Site icon Sanchika

శ్రీవర తృతీయ రాజతరంగిణి-10

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

చక్రాదీన్ క్రమరాజ్యస్థాన్ దృష్టాన్ జ్ఞాత్యా స తద్భువమ్।
హ్యర్వా మడవ రాజ్యాన్తర్దత్తవృత్తీన్న్య వేశయత్॥
(శ్రీవర రాజతరంగిణి, 40)

క్రామరాజ్యంలో చక్ర, ఇతర దుష్టులు ఉన్నారని తెలిసి రాజు (జైనులాబిదీన్) వారి భూములను ఆక్రమించి, వారికి జీవికకు సరిపడ వృత్తులు కల్పించాడు. వారిని ‘మడవ’ దేశంలో స్థిరపరిచాడు.

చరిత్రను పొదుగుకున్న శ్లోకం ఇది.

కశ్మీరును హిందూ రాజులు పాలిస్తున్న కాలంలో, పాలన కోసం రెండు భాగాలుగా విభజించారు – క్రమ రాజ్యం, మడవ రాజ్యం అని. ఈ విభజన ప్రస్తావన అక్బర్ కాలంలో అబుల్ ఫజల్ చేశాడు. అంటే, ఈ విభజన కశ్మీరుపై మొఘలులు అధికారం సాధించే సమయానికీ  కొనసాగుతోందన్న మాట. కాబట్టి జైనులాబిదీన్ కాలంలోనూ ఈ విభజన కొనసాగుతోందనుకోవటంలో  ఎలాంటి సమస్య ఉండదు. శ్రీనగర్ నుంచి వితస్త అధోభాగంలో ఉన్న ప్రాంతాలన్ని క్రమ రాజ్యంగా పరిగణిస్తారు. మిగతాది మడవ రాజ్యం.

‘క్రమ రాజ్యంలో ఉన్న ‘చక్ర’లు దుష్టులు’ అన్నాడు శ్రీవరుడు. అయితే శ్రీవరుడు ‘చక్ర’లు అన్నవారు ‘చాక్’లు. దరదులు. వీరు దరదిస్తాన్ లోని గిల్జిత్ నుండి కశ్మీరు వచ్చారు, సూహదేవుడి పాలనా కాలంలో. వీరు గొప్ప వీరులు.  దాంతో త్వరలోనే కశ్మీరు రాజులంతా వీరి సేవలను వినియోగించుకోవడం ఆరంభించారు. త్వరలో వీరు కశ్మీరులో కీలక పదవులను ఆక్రమించారు. జైనులాబిదీన్ కాలానికి వీరు శక్తిమంతులయ్యారు. జైనులాబిదీన్‍కి వ్యతిరేకంగా చర్యలు చేపట్టారు. ‘జైనగిరి’ నిర్మాణం వీరికి నచ్చలేదు. ఎందుకంటే, జైనులాబిదీన్ అధిక కాలం జైనగిరిలో గడపటం వీరి కార్యకలాపాలకు ప్రతిబంధకంలా ఉంది. అందుకని వీరు ఓ రాత్రి జైనగిరిపై దాడి చేసి రాజభవనాలను తగులబెట్టారు. దాంతో కోపించిన జైనులాబిదీన్, వీరిపై దాడి చేసి, మడవ రాజ్యానికి తరిమేశాడు. వారి ఆయుధాలు లాగేసుకుని, వారి స్థావరాలను ధ్వంసం చేశాడు. శరణు వేడిన వారికి ప్రాణభిక్ష పెట్టి, వారికి వేరే వృత్తులు కల్పించాడు. అంటే, శ్రీవరుడు ఒక్క శ్లోకంలో చెప్పిన దాని వెనుక ఇంత కథ ఉందన్న మాట. తరువాతి కాలంలో ‘చాక్’లు శక్తివంతులై కశ్మీరును పాలించారు.  ఈ విషయాన్ని భవిష్యత్తులో, ‘శుక రాజతరంగిణి’ ప్రస్తావిస్తుంది. శ్రీవరుడి కాలంలో మాత్రం చాక్‍లను దుష్టులుగా, దోపిడీగాళ్లుగా పరిగణించారు. ముఖ్యంగా  వారి నాయకుడు ‘పాండుచాక్’ కోసం తీవ్రమైన వేట జరిగింది. చివరికి ఆయన దొరికిపోయాడు.

ఈ శ్లోకంలో మనం గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. జైనులాబిదీన్ దుష్టులను వారి దొంగతనాలు, దోపిడీలు, దాడుల మార్గం నుంచి మళ్లించేందుకు, వారికి వేర్వేరు వృత్తులు కల్పించటం. తద్వారా వారిని సామాన్య జీవన స్రవంతిలో భాగం చేయటం. ఇందువల్ల ఏం జరుగుతుందంటే, కొన్ని తరాలయ్యే సరికి, వారు తమ దొంగతనాల గతాన్ని మరిచిపోతారు. తమ పూర్వీకులకు జైనులాబిదీన్ ఇచ్చిన వృత్తినే తమ వృత్తి అనుకుంటారు, అనుసరిస్తారు. ఈ రకంగా, భారతదేశంలో ఇస్లామీయుల ప్రవేశం తరువాత సమాజం మొత్తం సంపూర్ణంగా రూపాంతరం చెందింది. మనస్తత్వాలు మారిపోయాయి. ఇస్లామీయుల ఆగమనం వల్ల కశ్మీరులో సంభవించిన మార్పులను కశ్మీరీ కవులు తమ రాజతరంగిణి రచనల ద్వారా సజీవంగా భవిష్యత్తు తరాలకు అందించారు. కానీ దేశంలోని ఇతర ప్రాంతాలకు అంత అదృష్టం లేదు. ఆ యా ప్రాంతాల వారు రచనలు చేసినా ఇప్పుడు అవి దొరకటం లేదు. అందుకే ఎవరు భారతీయ సామాజిక పరిణామక్రమం గురించి వ్యాఖ్యానించినా, ఎలాంటి ఊహలు చేసినా అదే ‘సత్యం’ అని భావించటం కుదరని పని. కానీ అలా వ్యాఖ్యానించేవారు వ్యాఖ్యానించేస్తున్నారు. తమ స్వలాభాలను ఆశించి నమ్మేవారు నమ్మేస్తున్నారు.

తస్కరోపద్రవే రాజ్ఞా నీత్యైవ శమితే సుఖమ్।
గృహేశ్వ వాటవీశ్వన్తః పథికా శీరత్ స్మ హి॥
(శ్రీవర రాజతరంగిణి, 41)

ఈ రకంగా రాజు దొంగల ఉపద్రవం నుంచి కశ్మీరును విముక్తం చేయటంతో కశ్మీరులో పర్యాటకులు, పథికులు, తమ ఇళ్ళల్లో విశ్రమించినంత భద్రంగా, సుఖంగా అడవుల్లోనూ, దారుల్లోనూ విశ్రమించేవారు.

సత్తా ప్రకృతి మధ్యస్థో నిత్య సర్వాంగ వర్ణనః।
స్వతంత్ర వృత్తిర్భూపాలః రేమే వ్యయ ఇవానిశమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 42)

రాజు ఎలాంటి పటాటోపాలు లేకుండా సామాన్యుడిలా జీవించేవాడు. అందరికీ లాభకరమైన కార్యాలు చేపట్టేవాడు. అతను స్వేచ్ఛగా వ్యవహరించేవాడు. అతని దగ్గర ఉండేవారంతా ఐశ్వర్యంతో తులతూగేవారు. అందువల్ల రాజు ఎక్కడికి వెళ్ళీనా ఆనందాలలో మునిగితేలేవాడు.

మందేహాన హితాన్నివార్య చ భజన్ పూర్వాచలగ్రోదయం
యో నిత్యం కమళాకరేషు రసికో బిభ్రత్ప్ర తాపోచ్ఛయమ్।
సంకోచం కుముదాశయేషు రచయన్ పద్మకరోత్పూజితః
శస్యః కస్య న సన్నమస్య మహిమా భాస్వాన్ యశస్వీ విభుః॥
(శ్రీవర రాజతరంగిణి, 43)

తూర్పు పర్పుతాల పై ఉదయించి, చీకటిని తరిమివేసి కమలాలను కిరణ ప్రసరణ ద్వారా వికసింప చేసి, కుముద పుష్పాలని వాడేట్టు చేసే సూర్యుడిని ప్రజలంతా నిత్యం ప్రస్తుతిస్తుంటారు.

ఈ శ్లోకంలో ‘మందేహు’ అనే రాక్షసుల ప్రస్తావన ఉంది. వీరంతా ఒక రకమైన రాక్షస వర్గానికి చెందినవారు. పురాణలలో వీరికి సంబందించిన కథ ఉంది.

రాత్రి పగళ్ల మధ్య సంధ్య కాలం ఉంటుంది. సంధి కాలం రాగానే ఈ మందేహులనే రాక్షసులు పెద్ద సంఖ్యలో సూర్యుడిపై దాడి చేసి, సూర్యుడి గతికి అడ్డు పడతారు. ఈ సమయంలో బ్రాహ్మణలు సంధ్యావందనం చేసి గాయత్రి మంత్ర పఠనం ద్వారా పరిశుభ్రమైన జలాన్ని వజ్రాయుధంలా ప్రయోగించంటం వల్ల. ఈ రాక్షసులు అణగిపోతారు. వీరికి చావు లేదు. మరుసటి రోజు మళ్లీ సంధ్య సమయంలో సూర్యుడిపై దాడి చేస్తారు. అందుకని బ్రాహ్మణులు త్రికాలాలలో సంధ్య వార్చటం ద్వారా జగతిని ఈ రాక్షసుల బెడద నుంచి తప్పిస్తారని పురాణాలు చెప్తాయి. అందుకే సంధ్య చేయని బ్రాహ్మణులు సూర్యుని వధకు పాల్పడిన వారవుతారంటుంది శాస్త్రం. ఎందుకంటే, వారు సంధ్య వార్చకపోతే మందేహులు శక్తిమంతులయి సూర్యుడికి అడ్డుపడతారు. అయితే పురాణాలన్నీ ప్రతీకల మయం. ఈ పురాణ గాథలోని ప్రతీకలను చర్చించటం ప్రస్తుతం అప్రస్తుతం కాబట్టి ముందేహులను, సంధ్యావందనాన్ని ఇక్కడే వదిలి ముందుకు సాగాల్సి ఉంటుంది.

ధాత్రే యాష్ఠక్కురా రాజ్ఞో విభవశ్రీమదోద్వతాః।
విస్ఫూర్తి హారిణోస్యాసన్ గజా ఇవ నిరంకుశా॥
(శ్రీవర రాజతరంగిణి, 44)

ఠక్కురాలు, మదోద్ధరులై తమ అదృష్టాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుతూ రాజు సుఖశాంతులను హరించారు.

ఠక్కురాలు, ఇస్లాం స్వీకరించక ముందు రాజపుత్ర ఠాకూర్లు. మతం మారినా తాము ఒకప్పటి ఠాకూర్లమన్నది మరచిపోకూడని వీరు ఠక్కురాలు అన్న పేరును స్థిరపరుచుకున్నారు.

ఇప్పటికీ దేశంలో పలు ప్రాంతాలలో ముస్లింలు తమని రాజపుత్ర ముస్లింలుగా చెప్పుకునే వారున్నారు.

శ్రీమేర ఠక్కురో జ్యేష్ఠః ప్రాడ్వివేక పదోజ్జ్వలః।
తేషాం ముసుల వృద్ధోపి బభో గ్రంథగుణోజ్జ్వలః॥
(శ్రీవర రాజతరంగిణి, 45)

జ్యేష్ఠుడైన మేర ఠక్కరుడు న్యాయాధీశుడు. తన సాహిత్య సృజన వల్ల చక్కటి పేరు సంపాదించాడు. ఆయన ముసలి ముసల్మాన్.

శ్రీవరుడు ముసల్మాన్ అన్న పదాన్ని ‘ముసుల’ అన్న పదంతో సూచించాడు.

కష్టేన కాష్టవాటం స ప్రాప్తో వట పథాత్తతః।
హిమాన్యంతర దగ్ధాడ్ ఘ్రిర్హిమాన్యన్తర మాసదత॥
(శ్రీవర రాజతరంగిణి, 46)

అవట పథం నుండి అతి కష్టపడుతూ కాష్టవాటం చేరుకున్నాడతడు. దారిలో మంచులో ప్రయాణం చేయాల్సి రావటం వల్ల అతని కాళ్లు మంచు తాకిడికి దెబ్బతిన్నాయి.

అవట పథం నుండి కాష్టవాటం ప్రయాణాన్ని శ్రీనగరం నుండి ‘కిష్టవార్’ వరకూ ప్రయాణంగా భావిస్తున్నారు. ఈనాటికీ ఈ దారి అతి కఠినమైనది. ‘అవట పథం’ అంటే గోతులతో నిండిన కష్టమయమై ఎగుడు దిగుడు మార్గం అని అర్థం.

స్థిత్వా మాణిక్య దేవాగ్రే సమద్ర స్యాన్తరే చిరమ్।
చింభదేశం తతః ప్రాప కించిత్ప్ర ప్త పరిచ్ఛదః॥
(శ్రీవర రాజతరంగిణి, 47)

మద్ర దేశంలోని మాణిక్య దేవుడి వద్ద చిరకాలం విశ్రమించి, సేవకులను కూడగట్టుకుని ఛింభదేశం చేరుకున్నాడు.

‘తవాతీ అక్బరీ’ ప్రకారం జమ్మూలో మాణిక్యదేవుడనే రాజుండేవాడు. కాబట్టి ఆయన మద్రదేశంలోని మాణిక్యదేవుడి వద్ద చిరకాలం ఉండి, ఆరోగ్యం కుదుటబడ్డ తరువాత  బయలుదేరాడనీ, రాజు ఆయనకు తోడుగా కొందరు సేవకులను పంపి ఉంటాడని భావించవచ్చు.

జమ్మూ నుండి శ్రీనగర్ వచ్చే మార్గంలో శ్రీవరుడు ప్రస్తావించిన ‘ఛింభ  దేశం’ ఉండి ఉంటుందని భావిస్తున్నారు. జమ్మూ నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు గొప్ప రాజ్యం. ‘చివ’ లేక ‘చివ్’ రాజుల రాజధాని ఇది. ప్రస్తుతం ఈ ప్రాంతం పాక్ ఆక్రమిత కాశ్మీర్‍లో ఉంది.

తద్దేశ కాల విషమావస్థా శత హతోపి సన్।
సతత్ర ప్ర ష్లవత్ సై దపాద సౌచం సమా సదత్॥
(శ్రీవర రాజతరంగిణి, 48)

అనేక దేశాలు దాటి, అనేక విషమ పరిస్థితులను ఎదుర్కున్న ఆయన పాదాలను సైద్ (సయ్యద్) ప్రక్షాళన చేశాడు.

ఉద్ధం ధ తామయోత్పన్న స్ఫోట వై కృత శాన్తయే।
స రోజ్ఞా పటబద్ధై క పాదో భూజ్జే వితావధి॥
(శ్రీవర రాజతరంగిణి, 49)

తీవ్రమైన దుర్వాసనతో పగిలి ఉన్న పుళ్ళతో ఉన్న అతని కాలికి ఉపశమనం కలగటం  కోసం వైద్యులు చికిత్స చేశారు. ఒక కాలిని దారాలతో కట్టేశారు. జీవితాంతం ఆ కాలు అలా కట్టుతోనే ఉండాలని ఆదేశించారు.

తత్రోపాయాన్ బహూన్ కుర్వన్ స్వదేశ విభవాప్తయే।
యథా కథశ్చిత తత్రస్థః పంచషాః సో వసత్ సమాః॥
(శ్రీవర రాజతరంగిణి, 50)

ఇక్కడ ఓ అయిదేళ్ళున్నాడాయన. ఈ అయిదేళ్ళలో ఆయన తన దేశాన్ని, ఐశ్వర్యాన్ని తిరిగి సాధించాలని తీవ్ర ప్రయత్నాలు చేశాడు.

ఇక్కడ కొన్ని శ్లోకాలు లభించటం లేదు. శ్రీవరుడు లిఖించిన మూల ప్రతి ధ్వంసం అవటం వల్ల ఈ భాగంలో ఆయన ఏం రాశాడో తెలియటం లేదు. ఇప్పుడు మనకు లభిస్తున్నవన్నీ మూల ప్రతికి నకళ్ళు మాత్రమే.

భారతదేశ చరిత్రను నిర్మించేవారు, భారతదేశం గురించి వ్యాఖ్యానం చేసేవారు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం ఇది. మన దేశ చరిత్రలో అనేక అధ్యాయాలు అదృశ్యం అయిపోయాయి. కొన్ని కాలగర్భంలో కలసిపోతే, మరికొన్ని నిర్లక్ష్యం  వల్ల, అజ్ఞానం వల్ల అందకుండా పోయాయి. అంటే కొన్ని అధ్యాయాలు లేని చరిత్ర పుస్తకాన్ని చదువుతూ, అంతా తెలిసినట్టు వ్యాఖ్యానించేస్తున్నారన్న మాట. అన్నీ తాము అనుభవించినట్టు, కళ్ళతో చూసినట్టు తీర్మానిస్తున్నారు. ఇది వైజ్ఞానిక పద్ధతి కాదు.

(ఇంకా ఉంది)

Exit mobile version