శ్రీవర తృతీయ రాజతరంగిణి-29

2
16

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ద్వితీయ సర్గ

భూభృతో నిర్గతా ప్రేమసరిత్ ప్రోచ్చానుజచ్ఛలాత్।
ప్రత్యావృత్తా కియత్కాలం శుద్ధాగ్రజామశిశ్రియత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 1)

చిన్న కొడుకు చేసిన మోసం వల్ల రాజు ప్రేమ ఇప్పుడు పెద్దవాడి వైపు మళ్ళింది. ఎలాగయితే పర్వతం నుండి ప్రయాణించిన నది, ఎత్తు భాగాన్ని వదిలి సమతల ప్రదేశంలో స్థిరపడుతుందో, అలాగ, రాజు ప్రేమ ప్రవాహం చిన్నవాడిని వదిలి పెద్ద కొడుకుపై స్థిరపడిందన్న మాట.

వాడిన ఉపమానంలోనే శ్రీవరుడి ఉద్దేశం స్పష్టంగా తెలుస్తోంది. ఎత్తు నుంచి నీరు పల్లానికి వచ్చి సమతల ప్రదేశంలో స్థిరపడింది. ఉన్నతస్థానం నుండి పతనమై క్రిందకు దిగజారి క్రింద స్థిరపడింది అనటంలోనే శ్రీవరుడికి ఆదమ్ ఖాన్ పై ఉన్న చిన్నచూపు స్పష్టంగా తెలుస్తుంది. నీరు ఎత్తునుంచి పల్లానికి జారటం స్వాభావికం. అలాగే, తనపై తిరుగుబాటు చేసిన కొడుకు పైనున్న ప్రేమ, వ్యర్థుడైనా, తన వైపు పోరాటం చేసిన కొడుకుపై స్థిరపడటం కూడా అంతే స్వాభావికం. అదే చెప్తున్నాడు శ్రీవరుడు.

యత్ స్నేహభాగీ సుదశాభిరామో
భావి ప్రదీపః సముపాస్య పాత్రమ్।
ఆశాప్రకాశైకనిధే స్తదారా
దసంనిధానేన విరోచనస్య॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 2)

దిశలను ప్రకాశవంతం చేసే సూర్యుడు లేకపోవటం వల్ల నూనె వత్తుల వల్ల కలిగే వెలుతురుతో ప్రకాశవంతమవుతారు.

సూర్యుడు ఉంటే దివిటీల అవసరం లేదు. సూర్యడు లేనప్పుడే కృత్రిమ ప్రకాశం అవసర మవుతుంది. సూర్యుడు హాజీఖాన్. అతడు లేడు. కాబట్టి ఆదమ్ ఖాన్ అవసరం పడింది. సూర్యుడు లేనప్పుడు వెలుగునిచ్చేది దివిటీలే కదా!

దదావాదుమఖానాయ నాయకః స క్షితేస్తదా।
ప్రమేయాన్ క్రమరాజ్యస్థానుజీయాన్ విరాగతః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 3)

ఎంతో కాలానికి రాజు రాజధానికి తిరిగి వచ్చాడు. క్రామ రాజ్యంలో ఉన్న హాజీఖాన్ సమర్థకులను ఆదమ్‍ఖాన్‌కు అప్పజెప్పాడు.

ఫరిష్టా ప్రకారం, కొంత సైన్యం ఇచ్చి ఆదమ్ ఖాన్‌ను క్రామ రాజ్యం పంపాడు. అక్కడ ఉన్న హాజీఖాన్ సమర్థకులను ఆదమ్ ఖాన్ ఊచకోత కోశాడు. వాళ్ల ఆస్తులను జప్తు చేసుకున్నాడు. అతని ఈ చర్యతో ఇంకా మిగిలి ఉన్న హాజీఖాన్ సమర్థకులు – ఆదమ్ ఖాన్‍ను శరణు వేడారు.

జగృహే స చి విత్తౌఘం గృహగ్రామాది దేవగమ్।
హాజ్యెహైదరఖానీయం పానీయమివ వాడవః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 4)

బడబాగ్ని నీటిని ఆవిరిచేసినట్టు, హాజీ హైదర్ ఖాన్ ఆస్తులను ఆదమ్ ఖాన్ జప్తు చేసుకున్నాడు. హాజీఖాన్ ఆస్తులన్నింటినీ ఆదమ్ ఖాన్ స్వాదీనం చేశాడని చెప్పేందుకు – ఇంట్లో, గ్రామాలలో, మందిరాలలో ఉన్న ఆస్తులన్నిటినీ, అంటే ఎక్కడెక్క హాజీఖాన్‍కు ఆస్తులున్నాయో, అవన్నీ ఆదమ్ ఖాన్ స్వాధీనం చేసుకున్నాడని అంటాడు శ్రీవరుడు. హాజీఖాన్ అంటే ఆదమ్ ఖాన్‌కి ఎంత కసి ఉన్నదో ఇది తెలుపుతుంది

సాధారణంగా ఇస్లామీయుల రాజకుటుంబాలలో ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ‘క్షమ’ అన్న పదం వారి దరిదాపులలోకి కూడా రాదు. స్వంత సోదరుడన్న కనీస జాలి, దయ లేకుండా వ్యవహరించటం కనిపిస్తుంది. కశ్మీరు ఇందుకు భిన్నం కాదని ఆదమ్ ఖాన్ ప్రవర్తన నిరూపిస్తుంది. జైనులాబిదీన్ శత్రువుపై కనికరం చూపించాడు. కానీ అతని సంతానానికి జైనులాబిదీన్ లక్షణాలు ఏమీ రాలేదు. ఇది సృష్టిలోని వైచిత్రి. అరుదైన అదృష్టవంతులకు మాత్రమే తండ్రిని మించిన తనయులు కలుగుతారు .

తతః ప్రభృతి జ్యేష్ఠః స కశ్మీరాంతనృపాగ్రగః।
యౌనరాజ్యే సుఖం తద్దద్ బుభుజే పన్చశాః సమాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 5)

అప్పటి నుండి ఆదమ్ ఖాన్ శ్రీనగరం లోనే, రాజు సరసన ఉన్నాడు. ఆదమ్ ఖాన్‍ను యువరాజులా ప్రకటించాడు జైనులాబిదీన్. అలా అయిదేళ్ళ పాటు యువరాజులా భోగం అనుభవిచాడు ఆదమ్ ఖాన్.

‘యువరాజు’ను నియమించటమనేది భారతీయ సంప్రదాయం. ఇస్లాంలో సుల్తాన్ వారసుడిని నియమించటమనేది లేదు.

ఓట్టోమన్ రాజులకు ఒక నిర్దిష్టమైన వారసత్వ పద్ధతి లేదు. ఇందువల్ల రాజ్యం కోసం హింస జరగటం అన్నది సాధారణమయింది. పైగా సుల్తాన్‌కు ఓ డజను పైగా వారసులు ఉండటంతో ఎడతెగని హింస కొనసాగిది. దాంతో సుల్తాన్ మరణం తరువాత కొన్ని సంవత్సరాల పాటు రాజ్యాధికారం కోసం అంతర్గత యుద్ధం జరిగేది. ఇది దేశాభివృద్ధిని కుంటుపరచేది.

ఈ పరిస్థితిని మెరుగుపరచేందుకు సుల్తాన్‌కు ఇతర రాచకుటుంబీకుల వల్ల జన్మించిన వాడికే రాజ్యాధికారం ఉంటుదన్న నియమం విధించారు. దీనివల్ల రాజ్యం కోసం పోరాడే వారసుల సంఖ్య తగ్గింది. కానీ, రాజ్యం కోసం తండ్రిని హత్య చేయటం ఆరంభమయింది. ఫలితంగా మొదట పుట్టిన వాడికే రాజ్యాధికారం ఉంటుదన్న నియమం ఏర్పడింది. ఇలా 13 ఏళ్ల వయసులో రాజ్యాధికారం చేపట్టిన తొలి సుల్తాన్ రెండవ మహమూద్. అయితే, మంగోలియన్లు దాడి చేయటంతో పగ్గాలు తండ్రి రెండవ మురాద్‌కు అప్పజెప్పాడు. మళ్లీ 21వ ఏట రాజ్యాధికారం చేపట్టి ముందుగా, హత్య ద్వారా తండ్రి అడ్డు తొలగించుకున్నాడు.

1520లో సుల్తాన్ సులేమాన్ వారసత్వపు అధికారానికి నూతన దిశను ఇచ్చాడు. రాచకుటుంబ స్త్రీల వల్లనే కాక, బానిసల ద్వారా జన్మించిన సంతానానికి కూడా రాజ్యాధికారం దక్కేట్టు చేశాడు. అంతకు ముందు గర్భవతి కాగానే బానిసలకు దేశబహిష్కారం విధించేవారు. ఆ పద్ధతిని మాన్పించి వారు కూడా రాజభవనంలో నివసించేట్టు చేశాడు. ఫలితంగా రాజ్యాధికారం కోసం ‘జనానా’ (మహిళలు ఉండే భవనం) కుట్రలు కుతంత్రాలు మొదలయ్యాయి.

పెద్దవాడు రాజ్యాధికారం చేపట్టటం 17వ శతాబ్దం దాకా కొనసాగింది. 17వ శతాబ్దంలో రెండవ ఉస్మాన్, ఈ పద్ధతిని మార్చాడు. రాజ్యాధికారం వారసత్వంగా సంతానానికి కాదు, సుల్తాన్ సోదరుడికి దక్కేట్టు మార్చాడు.

ఇందుకు భిన్నంగా భారతదేశంలో సుల్తానులు పెద్దకొడుకును యువరాజుగా ప్రకటించే పద్ధతిని భారతీయుల నుంచి స్వీకరించారు. అయినా, రాజ్యాధికారం కోసం పోరు జరిగేదన్నది వేరే సంగతి. కానీ, ‘యువరాజు’ను ప్రకటించే పద్ధతిని స్వీకరించారన్నది గమనించవలసిన విషయం. కశ్మీరంలో సుల్తానులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భారతీయుల పద్ధతిని అమలుపరిచారని జోనరాజ రాజతరంగిణి ద్వారా తెలుస్తుంది.

సుల్తాన్ ఖుతుబ్-ఉద్-దీన్, హసన్ షాహను యువరాజుగా ప్రకటించాడు. పర్షియన్‍లో యువరాజుకు సమానార్థక పదం ‘వలీ అహద్’. ఈ పద్ధతిని అనుసరిస్తూ మహమ్మద్ షాహి, సికందర్‍ను యువరాజుగా ప్రకటించాడు.

భారతీయ ధర్మం ప్రచారం యువరాజుకు కూడా ‘అభిషేకం’ జరుగుతుంది. అతడికి రాజ్యాంలో కొన్ని భాగాలను పాలించే అధికారం వస్తుంది. యువరాజుకు మంత్రులు, సేనాపతులు, పరివారగణం ఉంటుంది.

అయితే భారతీయ ధర్మం ప్రకారం, రాజు తన ప్రథమ సంతానాన్ని మాత్రమే యువరాజుగా ప్రకటించాలన్న నియమం ఏమీ లేదు. రాజ్యాధికారం చేపట్టే అర్హత ఉన్న వారెవరినయినా యువరాజుగా ప్రకటించవచ్చు. ఈ పద్ధతి ప్రకారం జైనులాబిదీన్ ముందుగా సోదరుడు ‘మహమూద్’ను యువరాజుగా ప్రకటించాడు. తరువాత ఆదమ్ ఖాన్‌ను యువరాజు అన్నాడు. చివరికి ‘హాజీఖాన్’ను యువరాజు చేశాడు.

‘హైదర్ షాహ’ సుల్తాన్ అయ్యాక, తన బంధువు బహెరామ్ ఖాన్‌ను యువరాజుగా ప్రకటించాడు. సుల్తాన్ ఖుతుబుద్దీన్‌కు సంతానం లేదు. అందుకని ఆయన హసన్‌ను యువరాజుగా నిశ్చయించాడు. సుల్తాన్ ‘జమర్రుద్’ తన సోదరుడు అల్లా-ఉద్-దీన్‌ను యువరాజుగా నియమించాడు.

ఇది, భారతదేశంలో అడుగుపెట్టిన తరువాత ఏ రకంగా ఇస్లామీయులను భారతీయ జీవన విధానం ప్రభావితం చేసిందో స్పష్టం చేస్తుంది. ఇంకా, ఇస్లామీ దేశాల్లో వారసత్వం నిర్ణయం నిర్దిష్టమైన రూపు దిద్దుకోక మునుపే భారతీయ సుల్తాన్‌లు ‘యువరాజు’ను నిర్ణయించే పద్ధతిని స్వీకరించి అమలుచేశారు.

బయట నుంచి వచ్చినవారు భారతీయులను అనాగరికులుగా భావించి, భారతీయులను నాగరికులుగా చేయాలని ప్రయత్నించారని చరిత్ర పుస్తకాలు చెప్తాయి. ఎందుకంటే, చరిత్ర పుస్తకాలు, భారతీయుల గురించి బయటివారు రాసిన రచనలను ప్రామాణికంగా భావించి రచించినవి కాబట్టి. కానీ, జాగ్రత్తగా గమనిస్తే భారతీయుల సంపర్కంతో బయటనుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు సంస్కారవంతులవటం కనిపిస్తుంది. ఇందుకు భారతీయ సుల్తాన్‌లు అవలంబించిన యువరాజు ప్రకటన పద్ధతి ఒక ఉదాహరణ.

ఆదమ్ ఖాన్ యువరాజుగా అయిదేళ్ళున్నాడని శ్రీవరుడు రాశాడు. పర్షియన్ రచయితలు ఆరేళ్ళన్నారు.

యేషాం సుఖం వితనుతే విధిరన్నవ వృద్ధథా
దుర్భిక్ష దుఃఖమపి సంతనుతే స తేషామ్।
వృష్టథా వివర్ధయతి యాని తృణని మేఘ-
స్తాన్యేరివ శోషయతి భావితుషార భారాత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 6)

ఇక్కడి నుంచి కశ్మీరును అల్లకల్లోలం చేసిన కరువు వర్ణన ప్రారంభమవుతుంది.

పంటలు బాగా పండటం వల్ల వ్యక్తులకు సుఖం కలిగించిన విధి, కరువు కాటకాల ద్వారా వారి ఆనందాన్ని హరిస్తుంది. వర్షం కురియటం వల్ల గడ్డిని మొలిపించిన మేఘాలే, ఆ గడ్డిని మంచు బరువుతో నాశనం చేస్తాయి కదా!

భారతీయులు విధిని నమ్ముతారు. కర్మ, విధి నడుమ అవినాభావ సంబంధం ఉంటుంది. విధి వ్యక్తిగతంగాను, సామూహికంగానూ పని చేస్తుంది. ఒక వ్యక్తి అదృష్టం బాగుండవచ్చు. కానీ ఆ అదృష్టం అతడున్న సామాజిక అదృష్టంతో ముడిపడి ఉంటుంది.

కశ్మీరుకు దుర్దినాలు ఆరంభమయ్యాయన్న సూచనగా కరువు కాటకాలు మొదలయ్యాయి. జైనులాబిదీన్ అంత్య దశ ఆరంభమయింది.

సర్వ సస్య సమృద్ధేస్మిన్ దేశే షట్‌త్రింశవత్సరే।
అకస్మాదమ్ భచ్చైత్రే గగనాత్ పాంశువర్షణమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 7)

అన్ని రకాల పంటలు సమృద్ధిగా పండిన దేశంలో, 36వ సంవత్సరంలో హఠాత్తుగా ఆకాశం నుండి దూళి వర్షం కురిసింది.

శ్రీవరుడు చెప్పిన 36వ సంవత్సరం, క్రీ.శ. 1460 సంవత్సరంతో సమానం. అంత వరకూ కశ్మీరులో పంటలు సమృద్ధిగా పండేవి. ఎవరికీ దేనికీ లోటుండేది కాదు. కానీ హఠాత్తుగా కశ్మీరంలో ధూళి వర్షం కురిసింది. సర్వం నాశనమయింది.

శ్రీవరుడు వర్ణించిన ‘ధూళి వర్షం’ కశ్మీరులో సాధారణం. ఇందుకు కారణం కశ్మీరు భౌగోళిక స్వరూపం. కశ్మీరు హిమానీ నదములతో పరివృతం. గాలిలో ఎగిరే ధూళికణాలు నేలపై నిక్షిప్తమవుతాయి. చలి ప్రదేశాలలో ఈ ధూళి కణాలు 10 నుండి 100 మీటర్ల పైన గుట్టలుగా ఏర్పడతాయి. వీటిని ‘Loess’ నిక్షిప్తాలంటారు. వీటిని అధ్యయనం చేయటం వల్ల ఆ ప్రాంతపు భౌగోళిక శీతోష్ణ పరిస్థితులను తెలుసుకోవచ్చు. కశ్మీరంలో ఇలాంటి Loess నిక్షిప్తాలు దాదాపుగా 20 మీటర్ల ఎత్తులవి ఉన్నాయి. వీటిలో అనేక ప్రాచీన కాలపు మట్టి కణాలు Paleosols ఆనవాళ్లున్నాయి. ఈ సూక్ష్మకణాలు గాలులు విపరీతంగా వీచినపుడు గాలిలోకి ఎగురుతాయి. గాలి వేగం తగ్గినప్పుడు భూమిపైన పడతాయి. విపరీతమైన  వేగంతో గాలులు వీచినప్పుడు పెద్ద సంఖ్యలో ఈ ధూళికణాలు గాలిలోకి ఎగురుతాయి. గాలి వేగం తగ్గినప్పుడు ఆకాశం నుండి వర్షంలా ఈ ధూళి కణాలు భూమిపై పడతాయి. సర్వనాశనం చేస్తాయి. ఈ శ్లోకం తరువాత శ్లోకంలో ధూళి వర్షం తరువాత కశ్మీరు పరిస్థితిని శ్రీవరుడు కళ్లకు కట్టినట్టు వర్ణించాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here