Site icon Sanchika

శ్రీవర తృతీయ రాజతరంగిణి-3

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

వన్ద్యాస్తే రాజకవయః పదన్యాసమనోహరాః।
ఖ్యాతా యె సరసైః క్షీరనీరవివేకినః॥
(శ్రీవర రాజతరంగిణి, 3)

[dropcap]భ[/dropcap]గవంతుడిని ప్రార్ధించిన తరువాత శ్రీవరుడు ‘కవి’ని ప్రస్తుతిస్తున్నాడు.

క్షీరనీరన్యాయం తెలిసి, మనోహరమైన పదాల అమరికతో పేరు, ప్రఖ్యాతులు గాంచిన వారు రాజకవులు అంటున్నాడు.

శ్రీవరుడి గురువు జోనరాజు. జోనరాజు రాజకవి. రాజకవి పేరు ప్రఖ్యాతులు పొందేందుకు కారణాలు మనోహరమైన పదాల అమరిక, క్షీరనీరన్యాయ ప్రదర్శనలు. శ్రీవరుడికి తాను రచిస్తున్న కావ్యం గతంలో రాజతరంగిణిని రచించిన వారిద్దరి రచనలకూ భిన్నం అని తెలుసు. ఎందుకంటే, కల్హణుడు కానీ, జోనరాజు కానీ ఆధిక శాతం రాజతరంగిణి కావ్యంలోని అంశాలను పరిశీలించి తెలుసుకుని, తమ  ఊహాశక్తితో ఆయా కాలాలకు జీవం పోసి, అక్షరాల ద్వారా చిరంజీవులను చేశారు. కానీ శ్రీవరుడికి పరిశోధించాల్సిన అవసరం లేదు. ఆయన తన కళ్ల ఎదురుగా జరుగుతున్న సంఘటనలనే తన కావ్యంలో పొందుపరిచాడు. ఇతర రాజతరంగిణులకూ శ్రీవరుడి రాజతరంగిణికి ఇది ప్రధానమైన తేడా.

శ్రీవరుడు జైనులాబిదీన్ ఆస్థాన కవి. ఆయనతో కలసి రోజూ ముచ్చటించేవాడు. జైనులాబిదీన్ ఆంతరంగికులలో ఒకడు. ఎప్పుడో గతించిన కాలాన్ని ఆయన తన రాజతరంగిణిలో వర్ణించలేదు. తాను చూస్తూ, తెలుసుకుంటు అనుభవిస్తున్న వాటినే ఆయన రాజతరంగిణిలో పొందుపరిచాడు. అంటే శ్రీవరుడి రాజతరంగిణి ఆ కాలానికి ప్రత్యక్ష సాక్షి కథనం అన్నమాట.

జోనరాజు తన రాజతరంగిణిలో జైనులాబిదీన్ అధికారానికి రావటం, ఆయన ఘనతలు, ఆయన పాలనా విధానం, పరమత సహనం వంటి విషయాలను వివరించాడు. జోనరాజు హఠాత్తుగా మరణించాడు. అక్కడి నుంచి శ్రీవరుడు కొనసాగించాడు. అంటే జోనరాజు రాజతరంగిణికి జోడింపు, లేక కొనసాగింపు లాంటిది అన్నమాట శ్రీవరుడి తృతీయ రాజతరంగిణి. శ్రీవరుడు కూడా అలానే చెప్పుకున్నాడు. కానీ శ్రీవరుడు చెప్పినదొకటి. చేసినదొకటి.

శ్రీవరుడు ప్రధానంగా సృజనాత్మక కవి. శ్రీవరుడికి తన రచన ప్రాధాన్యం తెలుసు. కశ్మీరు చరిత్రలో తన పేరు శాశ్వతంగా నిలిచేట్టు చేస్తుందీ రచన అన్న గ్రహింపు ఉంది. అయితే, జోనరాజు రచనతో పోలిస్తే, తన రచన స్థాయి తేలిపోతుందనీ తెలుసు. ఎందుకంటే, జోనరాజు రచన దాదాపుగా మూడు వందల ఏళ్ల చరితను ప్రదర్శిస్తుంది. అనేక వ్యాఖ్యానాలు, తీర్మానాలు, దృక్కోణాలు ఆ రచనలో కనిపిస్తాయి. దానితో పోలిస్తే శ్రీవరుడు నడుస్తున్న చరిత్రను కావ్యరూపంలో రాస్తున్నాడు. అందుని తన కావ్య పరిచయంలోనే తన రచనను తక్కువ చేసి చూపించాడు. కానీ తాను ఇతరులకు భిన్నమైన మార్గం అవసరిస్తున్నాననీ, ఇతరులకన్నా పూర్తిగా భిన్నమైన చారిత్రక రచన చేస్తున్నాననీ శ్రీవరుడికి తెలుసు.

జోనరాజు రచనకు కొనసాగింపు అని చెప్పుకున్నా  శ్రీవరుడు జైనులాబిదీన్ జీవితాన్ని సంపూర్ణంగా రచించాడు తన రాజతరంగిణిలో. శ్రీవరుడి కాలానికి సంస్కృతం వాడకం వెనకబడింది. సంస్కృతం తనని తాను పునర్నిర్వచించుకుని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే  మనుగడ లేని పరిస్థితి నెలకొంటోంది. సంస్కృతం వెనుకబడుతుండగా, ఆ స్థానాన్ని పర్షియన్ భాష ఆక్రమిస్తోంది. మరోవైపు స్థానిక భాషల ఆధిక్యం  పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో భావాన్ని వ్యక్తపరిచే సంస్కృత భాష పరిధులను విస్తరింప చేస్తూ, సంస్కృతాన్ని కేవలం సాహిత్య భాషలా మాత్రమే కాక, పదిహేనవ శతాబ్దపు రాజకీయ, సాంస్కృతిక, సామాజిక భాషలా ఎదిగింప చేసే ప్రయత్నం శ్రీవరుడి రాజతరంగిణి రచనలో కనిపిస్తుంది.

15వ శతాబ్దారంభానికి దేశంలో అధిక ప్రాంతాలలో పర్షియన్ భాష, స్థానిక భాషలు ప్రాధాన్యం వహించటం తీవ్రమయింది. గతంలోలా సంస్కృతం అధికులు అర్థం చేసుకుని మాట్లాడే వీలు లేని పరిస్థితులు  దేశంలో ఇస్లాం పట్టు సాధించటం వల్ల నెలకొన్నాయి. దాంతో సంస్కృతం భాషలో ఉన్న సత్యాలను స్థానిక భాషలలో ప్రదర్శించటం ఒక స్వచ్ఛంద ఉద్యమంలా దేశమంతా నెలకొంది. ఇది ఎవరో ప్రేరేపించి నాయకత్వం వహించిన ఉద్యమం కాదు. ఎవరికి వారు స్వచ్ఛందంగా, ఎవరి ప్రమేయం, ప్రేరణ, ప్రోద్బలాలు లేకుండా స్వతంత్రంగా సాగించిన సామాజిక,  సాంస్కృతిక, ధార్మిక పునరుజ్జీవన ఉద్యమం ఇది. దీన్ని ‘భక్తి’ ఉద్యమం అన్న పేరుతో తప్పుదారి పట్టించారు. దృష్టిని అసలు విషయం నుంచి మళ్ళించారు. ‘భక్తి’ అనే వస్త్రం ధరించిన ధార్మిక, సాంస్కృతిక, సామాజిక  పునరుజ్జీవన ఉద్యమం ఇది.

భగవద్గీతను మరాఠీలోకి అనువదించి, అనేక ఆధ్యాత్మిక అంశాలను ‘అభంగ్’ల రూపంలో సామాన్యులకు చేరువ చేసిన సంత్ జ్ఞానేశ్వర్‌తో తీవ్రమైన ఈ ఉద్యమం పలు విభిన్నమైన రూపాలు ధరించింది. ఉపనదుల కలయికతో ఉధృతమైన ప్రవాహంలా మారింది. రాజకీయ అండ తోడవటంతో పెను తుఫానయింది. ఈ రకంగా ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ ఇస్లాం తాకిడికి విరిగిపోయి, ఒరిగిపోయి సంపూర్ణంగా రూపాంతరం చెంది, గతంతో సంబంధం కోల్పోయి, ఇస్లామ్ రంగులో ఇమిడిపోతే ,  భారతీయులు మాత్రం ఇస్లాం నీడలో నివసిస్తూ కూడా  తమ ప్రత్యేకతను కాపాడుకున్నారు. తమ అస్తిత్వాన్ని నిలుపుకున్నారు. తమ ధర్మాన్ని, జీవన విధానాన్ని కాపాడుకున్నారు.

దేశంలోని ఇతర ప్రాంతాలు ఇస్లాం తాకిడికి విలవిల లాడుతున్న తరుణంలో కశ్మీరు నెమ్మదిగా, ఇస్లామీయుల హస్తగతం అవసాగింది. అప్పుడు కానీ ఇస్లాం వల్ల పొంచి ఉన్న ప్రమాదం కశ్మీరీయులు గ్రహించలేకపోయారు. జరుగుతున్నది అర్థమయి స్పందించేలోగా సికందర్ బుత్‌షికన్ కంకణం కట్టుకుని మరీ కశ్మీరు నుంచి ఇస్లామేతరులని తరిమివేశాడు. జైనులాబిదీన్ వచ్చి, పరమత సహనం ప్రదర్శించటంతో మళ్లీ కశ్మీరులో భారతీయ ధార్మిక జీవనం ఆరంభమయింది. కానీ ఎన్నటికీ గత వైభవ స్థాయిని అందుకునే వీలు లేదని అందరికీ అర్థమయింది. అందుకని పరిస్థితులతో రాజీపడుతూ, తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటూ, భావితరాలకు తమ  సంస్కృతిని సజీవంగా అందించాలన్న తపన మొదలయింది. శ్రీవరుడి తృతీయ రాజతరంగిణి రచన ఈ తపనను ప్రతిఫలిస్తుంది.

శ్రీవరుడి రాజతరంగిణిలో రచనను పరిశీలిస్తే, ఇతరులలా ఈయన రాజతరంగిణిని ఒక్కసారే  రాసినట్లనిపించదు. జోనరాజు రాజతరంగిణిని కొనసాగించమని కోరినందుకు తన రాజతరంగిణిని జైనులాబిదీన్ జీవిత కథాత్మక చరిత్ర రచనగా మలచాడు శ్రీవరుడు. జోనరాజు చెప్పని అంశాలు,  చెప్పకుండా వదిలిన విషయాలను తన రచనలో పొందుపరిచాడు. జైనులాబిదీన్ మరణం తరువాతనే  శ్రీవరుడు రాజతరంగిణి రచనను ఆరంభించినట్టు అనిపిస్తుంది.   ఇస్లామేతరులకు కశ్మీరులో ఆశ్రయం ఇచ్చి, భద్రత కల్పించి, వారి అభివృద్ధికి పాటుబడ్డ సుల్తాన్ ఋణం తీర్చుకునేందుకు తాను రాజతరంగిణిని రచించి ఆయనకు అర్పించినట్టు శ్రీవరుడు రాజతరంగిణిలో చెప్పుకున్నాడు. అందుకని, బహుషా, సుల్తాన్ చివరి దశలోనో, ఆయన మరణం తరువాతనో శ్రీవరుడు రాజతరంగిణి రచించినట్టు ఊహించవచ్చు.

జైనులాబిదీన్ మరణం వరకూ రాసి  రాజతరంగిణి రచనను శ్రీవరుడు ఆపేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మరణం తరువాత కశ్మీరులో పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. క్రీ.శ.1459 లోనే ‘హాజీఖాన్’‍ను జైనులాబిదీన్ తన వారసుడిగా ప్రకటించాడు. 1470లో జైనులాబిదీన్ మరణం తరువాత ‘హాజీఖాన్’ హైదర్ షాహ్ పేరుతో రాజ్యాధికారం చేపట్టాడు. తన కొడుకు ‘హసన్ ఖాన్’ను తన వారసుడిగా ప్రకటించాడు. తన రాజధానిని ‘నౌషపర్’ నుంచి ‘నౌపట్టా’కు  మార్చాడు.

‘నౌషపర్’ నుంచి రాజధానిని ‘నౌపట్టా’కు మార్చటం ఒక ప్రతీకాత్మకమైన మార్పు.

‘నౌషపర్’, జైనులాబిదీన్ రాజధాని. జైనులాబిదీన్ పాలన పరమత సహనానికి పెట్టింది పేరు. ‘నౌపట్టా’ సికందర్ బుత్‍షికన్ రాజధాని. పరమత అసహనానికి, హింసకు , బలవంతపు మత మార్పిళ్లకు, హత్యలకు మారు పేరు సికందర్ పాలన. రాజధానిని ‘నౌహట్టా’కు మార్చటం – కశ్మీరులో జైనులాబిదీన్ అంతవరకూ  అణచి పెట్టి ఉంచిన మత మౌఢ్యం తిరిగి తల ఎత్తడాన్ని సూచిస్తుంది.

హైదర్ షా తాగుబోతు. రాజ్య పాలన బాధ్యతలను గాలికి వదిలేశాడు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అధికారం దక్కటంతో ఒళ్లు పై మరచి అందినది అనుభవించాలని ఆత్రపడ్డాడు. రాజ్య పాలనను మంత్రులకు వదలి తను భోగాలు అనుభవించసాగాడు. విచ్చలవిడిగా ప్రవర్తించాడు.

మళ్లీ భారతీయులపై అచ్యాచారాలు మొదలయ్యాయి. మందిరాల విధ్వంసం ఆరంభమయింది. విగ్రహాలను విరగ్గొట్టటం, అవమానించటం మొదలయింది. ఆస్తులను ఆక్రమించటం, బలవంతపు మత మార్చిళ్లు తీవ్రమయ్యాయి. తమ ధర్మాన్ని రక్షించుకునేందుకు, మతం మారకుండా ఉండేందుకు ఇస్లాం దుస్తులు వేసుకోవటం ఆరంభించారు హిందువులు. అంటే, గతంలో లాగా రాజాశ్రయం, భద్రత, రక్షణలు ఇస్లామేతరులకు కరువయ్యాయన్న మాట. జైనులాబిదీన్ మరణం తరువాత, రాజకవి, రాకుమారుల (ప్రస్తుత సుల్తానులకు) గురువయిన శ్రీవరుడు అదృశ్యమై పోయాడు. అతడు ఎలా ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో, ఏమేం కష్టాలు పడ్డాడో ఎవరికీ తెలియదు. శ్రీవరుడు కూడా చెప్పుకోలేదు. కల్హణుడు, జోనరాజు లకు భిన్నమైన పరిస్థితులు శ్రీవరుడివి. తన ప్రాణాలు అరచేతపట్టుకుని బిక్కుబిక్కు మంటూ బ్రతకాల్సిరావటం వల్ల బహుషా రాజతరంగిణి రచనను కొనసాగించలేకపోయివుంటాడు.

ఒక సంవత్సరం పది నెలల పాలన తరువాత ‘హైదర్ షాహ్’ మరణించాడు. కొద్దిపాటి అల్లకల్లోలం తరువాత ‘హసన్ షాహ్’ అధికారానికి వచ్చాడు. ఈయన కూడా శ్రీవరుడి శిష్యుడు. ‘హసన్ షాహ్’ పదవీకాలంలో అధికారం కోసం పోరు తీవ్రమయింది. ‘హసన్ షాహ్’ పరిస్థితిని చక్కబెట్టాలని ప్రయత్నించాడు. శ్రీవరుడి శిష్యరికంలో ‘హసన్ షాహ్’కు లలితకళలపై ఆసక్తి కలిగింది. ‘హసన్ షాహ్’ సంస్కృతంలో, కశ్మీరంలో రాసిన పాటలకు బాణీలు కట్టాడు. ‘హసన్ షాహ్’ వద్ద 1200 మంది నాట్యగత్తెలుండేవారు. సంగీత విద్వాసులు ఉండేవారు. వారి సంగీత దర్శకుడు శ్రీవరుడు.

బహుషా ఈ సమయంలో హసన్ శాహ కోరికపై మళ్ళీ రాజతరంగిణి రచనను కొనసాగించివుంటాడు  శ్రీవరుడు. హైదర్ శాహ పాలన కాలం రచన హడావిడిగా జోడించినట్టుంటుంది. జైనులాబిదీన్, హైదర్ శాహ ల పాలన కాలాన్ని ఒక పుస్తకంలా భావించాడు శ్రీవరుడు. దాంతో రాజతరంగిణి రచనను ఆపేశాడు.

1472 నుండి 1484 వరకు రాజ్యం చేసి ‘హసన్ షాహ్’ మరణించాడు. అప్పటికి అతని సంతానం ఇంకా చిన్న పిల్లలు. దాంతో సోదరుడి కొడుకు ‘ఫాత్ ఖాన్’ను తన వారసుడిగా ప్రకటించాడు హసన్ ఖాన్.

హసన్ ఖాన్ పాలనా కాలం కూడా అల్లకల్లోలమే. అధికార పోరుతో కశ్మీరానికి శాంతి లేకుండా అయింది. చివరికి 1499లో హసన్ ఖాన్ ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోవటంతో ‘మహమ్మద్ షాహ్’ అధికారం హస్తగతం చేసుకున్నాడు. గతంలో ఈయన కొంత కాలం రాజ్యం చేశాడు. కానీ హసన్ ఖాన్‍తో ఓడిపోవడంతో, నిరంతర పోరాటం జరిపి మళ్ళీ అధికారం పొందాడు. ‘ఫాత్ షాహ’ అధికారం సాధించేందుకు దాడులు చేస్తునే ఉన్నాడు. 1505లో మళ్ళీ అధికారం సాధించాడు. అయినా అధికారం కోసం పోరు సాగుతూనే ఉంది. కశ్మీరం అల్లకల్లోలం అవుతూనే ఉంది. మరోవైపు కశ్మీరంలో ఇస్లాం మత ప్రచారకులు భిన్నమైన ఆలోచనలను ప్రచారం చేస్తూ తమలో తాము  కలహించుకోసాగారు. కానీ ఇతర మతస్తులను మతం మార్చటం విషయంలో మాత్రం కలిసికట్టుగా పని చేశారు. ఇస్లామీయులు తమలో తాము కలహించుకోవటాన్ని అనువుగా తీసుకుని పండిత్ కాంతభట్టు బలవంతాన మతం మారిన హిందువులను తిరిగి స్వమతంలోకి మార్చాడు. ఓ రకమైన ‘ఘర్ వాపసీ’ అన్న మాట.

ఈ అల్లకల్లోలాలు, అధికార పోరాటాలు, మతమార్పిళ్లు, హింస, అణచివేతల నడుమ బహుశా ‘హసన్ షాహ్’ కోరిక వల్ల శ్రీవరుడు రాజతరంగిణి రచనను కొనసాగించి ఉంటాడు. జైనులాబిదీన్ తరువాత ‘హైదర్ షాహ్’ మరణం వరకూ రాసి ఆపేసిన శ్రీవరుడు మళ్ళీ హసన్ షాహ్, మహమ్మద్ షాహ్‍ల పాలనా కాలాన్ని రచించాడు. అయితే జైనులాబిదీన్, హైదర్ షాహ్‍ల పాలనా కాలన్ని ఒక ప్రత్యేక పుస్తకంలా పరిగణించటంతో,    ‘హసన్ షాహ్’, మహమ్మద్ షాహ్‍ల పాలనా కాలాన్ని వివరించే రాజతరంగిణిని ప్రత్యేక పుస్తకంలా భావించి, ఆ రచనకు ముందు కొత్త రచనను ఆరంభించినట్టు  పరిచయ శ్లోకాలను రాశాడు శ్రీవరుడు. అంటే రెండు పుస్తకాల కలయిక శ్రీవరుడి తృతీయ రాజతరంగిణి అన్న మాట.

(ఇంకా ఉంది)

Exit mobile version