Site icon Sanchika

శ్రీవర తృతీయ రాజతరంగిణి-18

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

యావజ్జీవితి భూపాలస్తావత్ కో బాధితుం క్షమ।
మనోనువర్తనం కర్తు తద్యుక్తం తవ సాంప్రతమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 97)

రాజు జీవించి ఉన్నంత కాలం ఆయనను  వ్యతిరేకించి నిలవలేరెవ్వరూ. కాబట్టి ప్రస్తుతానికి రాజుకు ఏది ఆనందం కలిగిస్తుందో, ఆ పని చేసి రాజును సంతోషపెట్టడం ఉచితం.

మంత్రులు హాజీఖాన్‍కు చక్కటి సలహాలిస్తున్నారు. రాజులకు, రాజ్యాధికారం కోరుకునే వారికి మాత్రమే కాదు, సామాన్యులకు నిత్య జీవితంలోనూ ఎంతో ఉపయోగపడతాయీ సలహాలూ, సూచనలు.

జైనులాబిదీన్ సంతానమే అయినా, జైనులాబిదీన్ పాలనలో భాగమే హాజీఖాన్ కూడా. ఎంతగా తన సంతానమే అయినా, తనను వ్యతిరేకించటం, తిరుగుబాటు చేయటం, ఎదురు నిలిచి పోరాడటం ఏ రాజు కూడా సహించలేడు. కాబట్టి రాజాజ్ఞను బహిరంగంగా ధిక్కరించటం ఆత్మహత్యా సదృశ్యం. అదీ, జైనులాబిదీన్ లాంటి శక్తిమంతుడైన రాజును ఎదిరించటం మూర్ఖత్వం. ఇందుకు భిన్నంగా రాజుకు నచ్చినట్టు ప్రవర్తించి, రాజును సంతోషపరిస్తే, లాభాలుంటాయి. సంతోషంతో రాజు వరాల జల్లు కురిపించవచ్చు. ఎదిరించి నష్టపోవటం కన్నా, తలవంచి లాభం పొందటం మేలు అన్న సలహాను మంత్రులు ఇస్తున్నారు.

ప్రసన్నే జనకేస్మాంకం భవేషుః కా న సంపదః।
ఈశ్వరే చ గురౌ భక్తిజయితే పుణ్యకర్మణామ్॥
(శ్రీవర రాజతరంగిణి, 98)

రాజు మన వైపు ప్రసన్నుడయితే, మనకు లభించని సంపదలేమిటి? తండ్రిపై, ఈశ్వరుడిపై భక్తి పుణ్యకర్మల వల్ల కలుగుతుంది.

కశ్మీరు రాజకీయాలలో వైచిత్రి ఇక్కడే ప్రస్ఫుటమవుతుంది. రాజుపై తిరుగుబాటు చేయమని ప్రోత్సహిస్తున్నది ఇస్లామేతరులు. రాజుతో పోరు వల్ల నష్టాలను వివరిస్తూ రాజు మెప్పు పొందటం వల్ల లాభాలను వివరించేది ఇస్లామేతరులే. ఒకరు తమ సార్థం కోసం రెచ్చగొడుతూంటే, మరొకరు సమాజం మంచి కోసం చక్కటి సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా, తండ్రిపై, ఈశ్వరుడిపై భక్తి కలుగటమన్నది పూర్వజన్మ కర్మఫలం వల్ల అనటం భారతీయులకే చెల్లుతుంది. తండ్రిని ఈశ్వర సమానుడిని చేయటం భారతీయ ధర్మంలో ప్రధాన సిద్ధాంతం. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. ఈ మాట అనటంలో శ్రీవరుడు కాస్త వ్యంగ్యాన్ని కూడా జొప్పించాడు.

తండ్రిని ఈశ్వర సమానుడిలా భావించటం భారతీయ సంప్రదాయం. సింహాసనం కోసం తండ్రిపై కత్తి దూయటం భారతీయులకు కొత్త. ఆమోదయోగ్యం కాదు. కానీ సుల్తానులకు తమ నీడను కూడా నమ్మకపోవటం అలవాటు. అది ప్రస్తుతం ఆనవాయితీ అవుతోంది. అందుకే, పూర్వ కర్మల పుణ్యం ఉంటే కానీ తండ్రిపైన, ఈశ్వరుడి పైన భక్తి కలగదని వ్యాఖ్యానించాడు శ్రీవరుడు. నిజానికి ఇది ఒక మంత్రి ద్వారా చెప్పించాడు శ్రీవరుడు అని అనుకోవచ్చు. కావ్య రచనలో రచయితకీ స్వేచ్ఛ ఉంటుంది. పాత్రల ద్వారా  నీతులు  చెప్పించటం వల్ల  సమాజానికి మంచి చెప్పటం, విచక్షణ నేర్పటం రచయితలు అవలంబించే పద్ధతి.

కల్హణుడి రాజతరంగిణి చివరి దశలో ఇస్లామీ సంపర్కం వల్ల సమాజంలో సాంఘికంగా, ధార్మికంగా, మానసికంగా, రాజకీయంగా సంభవిస్తున్న మార్పుల  పట్ల ఆవేదన కనిపిస్తుంది. భవిష్యత్తులో ఈ సమాజం ఏమైపోతుందోని అన్న ఆలోచన కనిపిస్తుంది. జోనరాజ రాజతరంగిణిలో భ్రష్టు పట్టిన సామాజిక వ్యవస్థలో తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటూ మూలాలను సంరక్షించుకోవాలన్న తపన అంతర్లీనంగా కనిపిస్తుంది. శ్రీవరుడి కాలానికి సమాజం గతి స్థిరమై పోయింది. గతం ఒక కల. వర్తమానం చేదు కల. భవిష్యత్తు  పీడకల అన్నది స్థిరపడిపోయింది. అందుకని భవిష్యత్తు తరాలకు తమ సంప్రదాయం, తమ లక్షణాలు, తమ జీవన విధానం, ఆలోచలు తెలిసిందుకు వీలున్న చోటల్లా ప్రస్తుత సమాజానికి, తమ జీవన విధానానికి నడుమ తేడాలను ఎత్తి చూపిస్తూ రచనను సాగించాడు శ్రీవరుడు.

అస్య కోపేన యత్ సాధ్య పురానుగ్రహతో న తత్।
దుర్దినే యా రవేదీప్తిః ప్రదీపాజ్జ్వలతో న సా॥
(శ్రీవర రాజతరంగిణి, 99)

మహారాజుకు మనపై కోపం కలిగినా సరే, ఇతరుల అనుగ్రహం కన్నా రాజు కోపం మనకు లాభదాయకం. మామూలు దీపం నుండి వచ్చే వెలుతురు కన్నా మేఘాల మాటున దాగిన సూర్యుడి వెలుతురు ఎప్పటికీ అధికమే.

ఈ శ్లోకాలు చదువుతుంటే అలవికాని ఆనందం కలుగుతుంది. ఒక సత్యాన్ని చెప్పటానికి పోలికగా మరో సత్యాన్ని చెప్పేందుకు వాడుతున్న ఉపమానాలు ఎంతో గొప్పగా అనిపిస్తాయి. నిజానికి రాజతరంగిణిలను చారిత్రక కావ్యాలుగా పరిగణిస్తూ కూడా అత్యత్తమ సాహిత్య సృజనకు చక్కని ఉదాహరణలుగా  స్వీకరించవచ్చు.

రాజు సూర్యుడు. స్వయంప్రకాశకుడు. శక్తిమంతుడు. అలాంటి వాడు కోపంలో ఉన్నా, అతని వల్ల కలిగే లాభాలు, ఇతరుల అనుగ్రహంతో పోలిస్తే ఎక్కువే. ఎందుకంటే, ఇతరులు దీపాల లాంటి వారు. ఎంత ప్రయ్నంచినా రాజు సాటి కారు వారు. దీపం ఎప్పుడయినా సూర్యుడి కన్నా అధికంగా వెయితురును ఇవ్వగలుగుతుందా? చివరకు  సూర్యుడు మేఘాలతో కప్పబడి ఉన్నా సరే, సూర్యుడి వెలుతురుకు ఏదీ సాటి రాదు. ఈ నిజాన్ని హాజీఖాన్‌కు వివరిస్తున్నారు అతని మంత్రులు.

రాజు అనుగ్రహం లేకున్నా ఫరవాలేదు. ఇతరులను నమ్మి రాజుతో వైరం పూనటం అనర్థదాయకం. ఇతరుల అనుగ్రహం కన్నా రాజు ఆగ్రహం కూడా లాభదాయకమే.

ఖలోక్తిశ్వాసమాలిన్యం సతత నయసేవినః।
హృదయాదర్శవైపద్యోత్స్రసకం నాశ్య దృశ్యతే॥
(శ్రీవర రాజతరంగిణి, 100)

రాజు న్యాయపరుడు. అందరికీ న్యాయం చేస్తాడు. అతని స్వచ్ఛమైన హృదయ దర్పణాన్ని దుష్టులు  వదిలిన శ్వాస ఏమీ చేయలేదు. ‘ఖలోక్తి శ్వాస మాలిన్యం’ చక్కటి ప్రయోగం.

నిర్వాణగోష్ఠీనిష్ఠస్య తద్ధచ్ఛాస్త్రా వివేకినః।
కృపాబ్ధేరస్య నో కించిత్ కృత్యమస్య సుఖప్రదమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 101)

రాజు ‘నిర్వాణగోష్ఠీనిష్ఠుడు’. శాస్త్రవివేకి. కృపాసాగరుడు. ఎవరికీ హాని చేయడు. నష్టం కలుగ చేయడు.

ఇక్కడ జైనులాబిదీన్ వ్యక్తిత్వాన్ని, ఇతర సుల్తానుల, ఇస్లామీయుల వ్యక్తిత్వాలను వేరు చేసి చూపిస్తున్నాడు శ్రీవరుడు.

ఇతర  సుల్తానులకు భిన్నంగా జైనులాబిదీన్ ‘నిర్వాణగోష్ఠీనిష్ఠుడు’. వేదాంత చర్చల పట్ల ఆసక్తి కలవాడు. భవిష్యత్తులో మనకు శ్రీవరుడు జైనులాబిదీన్‍కు కశ్మీరుకు చెందిన ప్రధాన గ్రంథం ‘మోక్షోపాయ’ను చదివి వినిపించేవాడని తెలుస్తుంది. వైరాగ్య భావనలతో సుల్తాన్ ‘మోక్షం’ కోసం తపించాడనీ తెలుస్తుంది.

సంసార దుఃఖ శాంత్యర్థం మత్తో వ్యాఖ్యా వేదినాః।
అశ్ర్నోంద్ గణరాత్రమ్ సా శ్రీ మోక్షోపాయ సంహితం॥

 సంసార దుఃఖాలను శాంతింపచేయటానికి పలు రాత్రుళ్లు జైనులాబిదీన్ మోక్షోపాయ సంహితను విన్నాడు. నేను ఆయనకు వ్యాఖ్య సహితంగా వినిపించాను.

ఈ శ్లోకాన్ని బట్టి ‘నిర్వాణగోష్ఠీనిష్ఠుడు’ అన్న పదాన్ని మరింతగా అర్థం చేసుకోవచ్చు. సింహాసనం కోసం పోరు జైనులాబిదీన్‍ను విసిగించింది. విరక్తి కలిగించింది. ఆయనకు అప్పటి నుండి విముక్తి అవసరమైంది. శాంతి కోసం తపించాడు. ఆ శాంతి సాధనలో భాగంగా ‘మోక్షోపాయ సంహిత’ను విన్నాడు. శాస్త్ర వివేకం కలవాడు కాబట్టి సుల్తాన్ ఎవ్వరికీ హాని చేయడు. కష్టం కలిగించడు. ప్రధానంగా రాజు శాస్త్ర వివేకి, న్యాయబద్ధుడు. వైరాగ్య భావనలు కలవాడు. కాబట్టి రాజును వ్యతిరేకించవద్దని మంత్రులు సలహా ఇస్తున్నారు.

(ఇంకా ఉంది)

Exit mobile version