శ్రీవర తృతీయ రాజతరంగిణి-1

7
3

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]శ్రీ[/dropcap]వర పండిత కృతా జైన రాజతరంగిణి

ప్రథమ తరంగః

ప్రథమ సర్గః

~

శివాయాస్తు నమస్తస్మై  త్రైలోక్యైక మహీభుజే।
అశేషక్లేశనిర్ముక్త నిత్త్యైశ్వర్య దశాజుషే॥
(శ్రీవర రాజతరంగిణి, 1)

కల్హణుడు ఆరంభించిన సంప్రదాయాన్ని, జోనరాజు కొనసాగించిన సంప్రదాయాన్ని అనుసరిస్తూ శ్రీవరుడు తన రాజతరంగిణిని ఆరంభించాడు.

అశేష క్లేశాలను తొలగించేవాడు, ఐశ్వర్యాన్ని అందించేవాడు, ముల్లోకాలకు మహారాజు అయిన శివుడికి నమస్కరిస్తూ రాజతరంగిణి రచనను ఆరంభిస్తున్నాడు శ్రీవరుడు.

శ్రీవరుడి రాజతరంగిణి ఇతర రాజతరంగిణిలతో పోలిస్తే ప్రత్యేకమైనది. కల్లణుడు రాజతరంగిణిని ఎలాంటి రాజాశ్రయం పొందకుండా స్వతంత్రంగా రచించాడు. రాజతరంగిణి రచనలో కల్హణుడి ప్రధానోద్దేశం రాబోయే తరాలకు తమ అత్యద్భుతమైన గత వైభవాన్ని గురించి తెలిసేట్టు చేయటం. కల్హణుడి కళ్ల ముందు కశ్మీర రాజుల గత వైభవం కరిగిపోయింది. మహాద్భుతమైన రాజులు కశ్మీరును పాలించారంటే సమకాలికులే నమ్మలేక పోతున్నారు. ఎందుకంటే కల్హణుడు దర్శించిన సమకాలిక కశ్మీర్ సమాజం అల్లకల్లోలం అవుతూ, దిక్కుతోచక బిక్కుబిక్కుమంటున్న సమాజం. అధికార దాహంతో ఒకరితో ఒకరు కలహించుకుంటూ కశ్మీరాన్ని మరుభూమిగా మలస్తున్నారు వారు. ప్రజలను పట్టించుకోకుండా పట్టణాలు, నగరాలు, పల్లెలు, పంటలన్నిటినీ ధ్వంసం చేస్తున్నారు. శాంతి లేదు. సుస్థిరత్వం లేదు. అభివృద్ధి లేదు. ఆనందం లేదు. పోరాటం, చావులు, తగులపెట్టటాలు, చంపుకోవటం, వేటాడటం తప్ప మరేమీ లేదు. ఏరోజు కారోజు గడిస్తే మరో రోజు గురించి ఆలోచించకుండా సంతృప్తి పడాల్సి పరిస్థితులు. ఎవరన్నా ఎవరికీ గౌరవం లేదు.. రాజుకు విలువ లేదు. పాండిత్యంతో పని లేదు. దైవం గురించిన ఆలోచన లేదు. పాపపుణ్యాల భీతి లేదు. నైతిక విలువల ప్రసక్తి లేదు. ఇదే సమయాని కశ్మీరులో పెరుగుతున్న ఇస్లామీ ప్రభావాన్ని కల్హణుడు గమనించాడు. ఎవరినయినా ‘తురుష్కుడు’ అని పిలవటం నిందాత్మక పదంగా భావించే కాలం నుండి, పోరులో రాజులకు సహాయం చేయటం వల్ల నిర్ణయాత్మక స్థానాలను తురుష్కులు ఆక్రమించే స్థాయికి ఎదిగారు. ఇదంతా కల్హణుడు గమనించాడు.

ఇలాంటి పరిస్థితులలో ఒకప్పడు శివ భక్తి భావనలో వితస్త దారిని మళ్ళించిన గొప్ప రాజులున్నారంటే కట్టుకథలానే తోస్తుంది. కశ్మీరం నుండి వెడలి సమస్త భారతాన్ని దాటి శ్రీలంక వరకూ, అస్సాం దాటి తిబ్బెత్తు వరకు, గాంధారం (ఆఫ్ఘనిస్తాన్) దాటి ఎడారి రాజ్యాల వరకూ కశ్మీర సామ్రాజ్యం విస్తరింపజేసిన మహావీరులైన రాజులు ఉన్నారంటే నమ్మబుద్ధి కాదు. రాజ్య అధికారాన్ని దైవదత్తంలా భావించి, తనని తాను ప్రజాసేవకుడిలా భావించికుని నగరం వెలుపల పర్ణశాల నిర్మించుకుని, రాజవైభవాన్ని, ఐశ్వర్యాలను త్యజించి, రోజూ సహస్ర లింగాభిషేకం జరిపిన తరువాత దినచర్యను ఆరంభించే సన్యాసి లాంటి మహారాజున్నాడంటే ఒప్పుకోరు. కాబట్టి, తెరపై నుంచి అదృశ్యం అవుతున్న ఒక ఉజ్జ్వల చరిత్రను భావి తరాల వారికి సజీవంగా అందించాలన్న ఉద్దేశంతో కల్హణుడు రాజతరంగిణి రచనను చేపట్టాడు. అందుకే రాజతరంగిణి కావ్యం ప్రధానోద్దేశం శాంతరసాన్ని ఉత్పన్నం చేయటం అని స్పష్టం చేశాడు.

ఈ ‘శాంతరసం’ కశ్మీరులో అత్యంత ప్రాధాన్యం పొందిన రసం. భరతుడు నాట్యశాస్త్రంలో ప్రస్తావించిన రసాల జాబితాలో ‘శాంతరసం’ లేదు. కశ్మీరును జయా పీడుడు పాలిస్తున్న కాలంలో అతని ఆస్ధానంలోని పండితుడు ఉద్భటుడు శాంతరసాన్ని ప్రధాన రసాల జాబితాలో చేర్చాడు. తరువాత రామాయణ, భారతాలపై వ్యాఖ్యానిస్తూ ఆనందవర్ధనుడు శాంతరసం ప్రాధాన్యాన్ని సృష్టం చేశాడు. నాట్యశాస్త్రంపై అభినవగుప్తుడు వ్రాసిన వ్యాఖ్యానం ‘అభినవ భారతి’లో శాంతరసాన్ని నిర్వచించి లోతుగా వివరించాడు. వీరిలో ఆనందవర్ధనుడు అనంతవర్మ కాలం నాటి వాడు. అభినవగుప్తుడు లలితాదిత్యుడి కాలం నాటి వాడు. కల్హణుడు గొప్ప పండితుడు. తన రాజతరంగిణి పఠనం ద్వారా క్షణభంగురమైన జీవన లక్షణం గ్రహింపుకు వచ్చి, నదిలో అలల్లా ఎగసిపడి, వెనక్కు వెళ్ళిపోయే మానవ జీవిత లక్షణాన్ని అర్థం చేసుకుని వ్యక్తులు – అహంకార మమకారాలను వీడి సంతృప్తితో ఆనందంగా శాంత భావనతో ఈ ప్రపంచంలో జీవితం గడపాలని కల్హణుడు ఆశించాడు.

కల్హణుడి తరువాత రెండు మూడు వందల ఏళ్ల తరువాత జోనరాజు రాజతరంగిణిని కొనసాగించాడు. అయితే, కల్హణుడు రాజతరంగిణి రాసిన నాటి పరిస్థితులకూ, జోనరాజు రాజతరంగిణిని కొనసాగించిన నాటి పరిస్థితులకూ అనూహ్యమైన తేడా ఉంది. గతం సంపూర్ణంగా ప్రజల మనస్సుల నుండి తొలగిపోతుంది కాబట్టి, వారికి తమ గతం తెలియాలన్న ఉద్దేశంతో కల్హణుడు రాజతరంగిణి రాశాడు. కల్హణుడు ఉహించినట్టు అతని మరణం తరువాత కశ్మీరం అతి వేగంగా ఇస్లామీ సుల్తానుల అధికారంలోకి వెళ్లిపోయింది.

కశ్మీరుపై అధికారం సాధించిన సుల్తానులు ప్రజలకు సంపూర్ణంగా గతంతో సంబంధం లేకుండా చేయాలని సంకల్పించారు. గతం గుర్తులను చెరిపి వేయాలని తీవ్రంగా ప్రయత్నించారు. బలవంతంగా, బెదిరించి, మతం మార్చారు. మారని వారిని హతమర్చారు. సామాజిక జీవన విధానాన్ని సంపూర్ణంగా రూపాంతరమొందించారు. ఇస్లాం మత సూత్రాల ప్రకారం కశ్మీరులో పాలనను ఆరంభించారు. దాన్లో ఇస్లామేతరులను కాఫిర్‍లుగా భావించి, వారిని ద్వితీయ శ్రేణి పౌరుల కన్నా హీనంగా చూడటం కూడా ఓ భాగం. ఒక దశలో కశ్మీరులో ఇస్లామేతర కుటుంబాలు కేవలం 13 మిగిలాయి. వారు కూడా ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో అని భయపడుతూ, ఎలాంటి గౌరవం, హక్కులు లేక బిక్కుబిక్కుమంటూ, అయినా, మొండిగా జీవనం సాగించారు. వారికి ఎలాంటి హక్కులు లేవు. న్యాయం జరిగే ప్రసక్తి లేదు. ఎవరైన ఏ క్షణంలోనైనా వారి ఇంటిని ఆక్రమించుకోవచ్చు. కాఫిర్‍లని నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపేయవచ్చు. ఇంట్లోని ఆడవారిని ఎత్తుకుపోవచ్చు. ఏమైనా చేయవచ్చు. ఎవరి దగ్గర మొర పెట్టుకుని వీలు లేదు.

ఇలాంటి పరిస్థితులలో జైనులాబిదీన్ రాజ్యాధికారం చేపట్టాడు. భారతదేశాన్ని పాలించిన అతి గొప్ప సుల్తానులలో అగ్రస్థానం జైనులాబిదీన్‍దే. ‘అక్బర్’ వంటి వారు కూడా జైనులాబిదీన్ తరువాతనే. అక్బర్ పరమత సహనంలో రాజకీయ అవసరాలున్నాయి. తనని తాను గొప్పవాడిగా భావించి తానే ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టేంత అహంకారం అక్బర్‍ది. కానీ జైనులాబిదీన్ ఇందుకు పూర్తిగా భిన్నం. కశ్మీరుపై సంపూర్ణాధికారం ఇస్లామీయులదే. కశ్మీరుకు బయట వారి నుంచి ఎలాంటి ప్రమాదం లేదు. అయినా సరే, ఇస్లామేతరులు కశ్మీరును వదలి వెళ్లిపోవటం వల్ల కశ్మీరులో లుప్తమైపోయిన విజ్ఞానం, ప్డాండిత్యం  వంటి వాటిని తిరిగి కశ్మీరులో నిలబెట్టాలన్న  సదుద్దేశంతో ఆయన కశ్మీరు వదలి వెళ్ళిన పండితులను  తిరిగి కశ్మీరుకు ఆహ్వానించాడు. వారికి రక్షణనిచ్చాడు. వారికి హక్కులనిచ్చాడు. ఇస్లామీయులతో సమానంగా చూశాడు. కీలకమైన పదవులను ఇస్లామేతరులకు కట్టబెట్టాడు. ‘ఇదేమని?’ ప్రశ్నించిన ఇస్లాం ఛాందసవాదులను అదుపులో పెట్టాడు.

జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించాడు. ఇస్లామేతరుల పండుగలు, పబ్బాలలో పాల్గొన్నాడు. వారి సంబరాలలో పాల్గొన్నాడు. వారి పద్ధతులను పాటించాడు. ఇస్లామేతరుల కావ్యాలు విన్నాడు. పర్షియన్ కావ్యాలను సంస్కృతం లోకి అనువదింప చేశాడు. సంస్కృత కావ్యాలను పర్షియన్ భాష లోకి అనువదింప చేశాడు. రెండు భిన్న సంస్కృతి సంప్రదాయాల నడుమ సుహృద్భావం, సమన్వయాలు సాధించాలని ప్రయత్నించాడు. అందులో భాగంగా రాజతరంగిణి గురించి తెలుసుకుని, దాన్ని కొనసాగింప జేయాలని ఆలోచించాడు. ఫలితంగా శౌర్యభట్టు – రాజతరంగిణి రచనను కల్హణుడు  వదలిపెట్టిన దగ్గర నుంచి జోనరాజు కాలం వరకూ కొనసాగించమని జోనరాజును ఆజ్ఞాపించాడు. అలా జోనరాజు రాజతరంగిణిని ఆరంభించాడు. కల్హణుడు ఎంతవరకూ రాశాడో అక్కడి నుంచి ద్వితీయ రాజతరంగిణిని రచించాడు. అయితే కల్హణుడిలా నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా రాజతరంగిణిని జోనరాజు రచించే పరిస్థితులు లేవు.

జోనరాజు రచనలో ఏ మాత్రం అవమానకరమైన వ్యాఖ్యలు దొర్లినా, తమను దోషులుగా చూపించినా, విరుచుకు పడేందుకు ఇస్లాం ఛాందసవాదులు సిద్ధంగా ఉన్నారు. తమ మందిరాలు కూల్చి, తమవారిని బలవంతాన మతం మార్చి, మారని వారిని చంపిన వారిని కూడా ఏమీ అనలేడు జోనరాజు. అందుకని జోనరాజు తన రాజతరంగిణిలో అనేక చేదు నిజాలను నర్మగర్భంగా చెప్పాడు. సికందర్ బుత్‍షికన్ చేసిన  ఘోరాలన్నిటికీ మతం మారిన సూహభట్టును దోషిగా నిలిపాడు. మతం మారిన సూహభట్టు క్రూరకృత్యాలన్నీ అతను స్వీకరించిన కొత్త మతం ప్రకారం దైవకార్యాలు కాబట్టి, మతం మారినా సూహభట్టును, మారిన పేరుతో ప్రస్తావించలేదు. ‘సూహభట్టు’ అనే అన్నాడు. సుల్తానులను రాజులనే అన్నాడు. కానీ ఇతరులను మ్లేచ్ఛులు, యవనులు అంటూ ప్రస్తావించాడు. అయితే ఏదో ఓ రకంగా తన పరిమిత పరిధిలో చేదు నిజాలను రాజతరంగిణిలో పొందుపరిచాడు భావితరాల వారి కోసం. భారతీయ రాజులను నిర్మొహమాటంగా కసిగా దూషించాడు. వారి చేతకానితనం, అధికార దాహం, అనైకమత్యాల వల్లనే కశ్మీరం సుల్తానుల ఏలుబడిలోకి వెళ్లిందన్న కసినంతా ప్రదర్శించాడు. ఇలా భారతీయ రాజులను దూషించటం ఇస్లామీయులకు, సుల్తానులకు ఆనందం కలిగించింది. కశ్మీరుకు శాంతిభద్రతలను తామే ఇచ్చామని వారు సంబరపడి పోయారు. ఈ రకంగా కత్తి మీద సాము చేస్తు రాజతరంగిణిని రచించిన జోనరాజు, జైనులాబిదీన్‌ను మాత్రం దైవ సమానుడిగా భావించాడు. ఆయన విష్ణుమూర్తి అవతారం అని మనస్ఫూర్తిగా ప్రస్తుతించాడు. పలు సందర్భాలలో రాముడితో పోలిక తెచ్చాడు. ఎందుకంటే, అసంభవాన్ని సంభవం చేశాడు జైనులాబిదీన్. కత్తులు కటార్లతో సిద్ధంగా ఉన్న ఇస్లాం ఛాందసవాదుల ద్వేష సముద్రానికి అడ్డుకట్ట వేసి ఇస్లామేతరులు మళ్ళీ కశ్మీరులో శాంతిగా, భద్రతలతో, సగర్వంగా జీవించే వీలు కల్పించాడు జైనులాబిదీన్. ఇది మానవమాత్రులకు సాధ్యం కాని పని.

రాజతరంగిణి రచన ఆరంభించే సమయానికే జోనరాజు వయోవృద్ధుడని పలువురు చరిత్ర విశ్లేషకులు భావిస్తారు. కశ్మీరు ఆవిర్భావం నుంచి క్రీ.శ 1148 వరకూ కల్పణుడి రాజతరంగిణి ప్రస్తావిస్తుంది. క్రీ.శ 1149లో కల్హణుడు మరణించటంతో రాజతరంగిణి రచన ఆగిపోయింది. మళ్ళీ జోనరాజు క్రీ.శ. 1149 నుండి 1457 వరకూ అంటే దాదాపుగా 300 ఏళ్ళ చరిత్రను ద్వితీయ రాజతరంగిణిలో పొందుపరిచాడు. 1459లో జోనరాజు మరణించే నాటికి జైనులాబిదీన్ పాలన సాగుతోంది.

క్రీ.శ. 1418 నుంచి 1419 వరకూ మొదటిసారి, మళ్ళీ, 1420 నుంచి 1470 వరకూ, అంటే దాదాపు యాబై ఏళ్ళు ఎలాంటి అవాంతరాలు లేకుండా జైనులాబిదీన్ కశ్మీరుపై రాజ్యం చేశాడు. 1459లో జోనరాజు మరణించే నాటికి జైనులాబిదీన్ పాలన 39 ఏళ్లు పూర్తయింది. జైనులాబిదీన్ ఉచ్చదశలో ఉన్నాడు. జోనరాజు అదృష్టం ఏమిటంటే ఆయన జైనులాబిదీన్ చివరి దశను చూడలేదు.

జోనరాజు మరణం తరువాత రాజతరంగిణిని కొనసాగించవలసిన బాధ్యత శ్రీవరుడిపై పడింది. శ్రీవరుడు జోనరాజు శిష్యుడు. శ్రీవరుడు జైనులాబిదీన్ సంతానానికి గురువు. జైనులాబిదీన్‍కు అత్యంత సన్నిహితుడు. సలహాదారు. జైనులాబిదీన్‍ను జోనరాజు దైవావతారంగా భావిస్తే, శ్రీవరుడు జైనులాబిదీన్‍ను దైవంలానే భావించాడు. అందుకని అతని రాజతరంగిణి రచనను పలువురు విశ్లేషకులు చరిత్ర గ్రంథంలా కన్నా, జైనులాబిదీన్ జీవిత చరిత్రలా భావిస్తారు. అయితే, కల్హణుడు రాసిన మూడు వందల ఏళ్ల తరువాత జోనరాజు రాజతరంగిణి రాసేనాటికి పరిస్థితులు సంపూర్ణంగా మారిపోయినట్టే, జోనరాజు మరణం తరువాత శ్రీవరుడు రాజతరంగిణి రాసేనాటికి కూడా పరిస్థితులు సంపూర్ణంగా రూపాంతరం చెందాయి. ఈ రూపాంతరం చెందిన పరిస్థితులు శ్రీవరుడు రచించిన తృతీయ రాజతరంగిణి రచనపై ప్రభావం చూపించాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here