Site icon Sanchika

శ్రీవర తృతీయ రాజతరంగిణి-23

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తద్దృష్ట్యా హాజ్యఖానోథ సత్రపః పితురాగమాత్।
అభిమన్యు ప్రతీహార ముఖునాఖ్యదాదం వచః॥
(శ్రీవర రాజతరంగిణి, 128)

దూతపై తన అనుచరులు హింస జరపటం చూసి హాజీఖాన్ లజ్జితుడయ్యాడు. తన తండ్రి కాళ్లపై పడి క్షమాపణలు వేడుకునేందుకు అభిమన్యు అనే ప్రతీహారి అనుమతిని అభ్యర్థించాడు.

ఇతరుల ప్రభావం లేకపోత హాజీఖాన్ సంస్కారవంతుడే అనిపిస్తుంది పై శ్లోకం చదివితే. దూతతో తన సైనికులు వ్యవహరించిన విధానానికి సిగ్గుపడి తండ్రి కాళ్ల మీద పడి క్షమార్పణ వేడుకోవాలనుకోవటం అంటే అసలు వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. కానీ దుష్టుల ప్రభావంలో పడి తన అసలు వ్యక్తిత్వాన్ని మరిచి ప్రవర్తించటం మానసిక దౌర్బల్యాన్ని సూచిస్తుంది.

వరం పాదప్రణామార్థం పితుర్యామ్య ముతో బలాత్।
భూపస్తుష్టోథ రుష్టో వా యత్ కరోతు కరోతు తతః॥
(శ్రీవర రాజతరంగిణి, 129)

నేను వెళ్ళి తండ్రి పాదాలకు ప్రణామాలు ఆచరిస్తాను. ఆయన క్షమించినా, కోపించినా, ఎలాంటి శిక్ష విధించినా సంతోషంగా స్వీకరిస్తాను.

యుద్ధం కన్నా ముందు హాజీఖాన్ మానసిక సంఘర్షణను ప్రదర్శిస్తుందీ శ్లోకం. ఎలాంటి వాడినైనా మనస్సాక్షి హెచ్చరిస్తూంటుంది. హాజీఖాన్‍కు తన తండ్రి శక్తి తెలుసు. జైనులాబిదీన్‍తో పోరాడి గెలవటం అసంభవం అనీ తెలుసు. అయినా సరే, దుష్టుల ప్రభావానికి గురియ్యాడు. పైకి ఎన్ని బీరాలు పలికినా, మనసులో భయం ఉంటుంది. తాను చేస్తున్నది తప్పు అన్న భావన ఉంటుంది. దూతను హింసించటం అన్నది ఆ నేర భావనను మరింత పెంచటంతో మనసులోని మాట బయటకు వచ్చింది.

ఏ మనిషి అయిన స్వతహాగా మంచివాడే. చుట్టూ ఉన్న వారి ప్రభావంతో సహా పలు కారణాలు వ్యక్తి అసలు స్వభావాన్ని మరుగుపరుస్తాయి.

కానీ అప్పుడప్పుడు మేఘల మాటు నుండి చంద్రుడు తొంగిచూసేట్టు, దుష్టుల ప్రభావమనే మేఘాల మాటు నుండి అసలు ప్రభావం కనిపిస్తూంటుంది. ఇది అలాంటి సందర్భం. ఇలాంటి పరిస్థితులతో స్వీయ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవటం మీద, ఇరుల ప్రభావానికి లొంగిపోవటం అన్నది వ్యక్తి ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉంటుంది.

సర్వథా తాతిపాదా మే సేవ్యా రక్షేత్ స నో ధృవమ్।
తన్మా కురుత్ యుద్ధేస్మిన్ సంరంభం చేన్మతం మమ॥
(శ్రీవర రాజతరంగిణి, 130)

నేను పితృ పాదాల శరణు కోరుతాను. ఆయన నిశ్చయంగా మనల్ని రక్షిస్తాడు. మీకు ఇది సమ్మతమయితే మనం యుద్ధం ఆరంభించాల్సిన అవసరమే లేదు. అసలు యుద్ధం అవసరమే లేదు.

కిం తు స్వప్నేపి భూపాయ నానిష్టం చిన్తయామ్యహమ్।
యో మే దేవాధికః పూజ్యో లోకద్వయ సుఖప్రధః॥
(శ్రీవర రాజతరంగిణి, 131)

కలలో కూడా రాజుకు అయిష్టమైన కార్యాన్ని నిర్వహించాలని అనుకోను. రాజు నాకు దేవత కన్నా అధికంగా పూజనీయుడు. నాకు రెండు లోకాలలో సుఖప్రదమైన జీవితాన్నిచ్చేవాడు.

అగ్రజోగ్రే సమాయాతి రణాయాయాతి నో నృపః।
ఇత్యుక్తం తేన సంప్రాప్తో నాహం పితృవధోధ్యతః॥
(శ్రీవర రాజతరంగిణి, 132)

యుద్ధం కోసం పెద్దన్నయ్య ముందు వస్తున్నాడు. నాన్న యుద్ధం కోసం సిద్ధమవుతున్నాడు. నేను తండ్రిని హతమార్చేందుకు యుద్ధానికి రాలేదు అన్నాడు హాజీఖాన్. ఏదైనా పని తలపెట్టినప్పుడు ఒక ఆవేశంలో నిర్ణయం తీసుకుంటారు. పర్యవసానాల గురించిన ఆలోచన ఉండదు. తీరా అనుకున్న పని ఆచరణలో పెట్టే సమయంలో పర్యవసానాల గ్రహింపు వస్తుంది. తమ పని లోని నైచ్యం, అనౌచిత్యాలు అర్థమవుతాయి.

శ్రుత్వేతి మంత్రిణస్తాజతన్త్రి పత్యోదయస్తతః।
తత్తురంగాత్త వల్గాగ్రా నిష్ఠురం తే బృవన్నితి॥
(శ్రీవర రాజతరంగిణి, 133)

హాజీఖాన్ మాటలు విన్న తాజ తంత్రపతి, ఇతరులు అతని అశ్వం కళ్ళేన్ని పట్టుకొని ఆపి, నిష్ఠూరంగా, ఈ మాటలన్నారు.

‘తంత్రపతి’ అన్న పదం ఆసక్తికరమైనది. వీళ్ల ‘తార్తారు’లన్న అభిప్రాయం పరిశోధకులు పలు సందర్భాలలో వ్యక్తపరచారు. ముస్లింలలో ఇదొక ఉప జాతిగా భావిస్తారు. వీరు  కశ్మీరమంతా వ్యాపించారు. ‘తార్తోరు’లని అనకుండా, ఆ పదాన్ని సంస్కృత పదంలా ‘తంత్రపతి’ అని వాడేడు శ్రీవరుడు.

యదోక్తం సమయో నాయం యామ ఇత్యవధీరితమ్।
అరబ్ధస్యాక్త గమనం తద్యుక్తమధునా తవ॥
(శ్రీవర రాజతరంగిణి, 134)

‘ఇది యుద్ధానికి సమయం కాదని మేము సలహా ఇచ్చినప్పడు మీరు అవహేళన చేశారు. మా మాట కాదని యుద్ధానికి వచ్చారు. మీరు ఆరంభించిన పనిని పూర్తి చేయాల్సిందే.’

మంత్రులు యుద్ధం వద్దని హాజీఖాన్‍కు పలురకాలుగా చెప్పారు. నచ్చజెప్పారు. యుధ్ధం తప్పించాలని చూశారు. కానీ హాజీఖాన్ వారి మాట పెడ చెవిన పెట్టాడు. ఇప్పుడు, తీరా యుద్ధం తప్పనిసరి అయేసరికి వెనుకడుగు వేస్తున్నాడు. ఇది మంత్రులకు నచ్చలేదు. ఎందుకంటే హాజీఖాన్ కోసం వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు వెనుకడుగు చేయటం వల్ల తండ్రి కొడుకును క్షమించి అక్కున చేర్చుకోవచ్చు కానీ రాజు మంత్రులను వదలిపెట్టడు. కాబట్టి ఇప్పుడు వెనుకడుగు వేసి లాభం లేదు. ముందుకు వెళ్ళటం తప్ప మరో మార్గం లేదు. అందుకే, అప్పుడు యుద్ధం వద్దని నచ్చచెప్పిన వాళ్ళే ఇప్పుడు యుద్ధం చేయకతప్పదని హాజీఖాన్‌ను నిలదీస్తున్నారు.

యూయం చేజ్జాతసౌహార్దా మార్దవాన్దితాః పరాః।
వయమేవ ఇతాః కష్టం క్లిశ్టాస్త్యత్యేవ నాశయా॥
(శ్రీవర రాజతరంగిణి, 135)

మీరు మీ నాన్నగారితో రాజీ పడి ఇద్దరూ ఏకమైపోతే, మీరు హాయిగా ఉంటారు. కానీ మీ సేవలో సర్వం త్యజించేందుకు సిద్ధపడ్డ మేము చావక తప్పదు.

నిజం చెప్పారు. మంత్రులకు తెలుసు, తండ్రీకొడుకులు ఏకమైపోతే తమకు పుట్టగతులుండవని, అందుకే యుద్ధం వద్దన్నవారు ఇప్పుడు యుద్ధం తప్పదంటున్నారు.

భవేత్ సన్తప్తయోః సంధర్నిత్యం తైలకటాహయోః।
తదన్తః పూరిణీ క్షిప్తా సైవ దన్దహ్యతే క్షణాత్॥
(శ్రీవర రాజతరంగిణి, 136)

అద్భుతమైన శ్లోకం ఇది.

వేడి నూనె, నూనెను వేడి చేసిన మూకుడు నడుమ నిత్యం సంధి సంభవమే. కానీ ఆ రెంటి నడుమ వచ్చినది ఏదైనా క్షణంలో కాలిపోతుంది.

నూనెను  తిన్నగా నిప్పుపై వేడి చేయటం కుదరదు. సరైన పాత్రలో పోసి వేడి చేయాలి. అలా తనని వేడి చేస్తోందని నూనె పాత్రపై శత్రుత్వం వహించదు. ఆ రెంటి మధ్య సంధి కలుగుతుంది. అవి హాయిగా, స్నేహంగా ఉంటాయి. కానీ కాగుతున్న నూనెలో ఏది పడ్డా అది కాలిపోతుంది. ఇక్కడ రాజు నూనె. హాజీఖాన్ పాత్ర. వారిద్దరి నడుమ ఎలాగూ సంధి జరుగుతుంది, స్నేహం నెలకొంటుంది. కానీ నడుమ నిలిచిన సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. ఇది కేవలం రాజు, అతని సంతతికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది ప్రపంచ రీతి. ఇద్దరు శక్తిమంతుల నడుమ వైరం ఉంటుంది. కానీ ఆ వైరం వల్ల వారికి నష్టం లేదు. వారి సమర్థకులవే ప్రాణాలు పోతాయి. ఈ నిజాన్ని పాత్ర, నూనె ఉపమానంతో చక్కగా బోధించాడు శ్రీవరుడు.

భవాన్ స్వామీ వయం దాసోః పౌరుషం పశ్య సాంప్రతమ్।
జయశ్చేత్తర రాజ్యాప్తిర్నష్ణో యాహి యథాగతమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 137)

మీరు ప్రభువు. మేము భృత్యులము. మీ కోసం పోరాడే మా వీరత్వాన్ని చూడండి. యుద్ధంలో మీరు గెలిస్తే రాజభోగాలను అనుభవించవచ్చు. ఓడిపోతే ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోవచ్చు.

శ్రీవరుడి ఈ శ్లోకం చదవగానే భగవద్గీత లోని శ్లోకం గుర్తుకు వస్తుంది.

హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ (2,36)

యుద్ధంలో మరణిస్తే స్వర్గం లభిస్తుంది. గెలిస్తే రాజ్య భోగాలను అనుభవిస్తావు. కాబట్టి ప్రయత్నం చేయాలి అంటున్నారు మంత్రులు.

ఇది కూడా చక్కటి శ్లోకం –

హాజీఖాన్‍కు తండ్రి శక్తి తెలుసు. అతనితో పోరాడి గెలవటం కష్టం అని గ్రహించాడు. తండ్రితో ఆయన కలసిపోతే, ఇంత వరకూ అతడిని నమ్ముకున్న వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. కాబట్టి యుద్ధంలో తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తామంటున్నారు. యుద్ధంలో తమ శౌర్య ప్రదర్శన వల్ల హాజీఖాన్ గెలిస్తే రాజ్యం అనుభవిస్తారు. ఓడిపోతే ఎలా వచ్చామో అలా వెళ్లిపోవచ్చు అని అంటున్నారు.

యావద్ద్యుద్ధం కరిష్యా మస్తావదేవ విలంబ్యతామ్।
హతేష్యన్మాసు కర్తవ్యం యత్ పునస్తాత్ సమాచాణ॥
(శ్రీవర రాజతరంగిణి, 138)

మేము యుద్ధం చేస్తున్నంత సేపూ మీరుండండి. యుద్ధంలో మేము ప్రాణాలు కోల్పోయిన తరువాత మీ కర్తవ్యం మీరు నిర్వహించండి.

తమ అభిప్రాయాన్ని మంత్రులు సృష్టంగా చెప్తున్నారు. మేము పోరాడినంత సేపూ మీరు ఆగండి. మా ప్రాణాలు పోయిన తరువాత మీరు చేయాలనుకున్నది చేయండి అంటున్నారు.

అస్మదుక్తం న గృహ్ణసి యదిత్వం పితృవంచితః।
త్వయ్యేవానుచితం కృత్వా పునర్యామో దిగన్తరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 139)

మీ తండ్రిగారి కుట్రలకు లొంగి మీరు మా మాటలను స్వీకరించకపోతే, మేము మీకు హాని చేసి, ఎక్కడికో వెళ్లిపోతాం.

మాటలు, బుజ్జగింపులు అయిపోయాయి. ఇప్పుడు బెదిరింపులకు దిగారు. మీరు మా మాట విని యుద్ధం చేయకపోతే, మీ పైనే దాడి చేసి – ‘అనుచితం కృత్వా’ – అనుచితమైన పని చేసి, ఎటో వెళ్ళిపోతాం అంటున్నారు. ఇంత కాలం హాజీఖాన్‌ని నమ్ముకున్న వారికి సంధి వల్ల లాభం లేదు. యుద్ధం తప్పదు. యుద్ధం గెలవాలి, లేదా, ప్రాణాలు కోల్పోవాలి. అదీ కుదరకపోతే, హాజీఖాన్ పైనే దాడి చేసి చంపి వెళ్లిపోతాం అంటున్నారు.

ఇతి నిర్భత్స్యనా వాక్యజాతభీతిన్నృపాత్మజః।
తతశ్చిన్తార్ణవే భగ్నో యుద్ధశ్రద్ధామగాహత్॥
(శ్రీవర రాజతరంగిణి, 140)

మంత్రుల మాటలకు హాజీఖాన్ భీతిభ్రాంతుడయ్యాడు. చింతా సముద్రంలో మునిగాడు. తప్పనిసరి పరిస్థితులలో యుద్ధానికి సిద్ధమయ్యాడు.

‘పులి పై స్వారీ’ అంటారు.

ప్రజలను రెచ్చగొట్టి ఆవేశానికి గురిచేస్తారు. ప్రజలు ఆవేశంలో ఉన్న సమయంలో వారు చెప్పినట్టు వినాల్సి ఉంటుంది. లేకపోతే, రెచ్చగొట్టిన వారి ఆగ్రహాన్ని చవిచూడల్సి ఉంటుంది. ఎందుకంటే, తమను రెచ్చగొట్టి, ఏవేవో ఆశలు చూపించి తమను మోసం చేశాడన్న భావనతో ప్రజలు ఆగ్రహోదగ్రులవుతారు. కాబట్టి, పులి మీద స్వారీ చేస్తున్నంత సేపూ బాగుంటుంది. కానీ పులిని దిగితే పులి చంపేస్తుంది. అయినా సరే, పులి మీద స్వారీ చేయక తప్పదు. అందుకే మంత్రులు, ఆరంభం లోనే ‘నువ్వు ఆరంభించిన పని పూర్తి చేయక తప్పదు’ అన్నారు. దాంతో చేసేదేమీ లేక హాజీఖాన్ యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధం చేశాడు.

ఇది మనం మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. ఏదో కారణంతో ప్రజలను రెచ్చగొడతారు. ఉద్యమం ఆరంభిస్తారు. ఒక దశలో ఆరంభించిన వారికి ఉద్యమంపై పట్టు పోతుంది. వారు ఉద్యమాన్ని నడపటం కాదు, ఉద్యమం వారిని నడిపిస్తుంది. హాజీఖాన్ కూడా అలాంటి పరిస్థితిని అనుభవించాల్సి వచ్చింది. ఇష్టం ఉన్నా లేకున్నా యుద్ధం ఆరంభించాల్సి వచ్చింది.

(ఇంకా ఉంది)

Exit mobile version