పౌరుడి చేతుల మీదుగా నగదు పురస్కారాల్ని అందుకున్నాడు! వేణు – భార్యతో సహా ప్రశంసల్ని అందుకున్నాడు! పురుషుడు ఘనుడయ్యాడంటే కారణం స్త్రీ ప్రచ్ఛన్న హస్త సహాయ సహకారాలే పునాదిరాళ్ళు గదా! ఆ తర్వాత ఆ పుణ్య దంపతులిద్దరూ మరెన్నో సత్కారాల్ని బడయక తప్పలేదు. అంత మచ్చ పెట్టుకుని చందమామ – నీకెందుకింత సుబ్బరం చందమామ!
వేణుకు అందజేయబడ్డ ఆ నగదు పురస్కారాల మొత్తంలో యిమిడి వున్న ఎవరెవరి – ఫలాలందని చెమట బిందువులు ఎన్ని? పొద్దుంటే మా పుండని, మాపుంటే రేపుండని – వుంటే అప్పులమీదే అయినటువంటి బడుగు జీవులనుండి రాబట్టిన భాగం మొత్తం ఎంత? మానాలు కాపాడడానికే బ్రతికే, ‘నేత’ బడుగుజీవులు ప్రాణాలు తీసుకుంటుంటే, వాళ్ళ విగతాత్మలు వేసుకున్న చందాల మొత్తం ఎంత? జీవాల్ని నిలుపడానికి జీవించడానికి జీవించే జీవులు, జీవింపనలవిగాని స్థితుల్లో ఉరితాళ్ళ కెక్కుతుంటే, వాళ్ళ విగతాత్మలు వేసుకున్న చందాల వంతు ఎంత?
‘వేణు’ లాంటి వాళ్ళకు తమచేతుల మీదుగా నగదు మొత్తాల్ని అందిస్తున్న వాళ్ళకు విగతజీవులవుతున్నఅభాగ్య జీవుల పట్ల గల బాధ్యత ఎంత? నదుల జీవజలాలు, ఉప్పుసముద్రంపాలు… సస్యశ్యామల దేశం, అయినా నిత్యం క్షామం… పేరుకు ప్రజలది రాజ్యం, పెత్తందార్లకే భోజ్యం… ఆళ్ళు దిగి ఈళ్ళేక్కే, ఈళ్ళు దిగి ఆళ్ళెక్కే!… జాతికి గ్రహణం పట్టినవేళ వూరంతా మింగినోడు, వుయ్యాల వూగుతాండు!… వేణు యిప్పుడు దేశ ‘శ్రమరత్నాల్లో’ ఒక ‘రత్నం’! శ్రమంటేనే ఎరుగని శ్రమరత్నం.