శ్రవణమే అత్యుత్తమ సాధనా మార్గం

0
2

శ్రవణం ప్రాధాన్యత:

మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు
(భగవద్గీత 7వ అధ్యాయం 1వ శ్లోకం)

[dropcap]ఓ[/dropcap] అర్జునా, మనస్సు నా యందే లగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నువ్వు నన్ను చేరే మార్గం ఇప్పుడు తెలుపుతాను, శ్రద్ధగా విను అని పై శ్లోకం యొక్క భావం.

భగవద్గీత యొక్క సమగ్ర సారాంశం జీవుడు ఆత్మ స్వరూపుడని. వివిధ యోగ సాధనలను అభ్యసించడం ద్వారా తనను తాను ఆత్మ సాక్షాత్కార స్థితికి ఉద్ధరించుకోవడం సాధ్యమే అని చెబుతోంది. అయితే మార్గం మాత్రమే గీత చూపిస్తుంది, ఆ మార్గంలో క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో నడవడం అన్నది పూర్తిగా సాధకుని చేతిలోనే వుందన్నది విస్పష్టం.

భగవంతుని యందు మనస్సును సంపూర్ణంగా లగ్నం చేసి, ఎలాంటి సంశయ ఆలోచనలకు తావివ్వకుండా నిరంతర ఆరాధనయే అన్ని యోగాలలో కెల్లా ఉత్తమమైనదని  గీత ప్రబోధిస్తొంది. అంటే భగవంతునిపై మనస్సును లగ్నం చేయడం ద్వారానే పరతత్వపు విశిష్టత అవగతం చేసుకోవడం సాధ్యం. పరిపూర్ణ భక్తి భావన తప్పితే ఇతరమైన యోగ సాధనల ద్వారా పామరులు భగవంతుని చేరడం చాలా కష్టం.

అయితే ఈ మనస్సును లగ్నం  చేయడం అనే ప్రక్రియను మొదట భక్తియుత సేవతో ప్రారంభించాలి. దానితో పాటు నవ విధ భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గం ఎంపిక చేసుకోవచ్చు కాని అన్నింటి కంటే ముఖ్యమైనది అయిన శ్రవణం అంటే భగవంతుని గూర్చి ప్రవచనాలు, కీర్తలను, శ్లోకాలు, నామ పారాయణ వంటివి పవిత్రమైన మనస్సుతో వినడం ప్రారంభించాలి. భాగవతంలో ప్రథమ స్కంధములో రెండవ అధ్యాయంలో తెలిపిన విధంగా భక్తులు చిత్తశుద్ధితో భగవంతుని గూర్చి శ్రవణం చేస్తే వారిని తన సన్నిహిత స్నేహితునిగా గుర్తించి ఆధ్యాత్మిక మార్గంలో ఉద్ధరిస్తాడు. ఎంత ఎక్కువగా శ్రవణం అనే సాధన చేస్తే అంత త్వరగా భక్తి తత్వంలో పాదుకొనగలుగుతాడు. మానవులు రజ, తమో గుణాలు, కామము, లోభము, మోహం ఇత్యాది అరిషడ్వర్గాల నుండి విముక్తుడు అవుతారు. చిత్తశుద్ధి ఎక్కువైనప్పుడు మనస్సు అప్రయత్నంగా భగవంతునిపై లగ్నం అయిపోతుంది. ఇతరమైన ఆలోచనలు అసలు దరి చేరవు. కళ్ళు చెమరించడం, గొంతుక ఆర్చుకొనిపోవడం, శరీరం ఆపాదమస్తకం భక్తి భావనతో పులకించిపోవడం వంటి సాత్విక భావాలు అప్రయత్నంగా కలుగుతాయి. అప్పుడు సాధనా మార్గంలో తొలి విజయం అందుకునట్లు లెక్క.  సాధన మరింత తీవ్రతరం అయినప్పుడు మన ప్రమేయం లేకుండానే మనస్సు నిశ్చలం అయిపోయి సమాధి స్థితి లేక ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. మనస్సులో ఆ కల్మషాలు తొలగిపోతే వారు శుద్ధ సత్వ స్థితిని పొంది ఎవరు ఈ జగత్తులో సృష్టి, స్థితి, లయ లకు కారణభూతుడో అటువంటి పరమాత్మను శ్రీఘ్రమే చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here