Site icon Sanchika

శ్రీవర తృతీయ రాజతరంగిణి-2

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ప్రేమ్ణార్థం వపుషో విలోక్య మిలితం దేవ్యా సమం స్వామినో
మౌలౌ యస్య నిశాపతిర్నగసుతావేణీ నిషామిశ్రితః।
అస్తే స్వామ్యనుకర్తనార్థమివ తత్ కృత్వా వపుః ఖండితం
దేయాద ద్వయ భావనాం స భగవాన్ దేవోర్థనారీశ్వరః॥
(శ్రీవర రాజతరంగిణి, 2)

తృతీయ రాజతరంగిణి ఆరంభంలో రచించిన దేవతాస్తుతి శ్లోకాలలో రెండవది, చమత్కార భరితమైన శ్లోకం ఇది.

ప్రేమతో శివుడు తన శరీరంలో అర్ధభాగాన్ని పార్వతి శరీరంతో మిళితం చేశాడు. అది చూసిన చంద్రుడు తన స్వామిని అనుకరిస్తూ తన శరీరాన్ని కూడా సగానికి ఖండితం చేశాడు. మిగతా సగం భాగాన్ని శివుని జటాజూటంలో, పార్వతి కురుల నలుపుతో చేర్చాడు. అంటే సగభాగాన్ని చీకటిలో కలిపేశాడన్న మాట. అర్ధనారీశ్వరుడు అద్వైత భావనను కలిగించు గాక!

భారతదేశంలో పలు విభిన్న రకాల అర్ధనారీశ్వర మూర్తులు లభిస్తాయి. దేశంలో లభిస్తున్న అతి ప్రాచీనమైన అర్ధనారీశ్వరమూర్తి కుషానుల కాలానికి చెందినదిగా భావిస్తున్నారు. పురుష ప్రకృతిల ప్రతిరూపం బదులు అర్ధనారీశ్వరుల అద్వైత రూపం ఉన్న మూర్తి అది. నర నారీ, శివ శక్తిల కలయికను ప్రతిబింబించే మూర్తి అది.

ఈ శ్లోకాన్ని విశ్లేషించిన పలువురు పండితులు అర్ధనారీశ్వరుడిని ప్రస్తుతించటం సాధారణమే అయినా చంద్రుడు సైతం ఖండితుడై శివుడి శిరస్సులో మిగతా అర్ధ భాగాన్ని మిళితం చేసినాడనటంపై పలు రకాల వ్యాఖ్యానాలు చేశారు. శివుడి శిరస్సుపై ఉన్న చంద్రుడు పూర్ణ చంద్రుడు కాదు, అర్ధ చంద్రుడు. ఇది ఇస్లామీయులు భారతీయు ధర్మంతో సహాజీవనం చేయటానికి ప్రతీకగా చేస్తూ, రెండుగా, వేర్వేరుగా నిలచిన ధర్మాలు ద్వైతం అద్వైతం అయినట్టు, కలిసి సహజీవనం చేయటాన్ని సూచిస్తున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

శ్రీవరుడు జోనరాజు శిష్యుడు. జోనరాజు సికందర్ బుత్‌షికన్ కాలంలోని ఈ మతమౌఢ్యం తాలూకు హింసను అనుభవించాడు. ఇస్లామ్ మత మౌఢ్యం ఏ స్థాయిలో ఇస్లామేతరుల జీవితాలను అల్లకల్లోలం చేయగలదో ప్రత్యక్షంగా అనుభవించాడు. తాము కశ్మీరులో భద్రంగా, ప్రశాంతంగా జీవించగలగటానికి ఏకైక కారణం జైనులాబిదీన్ అని గ్రహించినవాడు జోనరాజు. అంతే కాదు, తమకూ, తమను ముంచెత్తేందుకు సిద్ధంగా ఉన్న ఇస్లాం మత మౌఢ్యానికీ నడుమ అడ్డుగోడగా నిలుచున్నది జైనులాబిదీన్ అని గ్రహించాడు.  అందుకని జోనరాజు ‘రసం’ జోలికి పోకుండా తన దృష్టిని రాజతరంగిణి  రచనపై పెట్టాడు. కల్హణుడిలానే రాజుల పరంపరలను గమనిస్తూ జీవితం క్షణికమని గ్రహించాలని రాజతరంగిణిలో ప్రదర్శించాడు.

శ్రీవరుడు జన్మించినది జైనులాబిదీన్ కాలంలోనే అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే జోనరాజు క్రీ.శ. 1459లో మరణించాడు. శ్రీవరుడు అతడి శిష్యుడు. కానీ జోనరాజు మరణించే సమయానికి జోనరాజు స్థానాన్ని భర్తీ చేయగల స్థాయికి చేరుకున్నాడు. జైనులాబిదీన్ తొలిసారి రాజ్యాన్ని చేపట్టింది క్రీ.శ. 1418. జోనరాజు స్థానాన్ని భర్తీ చేయాలంటే కనీసం ముప్ఫయి నలభై ఏళ్లయినా ఉండాల్సి ఉంటుంది. పైగా శ్రీవరుడు జైనులాబిదీన్ పిల్లలకు గురువు. కశ్మీరు చరిత్రను 1459 నుంచి 1486 వరకు అంటే 27 ఏళ్ళ కశ్మీరు చరిత్రను రాజతరంగిణిలో పొందుపరిచాడు శ్రీవరుడు. క్రీ.శ, 1470లో జైనులాబిదీన్ మరణం తరువాత కశ్మీరులో అధికార పోరు సాగింది. ముగ్గురు సుల్తానులు మారేరు. అంటే తన రాజతరంగిణిలో శ్రీవరుడు – జైనులాబిదీన్ పాలనా కాలం, హైదర్ షాహ, హసన్ షాహ, మహమూద్ షాహల పాలనా కాలాన్ని కూడా ప్రతిబింబించాడు. ఎంతో జాగ్రత్తగా జైనులాబిదీన్ నెలకొల్పిన పరమత సహనం – జైనులాబిదీన్ పాలన కాలం చివర్లలోని దెబ్బతిన్నది. కాఫిర్లకు, వారి మతానికి జైనులాబిదీన్ ఇస్తున్న ప్రాధాన్యం ఇస్లామీయులలో తీవ్రమైన అసంతృప్తికి, ఆవేశానికి దారితీసింది. వారంతా ఏకమై జైనులాబిదీన్ వ్యతిరేక చర్యలు చేపట్టారు. చివరికి అది జైనులాబిదీన్ సంతానం నడుమ అధికార పోరాటంలా పరిణమించి కశ్మీరును అనిశ్చిత పరిస్థితిలోకి నెట్టింది. జోనరాజు మరణంతో రాజతరంగిణి ఆగిపోయింది. కానీ 1486లో శ్రీవరుడి రాజతరంగిణి ఆగిపోవటానికి కారణం అతని మరణం కాదు, రాజకీయ అనిశ్చిత పరిస్థితి. అందుకే 1486లో శ్రీవరుడి రాజతరంగిణి రచన ఆగిపోయినా 1505లో శ్రీవరుడు ‘కథాకౌతుకమ్’ అనే అనువాద కావ్యాన్ని రచించడం ఆయన 1505 నాటికి జీవించి ఉన్నాడన్న విషయం స్పష్టం చేస్తుంది. మరి రాజతరంగిణి ఎందుకు కొనసాగించలేదనే సందేహం వస్తుంది. దీనికి కారణం ఏమంటే, మహమూద్ షాహను పదవీచ్యుతుడిని చేసి ఫతేష్ షా అధికారాన్ని హస్తగతం చేసుకోవటం. మళ్ళీ ఫతేష్ షాహ పదవిని కోల్పోయిన తరువాతనే శ్రీవరుడి పేరు వినిపిస్తుంది. అంటే ఫతేష్ షాహ శ్రీవరుడి వ్యతిరేకి అనీ, అతడిని రాజాస్థానం నుంచి తప్పించాడనీ గ్రహించటం పెద్ద కష్టం కాదు. జైనులాబిదీన్ మరణం తరువాత కశ్మీరులో సంభవించిన అల్లకల్లోలం, నెలకొన్న అశాంతి శ్రీవరుడి రాజతరంగిణి రచనపై ప్రభావం చూపించాయి. అందుకే కల్హణుడిని అనుసరిస్తూ, మరో అడుగు ముందుకు వేసి తన రచనలో వైరాగ్య రసాన్ని ప్రదర్శించానన్నాడు శ్రీవరుడు. నిజానికి వైరాగ్యం రసం కాదు. కానీ తన రచన పాఠకులలో వైరాగ్య భావనలను కలిగిస్తుందన్నాడు. శాంతరసం వ్యక్తి తనతో తాను సంతృప్తిగా ఉండగలిగే ‘సంస్థిత’ భావనను కలిగిస్తుంది. సంస్థిత భావన స్థాయిభావం స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞత పై మెట్టు వైరాగ్య భావన. కల్హణుడి రచన శాంతరసం ఉత్పన్నం చేస్తే, శ్రీవర రాజతరంగిణి వైరాగ్య భావనలు కలుగజేస్తుందన్న మాట.

దైవ సమానుడిలా భావించిన జైనులాబిదీన్ తన కళ్ళెదుటే తన సంతానం తనపై తిరుగుబాటు చేసి అధికారం కోసం పోరాడుకోవటం చూశాడు. అతను స్థిరపరిచిన సౌభ్రాతృత్వ భావనలు దూదిపింజలుగా చెల్లాచెదురయిపోవటం చూశాడు. తన వ్యక్తిగత ప్రవర్తనపై తన మతం వారే విమర్శలు గుప్పించి,  ద్వేష భావనలు ప్రకటించటం అనుభవించాడు. ముక్తి కోరుతూ విషాదంతో మరణించాడు జైనులాబిదీన్. ఈ సంఘటనలన్నింటికీ ప్రత్యక్ష సాక్షి శ్రీవరుడు. జైనులాబిదీన్ మరణం తరువాత అధికారం కోసం పోరు జరగటం, అధికారానికి వచ్చే సుల్తానులను బట్టి తమ అదృష్టం మారటం శ్రీవరుడి అనుభవానికి వచ్చింది. బహుశా అతని వైరాగ్య భావనలకు దారి తీసి ఉండవచ్చు.

శాంత భావన సమతౌల్య భావన. వస్తువుల తత్వజ్ఞానం కలుగటం వల్ల, మనస్సు, బుద్ధి పరిశుభ్రమై, వైరాగ్య భావనకు దారి తీస్తుంది. శ్రీవరుడు ‘వైరాగ్య భావన’ అన్న పదం వాడటానికి పండితులు మరో కారణం ఊహిస్తున్నారు. ఆ కాలంలో కశ్మీరులో ‘మోక్షోపాయం’ అనే గ్రంథం అత్యంత ప్రాచుర్యం పొందింది. జైనులాబిదీన్ సైతం ఆ గ్రంథాన్ని శ్రీవరుడితో చదివించుకునేవాడు. ‘మోక్షోపాయం’లో వైరాగ్య భావనను శాంత భావనను ఒకే అర్థంలో వాడతారు. కాబట్టి కూడా శ్రీవరుడు శాంత భావనకు ప్రత్యామ్నాయంగా వైరాగ్య బావన అనే పదాన్ని వాడి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

శ్రీవరుడి రాజతరంగిణి రెండు ప్రత్యేక పుస్తకాలుగా అనిపిస్తుంది. జైనులాబిదీన్ పాలనా కాలం ఒక రాజతరంగిణి పుస్తకం. జైనులాబిదీన్ తరువాత అధికారానికి వచ్చిన ముగ్గురు సుల్తానుల పదవీకాలం మరో పుస్తకం. ఈ రెండు పుస్తకాలను కలిపి శ్రీవరుడి రాజతరంగిణిగా పరిగణిస్తున్నారు.

శ్రీవరుడి రాజతరంగిణికీ, కల్హణుడు, జోనరాజు రాసిన రాజతరంగిణికి మరో ప్రధానమైన తేడా ఉంది. సికందర్, జైనులాబిదీన్ పాలనా కాలం తప్ప తాను రాసిన మిగతా చరిత్రకు జోనరాజు ప్రత్యక్ష సాక్షి కాదు. అంతా పరిశోధించి తెలుసుకున్నదే. హర్షుడి పాలన తరువాత అంశాలకు కల్హణుడు ప్రత్యక్ష సాక్షి. ఎంతో పరిశోధించి విషయాలు తెలుసుకుని రాజతరంగిణి రాశాడు కల్హణుడు. వీరిద్దరికీ భిన్నంగా, తాను రాసిన విషయాలకు ప్రత్యక్ష సాక్షి శ్రీవరుడు. జైనులాబిదీన్ పాలనా కాలాన్ని ప్రత్యక్షంగా చూశాడు. అనుభవించాడు. తరువాత జరిగిన అధికార పోరును అతి దగ్గరగా చూశాడు. చివరికి ఫతేష్ షాహ అధికారానికి రావటంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బహుశా, రాజు ప్రోత్సాహం లేదని రాజతరంగిణి రాయటం ఆపేసినట్టున్నాడు శ్రీవరుడు. మళ్లీ ఇతర గ్రంథాలు రాశాడు. కానీ రాజతరంగిణి రాయలేదు శ్రీవరుడు. బహుశా, ఫతేష్ షాహ పాలనలో తాను అనుభవించినవి, దర్శించినవి గ్రంథ రూపంలో భావి తరాలకు అందటం ఇష్టమనిపించలేదేమో శ్రీవరుడికి. ఈ విషయాలను శ్రీవరుడి తరువాత రాజతరంగిణి రచన చేపట్టిన ప్రజ్ఞాభట్టు, శుకులు తాము రాసిన రాజతరంగిణిలలో పొందుపరిచారు.

(ఇంకా ఉంది)

Exit mobile version